ది ఐస్‌ బాక్స్‌ మర్డర్స్‌.. నేటికీ మిస్టరీగానే!

20 Mar, 2022 13:05 IST|Sakshi

ఉన్మాద చర్యలు ఎప్పుడూ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తాయి. నిర్ఘాంతపోయే నిజాలతో గజగజా వణికిస్తాయి. నెత్తుటిధారలతో చరిత్ర పేజీలను తడిపేస్తాయి. ఆ జాబితాలోనివే అమెరికాలోనే అతి భయంకరమైన ఐస్‌ బాక్స్‌ మర్డర్స్‌. సుమారు 56 ఏళ్లు దాటినా నేటికీ తేలని ఆ కథేంటో ఈ వారం మిస్టరీలో చూద్దాం. 1965, జూన్‌ 23.. చార్ల్స్‌ ఫ్రెడరిక్‌ రోజర్స్‌ అనే పేరు అమెరికా మొత్తం మారుమోగిన రోజు. అతడి ఫొటోలు నాటి పత్రికల మొదటి పేజీల్లో పడ్డాయి. మోస్ట్‌ పాపులర్‌గా కాదు మోస్ట్‌ వాంటెడ్‌ క్రిమినల్‌గా. అసలు ఎవరీ రోజర్స్‌.. అతడు చేసిన నేరమేంటీ?

ఫ్రెడ్‌ క్రిస్టోఫర్, మరియా ఎడ్వినా.. దంపతులకు 1921 డిసెంబర్‌ 30న జన్మించాడు రోజర్స్‌. 1942 నాటికి హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్‌ ఫిజిక్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ పొందాడు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యునైటెడ్‌ స్టేట్స్‌ నేవీలో పైలట్‌గా ఉంటూనే.. నేవల్‌ ఇంటెలిజెన్స్‌ కార్యాలయంలో గుఢచారిగానూ  పనిచేశాడు. యుద్ధం తర్వాత తొమ్మిదేళ్ల పాటు షెల్‌ ఆయిల్‌కు భూకంప శాస్త్రవేత్త గా సేవలందించాడు. 1957లో ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు. 

‘రోజర్స్‌ ఏడు భాషలను అనర్గళంగా మాట్లాగలడు. చాలా తెలివైనవాడు. చమురు, బంగారం వెలికి తియ్యడంలో ప్రత్యేకమైన ప్రతిభ ఉంది అతడికి’ అనేది అతడి సన్నిహితుల మాట. 1963 తర్వాత రోజర్స్‌ నిరుద్యోగిగానే ఉన్నాడు. హ్యూస్టన్‌ లోని మాంట్రోస్‌ పరిసరాల్లో నివసిస్తున్న వృద్ధ తల్లిదండ్రులతో కలిసి జీవించేవాడు. అయితే తెల్లవారకముందే వెళ్లి.. అర్ధరాత్రికి తిరిగి వచ్చే రోజర్స్‌ అక్కడే ఉంటున్నాడనే విషయం చుట్టుపక్కల వాళ్లక్కూడా పెద్దగా తెలియదు.
ఏళ్లు గడిచాయి.. 

1965, జూన్‌ 23న ఫ్రెడ్‌ మేనల్లుడు మార్విన్‌.. ఆందోళనగా పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లాడు. గత కొన్ని రోజులుగా తన అత్తా, మామ(ఫ్రెడ్, మరియా)ల నుంచి ఎలాంటి సమాచారం లేదని, ఫోన్‌ చేస్తే ఎత్తడం లేదని, ఇంటికి వెళ్తే తాళాలు వేసి ఉన్నాయని.. అసలే ముసలివాళ్లు.. ఏదైనా ప్రమాదంలో ఉన్నారేమోనని అనుమానంగా ఉందని, తక్షణమే వెతకాలని కోరాడు.

దాంతో హ్యూస్టన్‌ పోలీసులు రంగంలోని దిగారు. మార్విన్‌ని తీసుకుని మాంట్రోస్‌ పరిసరాల్లో ఉన్న ఫ్రెడ్‌ ఇంటికి బయలుదేరారు సోదా చెయ్యడానికి. తలుపుమూసి ఉండటం చూసి.. బలవంతంగా తెరిచారు. తలుపు తీస్తే లోపలంతా సాధారణంగా ఉంది. ఎక్కడా ఏ అలికిడీ లేదు. డైనింగ్‌ టేబుల్‌ మీద ఏవో వంటకాలు కనిపించాయి. చుట్టూ చూశారు పోలీసులు. ఒక్కొక్కరూ ఒక్కో గది వెతికారు. ఎక్కడా ఏమీ అసాధరణమైనవి కంటపడలేదు.

మనుషులూ కనిపించలేదు. అందులో ఒక పోలీస్‌ ఆఫీసర్‌కి ఓ అనుమానం వచ్చింది. ‘ఈ ఇంట్లో ఎన్నిరోజులుగా మనుషులు ఉండటం లేదు? రోజువారి అసవరాల కోసం ఏమైనా తెచ్చి పెట్టుకుంటున్నారా లేదా?’ అనుకుంటూ ఫ్రిజ్‌ ఓపెన్‌ చేసి చూశాడు. ఫ్రిజ్‌ నిండా శుభ్రంగా కడిగిపెట్టిన మాంసం కనిపించింది. అడివి దున్న మాంసం కాబోలు అనుకుని తలుపు వెయ్యబోతుంటే.. కింద ఉండే ట్రాన్స్‌పరెంట్‌ కూరగాయల టబ్‌లో రెండు మనిషి తలలు కనిపించాయి. అవి ఎవరివో కాదు..  ఫ్రెడ్, మరియాలవే. 

ఫ్రిజ్‌ డోర్‌ తీసిన ఆఫీసర్‌ నుంచి ఒక గావుకేక వినిపించింది. మిగిలిన వాళ్లు అతడి దగ్గరకు పరుగుతీశారు. అక్కడ పరిస్థితి చూసి గజగజా వణికారు. టాయిలెట్‌ ఫ్లష్‌ దగ్గర.. ఆ దంపతుల అవయవాలు తొలగించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. అవశేషాలు దొరికాయి. రోజర్స్‌ గదిలో రక్తంతో తడిసిన రంపాన్ని బయటికి తీశారు. అయితే ఆ రోజు నుంచి రోజర్స్‌ కనిపించలేదు. అసలు ఎక్కడున్నాడో ఈ ప్రపంచానికి తెలియలేదు. నేరం చేసింది ఎవరు? కన్నకొడుకే తల్లిదండ్రులను ఇంత కిరాతకంగా కడతేర్చాడా? అనే వార్తలు యావత్‌  అమెరికా వ్యాపించాయి. అంతకు రెండు రోజుల ముందే ఫ్రెడ్‌ దంపతులు హత్యకు గురైనట్లు రిపోర్ట్‌లు వచ్చాయి. రెండు రోజుల ముందంటే జూన్‌ 20న ఈ ఘోరం జరిగింది. అంటే ఆ రోజు ఫాదర్స్‌ డే కావడంతో ఈ వార్త మరింత సంచలనం అయ్యింది.

శవపరీక్షల్లో ఫ్రెడ్‌(81), మారియా(72)లని తలపై సుత్తితో కొట్టి చంపినట్లు తేలింది. చనిపోయిన తర్వాతే ఫ్రెడ్‌ కాళ్లు, జననాంగాలు తొలగించారని, మారియా శరీరానికి నిప్పు పెట్టి, మిగిలింది ఫ్రిజ్‌లో దాచిపెట్టారని వెల్లడైంది. అయితే రోజర్స్‌.. సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజన్సీ(సి.ఐ.ఏ)కి సంబంధించిన ఏజెంట్‌ అని.. మెక్సికో నగరంలో ‘లీ హార్వే ఓస్వాల్డ్‌’గా చలామణీ అయ్యాడని.. చార్ల్స్‌ హారెల్సన్, ప్రెసిడెంట్‌ జాన్‌ ఎఫ్‌. కెన్నెడీల హత్యల్లో నిందితుడని, అతడి రహస్యాలు  తెలుసుకున్నందుకే తల్లిదండ్రులను చంపేశాడని.. కథలు కథలుగా రాశారు కొందరు ఔత్సాహిక రచయితలు. అయితే ఈ వాదనను పలువురు విచారణాధికారులు కొట్టిపారేశారు.

రోజర్స్‌ కోసం గాలింపు చర్యలు ఎంత ముమ్మరం చేసినా ఫలితం లేకపోయింది. చివరికి 1975లో ఈ కేసు విచారిస్తున్న న్యాయమూర్తి.. చట్టప్రకారం రోజర్స్‌ చనిపోయాడని ప్రకటించడంతో ఈ కేసు అధికారికంగా ముగిసింది. కోల్డ్‌ కేసుల సరసన చేరిపోయింది. ఫోరెన్సిక్‌ అకౌంటెంట్‌ హ్యూస్టన్, అతడి భార్య మార్తా ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడించారు. రోజర్స్‌ తల్లిదండ్రులను హత్య చేసిన తరవాత తను కూడా హోండురాస్‌ అనే ప్రాంతంలో హత్యకు గురయ్యాడని, సీ.ఐ.ఏ సిబ్బందితో అతడికి సన్నిహిత సంబంధాలు ఉండేవని నిర్ధారించారు. 

మరోవైపు ఫ్రెడ్‌ దగ్గర పని చేసే తోటమాలి మాటల ప్రకారం.. రోజర్స్‌ ఎప్పుడూ తల్లిదండ్రులను ఏడిపిస్తూనే ఉండేవాడని, దుర్భాషలాడి బాధపెట్టేవాడని.. జూదం, దొంగతనం అంటూ చట్టవిరుద్ధమైన పనులకు తెగబడేవాడని, చాలా సార్లు ఫ్రెడ్‌ దగ్గర డబ్బులు దొంగలించాడని చెప్పాడు. అంతేకాదు రోజర్స్‌ ముందే ప్లాన్‌ చేసుకుని తల్లిదండ్రుల్ని చంపి ఉంటాడని, ఎవరో నమ్మకమైన స్నేహితుల సాయంతోనే దొరక్కుండా తప్పించుకోగలిగాడని, చివరికి హోండురాస్‌లో మైనర్ల వేతనాల వివాదంలో హత్యకు గురయ్యి ఉంటాడని అభిప్రాయపడ్డాడు. ఇదే కథనాన్ని బేస్‌ చేసుకుని ‘ది ఐస్‌ బాక్స్‌ మర్డర్స్‌’ అనే పుస్తకం కూడా వచ్చింది. అయితే అన్ని అనుమానాలు, అంచనాలే కానీ అసలు ఏం జరిగిందో చెప్పేవాళ్లు లేకపోవడంతో ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.
∙సంహిత నిమ్మన 

మరిన్ని వార్తలు