అతడూ ఆమె: ‘ఒసేయ్‌..నా కళ్లజోడు తెచ్చివ్వు’! 

27 Feb, 2022 16:42 IST|Sakshi

సాహిత్యం

అప్పుడు..అతడూ ఆమె మధ్య
కమ్ముకున్న మంచుతెరల్ని
ఒక్కొక్కటిగా
భానుడి చూపులు
చీలుస్తున్న దృశ్య సమయం

ఒత్తిళ్లను పొత్తిళ్లలోనే దాచేసే
ఉడుకు నెత్తురు వురుకుళ్ల నడుమ
ఉత్తేజం అణువణువూ దాగుంది
క్రతువులన్నీ ఋతువుల్లా మారిపోతూ
కాలచక్రం వెంటే కలిసి ప్రయాణం
ప్రతీ అడుగూ జోరుగా హుషారుగా..

ఏ చెక్‌లకూ ఏ చిక్కులకూ
వంగని నిటారు వెన్నుపూసలు
ఒకానొక ప్రేమ వాక్యానికి
ఆసాంతం సాగిలబడుతున్నాయి

ఇరుగు పొరుగు సమాజం
కొన్ని తలకాయలు ఎన్నో కళ్లు
అసంబద్ధ కుత్సిత కావ్యాన్ని
రచించుకుంటూ వున్నాయి
ఎన్నో అవాంతరాలు... 

నిశీధిలో విచ్చుకునే తలపులు...
చల్లని చలి తాకిళ్లకు
హృది తలుపుల్ని పదే పదే తెరుస్తూ..
సాహచర్యాన్ని స్వాగతిస్తోంది
ఓ నిశ్శబ్ద యుద్ధం
అన్ని చిక్కు ముళ్లను విప్పేస్తూ
మరో ఉదయాన్ని ఆవిష్కరిస్తోంది..!

∙∙ 

ఇప్పుడు.. ఆమె అతడు మధ్య
వాలు కుర్చీలో కూలబడ్డ వృద్ధదేహం
అటూ ఇటూ ఊగిసలాడుతున్న నిద్రమత్తు
బతుకంతా అలసిన మనసులు
సేద తీరటానికి
ఎన్ని చీకట్లయినా ఎన్ని వెలుతుర్లయినా
సరిపోని త్రిశంకుస్వర్గం

ఆత్మీయ ఆలింగనాలకు వీలుకాని కాలం
ఇరువురి మధ్య ఎన్ని నిప్పుల్ని కుమ్మరిస్తోందో
వెచ్చని ఘాతాలతో మనసంతా
చిల్లుపడ్డ కుండవుతోంది

అయినా..
వణికిస్తున్న చిక్కని చలిలో
అతని పంజరం 
చైతన్యాన్ని కప్పుకుని కదుల్తోంది
కాలం వెంట నెమ్మది నెమ్మదిగా..

ఆమె చెయ్యి
పొగలుగక్కే వేడి వేడి 
టీ కప్పును అందిస్తోంది
ఒక్క గుటకేస్తూ వేయి నిట్టూర్పులను వొదిలేసి
మనిషితనం లోపించి మసకబారిన
ఈ మాయదారి లోకాన్ని
చీల్చి చెండాడాలనీ

కళ్లల్లో కత్తుల్ని విత్తుకుంటూ..
ఆయన ఉదయాన్నే బిగ్గరగా అరుస్తాడు
‘ఒసేయ్‌..నా కళ్లజోడు తెచ్చివ్వు’! 
-డా.కటుకోఝ్వల రమేష్‌ 

మౌనస్పర్శ
ఊహలెప్పుడూ
సమాంతరంగా ఉండవు

గతంలోంచి 
వర్తమానంలోకి 
ఎగసిపడుతూనే ఉంటాయి

కాలం 
మండే నిప్పుకణమై
కళ్ళ ముందు బద్దలవుతుంటే
ఊహలు ఉప్పెనలుగా ఎగసి పడుతుంటాయి

ఉప్పొంగే 
బతుకు శ్వాస
ఎప్పుడూ ఒకే 
సరళరేఖ మీద ప్రయాణిస్తుంటాయి

తడబడిన పాదముద్రల్ని సరిచేస్తూ
కొత్త దారుల వెంట ప్రయాణిస్తుంటే

గాఢ నిద్రలో సైతం
మెలకువ ఉదయాలే
కళ్ళ ముందు మెదులుతుంటాయి

మనుషులెక్కడుంటారో
అక్కడే నా ఉనికిస్పర్శ
కొత్త ఊహల్ని తట్టిలేపుతుంటాయి

జీవితంలో 
యుద్ధం మొదలైనప్పట్నుంచీ
ఇదే వరుస

బారులు తీరిన అడుగులు
మంద్ర మంద్రంగా తెరలు తెరలుగా
అరల పొరలుగా
అడుగుల్ని కప్పేస్తున్న వేళ

గతం ఆశతో 
వర్తమానంలోంచి
భవిష్యత్తులోకి తొంగి చూస్తుంది
-∙మానాపురం రాజా చంద్రశేఖర్‌

మరిన్ని వార్తలు