మౌన విస్ఫోటం..

19 Dec, 2021 17:46 IST|Sakshi

వ్యక్తి శ్రేయస్సుని  పట్టించుకోని సమాజం నైతిక విలువల కోసం బీరాలు పోతుంది. మనిషి నడవడికలోని లోపాల కోసం ఆరాలు తీస్తుంది. గోరంతని కొండంత చేస్తుంది.

డోలా పూర్ణిమనాడు చంద్రుడు పరిపూర్ణ వృత్తాకారంలో.. భూగోళాన్ని తన వెన్నెల వెలుగులతో ముంచెత్తేటట్లుగా ఉన్నాడు. ఎప్పటివలెనే ఆ సంవత్సరం కూడా ఉత్సవ విగ్రహాల్ని రథాలమీద ఊరేగిస్తున్నారు. ఇంటింటికీ ప్రసాదాల్ని పంచిపెడుతున్నారు. అలా మేళతాళాలతో జనప్రవాహం ముందుకెళ్లి ఒక పెద్ద మైదానాన్ని చేరుకొంది. అక్కడ బుక్కాగుండలని పిలిచే రంగు రంగుల పొడుల్ని ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. ఈ హోలీ ఇతర పండగల వంటిది కాదు. ఎంతో సందడిగా ఉంటుంది. జనం ఆ అనుభూతిని మిగిలిన కాలమంతా గుండెల్లో దాచుకొని నిత్యనూతనంగా నెమరువేసుకొంటూ వుంటారు.
ఆ పల్లెలో ఆ వెన్నెలతోనూ ఆ సంరంభంతోనూ సంబంధంలేని ఒకేఒక్క వ్యక్తి పాటాదే. ఆమెకు సుమారు పాతికేళ్ళుంటాయి.  చక్కగావుంటుంది. ఆమె తండ్రి జాగూ బెహరా రథాలను లాగుతూ ఉత్సవంలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడామె తమ నివాసంలో ఒక్కతే మిగిలిపోయింది. వీధిలోకి వచ్చిన ఉత్సవ  విగ్రహాలకు నమస్కరించి లోనికివచ్చి కూర్చున్నది. మాటామంతీ పంచుకోవడానికి గానీ ఇరుగుపొరుగున గానీ చీమ కూడా లేదు. వున్నా ఆమె ఎవరితోనూ మాట్లాడదు. వారి చిన్న ఇల్లు ఆపల్లె చివరన.. స్మశానానికి చేరువగా ఉంటుంది. అటువైపు జనసంచారం ఎక్కువగా ఉండదు.  ఎవరైనా అటుగా వచ్చి అడిగినా ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడదు. ఏదోలోకంలో ఉన్నట్టుగానే ఉంటుంది ఆమె. 
సుమారు ఒక సంవత్సరం కిందట.... 
జాగూ బెహరా తనకున్న అయిదు సెంట్ల పంట భూమిని అమ్మేసి పాటాదేను దూరపు గ్రామానికి చెందిన ఒక యువకుడికి ఇచ్చి పెళ్ళిచేశాడు. వరుడు కూడా చక్కని వాడు. ఆ కుటుంబం వారు మంచి స్థితిపరులు. వూర్లో గౌరవం కలవారు. వారు జాగూ స్థితిగతుల్ని కాకుండా కేవలం అమ్మాయి అందాన్ని చూసి చేసుకున్నారు. ఆ గ్రామస్తులు వరుడి వద్ద బంగారు నగల్ని తాకట్టు పెట్టి అప్పులు తీసుకొంటూ వుంటారు. కుమార్తె  సంతోషంగా ఉంటుందని జాగూ తన భూమిని కోల్పోయినా లెక్క చెయ్యలేదు. ఆమెని  అత్తవారింటికి పంపి  నిట్టూర్చాడు. ఒక బాధ్యత తీరిందని సంతోషించాడు. కానీ పట్టుమని రెండు నెలలు నిండకుండానే ఒక రోజు జాగూ బెహరా పగలంతా కష్టపడి పనిచేసి వచ్చి ఒక చిరిగిన దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి ఎవరో తలుపు తట్టిన శబ్దమైంది. ఒక్కసారిగా నిద్ర మేల్కొని ‘ఎవరది?’ అని అరిచాడు. అటు నుండి జవాబు రాలేదు. మళ్ళీ నిద్రకు ఉపక్రమించాడు. మళ్ళీ తలుపు శబ్దమైంది. నిద్రాభంగమైనందుకు చిరాగ్గానే  లేచి వెళ్లి  తలుపు తెరిచాడు. చలిలో చీకటిలో అర్ధరాత్రి ఇంటికి చేరిన కుమార్తెని చూసి నిర్ఘాంతపోయాడు. ‘పాటా! నువ్వేనా అమ్మా!’  అంటూ అడిగాడు. 
ఆమె నిలువెల్లా వణికిపోతూ అతడిని నెట్టుకొంటూ లోనికొచ్చి తలుపు గడియ పెట్టింది. 
‘అమ్మా! ఇంత రాత్రి వచ్చావేమిటి? నీభర్తతో గానీ అత్తమామలతో గానీ గొడవపడ్డావా?’
పాటాదే గోడకి చేరబడి తలవంచుకొని కుమిలిపోసాగింది. జాగూ కూడా కుమార్తె స్థితిని చూసి మరిన్ని ప్రశ్నలు వెయ్యకుండానే కూలబడిపోయాడు. ఇదేదో తీవ్రమైన అంశమే అని భావించాడు.
‘ఏమైనా తింటావా అమ్మా! ఆ మూలన గంజన్నముంది’ అన్నాడు. 
కానీ ఆమె లేవలేదు. తినలేదు. ఏడుపు ఆపలేదు. ఆ తరువాత కూడా ఎన్నిసార్లు ప్రశ్నించినా ఆమె సమాధానం చెప్పలేదు. పాటాదే మాత్రం తరచుగా ఏడుస్తూనే ఉండేది. గతంలో ఆమె అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఒకసారి ఏడ్చింది. జాగూ తన తువ్వాలుతో ఆమె కళ్ళని తుడిచాడు. నిజానికి అప్పుడు అతడికీ ఏడుపొచ్చింది. అయితే ఇప్పుడు ఈ స్థితిలో ఆమె రోదన వేరు. పాటాదే పసిపాపగా వున్నప్పుడే తల్లి చనిపోయింది. అతడు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఉన్నంతలో అల్లారుముద్దుగా కన్నుల్లో వత్తులు వేసుకొని పెంచాడు. 
రోజులూ వారాలూ నెలలూ గడిచాయి. ఆమె భర్త గానీ అత్తవారింటి నుండి వేరేవారు గానీ పాటాదేను తీసుకొనివెళ్ళడానికి రాలేదు. ఈలోగా ఇరుగుపొరుగులూ ఊరివారూ ఆమె గురించి గుసగుసలు మొదలుపెట్టారు. గుచ్చిగుచ్చి ప్రశ్నించేవారు. జాగూ బెహరా ఏవేవో సమాధానాలు చెప్పేవాడు. అల్లుడు ఉద్యోగాన్వేషణలో ఉన్నాడనీ, దేశాంతరం వెళ్లాడనీ, త్వరలోనే వచ్చి తీసుకెళ్తాడనీ చెప్పేవాడు. పాటాదే ఎవరితోనూ మాట్లాడేది కాదు. తన ఈడు ఆడపిల్లలతో సరదాగా తిరిగేది కాదు. ఎవరేమడిగినా తన చక్రాల్లాంటి పెద్దకళ్ళు పైకెత్తి చూసేది తప్ప పెదవి విప్పేదికాదు. 
జాగూ బెహరా తన కుమార్తె ఏదో తీవ్రమైన ఇబ్బందివల్లనే అత్తవారి ఇంటి నుండి తిరిగి వచ్చేసిందని మాత్రం గ్రహించాడు. అయినా వారిపైన తగువుకు గానీ కోర్టుకు గానీ వెళ్లే స్థోమత లేదు. అతడు తెలివైనవాడూ కాదు. బలమైనవాడూ కాదు. మౌనంగా కుమిలి పోవడం తప్ప అతనికింకేమీ తెలీదు. ఏదో కూలీ నాలీ చేసుకుంటూ తినోతినకో మర్యాదగా కూతుర్ని పోషించుకొంటూ తానూ బతుకు వెళ్లబుచ్చుతున్నాడు. పాటాదే తండ్రికి తన బాధ చెప్పుకోలేదు. గట్టిగా నిలదీస్తే ఆమె ఏదైనా అఘాయిత్యం తలపెడుతుందని జాగూ భయపడ్డాడు. 
నిజానికి జరిగిందిది ..
పాటాదే కాపురానికి వెళ్లడం మాత్రం వెళ్ళింది. కానీ ఆమె భర్తకు పుంసత్వం లేదు. కొద్దిరోజుల్లోనే  అతడు తనవద్ద తాకట్టులోవున్న ఊరివారి బంగారమంతా పట్టుకొని కలకత్తా ఉడాయించాడు. అత్తమామలు ఈమెని అనేక విధాలుగా రాచి రంపానపెట్టారు. ఈమెవల్లనే తమ కొడుకు ఇల్లు విడిచిపోయాడని అపనింద కూడా వేశారు. చాలారోజుల పాటు ఈమెని చీకటి గదిలో బంధించి కొట్టి తిట్టి సరిగా తిండి కూడా పెట్టేవారు కాదు. ఈస్థితిలోనే పాటాదే ఒకరోజు అర్ధరాత్రి వారి బారి నుండి తప్పించుకొని తండ్రిని చేరుకున్నది. కానీ తనకు జరిగిన అన్యాయాన్ని కన్నతండ్రితో ఎలా చెప్పుకోగలదు? చెప్పినా మరింత కుంగిపోతాడు తప్ప ఇంకేంచెయ్యగలడు?
తండ్రీకూతుళ్ళు కూటికి లేమైనా పరువుకి లేమిలేకుండా జీవిక కొనసాగిస్తున్నారు. జాగూ వార్థక్యానికి చేరుకున్నాడు. శరీరం పట్టుతప్పుతున్నది. ఇక ఎక్కువకాలం బతకనని అతనికి అర్థమయిపోయింది. తన తదనంతరం కూతురు ఏమైపోతుందోనని దిగులు పట్టుకున్నది.  
హోలీ పౌర్ణిమ వేడుకల్లో ఒక రెండురోజుల పాటు గ్రామమంతా నిమగ్నమైపోయింది. రెండోరోజు రాత్రి  పాటాదే ఉత్సవాల్ని దూరం నుండి చూడాలనే కాంక్ష తో ఇంటి నుంచి  బయల్దేరింది. మైదానం కూతవేటు దూరంలోనే వున్నది. ఎటుచూసినా భజనలూ, సంకీర్తనలూ, వాయిద్యాలూ అంబరాన్నంటిన సంబరాలు .. జనం భక్తిమత్తులో జోగుతున్నారు. ఎవరికీ ప్రపంచం ఏమైపోతుందో పట్టడం లేదు.  అందరిదృష్టీ అక్కడ జరుగుతున్న నాటకాలపోటీల పైనే వున్నది. అవి ముగిసిన తరువాత కూడా వాటి గురించే చర్చలు, వాదోపవాదాలు. నిజానికి అక్కడ ప్రజలంతా ఈ ప్రపంచంలో కాకుండా వేరే లోకంలో ఉన్నట్టున్నారు. జాగూ బెహరా వేడుకల్లో అలసిపోయి వేకువనే ఇంటికి చేరుకున్నాడు. ఆకలిగానూ వున్నది. తీరాచూస్తే ఇంటికి తాళం  వేసి వున్నది. కుమార్తె బహుశా తోటివారితో అష్టా చెమ్మా ఆడటానికి వెళ్ళిందేమో అనుకున్నాడు. ‘పాటా! పాటా!’ గొంతెత్తి పిలిచాడు. సమాధానంలేదు. మళ్ళీ మళ్ళీ పిలిచాడు. అంతలోనే బయటి అరుగు మీదనే గాఢనిద్రలోనికి జారుకున్నాడు. ఉదయం ఆలస్యంగా లేచాడు. అయినా కుమార్తె ఇంటికి చేరలేదు. వేసిన తాళం వేసినట్లుగానే వున్నది. జాగూ ఇంటింటికీ వెళ్ళాడు. ఊరంతా వెతికాడు. ఆమె జాడలేదు. ఇదంతా చూసిన గ్రామస్తులు జాలిపడి తాళాన్ని బద్దలుగొట్టి తలుపు తెరిచారు. ఆ తరువాత క్రమేణా జాగూ మారిపోయాడు.   
అతనికి మతిస్థిమితం తప్పింది. ఎవరైనా వచ్చి అతడ్ని పలకరించబోయినా వెర్రి చూపులు చూస్తాడు తప్ప మాట్లాడడు. ఎవరో ఒకరు కాసింత గంజిపోస్తే తాగుతాడు. లేకపోతే  పస్తుంటాడు. ఎప్పుడూ గుండె బాదుకొంటూ ఏడుస్తూనే ఉంటాడు. తనలో తను నవ్వుకుంటాడు.  
కుమార్తె వెళ్ళిపోయిన షాక్‌ వల్లనే  పిచ్చివాడయ్యాడని అందరూ భావించారు. పాటాదే గురించి జనం రకరకాలుగా చెవులు కొరుక్కోసాగారు. పదిరోజుల తరువాత జాగూ బెహరా చనిపోయి ఉండటాన్ని గ్రామస్తులు కనుగొ న్నారు. అతడి కళ్ళు తన ఇంటి ముందరి తలుపు పైనే నిలబడిపోయాయి. 
పాటాదే ఇల్లు వదలి వెళ్లి, జాగూ బెహరా చనిపోయి మూడు సంవత్సరాలయింది. మూడుసార్లు డోలోత్సవాలు జరిగాయి. విశాల మైదానంలో విగ్రహాలు వెలిసి నిమజ్జనమైనాయి. వసంతాలూ శిశిరాలూ వచ్చివెళ్లాయి.  వాగులూ వరదలూ  పొంగి సాగరంలో కలిశాయి. ఆమె ఈడువారందరూ పెళ్ళిళ్ళయి అత్తవారిళ్లకు వెళ్లిపోయారు. కానీ ఎవరూ ఆమెని గుర్తు చేసుకోలేదు. ఏమైందో ఎక్కడికి వెళ్లిందో మళ్ళీ పెళ్లి చేసుకున్నదో లేదో ఎవరికీ అవసరం లేకపోయింది. ఆమె గురించి ఎవరూ తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యలేదు. ఆమె ఉనికి మిస్టరీగానే మిగిలి పోయింది. 
జాగూ ఇంటివైపు కూడా ఎవరూ చూడలేదు. ఇల్లు ఖాళీగానే ఉండిపోయింది. ఇంట్లో సిరిసంపదలేమీ లేవు. ఒకటిరెండు చినిగిన చాపలూ, రెండు జంపఖానాలూ, తాళంలేని ఒక ట్రంకు పెట్టె .. అంతకన్నా ఏమీలేవు. ఇల్లు శ్మశానానికి దగ్గరగా వున్నది. దాంట్లో దెయ్యాలు కాపురం చేస్తున్నాయని వదంతులు లేవదీశారు. ఇంటి ముందున్న నారింజ చెట్టుకూడా ఈ మూడేళ్లలో పూత పుయ్యలేదు. చీకటిలో అటువైపు వెళ్ళినవారు జాగూ దెయ్యమై కనపడ్డాడనీ, కుమార్తెను పిలుస్తూ తిరుగుతున్నాడనీ ప్రచారం చేయసాగారు. 
గ్రామస్తులందరూ ఆమెని మరచిపోయిన దశలో పాటాదే ఒక రోజు ఉదయాన్నే ఇంటి ముందరి వాకిలి తుడుస్తూ హఠాత్తుగా ప్రత్యక్షమైంది. ఆమెతో పాటు ఒక రెండేళ్ల పిల్లవాడున్నాడు. వాడుతన రెండు వేళ్లనీ చీక్కొంటూ ముక్కుచీముడుతో అరుగు మీదనే కూర్చొని వున్నాడు. పాటాదే తిరిగి వచ్చిందనే విషయం ఆ పల్లెటూర్లో దావానలంలా వ్యాపించింది. 
‘జాగూ బెహరా కూతురొచ్చింది. వెంట ఒక పిల్లవాడు కూడా వున్నాడు’ అంటూ అందరూ మూతులు కొరుక్కున్నారు. ఆతరువాత సందేహాల పరంపర. వాడు ఆమె సంతానమేనా? అయితే మళ్ళీ పెళ్లి చేసుకుందా? వరుడెవరు? లేక ఎవర్నో తెచ్చిపెంచుకుంటోందా? అంత స్థోమత ఆమెకెక్కడిది? ఆ ఊరిజనాలకు ఇవన్నీ చిక్కు ప్రశ్నలైకూర్చున్నాయి. ఎక్కడవిన్నా ఎవరినోట విన్నా ‘పాటాదే... పాటాదే’. అవే చర్చలు.. అవే సంభాషణలు. పెద్దా చిన్నా వచ్చి ముందుగా దూరం నుండి చూసి నిజంగానే ఆమే అని నిర్ధారించుకొని వెళ్లారు. ఆమె రాకతో ఆ వూర్లో ఒక అణుబాంబు పేలినంత పనైంది. 
ఒక అర్ధరాత్రి అత్తింటి నుండి పారిపోయి వచ్చింది. మరో అర్ధరాత్రి పుట్టింటి నుండి వెళ్లిపోయింది. మూడేళ్ళ తరువాత మళ్ళీ ప్రత్యక్షమైంది. అదికూడా ఒక పసివాడ్ని ఎత్తుకొని వచ్చింది. ఎవర్నో ప్రేమించి పెళ్లి చేసుకుని.. సంతానం కలిగిన తరువాత మోజు తీరి వాడీమెని విడిచిపెట్టి ఉండాలి. ఈమొత్తం వ్యవహారంలో ఏదో  నిగూఢమైన రహస్యమే వున్నది. దాన్ని ఛేదించి బట్టబయలు చేస్తే గాని జనానికి  నిద్ర పట్టదు. 
ఆనాటి పాటాదే.. ఇప్పుటి పాటాదే..ఎంతో తేడా వున్నది. శరీరం ఛాయ తగ్గింది. ఇప్పుడామె కొంచమైనా బిడియపడటంలేదు. పెద్దవాళ్లెవరైనా సమాచారం తెలుసుకోబోతే చీర కొంగుని తలమీదకు బిగుతుగా లాక్కొని తల పక్కకు తిప్పుకొంటోంది. మహిళలెవరైనా వచ్చినట్లయితే చిరిగిన చాపనే పరచి కూర్చోమంటోంది. కానీ వారి ప్రశ్నలకు సమాధానం దాటవేస్తోంది. వారి వెక్కిరింతల్నీ వెటకారపు మాటల్నీ పట్టించుకోవట్లేదు. పాటాదేని గ్రామస్తులు వెలివేశారు. ఎక్కడో ఎవరితోనో తిరిగి బిడ్డడ్ని కని నిర్లజ్జగా ఊర్లోనికి తెచ్చిపెట్టిందని నిందించారు. నీతి తప్పిన అపచారానికి  దేవుడు కూడా క్షమించడని ఆడిపోసుకున్నారు. ఇలా సిగ్గులేకుండా బతకడం కంటే విషం తాగి చావడం మేలని ఆమెకు వినిపించేట్లుగానే అన్నారు. ఎన్నో విధాలుగా అవమానించారు. 
కానీ వీటన్నిటినీ ఆమె సహిస్తూ తన మానాన తాను మౌనంగా బతకసాగింది. ఆమె ఈ నిబ్బరాన్ని ఊరివారు భరించలేకపోయారు.  పిచ్చెక్కిపోయారు. పాటాదే తండ్రి చనిపోయాడు. కూలీనాలీకి పిలవకపోయినా ఏం తింటున్నదో  ఎలా బతుకుతున్నదో ఎవరూ పట్టించుకోలేదు. శ్మశానం పక్కన చిన్నపిల్లవాడితో ఒంటరిగా ఎలా నివసిస్తున్నదో ఎవరూ యోచించలేదు. వారికి కావలసిందల్లా ఒక్కటే. ఆ పసివాడు ఎవరు? ఆమెకేమౌతాడు? వాడి తండ్రి ఎవరు? ఈ ప్రశ్నలకు జవాబు తెలుసుకోవడం కోసమే  రాద్ధాంతం మొదలుపెట్టారు. వ్యక్తి శ్రేయస్సుని  పట్టించుకోని సమాజం నైతిక విలువల కోసం బీరాలు పోతుంది. మనిషి నడవడికలోని లోపాల కోసం ఆరాలు తీస్తుంది. గోరంతని కొండంత చేస్తుంది.        
ఊరి వారంతా కలసి ఒక అత్యవసర ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆమె వల్ల గ్రామానికి అపఖ్యాతి వస్తుందని ఏకగ్రీవంగా తీర్మానించారు. పాటాదే తక్షణమే వూరు విడిచి వెళ్ళిపోవాలి. అలా వెళ్ళకపోతే ఆమె ఇంటికి నిప్పంటించాలి. 
ఎప్పటి లాగే ఆరోజుకూడా పాటాదే నిద్రలేచింది. ముందురోజు రాత్రి పౌర్ణమి. కానీ ఆమె జీవితంలో మాత్రం వెన్నెల లేనేలేదు. కాకపోగా గ్రామస్తుల సామూహిక తీర్మానం ఆమె తలపైన పిడుగులా పడింది. అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్లగలదు? పసివాడ్ని ఎలా పోషించుకోగలదు? ఎటూతోచని స్థితిలో ఆమె లేచి వాకిలి తుడుచుకొంటున్నది. గ్రామస్తులు ఒక గుంపుగా కూడబలుక్కొని వచ్చారు. ‘ఈ పిల్లవాడెవరు? వాడి తండ్రెవరు?’ అందరివీ అవే ప్రశ్నలు. అక్కడ పోగయిన వందమంది నుండీ కోటిప్రశ్నలు.
‘జవాబు చెప్పు... చెప్పు..’ అంటూ  నిలదీశారు. కసురుకున్నారు. బెదిరించారు. కొందరైతే కొట్టడానికి సిద్ధమయ్యారు. ఎంతోసేపు మౌనం వహించి సంయమనం పాటించిన  పాటాదే నోరువిప్పక తప్పని పరిస్థితిని తీసుకువచ్చారు.
చివరకు తెగించిన పాటాదే ‘ఔను. వీడు నా కొడుకే. నేనే కన్నాను’ అని చెప్పింది. 
మళ్లీప్రశ్నల పరంపర ‘తండ్రెవరు?ఎక్కడ?’ అంటూ. 
‘అందరూ వినండి. నేను కాపురానికి వెళ్లిన కొద్దిరోజుల్లోనే నా మగడు డబ్బూ దస్కం చేత చిక్కించుకొని ఇల్లు వదలి పారిపోయాడు. మా అత్తమామలు నన్ను ఒక గదిలో బంధించారు. వారాలపాటు తిండి కూడా పెట్టకుండా బాధించారు. ఒక అర్ధరాత్రి నేను తప్పించుకొని నా తండ్రిని చేరుకున్నాను. అతడూ ఎంతో బాధపడ్డాడు. కుమిలిపోయాడు. నన్ను గురించి మీరంతా అన్న మాటలన్నీ భరించాడు. నేనూ ఎన్నో చీదరింపుల్నీ చీత్కారాల్నీ ఎదుర్కొన్నాను. మా ఇద్దరి పొట్ట గడవడం కోసం కూలీ నాలీ చేసి నా తండ్రి కృశించిపోయాడు’ అంటూ ఒక్క క్షణం ఆగి ఊపిరి పీల్చుకున్నది. ‘నా తండ్రిని రక్షించుకోవడానికి నేనేమీ చెయ్యలేకపోయాను. బయటికి దూరంగా వెళ్ళిపోయాను. ఈ పిల్లవాడ్ని కన్నాను. నిజానికి ఈ దుర్మార్గమైన ప్రపంచమే ఈ పిల్లవాడు నాకడుపున పడేటట్టు చేసింది. ఇంక చాలా?’
ఆ మాటవిని ఒక పెద్దాయన ఒక తువ్వాల్ని మెడకు చుట్టుకొని ఆవేశంగా ముందు కొచ్చాడు.. ‘అయితే ఈ పిల్లవాడు నీ భర్త కొడుకేనంటావు. నమ్మాలా?’ అంటూ.
‘కాడు. నా భర్త మగవాడేకాదు’
‘ఓసీ దుర్మార్గురాలా! మరి ఈ పిల్లవాడు ఎవరి సంతానమో చెప్పు. వీడి తండ్రి ఎవరో చెప్పితీరాలి. లేకపోతే చంపేస్తాం’ గుంపులో ఎవరో పాటాదేని కిందకు నెట్టేశారు. ఆమె నేలకూలి దుఃఖంతో బాధతో మెలికలు తిరిగిపోయింది.   
మళ్ళీ ఎవరో ఆమె వీపు మీద ఒక తాపు  తన్నారు.‘నీచురాలా! చెప్పువాడెవడో!’
‘నోరువిప్పు. నువ్వేం చేశావో మాకు తెలుసు. నీ అత్తవారింట్లోనూ ఉండలేక పోయావు. నీతండ్రి చావుకీ కారణమయ్యావు. ఇప్పుడు ఈ పిల్లవాడి  తండ్రి పేరు చెప్పడం లేదు. కాకపోగా ప్రపంచమే దుర్మార్గమైందని తిడుతున్నావు. లోకమే పిల్లవాడ్ని ఇచ్చిందని  సిగ్గులేకుండా చెబుతున్నావు. వీడి తండ్రి ఎవరో చెప్పు. లేకపోతె నిన్ను ముక్కలు చేసి చంపేస్తాం’ ఒక ముసలామె పాటాదే  మెడమీద కాలువేసింది. చుట్టూ చేరిన వ్యక్తులు చోద్యం చూస్తూ  వినోదిస్తున్నారు. 
పాటాదే ముఖం నేలకు ఆనుకోవడంతో ఆమెకు ఊపిరి ఆడటంలేదు. ఆమెని రక్షించడానికి ఏ జగన్నాథుడూ దిగిరాలేదు. సాటి మానవులేమో ఆమెని మరణంవైపు నెట్టివేస్తున్నారు.ఈగొడవకు పిల్లవాడు ఏడుపు లంకించుకున్నాడు. ఇంత గోలలోనూ వాడి ఏడుపు ఆమె చెవుల్ని తాకింది. ఆమెలో సహనం నశించింది. కళ్ళు నిప్పుకణికలయ్యాయి. 
ఒక్కాసారిగా ఆమె తన మెడ మీదున్న పెద్దామె కాలుని బలంగా నెట్టివేసింది. ఒక మహంకాళిలాగా మహోగ్రరూపంతో మేల్కొంది. ఒక మహారణ్యం దహనమౌతున్నప్పుడు ఉవ్వెత్తున లేచిన అగ్నిశిఖలాగా పైకిలేచింది. ఒక్క ఊపున వెళ్లి పసివాడ్ని తెచ్చి పైకెత్తి పట్టుకున్నది. అక్కడున్న అందరివైపూ ఒక్కచూపు చూసింది. ఆ చూపుకే దహించే శక్తి ఉంటే భూగోళమే భస్మీ పటలమైపోవాలి. ఆ క్షణంలో ఆమెలో అసహ్యమూ తిరస్కారభావమూ మూర్తీభవించాయి. పెద్దగా రోదిస్తూ మాటల్ని ఈటెల్లాగా సంధించింది. 
‘అయితే మీకందరికీ ఈపిల్లవాడి తండ్రెవరో కావాలి. అంతేకదా! చెబుతాను. వీడి తండ్రులంతా ఇక్కడే వున్నారు. మీలోనే వున్నారు.  రామూ, బీరా, గోపీ, మాగునీ,నాడియా .. ఇంకా ఉన్నారు. వీరందరిలో వీడు ఎవరి పిల్లాడో నేనెలా చెప్పగలను?’అందరూ ఆశ్చర్యంతో వింటున్నారు. ‘మూడుసంవత్సరాల కిందట.. డోలా పౌర్ణమి రోజున.. నాటకాల పోటీలు జరిగిన దినాన నేను దేవావతా విగ్రహాల్ని దర్శించాలని బయల్దేరాను. అంతలో రామూ నా వెనకగా వచ్చి నా నోట్లో గుడ్డలు కుక్కాడు. అసహాయంగా గిలగిలా కొట్టుకుంటున్న నన్ను శ్మశానంలో వున్న పొదల మాటుకి మోసుకొనిపోయాడు. అక్కడ మిగిలినవారంతా తోడయ్యారు. అందరూ కలసి నన్ను నాశనం చేశారు. మసక వెన్నెల వెలుగులో నేను వీరందర్నీ  గుర్తించాను. ఆ క్షణంలో  శవమాత్రంగా మిగిలాను. అపస్మారకస్థితిలో లేవలేకుండా వున్న నన్ను ఇదిగో ఈ హారియా ఆ ముఠా వారిదగ్గర డబ్బుతీసుకొని కాబోలు తనబండిలో కటక్‌ తీసుకెళ్లి రోడ్డుమీద  వదిలేశాడు. నా తండ్రికీ ఈ ప్రపంచానికీ ముఖం చూపలేక అక్కడే బిచ్చమెత్తుకొని బతికాను. ఇంతమంది దుర్మార్గుల పాపాన్ని నేను తొమ్మిది నెలలు మోసి వీడ్నికన్నాను. ఇప్పుడు కూడా మీరంతా నిలదీస్తేగానీ నాపై జరిగిన అఘాయిత్యాన్ని నేనుగా  పైకి చెప్పలేదు’ పాటాదే తన మీద  కాలువేసిన ముసలమ్మ  వైపు ఉరిమి చూసింది. 
‘ఓ పెద్దమ్మా! ఇప్పుడు చెప్పు. వీళ్ళలో నా బిడ్డకు తండ్రెవరో నిర్ణయించగలవా? చిరిగిపోయిన నా జీవితాన్ని తిరిగి అతికించగలవా? పోనీ ఒకడైనా ముందుకొచ్చి నేనే వీడి తండ్రినని ఒప్పుకోగలడా?ఇప్పుడు నేనడుగుతున్నాను.. చెప్పండి.. సమాధానం చెప్పండి. నా నీతి గురించి ఇంతగా పట్టించుకున్న మీరు ఈ దుర్మార్గుల్ని నిలదియ్యండి. భావితరాల్లో నా అక్కచెల్లెళ్లకు నాకు పట్టిన దుర్గతి పట్టకుండా కాపాడండి’ పాటాదే పట్టరాని దుఃఖంతో ఆగ్రహావేశాలతో నేల కూలిపోయింది. 
అక్కడ పోగైన పెద్దవారందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. రామూ.. బీరా మొదలైన దోషులు నెమ్మదిగా అక్కడ్నించి జారుకున్నారు. కుర్రకారు సిగ్గులేకుండా  నవ్వుకున్నారు. ఎవరి వద్దా పరిష్కారం లేదు. ఎవరూ జవాబు చెప్పలేదు. రామూ.. బీరా అందరూ డబ్బున్నవారి బిడ్డలు. వారిని ఎవరూ పల్లెత్తి మాట కూడా అనలేదు. న్యాయానికీ  రాజూ పెదా తేడాలుంటాయేమో తెలీదు. ఆగ్రహంతో వచ్చిన ముసలామె తానే సిగ్గుపడి అరుగు పైనుండి కిందకు దిగి పోయింది. వీరావేశంతో ధర్మ సంరక్షణార్థం అక్కడ పోగయిన జనమంతా చల్లబడిపోయి తలా ఒక దారిన చెదిరిపోయారు. 
పాటాదే కళ్ళు తుడుచుకొని ధైర్యాన్ని కూడగట్టుకొని లేచింది. చీపురుకట్టని మళ్ళీ అందుకుంది. ఇంతలో పిల్లవాడు ఏడవడం మొదలుపెట్టాడు. చీపురుని విసిరేసి పరుగున వెళ్లి వాడి కళ్ళూ ముక్కూ తుడిచింది. ముద్దులతో ముంచెత్తింది ‘బాబూ! నువ్వెందురా ఏడుస్తావు? ఒక ఆడదాని బతుకుని బుగ్గిచేసిన నేరస్థుల్ని  శిక్షించ లేకపోయినందుకు  ఈలోకమే ఏడవాలి. ఆ దుర్మార్గులు కృశించి నశించాలి. నీకేం భయం లేదురా! నీకు పేరుకి తండ్రి లేకపోవచ్చు. కానీ తల్లిని నేనున్నాను. నిన్ను నేను కాపాడుకుంటాను. నువ్వే నా ప్రాణం. నువ్వే నా సర్వస్వం’ 
రెండేళ్ల పసివాడికి ఆమాటల్లోని అర్థం బోధపడిందో లేదో తెలియదుకానీ వాడు పకపకా నవ్వాడు. తల్లికోసం చేతులు చాచాడు. అది వాడు మేఘాల్ని అందుకోవడానికి అర్రులు చాస్తున్నట్టుగా వున్నది.. దైన్యస్థితి నుండి తల్లిని రక్షించడానికి భరోసా కోసం ప్రార్థిస్తున్నట్లున్నది.. మనుషుల్లో పేరుకుపోయిన క్రౌర్యాన్ని  ప్రశ్నిస్తున్నట్లున్నది. సంఘంలోని మౌఢ్యాన్ని నిలదీస్తున్నట్లున్నది. జాగూ బెహరా వాకిట్లో  చాలాకాలంగా పూతలేని నారింజ చెట్టు పాటాదే రాకతో పువ్వులు పూసింది. ఆ పువ్వులే ఇప్పుడు పిందెలుగా రూపాంతరం చెందుతున్నాయి. పాటాదే చుట్టూ వున్న  భూమ్యాకాశాలు కూడా తమ నిస్సహాయతకి తామే సిగ్గుపడి గంభీర ముద్రవహించాయి. ఆమె ఒక్కసారిగా నవ్వుతూ ఏడ్చింది. ఏడుస్తూ నవ్వింది.  
అనువాదం: టి. షణ్ముఖ రావు 
  

మరిన్ని వార్తలు