కథ: కర్తవ్యం.. కలెక్టర్‌ అనుపమ.. నాకు శక్తిస్వరూపిణిలా కనిపించారు!

29 May, 2022 12:05 IST|Sakshi

కర్తవ్యం

ఆకాశం నిలువునా బద్దలైనట్టుగా హోరున భోరున కురుస్తోంది వర్షం. గత అయిదు రోజుల్నుంచి ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి. గాలి ప్రచండ వేగంతో వీస్తూనే వుంది. తీర ప్రాంతంలోని మా జిల్లాని తుఫాను అతలాకుతలం చేసేస్తోంది. వాగులూ వంకలూ పొంగాయి. చెరువులకు గండ్లు పడ్డాయి.

లోతట్టు ప్రాంతాలు మునిగిపోగా పట్నాలు జలమయమయ్యాయి. పల్లపు ప్రాంతాల జనం కంటిమీద కునుకు లేకుండా అరచేతుల్లో ప్రాణాలు బిగబట్టుకుంటున్నారు. తుఫాను బీభత్సం ఎంత ఘోరంగా ఉందంటే ఎప్పుడూ కిటకిటలాడే మా ఆఫీసర్స్‌ క్లబ్‌ వెలతెల బోతోంది. కంపెనీ కోసం ప్రాకులాడే నేనూ, మరో అరడజను మంది మాత్రమే ఉన్నామంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.

అద్దాల్లోంచి కనిపిస్తోన్న వర్షోధృతిని చూస్తూ తాపీగా మందు ఆస్వాదిస్తూ వెచ్చదనాన్ని తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నాను. ‘మున్సిపల్‌ కమిషనర్‌గారేదో ప్రత్యేక తపస్సులో ఉన్నట్టున్నారు’ సమీపిస్తూ మందహాసం చేశాడో మిత్రుడు.

‘టైముకి ఈ డ్యూటీ చేయకపోతే మన శరీరంలోని ఏ భాగమూ పని చేయదు’ నవ్వాను. ‘నగరం కకావికలమవుతున్నా మీరిలా నిమ్మకి నీరెత్తినట్టు ఎలా ఉండగలుగుతున్నారబ్బా!’
‘మనం అన్ని పనులూ ఫిజికల్‌గా చెయ్యక్కర్లేదోయ్‌. ఒక్కో డిపార్ట్‌మెంట్‌కి బోలెడు మంది అధికార్లు ఉన్నారు. వాళ్లకి ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇస్తూ పైపైన సూపర్‌వైజ్‌ చేస్తే చాలు. అంతా వాళ్లు.. ఫీల్డ్‌స్టాఫ్‌ చూసుకుంటారు’

‘ఈ అత్యవసర పరిస్థితిని వాళ్లు హ్యాండిల్‌ చేయగలరా?’ అతడి అమాయకత్వానికి జాలేసింది. ‘చక్కగా శ్రద్ధగా చేస్తారు. అసలు రెవెన్యూ వాళ్ళూ.. మేమూ ఎప్పుడూ కోరుకునేది విపత్తులూ ప్రకృతి వైపరీత్యాలూ తరచూ రావాలనే. ఇలాంటివి వచ్చిపడినప్పుడే మా అన్ని జేబులూ నిండేది. ఎంచేతంటే ఎంత ఖర్చు చేసినా అడిగే వాడుండడు ఆడిటింగూ ఉండదు. అంతా మా ఇష్టారాజ్యం!’ జ్ఞానిలా నవ్వాను.

‘కొత్త కలెక్టర్‌ అనుపమ చాలా స్ట్రిక్ట్‌ అంటున్నారు!’ ‘అనుకోవడం వేరు ఆచరించడం వేరు. సోషల్‌ నెట్‌వర్కింగ్‌ పెరిగాక ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు సొంత డబ్బా వాయించుకోడానికి పీఆర్‌వోలను పెట్టుకుంటున్నారు తెలుసా? అదీగాక ఈవిడ మీడియాతో మంచి రిలేషన్‌ మెయింటెయిన్‌ చేస్తోంది. వాళ్లు ఆమె భజన చేస్తారు. వెరీ సింపుల్‌!’

‘ఈవిడ ఆహార భద్రత కమిషనర్‌గా పని చేసినప్పుడు.. ఓ పెద్ద కంపెనీ సుగంధద్రవ్యాల్లో భారీగా కల్తీ చేస్తోందని ఆ కంపెనీనే మూయించేసిందట కదా!’ ‘అదో యాదృచ్ఛిక ఘటన. రైవల్‌ కంపెనీ వాళ్లు ఉప్పందించార్లే. అయినా అది జరిగిన మరుసటి రోజునే ట్రాన్స్‌ఫర్‌ వేటు పడిందిగా!’ ఇబ్బందిగా ఫీలవుతూనే అన్నాను.

‘ఆవిడ ఈ విపత్తుని సరిగ్గా హ్యాండిల్‌ చెయ్యగలదంటారా?’ ‘నో చాన్స్‌. జిల్లాకి వచ్చి మూడు నెలలే అయ్యింది. ఇంకా జిల్లా భౌగోళిక స్వరూపమే తెలిసుండదు. పైగా మహిళ. ఇలాంటి చాలెంజీల్ని ఎదుర్కోవడానికి ధైర్యమూ స్థైర్యమూ ఉన్న మగాళ్ళు కావాలి. మన జిల్లా సంగతి తెలిసి కూడా ఆవిడ్ని మన నెత్తిన కూర్చోబెట్టడం ఘోర తప్పిదం!’

అదోలా చూశాడతను. ఇంతలో నా సెల్‌ మోగింది. డిస్‌ప్లేలో జిల్లా కలెక్టర్‌ అనుపమ పేరు కనిపించగానే అలర్టయ్యాను.. ‘గుడ్‌ ఈవెనింగ్‌ మేడం’ ‘మీ సిటీ పరిస్థితి కంట్రోల్లోనే ఉంది కదా? సంబంధిత డిపార్ట్‌మెంట్లన్నీ యాక్షన్‌లోనే ఉన్నాయిగా?’

‘ఎవ్రీథింగ్‌ అండర్‌ కంట్రోల్‌ మేడమ్‌.  ఎలాంటి సిట్యుయేషన్‌ అయినా హ్యాండిల్‌ చేసేస్తాం మేడమ్‌’ గొప్పగా చెప్పాను. ‘మీరు కోఆర్డినేట్‌ చేస్తూ 24 గంటలూ వారికి అందుబాటులో ఉండండి. ముంపు ప్రదేశపు జనాన్ని ముందే సురక్షిత ప్రదేశాలకు తరలించండి. ఎక్కడా ప్రాణ నష్టం జరగటానికి వీల్లేదు. ఆస్తి నష్టాన్ని కూడా సాధ్యమైనంత తగ్గించాలి’

‘యస్‌ మేడమ్‌. ఇప్పటికే చాలామందికి చాలాచోట్ల ఆశ్రయం కల్పించాం’ ‘గుడ్‌. కలెక్టరేట్‌లోని విపత్తు విభాగంతో టచ్‌లో ఉండండి. అవసరమైన రిలీఫ్‌ మెటీరియల్‌ అందరికీ అందేలా చూడండి. ఇది మన శక్తి సామర్థ్యాలకు పరీక్ష. మనమేంటో నిరూపించుకుందాం’

ఫోన్‌ ఆఫ్‌ చేసి నుదుటికి పట్టిన చెమట తుడుచుకున్నాను. ‘ఆవిడేనా? గట్టిగానే దబాయిస్తోందే!’ మిత్రుడన్నాడు. ‘అధికార దర్పంలే. ఇంకా ఏదో నిరూపించుకోవాలంట. పాతికేళ్ల సర్వీసు పుటప్‌ చేసిన నేను కాదు, అయిదేళ్ళైనా సర్వీసు లేని ఆవిడ చేసుకోవాలి’ వ్యంగ్యంగా నవ్వాను.

వెంటనే వివిధ విభాగాల అధికార్లకి ఫోన్లు చేసి కాషన్‌ చేశాను. ‘నా డ్యూటీ పూర్తయింది’ మళ్లీ గ్లాసు నింపుకుంటూ కళ్లు చికిలిస్తూ నవ్వాను. అతడూ మాట్లాడలేదు. మాట్లాడానికేమైనా వుంటేగా!

ఇంటికెళ్ళడానికి లేస్తోంటే మళ్లీ ఫోన్‌. ఆవిడే. ‘యూ డెవిల్‌’ తిట్టుకుంటూ కాల్‌ తీసుకున్నాను. ‘మీ సిటీలో సహాయక చర్యలు సక్రమంగా జరగట్లేదుట. ఒక డిపార్టుమెంట్‌కీ ఇంకో దానికీ కో–ఆర్డినేషన్‌ లేదట. మీరేం చేస్తున్నారు?’

‘అలా కూసిన అక్కు పక్షి ఎవడు? అన్నీ నేనుగాకపోతే వాడమ్మా మొగుడు ఎవడు చేస్తున్నాడు?’ కయ్‌ మనేసి ఆ వెంటనే నాలిక్కరుచుకుని, స్టడీగా నిలబడ్డాను.. ‘సారీ మేడమ్‌. టంగ్‌ స్లిప్‌ అయింది. దగ్గరుండి అన్నీ నేనే పురమాయిస్తున్నాను మేడమ్‌’

‘ఇది చాలదు. ఇంకా స్పీడప్‌ చెయ్యాలి. శ్రీరామపేటలోని డ్రైనేజులు పొంగి పొరలుతున్నాయి. షావుకారు పేటలో రోడ్డు అడ్డంగా కోసుకుపోయి ట్రాఫిక్‌ నిలిచిపోయింది. టీచర్స్‌ కాలనీలో ఇళ్లల్లోకి నీళ్ళొచ్చేశాయి. ముందు వాళ్లని అక్కడ్నుంచి తరలించండి. బస్తీలో కొందరింకా ఇళ్లల్లో చిక్కుకుపోయి వున్నారట. వాళ్లకి బోట్లు పంపండి. ఈ పరిస్థితి ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలీదు. రిలీఫ్‌ మెటీరియల్‌ పంపిస్తున్నాం. స్టోరేజ్‌కీ సప్లైకీ ఏర్పాట్లు పకడ్బందీగా చేయండి. సహాయ శిబిరాల్లోని పరిస్థితిని స్వయంగా చూసి రిపోర్టు చేయండి’

మందు నిషా దిగిపోయింది. ‘ఈవిడ నా ప్రాణానికి సైతాన్‌లా దాపురించిందే’ తిట్టుకుంటూ బయటికి నడిచాను. వర్షం ఈడ్చి కొడుతోంది. గాలి విసిరి అవతల పారేస్తోంది. ఇటువంటి పరిస్థితిలో బయటికెళ్లడానికి నేనేమైనా ఫీల్డ్‌ స్టాఫ్‌నా? ఉన్నతాధికారిని! డ్రైవర్‌ కారు తెచ్చాడు. ‘జాగ్రత్తగా ఇంటికి పోనియ్‌’ అన్నాను.
∙∙ 
ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసి పడుకున్నాను. ఉదయం లేస్తూనే బయటికి చూశాను. దెయ్యం పట్టిన్టటు వూగిపోతోంది ప్రకృతి. సెల్‌ ఫోన్‌ స్విచ్ఛాన్‌ చేశానో లేదో మోగింది. మళ్లీ డెవిల్‌! ‘అంబేద్కర్‌ నగర్‌ మునిగిపోయింది. జనం దిక్కు తోచని స్థితిలో అల్లాడిపోతున్నారు. మీరేం చేస్తున్నారు? అసలు మీరెక్కడ వున్నారు?’ కళ్లు మూసుకుని పడింది.

‘ఆ దగ్గర్లోనే వుండి పరిస్థితులు సమీక్షిస్తున్నాను మేడమ్‌’. ‘దగ్గర్లో అంటే ఎంత దగ్గర్లో వున్నారు?’ ‘పది.. ఇరవై అడుగుల దూరంలో..’ ‘ఏ పక్కనున్నారు? ఎవర్తో వున్నారు? నాకెక్కడా కన్పించట్లేదే! తక్షణం నా ముందుకు రండి’

నా గుండెల్లో బాంబు విస్ఫోటించింది. రాత్రికి రాత్రే ఆ మహాతల్లి ఇక్కడికొచ్చినట్టుంది ఖర్మ! తిన్నగా నిద్రపోవడానిక్కూడా లేదు కదా! రెయిన్‌ కోట్‌ తొడుక్కుంటూ బయటికి పరుగెత్తాను.

యుద్ధ ప్రాతిపదిక మీద చకచకా ఏర్పాట్లు చేస్తూ కన్పించింది కలెక్టర్‌ అనుపమ. నా కళ్లకు సుశిక్షిత సైన్యాధికారిగా కనిపిస్తోంటే గుటకలు మింగాను. దగ్గరికెళ్లి విష్‌ చేసినా నా వంక చూళ్లేదు. నన్ను పట్టించుకోలేదసలు. నా సబార్టినేట్స్‌ ముందు నా తల కొట్టేసినట్టు ఫీలయ్యాను.

‘అలా స్తంభంలా నిలడ్డారేం? గో! బియ్యం పప్పులూ దుప్పట్లూ పాతదుస్తులూ వగైరా రిలీఫ్‌ మెటీరియల్‌ చాలా వచ్చింది. వాటిని సేఫ్‌  ప్లేస్‌లో పెట్టించండి’ ‘స్కూళ్లు, కాలేజీలు, ఫంక్షన్‌ హాళ్లు జనంతో నిండిపోయాయి మేడమ్‌’ ‘మీకీ నగరంలో అవి స్టోర్‌ చేయడానికి అనువైన చోటే కన్పించట్లేదా?’ తీవ్రంగా చూసింది.

బుర్రగోక్కున్నాను. ఆ దిశగా ముందుగానే సమాచారం సేకరించి వుండాల్సింది. ఈవిడ ముందు దోషిలా నిలబడాల్సొచ్చేది కాదు. ఏం చేస్తాం. అంతా నా బ్యాడ్‌ లక్‌! ‘ఎనీ సజెషన్స్‌’ చుట్టూ వున్న వారి వంక చూసింది.

‘సివిల్‌ కోర్టు కాంప్లెక్స్‌లో బార్‌ కౌన్సిల్‌ వారి హాలు చాలా పెద్దగా వుంటుంది మేడమ్‌’ ఒకరన్నారు. ‘గుడ్‌ ఐడియా. వాళ్లతో మాట్లాడి వెంటనే పెట్టించెయ్యండి. వానలో తడిస్తే ఇబ్బంది. ఎందరో దాతలూ స్వచ్ఛంద సంస్థలూ పంపిన సాయం కాపాడుకోలేకపోతే, సక్రమంగా వినియోగించుకోలేకపోతే మనల్ని మనం ఎప్పటికీ క్షమించుకోలేం. మనం ఇంత మందిమి వుండి కూడా లేనట్టే అవుతుంది’ ఉరిమినట్టుగా అంది. 

ఆ సలహా ఇచ్చిన వాడిని వెంటేసుకుని వెళ్లాను. బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడ్ని స్వయంగా వెళ్లి కలిశాను. ‘మాది పబ్లిక్‌ ప్లేస్‌ కాదు. ఇవ్వం’ ముఖాన్నే చెప్పేశాడు. ‘ప్లీజ్‌. పరిస్థితి అర్థం చేసుకుని కాస్త కో ఆపరేట్‌ చేయండి’. ఇదీ చేయకపోతే అనుపమ నన్ను నమలకుండా మింగేయటం ఖాయం. అందుకే ‘ఆవిడ హుకుం’ అని కూడా చెప్పాను.

కానీ అతడో మొండి ఘటంలా వున్నాడు. ఇచ్చేది లేదు పొమ్మన్నాడు. ‘నీ సంగతి రేపు నాతో అవసరం పడినప్పుడు చెబుతాన్లే’ అతడి వంక కసిగా చూస్తూ అనుకున్నాను. జరిగింది కలెక్టర్‌కి ఫోన్‌ చేసి చెప్పాను.

‘ఆ హాల్‌ ప్రభుత్వానికి అత్యవసరమని, హ్యాండోవర్‌ చెయ్యమని నోటీసిచ్చి సైట్‌కి వెళ్లండి. ఈలోగా రిలీఫ్‌ మెటీరియల్‌ అక్కడికి తెచ్చేలా చూసి, దాన్ని లోపల పెట్టించండి’ అప్పటికప్పుడు నాలుగు ముక్కలు గీకి ఇచ్చాను. అయినా అతడు అంగీకరించలేదు.

నిస్సహాయుడినై దేభ్యం మొహం పెట్టుకుని మళ్లీ ఫోన్‌ చేశాను. ‘అవసరమైతే ఫోర్సు ఉపయోగించు. గో ఎహెడ్‌ ’ గర్జించింది.

‘మాది ప్రైవేటు ప్రోపర్టీ. దానిలోకి మీరూ పోలీసులూ ఎలా చొచ్చుకొస్తారో మేమూ చూస్తాం. ట్రెస్‌ పాసింగ్‌ చేస్తే మీ అందరి మీదా క్రిమినల్‌ కేసు పెడతాం. ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తాం’ రంకెలేశాడు.

‘పోలీస్‌ని తీసుకుని కోర్టు కాంప్లెక్స్‌ కెళ్తున్నాను. మీరొచ్చి మర్యాదగా తాళాలు తీసి హ్యాండోవర్‌ చేయండి’ హెచ్చరించాను. మేం అక్కడికెళ్లే సరికి జోరున కురుస్తున్న వానని లెక్క చేయకుండా నలువైపుల్నుంచీ అడ్వొకేట్లు వివిధ వాహనాల్లో బిలబిలమంటూ వచ్చేశారు. మీడియా సైతం గద్దలా వాలిపోయింది.

చిలికి చిలికి గాలి వాన అవుతోందని అర్థమవుతోంటే, గొడవ వద్దంటూ మరోసారి రిక్వెస్ట్‌ చేశాను. వాళ్లు కౌన్సిల్‌ హాలు ముందరి వరండాలో దారికడ్డంగా బైఠాయించి కించిత్తు కదిలేది లేదని భీష్మించారు.

నా తలరాతని తిట్టుకుంటూ ఫోన్‌ చేసి చెప్పాను. ‘వాళ్లు ప్రెస్టీజియస్‌ ఇష్యూగా తీసుకున్నారు మేడమ్‌. లాయర్లతో తలపడడమంటే కొరివితో తలగోక్కోవడమే అవుతుంది మేడమ్‌’

ఆమె జవాబివ్వలేదుగాని మరి పదినిమిషాల్లో మా ముందు ప్రత్యక్షమైంది. ‘తాళం తీయండి’ అధికార స్వరంతో వారితో అంది అనుపమ. ‘తీయం. మీ దౌర్జన్యం సహించం’ అంటూ, ‘కలెక్టర్‌ దౌర్జన్యం నశించాలి’ అని నినాదాలిచ్చారు. 

ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ని పిలిచి, ‘తాళం బద్దలు కొట్టు’ ఉగ్రరూపిణై ఆదేశించింది. ‘మేం దారివ్వం. బలవంతంగా ఆక్రమించుకునే హక్కు మీకు లేదు. దౌర్జన్యం చేయొద్దు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు’ తీవ్ర స్వరంతో అన్నాడు బార్‌ అధ్యక్షుడు.

‘ఎన్‌డీఆరెఫ్‌ యాక్ట్‌ 2005 సెక్షన్‌ 34 హెచ్, జె, ఎమ్‌ ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో ప్రత్యేక ప్రయోజనార్థం ప్రభుత్వ లేక ప్రైవేటు సౌకర్యాల్ని  ఉపయోగించుకునే హక్కు, అధికారం ప్రభుత్వానికుంది. దాని ప్రకారం ఈ విపత్కాలంలో అత్యవసర ఆహారపదార్థాలు నిల్వ చేయడానికి మీ బార్‌ హాల్ని ఉపయోగించుకుంటున్నాం. అడ్డు తప్పుకోండి’ అక్షరాలా గర్జించింది.

అడ్వొకేట్ల దిమ్మదిరిగిపోయింది. ఆ ఏక్ట్‌ ఏంటో ఆ సెక్షన్లేంటో గుర్తు రాక నిశ్చేష్టులయ్యారు. అప్రయత్నంగా పక్కకు తప్పుకున్నారు. లారీల్లోని బియ్యం వగైరా రిలీఫ్‌ సామాగ్రిని కలెక్టర్‌ అనుపమ లోపల పెట్టిస్తోంటే ఆమె నాకు శక్తి రూపంలా కన్పించింది. నాకు నేను మరుగుజ్జుగా కన్పిస్తోంటే తలెత్తి చూస్తూ చేతులు జోడించాను!

-సింహ ప్రసాద్‌
చదవండి: Keerthi Jalli IAS Officer Success Story: నిజంగానే మట్టిలో మాణిక్యం మన కీర్తి జల్లి
                     

మరిన్ని వార్తలు