ఈవారం కథ

16 May, 2022 08:46 IST|Sakshi

నిజానికి పుస్తకాలు చదవడం ఎంత గొప్ప అలవాటు! ఓ మనిషి ఓ గొప్ప వ్యక్తిత్వాన్ని సంతరించుకునేలా మంచి పుస్తకాలు ప్రేరేపిస్తాయి. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకున్న ఎంతోమంది పుస్తకప్రియులే! ఇదంతా తెలిసి కూడాలక్షల మంది ఒకప్పటి తెలుగు పాఠకులు ఇప్పుడు ప్రేక్షకులుగా మారి ఎందుకూ పనికిరాని టీవీ ప్రోగ్రామ్‌లు, వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నామనుకుంటూ కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. రాబోయే తరాన్ని కూడా పాడుచేస్తున్నారు.

విమాన ప్రయాణం అంటే నాకు చాలా విసుగు. ఏ పనీపాటా లేనట్టుగా గంట ముందుగా విమానాశ్రయం చేరుకోవటం, మార్నింగ్‌ వాక్‌కి వచ్చినట్టుగా లోపల నడవడం, చాంతాడంత క్యూలో నుంచొని బోర్డింగ్‌ పాస్‌ తీసుకొని లగేజ్‌ చెకిన్‌ చేయించుకోవటం, ఒళ్ళంతా తడిమించుకొని సెక్యూరిటీ చెక్‌ దాటడం, ఆ తర్వాత బందరు బస్టాండ్‌లో బస్‌ కోసం నుంచున్నట్టుగా నుంచొని ఎయిర్‌ పోర్ట్‌  బస్‌ ఎక్కి మళ్ళీ దిగి విమానంలోకి ఎక్కడం. ఇదంతా ఓ పీడలాగా అనిపిస్తుంది నాకు. ఆ రోజు కూడా అలాగే అనిపించేదే ఆ మనిషి నాకు కనబడక పోయుంటే!

ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్నాను ఆ రోజు. హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ వెళ్ళాను కిందటి రోజే. పని చూసుకొని అక్కడనుంచి ముంబైలో ఉంటున్న మా అమ్మాయి ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ విమాన ప్రయాణమే చాలా బోరు అనుకున్నాను. బోర్డింగ్‌ పాస్‌ కోసం క్యూలో నుంచొని ఉండగా కనిపించాడతను. నా కంటే కొంచెం ముందున్నాడు క్యూలో. మంచి ఎత్తు, అందుకు తగ్గ లావు. యాభై ఏళ్ల పైనే ఉంటాడు. ఫుల్‌ సూట్లో అందంగా ఉన్నాడు. అయితే నన్ను ఆకర్షించింది మాత్రం అతని చేతిలో ఉన్న ఓ లెదర్‌ బేగ్, దాని సైడ్‌ అరలోంచి బయటకు తొంగి చూస్తున్న ఓ తెలుగు నవల!

ఆశ్చర్యపోయాను. ఈ రోజుల్లో తెలుగు నవలలు చదివే పాఠకులు ఒకప్పుడు తెలుగులో ఉన్న రచయితల కన్నా తక్కువే అనడం అతిశయోక్తే అయినా.. త్వరలోనే నిజమవుతుందేమోనని భయమేస్తూంటుంది నాకు. పాత నవలా యుగాన్ని తలచుకున్నప్పుడల్లా గుండెను ఎవరో గ్రైండర్లో పెట్టి గరగరా తిప్పినట్టుగా బాధేస్తుంది. అప్పట్లో నవలలు, సీరియల్స్‌ చదివే పాఠకులు కోకొల్లలుగా ఉండి వాటి గురించి గంటల తరబడి చర్చించుకునేవారు కూడా. వారం వారం సీరియల్‌ కోసం ఎదురుచూడటంలో ఉండే థ్రిల్‌ అప్పటి జనాలు బాగా ఆస్వాదించారు.

తెలుగు రచయిత అంటే ఓ గొప్ప విషయంగా ఉండేది. ఆ క్రేజే వేరు! టీవీలు, అందులో వచ్చే ఏడుపుగొట్టు సీరియల్స్, రియాలిటీ షోస్‌ లాంటివి వచ్చాక తెలుగు పాఠకులు అమాంతం తగ్గిపోయారు. ఇంటర్నెట్, స్మార్ట్‌ ఫోన్లు కూడా గృహప్రవేశం చేశాక తెలుగు పాఠకులు అంతరించిపోవటమే కాక చాలా అరుదైన విషయంగా మారారు. అలాంటి ఈ కాలంలో తెలుగు నవల చదివే ఓ పాఠకుడు డిల్లీ విమానాశ్రయంలో కనబడడం నాకు చాలా సంతోషం కలిగించింది. ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే నేనూ ఓ తెలుగు నవలా రచయితనే! వయసు అరవై.

ఆలోచనల్లోంచి తేరుకొని బోర్డింగ్‌ పాస్‌ తీసుకున్నాక ఆ పాఠక మహాశయుడు ఎక్కడున్నాడా అని కళ్ళతోనే చుట్టూ వెదికాను. దూరంగా ఉన్న రెస్ట్‌ రూమ్‌ వైపు అతను వెళ్ళటం కనిపించింది. నేనూ అటుగా అడుగులు వేశాను. ఆ పుస్తకం తెలుగు నవలే అని తెలిసింది కానీ తిరగదిప్పి ఉండటం వల్ల దాని టైటిల్‌ కానీ, రచయిత పేరు కానీ హడావిడిలో అర్థం కాలేదు. అసలా పుస్తకం ఏంటో, ఎవరు రాసిందో తెలుసుకోవాలన్న కుతూహలం కలిగి క్షణ క్షణానికీ ఎక్కువవసాగింది.

కొంపదీసి అది నా పోటీ రచయితది కాదు కదా! అలాగానీ అవుతే మూడ్‌ అంతా పాడై చస్తుంది. ‘అసూయ’ అనేది మానవ సహజమైన లక్షణం మరి. ఏది ఏమైనా ఆ నవల ఏంటో తెలుసుకునే దాకా నాకు విముక్తి లేదు అనుకున్నాను కసిగా. రెస్ట్‌ రూమ్‌ లోపలకు వెళ్లకుండా అతని కోసం బయటే నిలబడి వేచి చూడసాగాను. 

రెండు నిమిషాల్లో బయటకు వచ్చాడతను. బేగ్‌ వైపు చూశాను వెంటనే. దురదృష్టం! పుస్తకాన్ని లోపలకు తోసేసి బేగ్‌ జిప్‌ పెట్టేశాడు. పుస్తకం పేరు చూస్తే ఓ పనైపోతుంది అనుకుంటే ఏంటిది అనిపించింది. పోనీ నేరుగా వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకొని ఆ పుస్తకమేంటో అడిగేస్తే? అది నేను రాసిన పుస్తకమే అయుంటుంది అని ఎక్కడో ఏదో ఆశ. అతని దగ్గరకు వెళ్లబోతూంటే మళ్ళీ ఏదో అనుమానం.

తెలుగు రచనలు చదువుతాడు కాబట్టి కచ్చితంగా నా పేరు తెలిసే ఉంటుంది. పుస్తకం గురించి అడిగాక అది నేను రాసింది కాకపోతే అసహ్యంగా ఉంటుందేమో? అంతే కాక, నేను రాసిన నవల కాదు ఇంకెవరో రాసింది అని తెలిసినప్పుడు నా మొహంలో కలిగే మార్పు, అందులో కదలాడే ఈర‡్ష్యను అతను గమనించేస్తే? నేను ఫీల్‌ అవకుండా నా ముందు పెదాలు బిగపట్టి మనసులో మాత్రమే నవ్వుకొని పక్కకు వెళ్ళాక పగలబడి నవ్వుకుంటాడా? అన్నీ అనుమానాలే. బాగా బిజీగా, హడావిడిగా కూడా కనిపిస్తున్నాడు. ఫోన్లు వస్తున్నాయి మాటిమాటికీ.

బాగా ఆలోచించి అతన్ని అడక్కుండానే అదేం నవలో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. వేరే పని కూడా ఏమీ లేకపోవటంతో సరదాగా అతనికి తెలీకుండా అతన్ని ఫాలో అవసాగాను. నేను రాసిన డిటెక్టివ్‌ నవలల్లోని అలాంటి సన్నివేశాలు గుర్తొచ్చి నవ్వుకున్నాను. 

సెక్యూరిటీ చెక్‌ జరుగుతున్నప్పుడు కూడా నా దృష్టంతా నాకంటే ముందుగా వెళ్ళిన అతని మీదే ఉంది. ముంబై విమానం వచ్చే గేట్‌ దగ్గర వెయిటింగ్‌ ఏరియాలో ఓ ఖాళీ సీటు చూసుకొని కూర్చున్నాడతను బేగ్‌ ఒళ్ళో పెట్టుకొని. అతన్నే ఫాలో అవుతూ వెళ్ళిన నేను కూడా అతని పక్కనో, వెనకో కూర్చుందామని చూశాను. ఒక్క సీటుకూడా ఖాళీగా లేదు. రెండు వరసల వెనక ఓ సీటు చూసుకొని కూర్చున్నాను.

నేను కూర్చున్న చోటునుంచి అతను స్పష్టంగా కనబడకపోయినా, బేగ్‌లోంచి పుస్తకం తీయబోతే మటుకు కదలికలవల్ల తెలిసిపోతుంది అని తృప్తిపడ్డాను. విమానం రావటానికి టైమ్‌ ఉండటంతో బేగ్‌లోంచి ఆ నవల తీసి కచ్చితంగా చదువుతాడు అని ఊహించాను. చెప్పుకోకూడదు కానీ, నేను రాసిన నవల అయితే మటుకు టైమ్‌ దొరికినప్పుడల్లా చదవాల్సిందే. నా రచనల్లో ఉండే ‘బిగి’అలాంటిది. నవల మొదలుపెడితే పూర్తిచేసే దాకా తోచదు. అతన్నే ఉత్సాహంగా గమనించసాగాను. 

రెండు నిమిషాల్లోనే నేను ఊహించినట్టుగా అతని చేయి కదిలి బేగ్‌ వైపు వెళ్ళింది. తల కొద్దిగా పైకెత్తి, ముందు వరసల్లో కూర్చున్న జనాల మధ్యలోంచి కూడా బాగా కనబడేలా చూడసాగాను. నవల ఉన్న సైడ్‌ అర జిప్‌ మీద మీద చేయివేశాడు. ఊపిరి బిగపట్టాను. పుస్తకం అట్ట పావు వంతు సరిగ్గా కనబడినా చాలు. నాదో కాదో తెలిసిపోతుంది. ఏదో క్రైమ్‌ థ్రిల్లర్‌ సినిమా  క్లైమాక్స్‌ చూస్తున్నట్టుగా ఉత్కంఠగా అనిపించింది.

ఇంకో అర సెకెండ్లో బేగ్‌ జిప్‌ లాగుతాడనగా అతని ఫోన్‌ మోగింది. బేగ్‌ మీదనుంచి చేయి, దృష్టి మళ్లించి ఫోన్‌ తీసి చూసుకున్నాడు. కాల్‌ కట్‌ చేస్తాడేమో అంత ముఖ్యమైనది కాకపోతే అని ఆశించాను. అలా జరగలేదు. ముఖ్యమైనదే అనుకుంటా కాల్‌ ఏక్సెప్ట్‌ చేసి ఓపిగ్గా మాట్లాడసాగాడు. నేనూ తీరిగ్గా అతన్ని గమనించసాగాను. 
కాసేపటికి అతని ఫోన్‌ మాట్లాడటం పూర్తయింది. ఫోన్‌ జేబులో పెట్టుకునేలోగా మళ్ళీ మోగింది. అయితే ఈసారి కూర్చున్న చోటునుంచి లేచి కాస్త పక్కగా పచార్లు చేస్తూ మాట్లాడసాగాడు.

బేగ్‌ అతని సీట్లోనే ఉంది. అదృష్టవశాత్తూ అప్పటిదాకా అతని పక్కన కూర్చున్నతను కూడా లేచి వెళ్లిపోయాడు. ఆ పాఠక మహాశయుడి పక్కన కూర్చునే మంచి అవకాశం దొరికిందనుకొని గబగబా లేచి వెళ్ళి ఖాళీ అయిన సీట్లో కూర్చున్నాను. రిలీఫ్‌గా అనిపించింది. పక్క సీట్లోనే బేగ్‌ ఉన్నది. పుస్తకం ఉన్న వైపే తిప్పి ఉంది. బేగ్‌ జిప్‌ లాగి ఆ పుస్తకం ఏంటో చూడాలన్న కోరిక వొద్దనుకున్నా కలిగింది. ‘ఛ! ఏంటిది? ఎవరిదో బేగ్‌ నేను ముట్టుకోవడమేంటి దరిద్రంగా’ అనుకున్నాను. అతను వచ్చేదాకా  చూద్దాం అని అతని వైపే చూడసాగాను. ఫోన్‌ మాట్లాడటం అవగానే అతను సీటు దగ్గరకు రాకుండా, కొంచెం దూరంలో ఉన్న కాఫీ షాప్‌ వైపు వెళ్ళసాగాడు. 

నెమ్మదిగా చేయి బేగ్‌ వైపు జరిపి జిప్‌ లాగి పుస్తకం చూసి మళ్ళీ లోపల పెట్టేస్తే? ఇదంతా చేయడానికి రెండు మూడు క్షణాలు చాలు! ఇదేమీ దొంగతనం కాదు కదా. కాకపోతే ఆ రెండు క్షణాల్లోనే అతని చూపు బేగ్‌ వైపు మళ్లిందంటే అసహ్యంగా ఉంటుంది. ఆ పుస్తకం నేను రాసిందే అయితే, నేనెవరో తెలిశాక  ‘ఇదేంటి ఇంత గొప్ప నవల రాసిన రచయిత ఇలా ఉన్నాడు?’ అని తక్కువగా అనుకునే ప్రమాదం కూడా ఉంది. కాఫీ తాగుతున్న అతను దూరంగా వెనకనుంచి కనిపిస్తున్నాడు. ఇంకో అయిదు నిమిషాల్లో వచ్చేస్తాడులే అనుకొని తృప్తిపడాలని చూశాను.

కుదర్లేదు. రెండు నిమిషాల తరువాత నా చేయి అతని బేగ్‌ మీదకు వెళ్ళింది. గబుక్కున బేగ్‌ జిప్‌ తీసి పుస్తకం బయటకు కొద్దిగా తీస్తే చాలు. జిప్‌ తిరిగి పెట్టకపోయినా పర్లేదు. ఓసారి చుట్టూ చూసి, ధైర్యంగా జిప్‌ తీయబోయాను. రాలేదు. ఇరుక్కుపోయినట్టుంది. గట్టిగా లాగాల్సి వచ్చింది. ఓ చేత్తో బేగ్‌ పట్టుకొని ఇంకో చేత్తో జిప్‌ లాగుతూండగా గరగరమని పెద్ద చప్పుడు వెనక నుంచి. ఉలిక్కిపడి కంగారుగా చేతులు వెనక్కు తీసుకున్నాను. అక్కడి గ్రౌండ్‌ స్టాఫ్‌ మైక్‌ సరిచూసుకున్న చప్పుడది. ముంబై వెళ్ళే విమానం బోర్డింగ్‌కు సిద్ధంగా ఉందని అనౌ¯Œ ్స చేశారు. చప్పున అతని వైపు చూశాను. కాఫీ పూర్తిచేసుకొని వడివడిగా బేగ్‌ వైపు రాసాగాడు.

‘ఇంకా నయం జిప్‌ లాగుతూ అడ్డంగా దొరికిపోలేదు’ అనుకొని సీట్లోంచి లేచి నిలబడ్డాను. అతనొచ్చే దాకా ఆగి క్యూలో అతని వెనకే నుంచున్నాను. నవల చదవనీకుండా అడ్డుపడిందని కాబోలు అతను ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు. తృప్తిగా అనిపించింది. ఇక అతను పుస్తకం చేతిలోకి తీసుకోవటం ఏ క్షణానైనా జరగొచ్చు. సరదాగా అతన్నే గమనించసాగాను. అతని బోర్డింగ్‌ పాస్‌ చెక్‌ చేసి పంపేటప్పుడు వెనకే ఉన్న నాకు అతని సీట్‌ నంబర్‌ కనిపించింది. సరిగ్గా నా వెనక వరుసలో విండో సీటు అతనిది. నాది అతనికి ముందు వరసలో విండోకి అవతల పక్క సీటు. మంచిదే అనుకున్నాను. తల కొంచెం పక్కకు తిప్పి సీటు సందులోంచి వెనక్కి చూస్తే అతను ఏం చేసేది కనిపిస్తుంది, అతనికి తెలీకుండా.  

ఎయిర్‌ బస్‌లో కూడా అతని పక్కనే నుంచున్నాను. అతనెవరో తెలీకపోయినా కేవలం పుస్తకాలు చదివే అలవాటు అతనికుంది అన్న కారణం వల్ల అతని మీద గౌరవం ఏర్పడ్డది. నిజానికి పుస్తకాలు చదవడం ఎంత గొప్ప అలవాటు! ఓ మనిషి ఓ గొప్ప వ్యక్తిత్వాన్ని సంతరించుకునేలా మంచి పుస్తకాలు ప్రేరేపిస్తాయి. జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకున్న ఎంతోమంది పుస్తకప్రియులే!

ఇదంతా తెలిసి కూడాలక్షల మంది ఒకప్పటి తెలుగు పాఠకులు ఇప్పుడు ప్రేక్షకులుగా మారి ఎందుకూ పనికిరాని టీవీ ప్రోగ్రామ్‌లు, వీడియోలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నామనుకుంటూ కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. రాబోయే తరాన్ని కూడా పాడుచేస్తున్నారు. చదవడంలో ఉండే మాధుర్యంతో కూడిన వినోదం ఇంకెందులోనూ లేదు. ఈ విషయం ఇప్పటి జనరేషన్‌ పిల్లలకు ఎలా తెలిసేది? చాలా మందికి అసలు తెలుగు చదవటమే సరిగ్గా రాదు. బాధగా నిట్టూర్చాను. 

మొత్తానికి విమానం లోపల కూర్చున్నాను. తల వెనక్కి తిప్పి చూశాను. నా అభిమాన పాఠకుడు కూడా వెనక సీట్లో కూర్చున్నాడు హాయిగా. అతని బేగ్‌ ఒళ్లోనే ఉంది. విమానం కదిలాక పుస్తకం తీసుకొని బేగ్‌ కింద పెడతాడనుకుంటా. కాసేపటికి ప్రయాణికులంతా సీట్‌ బెల్ట్‌ పెట్టుకున్నాక విమానం కదిలి గాల్లోకి లేచింది.  మళ్ళీ తల వెనక్కి తిప్పాను. ఆ క్షణం నాకు కలిగిన ఆనందాన్ని వర్ణించడం రచయితనైన నాకు కూడా కష్టమే! అతను దీక్షగా చదువుతున్న పుస్తకం నేను రాసిందే!! చాలు!! అప్పటిదాకా నేను చేసిన నిరీక్షణ మంచి ఫలితాన్ని ఇచ్చింది అనుకున్నాను సంతృప్తిగా. అట్ట మీద నా పేరు గర్వంగా చూసుకున్నాను. పుస్తకం కవర్‌ డిజైన్‌ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. పాతికేళ్ళ పైనే అయింది ఆ పుస్తకం రాసి. అయినా కొత్తగా కనబడుతోంది. 

మధ్య మధ్యలో తల వెనక్కు తిప్పి అతను చదివే పేజీని బట్టి కథలో ఏ సన్నివేశం అయుంటుందా అని ఊహించసాగాను సరదాగా. అతను ఒకటి రెండుసార్లు పుస్తకం మూసేసి కళ్ళు మూసుకొని ఆలోచనలో పడటం గమనించాను. ఆ నవల్లో ఎన్నో హృదయానికి హత్తుకుపోయే సన్నివేశాలు ఉన్నాయి మరి! పెన్నుతో అక్కడక్కడా ఏదో రాసుకున్నాడు కూడా. కొంతమంది పాఠకులకు ఈ అలవాటు ఉంటుంది.
 

తమకు నచ్చిన వాక్యాలను అండర్‌ లైన్‌ చేసుకోవటం లేదా మార్జి¯Œ ్సలో తమ అభిప్రాయాలు రాసుకోవటం మొదలైనవి. విజ్ఞానం కలిగించే ఎన్నో విషయాలను ఎంతో రీసర్చ్‌ చేసి రాశాను ఆ నవల్లో. అలాంటివి గుర్తుకోసం అండర్‌ లైన్‌ చేసుకుంటున్నాడేమో అని కూడా అనిపించింది. ఆ నవల రాయడం వెనక నేను చేసిన కృషి, సీరియల్‌గా వస్తున్నప్పుడు అప్పటి పాఠకుల స్పందన అన్నీ గుర్తుకొచ్చినయ్‌. 

విమానం ల్యాండ్‌ అయ్యాక ప్రయాణికులంతా లేచి నిలబడి ఒకరొకరుగా దిగసాగారు. అతనితో మాటలు కలిపి అతను అప్పటిదాకా చదివిన నవల నేను రాసిందే అని చెప్పి అతనికి థ్రిల్‌ కలిగిద్దామనుకున్నాను. చిన్నగా నవ్వాను అతని వైపు తిరిగి. ఇద్దరం నిలబడే ఉన్నాం. 
‘మీరు పుస్తకాలు బాగా చదువుతారా?’ అడిగాను అతని చేతిలో ఉన్న నవల వైపు ఓసారి మామూలుగా చూసి. 
‘సారీ?’ నేనన్నది ఏమాత్రం అర్థంకానట్టుగా మొహం పెట్టి అడిగాడు. అప్పుడు కలిగింది నాకు అనుమానం అతనికి తెలుగు రాదేమోనని! అతను ఎయిర్‌ పోర్ట్‌లో అన్ని ఫోన్‌ కాల్స్‌ మాట్లాడినా ఒక్కసారి కూడా తెలుగులో మాట్లాడకపోవటం వెంటనే స్ఫురించింది.  ఈసారి ఇంగ్లీషులో అడిగాను ‘మీరు తెలుగువారేనా?’
‘నాకు తెలుగు రాదు. మాది ముంబై’ చెప్పాడు చిన్నగా నవ్వి. ఆ తర్వాత మా సంభాషణంతా ఇంగ్లీషులోనే సాగింది. 
‘మరి మీ చేతిలో ఉన్న తెలుగు పుస్తకమేంటి?’ అడిగాను ఆశ్చర్యంగా. 
‘ఓహ్‌! ఇదా? నా ఫ్రెండ్‌ కూతురు హైదరాబాద్‌లో ఓ లైబ్రరీలో పని చేస్తుంది. పదిహేనేళ్లకు పైగా ఎవరూ తాకని కొన్ని పుస్తకాల్ని స్టాఫ్‌కి ఇచ్చేశారట. అలా ఈ పుస్తకం తన చేతికొచ్చింది. తను తెలుగమ్మాయే కానీ తెలుగు చదవడం బొత్తిగా రాదు. పుస్తకం అట్ట ఊడిపోతే కవర్‌ డిజైన్‌ చాలా వెరైటీగా బావుందని, లోపల అదే సైజులో నీట్‌గా కట్‌ చేసిన తెల్లకాగితాలు పెట్టి బైండ్‌ చేసి ఇలా నోట్‌ప్యాడ్‌లా చేసి నాకు గిఫ్ట్‌గా ఇచ్చింది. నాకూ బాగా నచ్చింది. బాగా చేసింది కదూ’  దాని వైపు మురిపెంగా చూస్తూ అన్నాడు. 
‘అవును. అచ్చు నవల సైజ్‌లోనే చేసింది. చాలా బావుంది..’ పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని పేజీలు తిప్పుతూ అన్నాను. 
అట్ట నేను రాసిన నవలదే కానీ లోపలంతా తెల్ల కాగితాల మీద అతను రాసుకున్న నోట్స్‌ కనబడింది. సగం పైనే వాడేశాడతను. తిరిగి ఇచ్చేసి బై చెప్పి బయటకు వచ్చాను. 
జరిగిందంతా తలచుకుంటే నవ్వొచ్చింది. అసలు విషయం తెలుసుకోకుండా పొరపాటున ఆ పుస్తకం రాసింది నేనే అని ఆ ఉత్త మహాశయుడితో అని ఉంటే  ‘అవునా! ఈ ‘అట్ట’ డిజైన్‌ చేసింది మీరా’ అని సంభ్రమంగా అడిగేవాడేమో మరీ దారుణంగా. 

‘ఓహ్‌! ఇదా? నా ఫ్రెండ్‌ కూతురు హైదరాబాద్‌లో ఓ లైబ్రరీలో పని చేస్తుంది. పదిహేనేళ్లకు పైగా ఎవరూ తాకని కొన్ని పుస్తకాల్ని స్టాఫ్‌కి ఇచ్చేశారట. అలా ఈ పుస్తకం తన చేతికొచ్చింది. తను తెలుగమ్మాయే కానీ తెలుగు చదవడంబొత్తిగా రాదు. పుస్తకం అట్ట ఊడిపోతే కవర్‌ డిజైన్‌ చాలా వెరైటీగా బావుందని, లోపల అదే సైజులో నీట్‌గా కట్‌ చేసిన తెల్లకాగితాలు పెట్టి బైండ్‌ చేసి ఇలా నోట్‌ప్యాడ్‌లా చేసి నాకు గిఫ్ట్‌గా ఇచ్చింది. నాకూ బాగా నచ్చింది. బాగా చేసింది కదూ’  దాని వైపు మురిపెంగా చూస్తూ అన్నాడు.  

ఒకప్పుడు పాఠకులై ఉండి నేడు టీవీ ప్రేక్షకులుగా మారిన లక్షల మంది తెలుగువారికి ఆ సందర్భంగా మనసులోనే వందనాలు తెలుపుకున్నాను. కేవలం వారివల్లే ఆ రోజు నా విమాన ప్రయాణం ఏమాత్రం విసుగు లేకుండా సరదాగా సాగిపోయింది! వినోదంతో పాటు ఎంతో విజ్ఞానదాయకంగా ఉండే తెలుగు సాహిత్యం మీద ఒకప్పుడున్న (ఎప్పటికీ ఉండాల్సిన) ఆసక్తినంతా ఎందుకూ పనికిరాని టీవీ ప్రోగ్రామ్స్‌ మీదకు మళ్లించుకొని తెలుగు పాఠకుడనేవాడు కనబడటమే ఓ గొప్ప విషయంగా మార్చింది వారే కదా మరి!  -దమ్మవళం శ్రీనివాస్‌


  

మరిన్ని వార్తలు