మనస్సులో దీపం వెలిగించిన వాడు.. నేను చనిపోయాక..

2 May, 2022 16:12 IST|Sakshi

మనస్సులో దీపం వెలిగించిన వాడు

పేరుకు తగ్గట్టుగా ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ ప్రశాంత్‌నగర్‌ ఇప్పుడు చీటికీ మాటికీ అంబులెన్సుల సైరన్లతో మార్మోగిపోతోంది. ఆ సైరన్‌  విన్నప్పుడల్లా రఘురామయ్య గుండెల్లో అలజడి ప్రారంభమవుతూ ఉంటుంది. ‘ఎవరి ప్రాణం మీదికి వచ్చిందో, ఏమో! కరోనా పాడుగానూ, గుండెల్లో గుబులు దించుకుందామంటే, స్నేహితులెవరూ ఇల్లు వదిలి బయటకు రావడం లేదు’ అని దిగులుగా కుర్చీలో కూలబడ్డాడు.

ఇంతకుముందు, తనలాగే రిటైరైన ఉద్యోగులు కొంతమంది కలిసి రోజూ సాయంకాలం వాకింగ్‌కి వెళ్లేవారు. ఆ విధంగా ఓ గంటపాటు బయటి ప్రపంచంతో సంబంధాలు ఏర్పడేవి. ఇప్పుడేముందీ అంతా గృహ నిర్బంధమే! న్యూస్‌ పేపర్‌ చదవడమూ, టీవీ చూడడమూ మానేసినా.. చుట్టాలూ, స్నేహితులూ కరోనాకి బలైపోయిన వార్తలు ఫోన్‌  ద్వారా అందుతూనే ఉన్నాయి. ఫోన్‌  మోగితే చాలు భయం భయంగా ఉంటోంది.. ఏ చెడువార్త వినాల్సి వస్తుందోనని.

రఘురామయ్య ఇంకా బ్యాంకింగ్‌ సర్వీసులో ఉండగానే, ఒక్కగాని ఒక్క కొడుకు నవీన్‌  అమెరికాలో స్థిరపడ్డాడు. అతనికి బుద్ధిపుట్టినపుడు తండ్రికి ఫోన్‌  చేస్తుంటాడు. ముక్తసరిగా మూడు ముక్కలు మాట్లాడేసి, ఫోన్‌  పెట్టేస్తాడు. ‘సమస్యలంటూ ఏమైనా ఉంటే తనకుండాలి గానీ, రిటైరైన ఈ ముసలాయనకి ఏముంటాయి?’ అన్నట్లుంటుంది అతని వ్యవహారం! రఘురామయ్య ఎప్పుడు చేసినా అతను ఫోన్‌  ఎత్తడు. అదేమంటే, ‘నేనుండేది అమెరికాలో, అమలాపురంలో కాదు’ అంటాడు.

నాలుగేళ్ల క్రితం భార్య కేన్సరుతో చనిపోవడంతో రఘురామయ్యకు వృద్ధాప్యంతోపాటు ఒంటరితనం తోడైంది. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి ఎక్కువైజనం పిట్టల్లా రాలిపోతుంటే, రఘురామయ్యలో ఆందోళన పెరిగిపోయింది. అది పంచుకోవడానికి మరెవరూ లేక, కొడుక్కి చెప్పుకోక తప్పలేదు.. ‘నవీన్‌ ... ఈ వరస చావులు చూస్తుంటే, భయంగా ఉందిరా!’ అంటూ. కొడుకు నుండి వచ్చిన సమాధానానికి రఘురామయ్య హతాశుడయ్యాడు.

‘వయసులో ఉన్న కుర్రాళ్లే రాలిపోతుంటే, డెబ్బైఏళ్ల వయసు నిండిన మీరు భయపడ్డంలో అర్థమేమైనా ఉందా?’ అన్న కొడుకు మాట మరణభయం కంటే ఎక్కువగా బాధపెట్టింది. అదేం మాట! డెబ్బై కాదు, నూట డెబ్బై ఏళ్లు వచ్చినా చావు అనేది భయపెట్టకుండా ఎలా ఉంటుంది? చిన్నపిల్లలు కూడా చనిపోతున్నంత మాత్రాన, పెద్ద వాళ్ల చావు సాధారణమెలా అవుతుంది? ఆలోచించే కొద్దీ రఘురామయ్యకు దుఃఖం ఎక్కువైంది.

అంతలో మెయిన్‌  డోర్‌ మీద ‘టక్‌...టక్‌’ అంటూ చిన్నగా శబ్దం వినిపించింది. డోర్‌బెల్‌ కొట్టకుండా, ఇంత సున్నితంగా తలుపుపై కొట్టేవాడు వినయ్‌ మాత్రమే అని అతనికి తెలుసు. గడ్డం కింది నుండి మాస్క్‌ను ముక్కువరకూ లాక్కుని, నెమ్మదిగా లేచి తలుపు తెరిచేడు. డబుల్‌ మాస్క్‌ వేసుకుని, ఫేస్‌ షీల్డ్‌తో వినయ్‌ కనిపించేసరికి, రఘురామయ్యకు ఆనందంగా అనిపించింది. అతన్ని చూసినప్పుడల్లా, రఘురామయ్యకు కొడుకు గుర్తుకువస్తాడు. ఇద్దరిదీ సుమారుగా ఒకే వయసైనా, ప్రవర్తనలో ఎంతో వైరుధ్యం!

‘సర్‌.. నేను బజారుకు వెడుతున్నాను. మీకేమైనా మందులు కానీ, కూరగాయలు కానీ కావాలేమో చెప్పండి!’ అడిగాడు వినయ్‌. ‘ఏం వద్దుకానీ.. నీకు తీరికైనప్పుడు వచ్చి కూర్చోవయ్యా.. కొంతసేపు కబుర్లు చెప్పుకుందాం!’ ‘తప్పకుండా, సర్‌! పుస్తకాలు చదివీ చదివీ నాకూ బోర్‌ కొడుతోంది. త్వరగానే వచ్చేస్తాను. తలుపు తెరిచే ఉంచండి’ అంటూ వినయ్‌ బయల్దేరాడు.

వినయ్‌ నర్సింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ చేసి ఓ ప్రయివేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తూనే, నర్సింగ్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌  కూడా పూర్తి చేశాడు. రఘురామయ్యకు ఇంటికి అద్దెకివ్వాల్సిన అవసరం లేకపోయినా, వినయ్‌ చదువూ, వినయం చూసి ఒక పోర్షన్‌  అద్దెకిచ్చేడు. తనకేదైనా మెడికల్‌ ఎమర్జన్సీ అయితే, ప్రథమ చికిత్స అందించడానికైనా అతను ఉపయోగపడతాడన్న కించిత్తు స్వార్థం కూడా రఘురామయ్యకు లేకపోలేదు.

కోవిడ్‌ కేసులు ముమ్మరం కావడంతో చాలా ఆసుపత్రులను కోవిడ్‌ సెంటర్లుగా మార్చేశారు.  వినయ్‌ పనిచేసే ‘కార్డియాలజీ’ విభాగాన్ని కూడా మూసివేయడంతో గత నాలుగు నెలలుగా అతనికి ఉద్యోగం లేకుండా పోయింది. గ్రామంలో ఉంటున్న తల్లిదండ్రులు వినయ్‌ని ఇంటికి వచ్చేసి ఉండమంటున్నారు. అతనికి ఇరవై తొమ్మిదేళ్లు నిండడంతో, వెంటనే పెళ్లి చేసేయాలని తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. తన ఆలోచనలకు సరిపడే, నర్సింగ్‌ చేసిన అమ్మాయి కోసం వినయ్‌ ఎదురు చూస్తున్నాడు.

ఈ కరోనా సమయంలో ప్రజల ఆరోగ్యం ఇంత ప్రమాద స్థాయిలో ఉన్నప్పుడు, తనలాంటి వైద్యసిబ్బంది సమాజానికి సేవలు అందించాలి కానీ, ఇంట్లో కూర్చుంటే ఎలా అని, ఏదైనా కోవిడ్‌ సెంటరులో చేరాలని వినయ్‌ ప్రయత్నిస్తున్నాడు. అతని వలన తనకెక్కడ ఈ పాడురోగం సోకుతుందో నని రఘురామయ్య  వినయ్‌ను కోవిడ్‌ సెంటర్లో చేరకుండా అడ్డుకుంటున్నాడు.

రఘురామయ్య, వినయ్‌ల మధ్యనున్న భావసారూప్యత వలన స్నేహితులుగానే మెలగుతూ ఉంటారు. రఘరామయ్య ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలలో ఇది ఒకటి.. కరోనా వచ్చి తను హఠాత్తుగా చనిపోతే.. విమానాలు తిరగడం లేదు కాబట్టి, కొడుకు అమెరికా నుండి రాలేడు. వినయే తనకి తలకొరివి పెడతాడు అని. ఏ మాట కామాట చెప్పుకోవాలి  తన సొంత కొడుకు కంటే, వినయే తనని ఎక్కువ బాధ్యతగా చూసుకుంటున్నాడు.

కరోనా కేసులు ఎక్కువ కావడంతో, రఘురామయ్య వంటమనిషిని మానిపించేసేడు. అప్పటి నుండి, వినయే వంట బాధ్యతను తీసుకుని, తనకున్న వైద్య విజ్ఞానాన్నంతా జోడించి, నూనె, ఉప్పూ తగ్గించి వంటలు చేయడం ప్రారంభించేడు. వినయ్‌ గుర్తుకు రాగానే, అతనిలో ఈ మధ్య వస్తున్న మార్పులను చూసి రఘురామయ్య భయపడుతున్నాడు.

గత కొద్దిరోజులుగా వినయ్‌ ‘సర్, నేను వేరే రూమ్‌కి షిప్ట్‌ అవ్వాలనుకుంటున్నాను. నేను వంటచేయడాన్ని మీరు రోజూ గమనిస్తున్నారు కాబట్టి, ఇకపై మీరే వంటచేసుకోవడం మొదలుపెట్టండి. మీకు ఇబ్బంది అనిపిస్తే, బయట నుండి మీకు భోజనం క్యారియర్‌ అందించే ఏర్పాటు చేస్తాను’ అంటున్నాడు. రఘురామయ్యకు రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. వినయ్‌ ఎవరైనా అమ్మాయి ప్రేమలో పడ్డాడా? ఆ అమ్మాయితో కలిసి జీవించడానికి వెళ్ళిపోతున్నాడా? లేక తనలో చాదస్తాన్ని ఏమైనా చూశాడా?

తలుపు పై ‘టక్‌...టక్‌...’ శబ్దం. ‘రా .. వినయ్‌’  అంటూ పిలిచాడు రఘురామయ్య. తలుపు నెమ్మదిగా తెరచుకొని వినయ్‌ లోపలికి వచ్చేడు. కుర్చీని దూరంగా జరిపి కూర్చున్నాడు. అది గమనించిన రఘురామయ్యకు ‘తనకి దూరంగా జరిగిపోతున్నాడా? లేక భౌతికదూరం పాటిస్తున్నాడా?’ అన్న అనుమానం వచ్చింది. ప్రతిచర్యగా రఘురామయ్య కూడా తన కుర్చీని ఎడంగా జరుపుకుని కూర్చుని ‘వినయ్, మరణానంతర జీవితం ఉంటుందని నువ్వు నమ్ముతావా?’ అని అడిగాడు హఠాత్తుగా. 

‘మరణానంతర జీవితం మాట దేవుడెరుగు, మరణానికి ముందు జీవితం ఉంటుందని మీరు నమ్ముతారా?’ అన్నాడు వినయ్‌ వినయంగానే. రఘురామయ్య మనస్సు ఎక్కడో చివుక్కు మంది. ‘మాటల గారడీ కాదు, ప్రాక్టికల్‌గా మాట్లాడు’ అన్నాడు.

‘నేను ప్రాక్టికల్‌గానే మాట్లాడుతున్నాను, సర్‌! గత కొద్ది నెలలుగా మనం మరణం గురించి భయపడడం తప్ప, ఏమైనా జీవిస్తున్నామా?’ ‘ఇటువంటి విపత్కర పరిస్థితులలో అది సహజం’
‘లేదు సర్, అందరూ అలా లేరు. కొందరైనా కానీ మరణం గురించి భయపడటం మానేసి, మరణావస్థలో ఉన్న వాళ్లకి సేవ చేస్తున్నారు’
‘పైకి ఎన్ని కబుర్లు చెప్పినా కానీ మరణం గురించి భయపడని వాళ్లు ఉంటారా?’

‘మరణం గురించి మనం భయపడటానికి కారణం దాని గురించి ఎప్పుడూ తార్కికంగా ఆలోచించకపోవడమే అని నాకు అనిపిస్తూంటుంది. పుట్టుకా, చావూ ఒకే పార్సిల్‌లో వస్తాయి సర్‌. ఒక దాన్ని అంగీకరించి, రెండోదాన్ని వ్యతిరేకించడం కరెక్ట్‌ కాదు. మరణం అనేది చివరి మజిలీ కాదు, అది రోజూ కొద్దిగా కొద్దిగా జరుగుతూనే ఉంటుంది. శరీరంలో రోజూ అనేక కణాలు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి. బాల్యంలోనూ, యవ్వనంలోనూ పుట్టే కణాలు ఎక్కువగా ఉంటాయి. అదే వృద్ధాప్యంలో అయితే, చనిపోయే కణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిమధ్య సమతుల్యం దెబ్బతిన్నప్పుడు శరీరంలో జీవచర్య ఆగిపోతుంది..’ 

రఘురామయ్య అసహనంగా కదులుతూ ‘తాగుడూ, జూదమే కాదు, పుస్తకాలు ఎక్కువగా చదివి కూడా మనిషి చెడిపోవచ్చని నిన్ను చూస్తే అర్థమవుతుందయ్యా!’ అన్నాడు. వినయ్‌ చిన్నగా నవ్వి ‘నేను చదివే పుస్తకాలు ఎక్కువగా మీ దగ్గర నుండి తీసికెళ్లేవే!’ అన్నాడు. ‘నువ్వు ఎన్నయినా చెప్పు.. మరణ భయం ఎవరికైనా సహజం’ అన్నాడు రఘురామయ్య.

‘మరణం కూడా అంతే సహజమైందని మనం అర్థం చేసుకుంటే, ఆ భయం తగ్గుతుంది. మరణం అనేదే లేకపోతే మజా ఏముంది సర్‌! మరణం అనేది జీవితంలో ఓ గొప్ప మిస్టరీ, ఆకర్షణ. పుట్టిన క్షణం నుండి, మరణం అనేది ఏ క్షణంలోనైనా వచ్చే అవకాశం ఉన్నప్పుడు ప్రతిక్షణం జీవితాన్ని ఓ ఉత్సవంలా జరుపుకోవాలి కదా! మరణం అనే టాపిక్‌ను చర్చించడానికి మనం ఎప్పుడూ సిద్ధంగా ఉండం. ఎంతకాలం అలా తప్పించుకుంటాం? జీవితంలో మరణం అనివార్యమైనప్పుడు, దాని గురించి స్పష్టంగా ఆలోచించి, ఓ అవగాహనకి రావాలి కదా! అప్పుడే మన జీవితానికి అర్థం ఏమిటని అన్వేషించగలుగుతాం! మన వలన కొందరి జీవితాల్లోనైనా వెలుగు నిండాలి కదా!’

రఘురామయ్య మొహం కోపంతో జేవురించింది. ‘ఇది ఎలా ఉందంటే.. నక్క పుట్టి నాలుగు రోజులు కాలేదు కానీ, ‘నా జీవితంలో ఇంత పెద్ద వాన చూడలేదు’ అందట!’ అన్నాడు. వినయ్‌ నవ్వు ఆపుకోలేకపోయేడు. ‘ఈ సామెత నేను మొదటిసారి వింటున్నాను, బావుంది సర్‌! నేను మీకంటే వయసులో చాలా చిన్నవాడినన్న ఒకే ఒక కారణంతో, నా వాదననంతా పక్కకి పెట్టేయకండి’

రఘురామయ్య మొహంలో సీరియస్‌నెస్‌ తగ్గలేదు. ‘నువ్వు యవ్వనంలో ఉన్నావు కాబట్టి, మరణం అనే అధ్యాయం నీకు చాలా దూరంగా ఉంది కాబట్టి, అంత తేలిగ్గా మాట్లాడేస్తున్నావు’ కోపాన్ని అదుపు చేసుకునే ప్రయత్నంలో ఆయన మాటలు తడబడుతున్నాయి. వాదనను కొనసాగించడానికి ఇది సరైన సమయం కాదనిపించి, ‘మన మధ్య ఆ మాత్రం జనరేషన్‌  గేప్‌ ఉండటం సహజమే లెండి’ అంటూ నవ్వేసి ‘బయట వాతావరణం చాలా హాయిగా ఉంది. అలా నడిచి వద్దామా, సర్‌?’ అన్నాడు వినయ్‌.

ప్రస్తుతం ఇంట్లో నెలకొన్న వాతావరణం చల్లబడాలంటే బయటి వాతావరణంలోకి వెళ్లడమే మంచిదని రఘురామయ్యకు కూడా అనిపించింది. లాక్‌డౌన్‌  పాక్షికంగా ఎత్తివేసినప్పటి నుండీ వాకింగ్‌ కోసం  వినయ్‌ రోజుకొక కొత్త ప్రదేశాన్ని కనిపెట్టి, రఘురామయ్యను తీసుకెళ్లడం జరుగుతోంది. పచ్చని చెట్ల మధ్యలో నడిచి వస్తే, ఇద్దరికీ ఎంతో సేదతీరినట్లు అనిపిస్తోంది. కానీ.. ఈ రోజు మాత్రం నగరం మధ్యలో నడుచుకుంటూ చాలా దూరం వచ్చేశారు. కేసులు తగ్గుతున్నా, జనంలో భయం ఇంకా పోకపోవడం వలన, రోడ్డుపై వాహనాలు చాలా తక్కువగా తిరుగుతున్నాయి.

మెయిన్‌  రోడ్డు పక్కనే, ఒక గేటు దగ్గర వినయ్‌ ఆగాడు. ఆ గేటుపైన ఉన్న ‘హిందూ శ్మశాన వాటిక’ అన్న బోర్డు చూసి రఘురామయ్య గతుక్కుమన్నాడు. వినయ్‌ లోపలికి నడవడం చూసి, రఘురామయ్య కంగారుగా  ‘హేయ్‌.. అటెక్కడికి?’ అన్నాడు. వినయ్‌ నవ్వుతూ ‘అంత భయం దేనికి సర్‌? మనందరి చివరి మజిలీ ఇదే కదా!’ అంటూ మరింత ముందుకు నడిచేడు.

రఘురామయ్యకు అతన్ని అనుసరించక తప్పలేదు. కొన్ని శవాలు తగలబడుతూ ఉన్నాయి. మరికొన్ని శవాలు క్యూలో ఉన్నాయి. మున్సిపాలిటీ సిబ్బంది, చనిపోయిన వారి బంధువులు కొద్దిమందీ అంతరిక్ష యాత్రికుల్లా పూర్తి బందోబస్తుతో ఉన్నారు. రఘురామయ్యకు ఒక్కసారి ఊపిరాడనంత పనైంది. అక్కడ పడి ఉన్న అనాథ ప్రేతాల్లో తనదీ ఒకటైనట్లు భావించుకుని ఉలిక్కిపడ్డాడు.

‘సర్‌.. ఇటు చూడండి!’ అంటూన్న వినయ్‌ మాటలతో రఘురామయ్య బాహ్యస్మృతిలోనికి వచ్చాడు. నాలుగు సమాధులు పక్కపక్కనే ఉన్నాయి. వాటిని చూపిస్తూ వినయ్‌ ‘ఈ సమాధులు నాలుగూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురి పిల్లలవి. వీళ్ల పుట్టిన తేదీలు, చనిపోయిన తేదీ చూశారా? వీళ్ల వయసు – అయిదేళ్ల నుండి పన్నెండేళ్ల మధ్యనే ఉంది. కార్‌ ఏక్సిడెంటులో డ్రైవర్‌తో పాటుగా ఈ నలుగురు పిల్లలూ చనిపోయేరు. వీళ్ల తండ్రి మా ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌గా పనిచేసేవారు. ఇప్పుడు చెప్పండి.. చావుకూ, వయసుకూ ఏమైనా సంబంధం ఉందా?’ అన్నాడు.

రఘురామయ్య మనస్సంతా ఆర్ద్రమైంది. సమాధుల వంకా, రాతి పలకలపై రాసిన రాతల వంకా చూస్తూ ఉండిపోయేడు. వినయ్‌  రఘురామయ్య చేతిలోంచి మొబైల్‌ ఫోన్‌ తీసుకొని, అతని చెయ్యి పట్టుకుని ‘పదండి, సర్, వెడదాం’ అంటూ బయటకు దారి తీశాడు. వినయ్‌ నెమ్మదిగా చెప్పడం ప్రారంభించేడు.. ‘సర్‌.. నేను వయసులో చిన్నవాడిని కాబట్టి, ఇప్పుడప్పుడే నాకు చావు రాదన్న గ్యారంటీ లేదు.

నా వృత్తి కారణంగా, నేను ఇప్పటికే ఎన్నో మరణాలను దగ్గరగా చూశాను. నేను 2009లో నర్సింగ్‌ డిగ్రీలో చేరాను. అప్పటి నుండీ, అనేక వార్డులు రొటేషన్‌  మీద తిరగడం వలన, రకరకాల అవస్థలలో ఉన్న రోగులను చూశాను. రోగం నయమై సంతోషంగా వెళ్లిన వాళ్ల దగ్గర నుండి, రోగం ముదిరి చనిపోయిన వాళ్ల వరకూ చూశాను. ఒక రోగి చనిపోతే, నేను చాలా డిస్టర్బ్‌ అవుతాను, సర్‌.

అందుకు నేను కూడా కారణమేమో అనిపిస్తుంటుంది. వాళ్ల కుటుంబ సభ్యుల బాధ చూస్తే, భోజనం సయించదు. మరణం మీద ఎంతో పరిశోధన చేసిన ఎలిజబెత్‌ క్లుబ్లర్‌ రాస్, డేవిడ్‌ కెస్లర్‌ రాసిన పుస్తకాలు చదివి, ఎవరైనా రోగి మరణానికి చేరువలో ఉన్నప్పుడు, వాళ్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను. ఆ విధంగా, వృత్తిపరంగా, నేను మరణంతో సహజీవనం చేయాల్సి వస్తోంది’ అంటూ ఆగాడు. 

రఘురామయ్య దీర్ఘంగా నిట్టూర్చి ‘వినయ్‌.. ఇంత చిన్న వయసు నుండే మరణం గురించి భయం లేకుండా ఆలోచించడం ఆశ్చర్యంగా ఉంది’ అన్నాడు. ‘పుట్టుకా, చావూ జీవితమనే నాణెనికి బొమ్మా, బొరుసూ అనే నిజాన్ని అంగీకరిస్తే, ప్రశాంతంగా ఉండగలుగుతాం అనిపిస్తుంది, సర్‌!’ ఆలోచనలు ముసరడంతో రఘురామయ్య మౌనంగా నడుస్తూ ఉన్నాడు.

వినయ్‌.. రఘురామయ్య మొబైల్‌ను తిరిగి అతనికి  ఇస్తూ ‘సర్, మీరు ఎప్పుడు ఏమేం మాత్రలు వేసుకోవాలో రిమైండర్‌ పెట్టాను. అలారం మోగిన వెంటనే, బద్ధకించకుండా, అన్ని మందులూ వేసుకోండి. ‘లోడింగ్‌ డోస్‌’ మీ పుస్తకాల అర దగ్గర పెట్టాను. ఎప్పుడైనా గుండెనొప్పి అనిపిస్తే, ఆ డోస్‌ వేసుకోవడం మర్చిపోకండి’ చెప్పాడు. ‘నువ్వు వెళ్లక తప్పదంటావ్‌?’ అన్నాడు రఘురామయ్య దిగులుగా.

‘అవును సర్‌. ప్రశాంత్‌ యూత్‌ అసోసియేషన్‌  అనే పేరుతో కొంతమంది యువకులు ఉచిత కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కాలనీలో ఉండే ఒక స్కూలు యాజమాన్యం తమ భవనాన్ని కోవిడ్‌ సెంటర్‌గా మార్చడానికి అనుమతించడమే కాకుండా, ఆ యువకులకు అవసరమైన మార్గనిర్దేశం చేస్తున్నారు. కొంతమంది వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది తమ సేవలను ఉచితంగా అందిస్తున్నారు.

అంతే కాకుండా, మీలా ఒంటరిగా ఉండే సీనియర్‌ సిటిజన్లకూ, హోమ్‌ ఐసోలేషన్‌ లో ఉన్న వారికీ యూత్‌ అసోసియేషన్‌  సభ్యులు మందులూ, కూరగాయలూ ఇంటివద్దనే అందిస్తున్నారు. మీకేం అవసరమైనా ఈ సంస్థకు ఫోన్‌  చేయండి. వాళ్ల నెంబరు మీ ఫోన్‌ లో సేవ్‌ చేశాను’ అన్నాడు  వినయ్‌. రఘురామయ్యకి చాలా సంతోషమైంది. ‘వాళ్ల ఎకౌంట్‌ నెంబరు చెప్పు... నేనూ కొంత విరాళం పంపుతాను’ అన్నాడు. ‘చాలా సంతోషం, సర్‌. వాళ్ల అకౌంట్‌ వివరాలు మీకు వాట్సప్‌ చేస్తాను’ అన్నాడు వినయ్‌.
∙∙ 
రోజులు భారంగా గడుస్తున్నాయి, రఘరామయ్యకి. తన బంధువులూ, స్నేహితులూ కొంతమంది కరోనా వలన చనిపోవడంతో, ‘తరువాత ఎవరు?’ అనే భయం అతని గుండెల్లో కలుక్కుమంటున్నా, వినయ్‌ను గుర్తుకు చేసుకుని, ధైర్యం తెచ్చుకొంటున్నాడు. అప్పుడప్పుడూ వినయ్‌ ఫోన్‌ చేస్తూ రఘురామయ్య క్షేమ సమాచారాలు కనుక్కుంటూ, తమ అసోసియేషన్‌ చేస్తున్న కార్యక్రమాల గురించి తెలియజేస్తూ ఉన్నాడు.

‘కరోనా కేర్‌’ అనే వాట్సప్‌ గ్రూపును క్రియేట్‌ చేసి, అందులో రఘురామయ్యను కూడా చేర్చేడు. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసిన యువకులు కొంతమంది ఆ అసోసియేషన్‌ తో చేరి, వంటలు చేయటం గురించి తెలుసుకుని రఘురామయ్య ఎంతో సంతోషపడ్డాడు. కోవిడ్‌ సెంటరులో సేవలు పొందిన వారు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్న వీడియోలు, వారి సేవలను మెచ్చుకుంటూ అనేకమంది విరాళాలు అందజేయటం.. ఇలాంటి అనేక విశేషాలు వాట్సప్‌ ద్వారా తెలుస్తున్నాయి. నర్స్‌గా వినయ్‌ సేవలందింస్తున్న ఫొటోలు కూడా అందులో షేర్‌ చేస్తున్నారు.

అసోసియేషన్‌  కార్యక్రమాలు పెరగడం వలన కావచ్చు.. రఘురామయ్యకు ఫోన్‌  చేయడాన్ని బాగా తగ్గించేశాడు వినయ్‌. ఎప్పుడైనా ఫోన్‌ చేసినా, చాలా ముక్తసరిగా మాట్లాడుతున్నాడు. గతవారం రోజుల నుండి వినయ్‌ నుండి వాట్సప్‌ సమాచారం కూడా రావడం లేదు. అతని నెంబరుకు ఫోన్‌  చేస్తే స్విచ్ఛాఫ్‌ చేసి ఉంటుంది. ఏదో కీడు శంకించాడు రఘురామయ్య. 

యూత్‌ అసోసియేషన్‌  సభ్యుడు ఒకరికి.. రఘరామయ్య ఫోన్‌  చేసి, వినయ్‌ గురించి వివరాలు కనుక్కున్నాడు. రాత్రీపగలనకా రోగులకు ఎంతో సేవ చేయడం వల్ల వినయ్‌కు కోవిడ్‌ సోకిందనీ, వాళ్లు నిర్వహిస్తున్న ఐసోలేషన్‌  సెంటర్‌లోనే ప్రస్తుతం అతనికి వైద్యం అందిస్తున్నారనీ తెలిసింది. రఘురామయ్య ఆ ఐసోలేషన్‌  సెంటర్‌ అడ్రస్‌ కనుక్కుని, నోట్‌ చేసుకున్నాడు.

కన్న కొడుక్కే ఆపద వచ్చినంతగా రఘురామయ్య విలవిల్లాడిపోయేడు. వినయ్‌ ఆరోగ్యం పట్ల భయంతో పాటు, అతను చేస్తున్న సేవల పట్ల గౌరవం కలిగేయి. వినయ్‌కు పుస్తకాలంటే ప్రేమ కాబట్టి, రఘురామయ్య తన షెల్ఫ్‌ నుండి కొన్ని పుస్తకాలను తీసుకుని కోవిడ్‌ సెంటర్‌కు బయలుదేరాడు. పెద్ద దూరం కాదు కాబట్టి నడుచుకుంటూ బయల్దేరాడు.

రెండు వీధులు దాటేసరికి వెనక నుండి హారన్‌  మోగింది. రఘురామయ్య వెనక్కి తిరిగి చూశాడు. తెల్లటి పెయింటింగ్‌ వేసి ఉన్న వ్యాన్‌ పై ‘పార్థివ వాహనము– తెలంగాణ ప్రభుత్వం – ఉచిత సేవ’ అని రాసి ఉంది. ఒకప్పుడైతే రఘురామయ్య భయపడేవాడేమోగానీ ప్రస్తుతం మాత్రం ఆ వాహనం సేవనందిస్తున్న ఓ స్నేహితుడిలా అనిపించింది.
ఆ వాహనపు డ్రయివర్‌ తన వ్యాన్‌ నుంచి తల బయటకు పెట్టి ‘సర్‌.. రామాలయానికి  ఎటు వెళ్లాలీ?’ అని అడిగేడు.

‘ఇలానే ముందుకెళ్లి, సెకండ్‌ లెఫ్ట్‌ సందులోకి వెళ్లు బాబూ!’ అన్నాడు రఘురామయ్య. ‘అయ్యో.. ఆ ఇంటి వాళ్ళెవరోగానీ, ఎంత కష్టం వచ్చింది! వారి ఆత్మకు శాంతి కలుగుగాక!’ అని మనసులోనే అనుకున్నాడు. కోవిడ్‌ సెంటట్‌ అడ్రసు కనుక్కోవడం రఘురామయ్యకు పెద్ద కష్టమేమీ కాలేదు. రిసెప్టనిస్ట్‌ చెప్పిన సూచనలననుసరించి సేఫ్టీ యాప్రాన్‌ , గ్లోవ్స్‌ వేసుకుని,  వినయ్‌  ఉన్న వార్డ్‌ వైపు వెళ్ళేడు. వార్డులో రోగులు చాలామంది టీవీ చూస్తున్నారు. ఇద్దరు నర్సులు పేషంట్లకు సేవలందిస్తూ ఉన్నారు. వినయ్‌ బెడ్‌మీద పడుకుని పుస్తకం చదువుకుంటున్నాడు. 

అదేం పుస్తకమో అనుకుంటూ కళ్ళజోడు సరిచేసుకుని చూశాడు రఘురామ్య.  ‘ఇస్మాయిల్‌.. కరుణ ముఖ్యం’ అని రాసి ఉంది. బెడ్‌ పక్కకు ఎవరో వచ్చినట్టు అనిపించడంతో వినయ్‌  పుస్తకాన్ని పక్కనపెట్టి చూశాడు. రఘురామయ్య కనిపించే సరికి  హఠాత్తుగా లేచి ‘సార్‌.. మీరూ?’ అంటూ ఆశ్చర్యపోయేడు. ‘ ఎలా ఉందయ్యా నీ ఆరోగ్యం’ అంటూ అతని నుదుటిమీద చేయి వేశాడు రఘురామయ్య.

‘జలుబూ, దగ్గు తప్ప మరే సమస్యల్లేవు సర్‌. యాంటీ బయోటిక్స్‌ వాడుతున్నాను. కానీ.. మీరు రావలసింది కాదు,  మీలాంటి పెద్దలకు రిస్క్‌ ఎక్కువ ఉంటుంది’ అన్నాడు వినయ్‌. వినయ్‌ తల నిమురుతూ రఘురామయ్య  ‘ఏమవుతుందీ? నాక్కూడా కరోనా వస్తుంది, అంతే కదా! మీరంతా ఉన్నారు కదయ్యా, నాకు సేవచేయడానికీ’ అంటూ ‘ఈ సమయంలో కూడా పుస్తకాలను వదిలి పెట్టడం లేదా నువ్వు? ఏముందా పుస్తకంలో అంత శ్రద్ధగా చదువుతున్నావ్‌?’ అని అడిగాడు.

ఇందులో ఇస్మాయిల్‌ గారంటారూ ‘కవిత్వం చేసే పనల్లా చదువరి మనస్సులో దీపం వెలిగించడమే! అని’ ‘కవిత్వమే కాదు, మానవత్వంతో మీ యువకులంతా చేస్తున్నది అదే కదా!’ అన్నాడు రఘురామయ్య బెడ్‌ మీద వినయ్‌ పక్కన కూర్చుంటూ. ‘ మిమ్మల్ని చూశాకా నాక్కూడా ఉడతాభక్తిగా మీతో పాటు కలసి పని చేయాలని ఉంది’ అన్నాడు.

వినయ్‌ సంతోషానికి అవధుల్లేవ్‌. ‘సర్‌.. మీరు బ్యాంక్‌ మేనేజర్‌గా చేసిన అనుభవం ఉంది కాబట్టి, మాకు వచ్చే విరాళాలు, ఖర్చులకు సంబంధించిన లెక్కలు చూడండి. మీలాంటి పెద్దలు కోవిడ్‌ సెంటర్‌కు రావడం సరైంది కాదు. ఖర్చులూ, విరాళాలకూ సంబంధించిన పేపర్లన్నీ మీ దగ్గరకు పంపిస్తూ ఉంటాం. మీరు ఇంటిదగ్గర ఉంటూనే ఆ లెక్కలన్నీ చూడవచ్చు’ అన్నాడు. 

‘అయితే, నేను కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తాను’ అన్నాడు రఘురామయ్య నవ్వుతూ. ఆ పూట సంతోషంగా ఇంటికి చేరుకున్నాడు రఘురామయ్య. ‘నేను బతికుండగా నా మనస్సులో దీపం వెలిగించిన వినయ్, నేను చనిపోయాకా నా తల దగ్గర దీపం వెలిగించడా?’ అనుకుంటూ గుండెలపై చేయివేసుకుని, తృప్తిగా నిద్రపోయేడు.

-యాళ్ల అచ్యుతరామయ్య  

మరిన్ని వార్తలు