కథ: విరగని అల.. రెహమాన్‌, నూకాలు లేకుంటే ఎంతటి ఘోరం జరిగేదో?

28 Jun, 2022 15:58 IST|Sakshi

రివ్వుమని దూసుకొచ్చిన ఆడికారు సముద్రతీరానికి కొద్దిదూరంలో ఆగింది. కార్‌ డోర్‌ తీయడానికి డ్రైవరు రెహమాన్‌ వచ్చేలోపే రేవంత్‌ డోర్‌ తీసుకుని దిగాడు. ఒక అడుగు ముందుకేసి ఆగి వెనక్కి తిరిగాడు రేవంత్‌. రెహమాన్‌ ఒక్క ఉదుటన ముందుకొచ్చాడు.

‘రెహమాన్‌.. నువ్వు ఇంటికి వెళ్ళు’ అంటూ సముద్రం వైపు కదిలాడు. అప్పుడపుడు రేవంత్‌ సాయంకాలాలు  సముద్రం వైపు రావడం, కాసేపు గడపడం కొత్త కాదు.  
‘పర్వాలేదు సార్‌!  వెయిట్‌ చేస్తా’ వినయంగా అన్నాడు

‘ఈ రోజు కాస్త ఆలస్యం అవుతుందిలే’ విప్పిన కోటు తీసి భుజమ్మీద వేసుకుంటూ రెహమాన్‌ మాట వినకుండా ముందుకెళ్ళాడు. రెహమాన్‌ తండ్రి అబ్దుల్‌.. రేవంత్‌ తండ్రి గంగాధరరావుకి డ్రైవరుగా పని చేశాడు. రేవంత్‌ ఇంటి దగ్గరే రెహమాన్‌ పెరిగాడు. కారు నేర్చుకోవడంలో అక్కడే తడబడ్డాడు. డ్రైవరుగానూ అక్కడే స్థిరపడ్డాడు. రెహమాన్‌ మారుమాట చెప్పకుండా వెళ్లిపోయాడు.

బీచ్‌లో రేవంత్‌  నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు. మిర్చిబండి దగ్గర, ముంత కింద పప్పు బండి ముందర జనం ఈగల్లా మూగున్నారు. రేవంత్‌ మనసు నిశ్శబ్దంగా  నిశీధిని వెతుక్కొంటూ ప్రపంచంతో సంబంధాలు తెంచుకునేందుకు తొందర పడుతోంది. చీకటి పడుతున్నా కొద్దీ బీచ్‌లో జన సంచారం తగ్గుతోంది. అక్కడక్కడ లోకాన్ని పట్టించుకోకుండా ప్రేమలో మునిగితేలుతున్న ప్రేమికులే ఉన్నారు.

అంతవరకు పొదుపుగా ఉన్న అలల ఘోష కాస్తకాస్తగా పెరుగుతోంది.  మిణుకుమిణుకుమంటున్న పూరి గుడిసెల్ని అపుడప్పుడు లైట్‌ హౌస్‌ కాంతి పలకరిస్తోంది. రేవంత్‌ భుజం మీదున్న కోట్‌ తీసి ముడుచుకుని పడుకున్న ముసలి పోగుకి కప్పాడు. లేవలేని ఎముకలగూడు రెండు చేతులు జోడించి నమస్కరించింది. కాలికున్న ఖరీదైన షూ ఇసుకలోనే విడిచేశాడు. ఆలోచనలలో జీవితమ్మీద వైరాగ్యం.

అడుగుల్లో అలసిపోయిన నైరాశ్యం. ఎంతోమందికి మార్గదర్శి అయిన రేవంత్‌.. చీకటి వైపు భారంగా కదులుతున్నాడు. ఎంతో శ్రమించి తండ్రి నిర్మించిన సామ్రాజ్యం నమ్మకద్రోహంతో ములిగిపోయిందనే నిజం ముల్లై మనసుని గుచ్చుతోంది.  సిగరెట్‌ తీసి వెలిగించాడు. గట్టిగా దమ్ములాగాడు. సమస్యలో సతమతమైపోతున్న మెదడు నరాలకి విశ్రాంతినిచ్చే ప్రయత్నం విఫలమైంది.

ఆ సిగరెట్‌ పెట్టెను నేలకేసి కొట్టాడు. ముందుకెళ్తున్న కొద్దీ జనం కనుమరుగు అవుతున్నారు. వెనుక రెండు కాళ్ళు అనుసరిస్తున్నాయని, జత కళ్ళు గమనిస్తున్నాయనే నిజం తెలియక ముందుకు నడుస్తున్నాడు రేవంత్‌.  

జీవితంలో లోతు తెలియని వాళ్ళు, జీవితమంటే రంగులకల అని భ్రమించే వాళ్లు, క్షణికావేశంలో జీవితాన్ని కడతేర్చుకుందుకు అక్కడకే వస్తారు. జనం మీద నమ్మకాన్ని కోల్పోయిన రేవంత్‌ లాంటి వాళ్ళు బతుకుమీద నిరాసక్తతతో అక్కడికే చేరుకుంటారు. ఎంతటి ధీరుడైనా మృత్యుకుహరం ముంగిట అడుగు పెడితే వణకవలసిందే. చల్లగాలిలో కూడా ఆ భయానికి రేవంత్‌ శరీరం చెమటతో తడిసిపోయింది.

అయినా మరణించాలనే నిశ్చయంతో అడుగు ముందుకేసిన రేవంత్‌ని ఒక్క ఉదుటన వెనక్కి లాగాయి నీడలా వెంటాడుతున్న రెండు చేతులు. రేవంత్‌ను బలంగా ఒడిసిపట్టుకుని ఒడ్డుకు లాకొచ్చాడు ఆ మొరటు చేతుల మనిషి. 

గాలి స్వేచ్ఛగా వీస్తోంది. సముద్రం కెరటాలతో ఘోషిస్తోంది. ఆ ఇద్దరినీ చూస్తోంది. నడుముకు కట్టుకున్న రబ్బర్‌ ట్యూబు లోంచి నీళ్ళు తీసి తాగమని రేవంత్‌కు అందించాడు ఆ వ్యక్తి.  గడగడ గుటకలేస్తూ ఆత్రంగా నీళ్ళు తాగాడు రేవంత్‌. అప్పుడు ఏ హోదా, అధికారం గుర్తు రాలేదు అతనికి. నోట్లోంచి మాట పెగల్లేదు. ఒక్కసారి కుదేలై భోరున పసిపిల్లడిలా ఏడ్చేశాడు. 

అంత దర్పంగా ఉన్న మనిషి  ఏడ్చేసరికి కంగారుపడ్డాడు ఆ మొరటు మనిషి. ‘ఊరుకోండయ్యా! కట్టాలు మడిసికి రాకపోతే మానులకొత్తయా.  కట్టాలు వత్తాయి, పోతాయి.. సంద్రంలో కెరటాల్లాగా. కట్టాలు వచ్చినప్పుడే దైర్నంగా ఉండాలి’ అంటూ  కన్నీళ్లు తుడుచుకోడానకన్నట్టు భుజమ్మీద తువ్వాలు అందించాడు. 

తీసుకుని మొహం తుడుచుకోసాగాడు రేవంత్‌. అది పొద్దుటనుంచి చెమటతో తడిసి, మట్టికొట్టుకు పోయిన తువ్వాలు అని రేవంత్‌ గుర్తించలేదు. బాధని దిగమింగుకుని  నిమిషం సేపు అగాడు. భయంతో పూడుకు పోయిన గొంతు సర్దుకుని ‘నువ్వెవరు? నీ పేరేంటి?’ అని అడిగాడు. 

‘నూకాలండి.  నా పేరు వెనుక పెద్ద కతుంది బాబు’ రేవంత్‌ వైపు చూడకుండానే చెప్పడం మొదలుపెట్టాడు. ‘మాయమ్మకి ఇద్దరు ఆడంగులు పుట్టారు. తర్వాత  ముగ్గురు మగోళ్ళు పుట్టారు కానీ ఒక్కరు కూడా బతికి బట్టకట్టనేదు. మగెదవ కోసం మా అమ్మ, అయ్య ఎక్కని గుడిమెట్టునేదు. ఓ రేతిరి  నూకాలమ్మోరు మాయమ్మ కలలో కనబడినాదట.

ఆ తర్వాత నెలకే నేను మాయమ్మ కడుపులో పడ్డానని నాకు నూకాలని పేరెట్టిసినారు’ చెపుతూ చెవిలో సగం కాలిన చుట్ట తీసి నోట్లో పెట్టుకుని వెలిగించాడు. నెమ్మదిగా రేవంత్‌లో కంగారు తగ్గుతోంది. చుట్ట కాలుతున్న వైపు నోట్లో పెట్టుకుని గుప్పుమని పొగ వదులుతున్న నూకాలుని ఆశ్చర్యంగా చూస్తూ రేవంత్‌  ‘నిప్పు నోట్లో పెట్టుకుంటే నాలుక కాలదా?’ అని అడిగాడు 

‘మొదట్లో అలమాటు లేనప్పుడు కాలేది. ఇప్పుడు కాదు. జీవితంనాగే. తొలినాళ్లలో కట్టాలు, కన్నీళ్లకు కుమిలిపోయేవాణ్ణి.  ఇప్పుడు అయే జీవితం అయిపోనాయి’ చెప్పాడు.
నూకాలు మాట్లాడే తీరు, అతని నిర్మలమైన మనసు రేవంత్‌ను ఆకట్టుకోసాగాయి. 

‘బాబూ.. నాదో పెశ్న’ బుర్ర గోక్కుంటూ అడిగాడు నూకాలు.
‘అడుగు’ 
వెంటనే  కాలుస్తున్న చుట్టను సముద్రంలోకి విసిరేశాడు నూకాలు. నీళ్ళు  పుక్కిలించి ఉమ్మేస్తూ.. ‘అయ్యా! వయసు దాసుకునేందుకు డబ్బున్నోళ్ళు రేతిరేదో మందు తాగుతారంట కదా!’

అతని అమాయకత్వానికి  రేవంత్‌ నవ్వాడు. 
‘అయ్యా! మీరలా దొరబాబులా నగుతోంటే పున్నమిరేతిరి సెంద్రుడిలా ధగధగనాడిపోతన్నారు. అనాగే ఎప్పుడు నవ్వుతుండాల’ ప్రేమపూర్వకంగా చెప్పాడు నూకాలు.  
ఆ మాట వినగానే రేవంత్‌కు వాళ్లమ్మ గుర్తొచ్చింది. ‘మేం తాగేదానికి పేరేదైనా మత్తు మాత్రం ఒకటే నూకాలు’ అంటూ జవాబు చెప్పాడు నూకాలు ప్రశ్నకు.

‘మాదేముంది బాబు గోర్నమెంట్‌ సరకు. కడుపులోకెళ్లి గడబిడ సేత్తాది. ఓ పాలి ఏటయినాదంటే.. మా గంగ నిండు సులాలు. నాను పీకలదాకా తాగి ఒంటి మీద దేసనేక సారా దుక్నంలోనే సచ్చినోడిలా  పడున్నాను. ఎవరో పోకిరీ నాయళ్ళు  పాకలకి నిప్పెట్టారు. మా గుడిసెలు బుగై్గపోనాయి. మా గంగ ఆ అగ్గిలో బూడిదై పోయేదే, మా ఓబులేసుగాడు పానమడ్డమేసి రచ్చించాడు. నేకపోతే నాను అనాధ అయిపోను గదేటి’ చెమర్చిన కళ్ళు తుడుచుకున్నాడు.

‘అవునా?’ అశ్చర్యంగా చూశాడు రేవంత్‌.
‘అప్పుడు నాకు సానా సిగ్గేసినాది. సచ్చిపోవాలనిపించింది.  భూమ్మీద నూకలున్న గంగ గురుతొచ్చి ఆగిపోనాను. అప్పుడే,  నా ఇంటిది సేతిలో సెయ్యసి పెమానం తీసుకున్నాది’
‘తాగుడు మానేయమందా?’ 

‘నేదయ్యా! తాగమన్నాది. రోజుకు రెండు గుక్కలు, అయి కూడా ఇంటి కాడే తాగమన్నాది. అప్పటి నుంచి ఈ సెనం దాకా నాను బైట తాగనేదు. ఇంటికాడే ఒక గలేసు లేదంటే మరోటి అంతే’ నూకాలు చెప్పాడు.
‘అంటే గంగ నిన్ను గుప్పిట్లో పెట్టుకుందన్నమాట’ నవ్వుతూ అన్నాడు రేవంత్‌.

‘కాదయ్యా నా పేనాన్ని కాపాడి నెత్తిన పాలోసినాది. ఇంటిని బుగ్గి సేసే మంటనాపి, గడప కాడ దీపం పెట్టినాది. అయేల్లు్నంచి రేతిరి రెండు సుక్కలేసి, మా గంగెట్టిన బువ్వ తిని తొంగుంటాను. తెల్లారితే నా వలతో సంద్రం కాడుంటా’  చెపుతోంటే నూకాలు కళ్ళలో కాంతిని గమనించాడు  రేవంత్‌.
చొక్కా లేకుండా నిక్కరేసుకుని చేతిలో గుడ్డసంచి పట్టుకొని పదేళ్ల కుర్రాడొచ్చాడు అక్కడికి.. ‘ఓరయ్యా! అమ్మ నీ కాడాకి పోయి పైసలు తెమ్మన్నాది. బద్రం కొట్లో సరుకులు కావాలంట’ అంటూ. 

నడుం దగ్గర వేలాడుతున్న బుట్టలోంచి ఏభై రూపాయల కాగితం పిల్లాడిచేతిలో పెట్టాడు నూకాలు.  బుట్టలోంచి కొరమీను తీసి పిల్లాడి చేతికిచ్చి ‘ఒరేయి అబ్బి! ఇది అమ్మకిచ్చి మసాలా దట్టించి కూర సేయమను’ అని రేవంత్‌ వైపు తిరిగి ‘ఈడు నా కొడుకు బాబు. అదిగో ఆ దీపం అగుపడుతోందే అదే మా గుడిసె. నా పెళ్లానికి నానంటే సానా ఇష్టమండి. ఎంత పొద్దుగూకినా  నాను పోయేదాకా ముద్ద ముట్టదు. ఇప్పటికే పొద్దుపోనాది. రండయ్యా, మాతో కలో, గంజో తాగుదురుగాని’ అభ్యర్థించాడు నూకాలు.

‘వద్దులే నూకాలు నేనింటికి వెళ్లిపోతా’  అన్నాడు రేవంత్‌ మోహమాటంగా. 
‘మిమ్మల్ని నాను ఒగ్గను. మీ బుర్రనోకి సెడ్డ ఆలోసనొచ్చినాది. అది పురుగులా దొలిసేత్తది. మిమ్మల్ని ఇడిసే పసత్తినేదు’ చనువుగా రేవంత్‌ చెయ్యి పట్టుకుని ఇంటి వైపు అడుగులేశాడు నూకాలు.
ఆ అభిమానానికి అడ్డుచెప్పలేక పోయాడు రేవంత్‌.                                                  

అది ఒకటే గదున్న పాక. అందులోనే తడక అడ్డుతో వంటిల్లు. కుచేలుడు కృష్ణుడిని ఆహ్వానించినట్లు రేవంత్‌కు సాదర స్వాగతం పలికాడు నూకాలు. గంగని పరిచయం చేశాడు. ‘ఏందీ.. అయ్యగారికి మంచి కొరమీను కూరసేసి ఉడుకన్నం ఎట్టు. ఈలోగా సానం సేత్తారు’ అంటూ హడావిడి చేశాడు. పాత ట్రంక్‌ పెట్టెలోంచి తెల్లటి పంచె తీసి  ‘అయ్యా! ఇది కొత్త పంచి. పోయిన సంకురేతిరికి కొన్నాను. ఇంతవరకు మడత కూడా ఇప్పనేదు’ అంటూ రేవంత్‌ భుజమ్మీదేశాడు.
వారించడం ఇష్టం లేక  మౌనంగా  నాపరాళ్ళు వేసిన తడకల  స్నానాలగదిలోకి వెళ్లాడు రేవంత్‌.  

స్నానం చేసి కొత్త పంచె కట్టుకుని ఆరుబయట వేసిన నులకమంచం మీద మఠం వేసుకుని యోగిలా కూర్చున్నాడు రేవంత్‌. సముద్రకెరటాల మీద కదులుతున్న చంద్రుడు ఊయల ఊగుతున్న వెన్నెల బాలుడులా ఉన్నాడు. చేతికున్న బంగారు బ్రేస్‌లెట్‌ తీసి తలగడ కింద పెట్టాడు.

వేడి అన్నం మీద  ఘుమఘుమలాడే  కొరమీను కూర వేసి ఆవిర్లు కక్కుతున్న పళ్ళెం చేతికందించాడు నూకాలు. మంచి ఆకలి మీదున్నాడేమో లొట్టలేసుకుంటూ తిన్నాడు రేవంత్‌. రెండురోజుల్లో విదేశీ యాత్ర ముగించుకుని వచ్చేయనున్న భార్య, పిల్లలు మనసులో మెదిలారు. ఇల్లు గుర్తొచ్చింది.  

‘అయ్యా.. సిగరెట్టు’ అంటూ  సిగరెట్‌ పాకెట్‌ ఇచ్చాడు నూకాలు.  
అది తను కాల్చే బ్రాండ్‌. అనుమానం, ఆశ్చర్యం ఆపుకోలేక ‘నూకాలూ.. నీదగ్గర ఈ బ్రాండ్‌..’ అంటూ ఆగాడు రేవంత్‌. 
‘మీరు సంద్రం కాడ ఇసిరేసినాదే. దమ్ముగొట్టండి, మారంజుగుంటది’ 

‘వద్దులే. నీ జేబులో చుట్ట ఇవ్వు’ 
ఇచ్చాడు నూకాలు.  చుట్ట నోట్లో పెట్టుకుని వెలిగించి గట్టిగా దమ్ములాగాడు రేవంత్‌. చుట్ట ఘాటుకి ఊపిరాడక దగ్గు వచ్చింది. కంగారు పడిపోయాడు నూకాలు. మరుక్షణం తేరుకున్న రేవంత్‌ నెమ్మదిగా దమ్ములాగి పొగ వదిలాడు. 

 సముద్రపు గాలి చల్లగా వచ్చి ప్రేమగా తాకుతోంది.  
 ‘అయ్యా! నానో మాటాడగనా?’  
 గుప్పుగుప్పుమని పొగ వదులుతూ అడగమన్నట్లు సైగ చేశాడు రేవంత్‌.

‘వలలో పడ్డ సేపలు ఎట్టాగైన సంద్రంలోపడి బతకడానికి తెగ గింజేసుకుంతాయి. మరి మడిసెంటీ? భగమంతుడు ఇచ్చిన పేనాలు తీసేసుకుంతనంతాడు. ఇది శానా ఇసిత్రంగుంది’ అడిగాడు నూకాలు అమాయకంగా మొహం పెడుతూ. 
రేవంత్‌ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. అక్కడల్లుకున్న నిశ్శబ్దం వల్ల దూరంగా ఎగసిపడుతున్న సముద్రపు కెరటాల హోరు స్పష్టంగా వినిస్తోంది. 

‘మీరు సూత్తే సదువుకున్న దొరబాబులా ఉన్నారు. భగమంతుడు మీబోటి మారాజుల్ని పుట్టించి.. ఈడకు పంపినడంటే ఎంతో మంది ఆకలి తీర్చడానికని నాను సత్తేపెమానికంగా నమ్ముతాను. ఆ పని సగానీకే ఆపేసి ఎల్లిపోతననడం నాయమా సెప్పండి’ అన్నాడు నిలదీస్తున్నట్టుగా.
నిర్వేదంగా నవ్వాడు రేవంత్‌

‘అలా నగబాకండి. మీరు నగుతొంటే  జాబిలెలుగు సూశాను. ఈ నవ్వు నచ్చనేదు’ నిర్మొహమాటంగా చెప్పాడు నూకాలు.
‘నూకాలూ..  నాకుండే కష్టాలు నాకుంటాయిగా?’ 

‘ఎంత సెట్టుకు అంత గాలని తెలుసు. సమస్యలకి సావు సమాధానమా? సచ్చిపోతే కట్టాలకు దూరంగా లగేత్తచ్చు. అవి మనల్ని నమ్ముకున్నోళ్ల బతుక్కి సుట్టుకుంటాయి. ఆళ్లని పీక్కుతింటాయి. ఇంటోల్ల పేనానికి మన కట్టాల్ని ఒగ్గేత్తే అది నాయమా? ధర్మమా?  సార్ధమే అవుద్ది. మనోళ్లని మనమే అన్నేయం సేసినట్టు అవుద్ది. మీరు బాగా సదుకున్న బాబులు మీకు సెప్పే గేనమ్‌ లేనోడ్ని’ 

‘నా ఆలోచనకు రాని జీవితసత్యాన్ని చెప్పావు’ నూకాల్ని అభినందించాడు రేవంత్‌.
‘మా బతుకులే సూడండి ఈ పూట కూడు తింటాం. రేపటికి గుప్పెడు మెతుకుల కోసం ఎతుకులాడతాం. అది ఎలా సంపాదించాలనేది పెద్ద పెశ్న. మా ఆడోల్లకి ఆకరి ముద్ద గొంతులోకి దిగుతోంటే.. తెల్లారితే పసోళ్ల  ఆకలి ఎలా తీర్సాలని ఆలోసిత్తారు. అది మా బతుకు. ఏ పూటకాపూట కూడు ఎట్టా వత్తాదో ఆలోసించాలి’ 

‘నీకు రేపు ఎలా బతకాలి.. నిన్ను నమ్ముకున్న నీ వాళ్ళను ఎలా బతికించాలనేది ప్రశ్న.  కాని నా ప్రపంచం వేరు. మోసగించేవాళ్ళను దాటుకుని ఆస్తిని ఎలా కాపాడుకోవాలి.. చుట్టూ ఉన్న తోడేళ్లనుంచి ఎలా రక్షించుకోవాలి..  తోడుగా ఉంటూనే ప్రాణాలు తీసే పులులుంటాయి. నీడనిచ్చిన చెట్టును నరికే గొడ్డళ్లుంటాయి. నమ్మకద్రోహం చేసే నయవంచకులు ఉంటారు. వాళ్లనుంచి ఎలా బైటపడాలనే ఆలోచనే’ కాస్త ఆవేశంగా చెప్పాడు రేవంత్‌.

‘అవునయ్యా! నమ్మినోడ్నే కదా మోసం సేసీది. మా బతుకులే సూడండి. తూర్పున సూరీడు కంటే ముందే లెగిసి సెమటోడిసి నాలుగు సేపలు పడితే మధ్యలో కొంతమంది అయినకాడికి ఆటిని ఏసుకుపోతారు. మా సెమట సుక్క దోసుకోడం మోసంకదా. ఆళ్ళని పుట్టించిన భగమంతుడే సత్తూ బతకమని మమ్మల్ని, మమ్మల్ని సంపి పెరగమని ఆళ్ళనీ పుట్టిచ్చాడు’ అంటూ ఒక్క  ఒక్కక్షణం ఆగి.. మొహం తుండుగుడ్డతో తుడుచుకుని ‘మాకు బతుకిచ్చిన దేముడే బతికినంతకాలం సత్తూ బతకమని మమల్ని మోసం సేసాడు.

ఇంకెవరికి సేప్పుకోవాల! ఇందాక మనం వత్తోంటే ఒడ్డుకాడున్న మరపడవల గురించి అడిగినారు గుర్తుందా! నిజం సెప్పాలంటే అయి మాయే. కాని మాకు దాని మీద హక్కు నేదు. అప్పు కట్టే బాద్దెత మాత్రం ఉంది.  మేం వాళ్ళ  సేతుల్లో మోసపోయామని తెలుసు. కాని అడిగే దైర్నం నేదు’ అన్నాడు నూకాలు. 
‘అదేమిటి?’

‘ఆదంతే. వలలకోసం ఎప్పుడో పదో, పరకో అప్పిచ్చారు. అప్పు తీసుకున్న పాపానికి పట్టిన సేపలు అల్ల పాదాల కాడ పెట్టాల. ఆళ్ళ దయ మీద బతకాల. ఇట్టమైతే బిచ్చమేత్తారు. నేకపోతే సీ కొడతారు. వలల కోసం యేసిన యేలిముద్రలతో కొన్నవే ఆ మరపడవలు. అప్పు తీర్సే మరమనుషులం మేం.  అప్పు మా పేర ఉంటది. మమల్ని ఆడించే తాళం ఆల్ల కాడుంటాది.

ఇంతకన్నా ఈ పెపంచకంలో దగా ఉంటాదా? అన్నేయమని ఎదిరిత్తే సంద్రం ఒడ్డు మీద సచ్చి శవాలై తేల్తాం. మాకు పెళ్ళాంబిడ్డలు కావాలి. మా పెళ్లాంబిడ్డలకి మేం కావాలి. అందుకు మా నోరు మూసుకుని మనుషులమై కూడా మూగ పీనుగుల్లా బతుకుతున్నాం’ గుండెల్లో దాచుకున్న బాధను బైట పెట్టాడు నూకాలు.
జరుగుతున్న దోపిడీ వింటూంటే రేవంత్‌ రక్తం సలసల పొంగింది. వీళ్ళకు సాయం చేయాలని మనసులోనే నిర్ణయించుకున్నాడు. వాళ్ళకు జరిగిన మోసం ముందు తనకి జరిగిన మోసం ఎంతో చిన్నదనే విషయం అర్థమయింది.

ఎవరో చేసిన మోసానికి తనని తాను శిక్షించుకోవడం ఎంత తప్పో అర్థమయింది. అన్యాయానికి ఎదురొడ్డి  పోరాడాలనుకున్నాడు. కళ్ళు తెరిపించిన నూకాలికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.

‘అయినా బాబు నాకు తెలకడుగుతాను.. మీకు మోసం జరిగినదంటే పోలీసోళ్ళకి సెప్పచ్చుగా! మీ దగ్గర డబ్బు ఉంది.  మీ మాటకు పోలీసుల కాడ ఇలువుంటది. అయ్యా.. మా గొడంతా సెప్పి మిమల్ని ఇసిగించనేదు కదా..  చెమించండి. బాగా పొద్దు పోయింది. ఇక పండుకోండి’ అంటూ  నిద్రకి ఏర్పాటు చేశాడు నూకాలు. 
∙∙ 
తెల్లారింది. తెల్లారిపోవలసిన రేవంత్‌ జీవితం కొత్త సూర్యోదయాన్ని చూసింది. రెహమాన్‌ మాట విన్పిస్తోంది. ఇక్కడకి రెహమాన్‌ ఎలా వచ్చాడు.. రేవంత్‌కి ఆశ్చర్యం వేసింది.  వెంటనే ‘రెహమాన్‌! నువ్వు.. ఇక్కడ?’ అడిగాడు.
‘మీ కోసమే సార్‌’

‘నా కోసమా?  నేను ఇక్కడున్నానని నీకు ఎలా తెలిసింది?’
ఊహించని ప్రశ్నకు రెహమాన్‌ సమాధానం చెప్పడానికి తడబడుతున్నాడు. 
‘అయ్యా.. నాను సెపుతాను. తమరు ఏదో అఘాయిత్తం సేత్తారేమోనని నాకు చెప్పింది ఇతగాడే. అతగాడి మాట మీదే మీ వెనకమాల నానొచ్చాను. మీరు రేతిరి నాతో గుడిసెకాడకి వచ్చే వరకు రెహమాన్‌ సంద్రం కాడే ఉన్నాడు’

‘రేవంత్‌ బాబు! మీరు ఎయిర్‌ పోర్ట్‌లో దింపమన్న గెస్టుల మాటల్ని బట్టి  కంపెనీని ఎవరో మోసం చేస్తున్నారని అర్థమైంది.  మనుషులకు విలువిచ్చే మీరు నమ్మినవాళ్ళ ఉచ్చులో పడ్డారని గ్రహించాను. చిన్నప్పట్నుంచి  మీ సున్నితమైన మనస్తత్వం తెలుసు. అందుకేనేమో మీరు వెళ్లమన్నా  వెళ్లలేకపోయాను. నా దేవుడ్ని రక్షించుకునేందుకు నూకాలు.. అల్లా పంపిన దేవదూతలా కనిపించాడు’  ఆ మాట చెపుతుంటే రెహమాన్‌ మొహంలో సంతృప్తి కనబడింది.

రెహమాన్‌ మాటలకు రేవంత్‌ కళ్లు చెమ్మతో తడిశాయి. నమ్ముకున్న బంధువులు టెండర్లలో పోటీ కంపెనీతో చేతులు కలిపి వెన్నుపోటు పొడిచారు. కంపెనీ కీలకరహస్యాలు బైటకు చేరేశారు.  

నూకాలు మాటలకి, రెహమాన్‌ అభిమానానికి చలించిపోయాడు. రేవంత్‌లో సడలిన ఆత్మవిశ్వాసం, చిగురించింది.
‘నూకాలూ.. రేపు రెహమాన్‌ వస్తాడు. అతనితో కలిసి మా ఇంటికి రా’ చెప్పాడు రేవంత్‌.
‘చెమించండి బాబూ.. మీ అంత గొప్పోళ్ళ లోగిలికి రాలేను’ రెండు చేతులు జోడిస్తూ నూకాలు.

‘నాకు బతుకంటే అర్థం చెప్పావు. నేను ఋణం తీర్చుకోవాలిగా’ 
‘తిరిగి చెల్లించడానికి ఇది అప్పు కాదయ్యా. కట్టంలో ఉన్న మడిసికి సాటిమడిసి సేసే మాట సాయం. ఇలువలకి కొలతలు ఉండవు. పైనున్న భగమంతుడే సూసి మెచ్చాలి’ 
నూకాలు ఆత్మాభిమానానికి అబ్బురపడి అభివాదం చేస్తూ కారు ఎక్కాడు రేవంత్‌. 

నూకాలు కొడుకు నులకమంచం మీద దుప్పటి దులుపుతూంటే బంగారు బ్రేస్‌లేట్‌ కింద పడింది. ‘అయ్యా! ఇది బాబుగారి  గొలుసు’ అంటూ ఆ గొలుసును చేత్తో పట్టుకుని కారు ఆపమని అరచుకుంటూ కారు వెనుకే పరిగెత్తాడు నూకాలు నిజాయతీకి వారసుడు.
-పెమ్మరాజు విజయ్‌ 

మరిన్ని వార్తలు