ఆయన పాట కమనీయం.. స్వరం రమణీయం

29 Mar, 2021 06:35 IST|Sakshi

స్టార్‌ టాక్‌

ఆయన ఊపిరిపోసిన పాటలు వేలు.

‘ఆస్కార్‌’, ‘గ్రామీ’ సహా అందుకున్న కిరీటాలు వేనవేలు.

కానీ, ఇప్పుడాయన ‘99 సాంగ్స్‌’ అంటున్నారు.

రచయిత, నిర్మాత – ఇది ఆయన కొత్త అవతారం.

రెహమాన్‌ సంగీత స్వరార్ణవంలో ఇదో కొత్త కెరటం.

కొన్నేళ్ళుగా తన డ్రీమ్‌ ప్రాజెకై్టన మ్యూజికల్‌ ఫిల్మ్‌ ‘99 సాంగ్స్‌’తో ఏప్రిల్‌ 16న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలకరించనున్న ప్రపంచ ప్రసిద్ధ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌. రెహమాన్‌ ‘సాక్షి’తో ఎక్స్‌క్లూజివ్‌గా, సుదీర్ఘంగా సంభాషించారు. అందులో నుంచి కొన్ని ముఖ్యాంశాలు...

► రచయితగా, నిర్మాతగా కొత్త జర్నీ గురించి...
రెహమాన్‌: దశాబ్దాలుగా సంగీత ప్రపంచంలోనే గడుపుతున్నా. కొత్తగా ఏదైనా చేయమని నా మైండ్‌ చెప్పింది. ఆస్కార్‌ అవార్డు తర్వాత హాలీవుడ్‌లో 5 ఏళ్ళున్నా. అక్కడి సినిమాలు చేశా. ఆ టైమ్‌లో కొన్ని వర్క్‌షాప్స్‌ చేశా. మనం ఎందుకు ఓ కథ చెప్పకూడదని అప్పుడనిపించింది. సంగీతం అనేది యూనివర్సల్‌ సబ్జెక్ట్‌. ప్రపంచంలో మంచి కథలున్నప్పుడు మనమూ చెప్పవచ్చనుకొని ‘99 సాంగ్స్‌’ కథ రాశాను.

తల్లితో రెహమాన్‌

► కొత్త రెహమాన్‌  పుట్టారననుకోవచ్చా? ఇదో మ్యూజికల్‌ ఫిల్మ్‌ లాగా అనిపిస్తోంది.
(నవ్వేస్తూ...) అవును నిర్మాతగా కొత్త రెహమాన్‌నే. ఈ సినిమాలో పాటలు ఎక్కువే. అలాగని సినిమా పూర్తిగా సంగీతం గురించే కాదు. సామాజిక అంశాలూ ఉన్నాయి. ఈ కొత్త ప్రపంచానికీ, పాత ప్రపంచానికీ మధ్య వైరుధ్యాలనూ, డిమాండలోని తేడాలనూ మా కథ చూపిస్తుంది.

► మీ నిజజీవిత ఘట్టాలేమైనా కథలో పెట్టారా?
లేదు. ఇది ఫ్రెష్‌స్టోరీ. వృత్తిలో భాగంగా చాలామందిని కలిశా. ఎన్నో ప్రదేశాలు చూశా. కొత్త క్యారెక్టర్లను చూశా. మనుషుల్ని రకరకాలుగా విడదీస్తున్న వేళ మ్యూజిక్, స్పోర్ట్స్, సినిమా... వీటి గురించి అందరినీ కలుపుతాయి. ముఖ్యంగా సినిమా. మా సినిమా రైట్‌ టైమ్‌లో వస్తోంది.

► ఈ కథపై దాదాపు ఏడేళ్లు వర్క్‌ చేశారట?
ఒక అమ్మాయికి, ఒక అబ్బాయి వంద పాటలు రాయడమనేది నా బేసిక్‌ థాట్‌. కానీ ప్రేక్షకులకు పాటలే సరిపోవు. వాళ్లకు సినిమా చూస్తున్నామనే అనుభూతి కలగాలి. మ్యూజిక్, విజువల్స్‌ కలిస్తే బాగుంటుంది. ముందు తరాలవారు అలానే చేశారు. కె. విశ్వనాథ్‌ గారు తీసిన ‘శంకరాభరణం’, ‘స్వాతిముత్యం’, బాలచందర్‌గారి ‘సింధుభైరవి’, మణిరత్నం ‘నాయగ¯Œ ’ ఇలాంటి సినిమాలు చూసి చాలా నేర్చుకున్నా. దర్శకులు శంకర్, సంజయ్‌ లీలా భన్సాలీ గ్రాండియర్‌ విజువల్స్‌తో పాటలను తెరకెక్కిస్తారు. ప్రతి దర్శకుడు, మ్యూజిక్‌ కంపోజర్‌ మైండ్స్‌ వేర్వేరు. ఈ ‘99 సాంగ్స్‌’ డైరెక్టర్‌ విశ్వేశ్‌ కృష్ణమూర్తి, నేను కలిసి ఉమ్మడి కలగా ఈ సినిమా చేశాం.

► చెన్నై సంగీత ప్రపంచానికి ఇది మీ కానుక...?
అనుకోవచ్చు. 1980లలో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం... ఇలా సౌత్‌లో ఉన్న సినీ జీనియస్‌లు అందరూ మద్రాసులోనే ఉండేవారు. తర్వాత ఏ ఇండస్ట్రీకి ఆ ఇండస్ట్రీ అయిపోయింది. ఓసారి దిలీప్‌ కుమార్‌ గారు మద్రాసులో 6 నెలలున్నారు. ఓ సినిమా చేశారు. అలా చెన్నైలో హిందీ సినిమాల షూటింగ్‌లూ జరిగాయి. అలాంటి మంచి రోజులు రావాలని, మరో స్వర్గం రావాలనీ మా సినిమా ఓ చిన్ని ప్రయత్నం.

► మ్యూజికల్‌ ఫిల్మ్స్‌ ఇండియాలో తక్కువ. నిర్మాతగా తొలిసారే ఇలాంటి ఛాలెంజ్‌...?
(నవ్వేస్తూ) రెగ్యులర్‌గా ఉంటే, తీస్తే లైఫ్‌ బోర్‌ కొడుతుంది. అందుకే ఈ ఛాలెంజ్‌. జనం లవ్, యాక్షన్‌  ఫిల్మ్స్‌ చూశారు. ఓ మ్యూజికల్‌ సినిమా చూడబోతున్నామనే ఎగ్జయిట్‌మెంట్‌ వారికి ఉంటుంది. థియేటర్స్‌లో పాటలు వస్తున్నప్పుడు కొందరు మొబైల్‌ బ్రౌజింగ్‌లో ఉంటారు. ఏకకాలంలో ‘మల్టీఫుల్‌ థింగ్స్‌’ కోరుకుంటున్నారు. కానీ ఈ సినిమాకు అలా జరగదు. బిగువైన స్క్రీన్‌ప్లేతో ‘99 సాంగ్స్‌’ ఉంటుంది.

► తమిళం, హిందీ, తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు. పాటలకు, గాయకుల విషయంలో జాగ్రత్తలు?

ప్రతి పాటకూ 10 –13 రివిజన్స్‌ జరిగాయి. లిప్‌సింక్, మీనింగ్, పొయిట్రీ చూసుకున్నాం. అనువాదం చేయకుండా స్వేచ్ఛగా ఏ భాషకు ఆ భాషలో పాటలు రాశారు. డబ్బింగ్‌ సినిమాలా ఉండకూడదనుకున్నా. (నవ్వేస్తూ) అందర్నీ కష్టపెట్టి చాలా రివైజింగ్‌ వెర్షన్స్‌ చేశాం. కొన్నిసార్లు సింగర్స్‌నూ మార్చాం. తెలుగులో సీతారామశాస్త్రి గారు ‘సాయి..’ సాంగ్‌ బ్యూటిఫుల్‌గా రాశారు. అలాగే వెన్నెలకంటి కుమారుడు రాకేందు మౌళి.

► భారత చరిత్రలో తొలిసారి డాల్బీ ఎట్మాస్‌ టెక్నాలజీతో రిలీజ్‌ చేస్తున్న సౌండ్‌ ట్రాక్‌ ఆల్బమ్‌ అట కదా ఇది...
అవును. ఆడియో త్వరలోనే రిలీజ్‌ చేస్తాం. ఫస్ట్‌ డాల్బీ సౌండ్‌ ట్రాక్‌ మా సినిమాతో లాంచ్‌ అవడం గౌరవంగా ఉంది. ఈ సినిమాను హిందీలోనే విడుదల చేద్దామనుకున్నాం. జియో స్టూడియోస్‌ మాతో అసోసియేటయ్యాక తెలుగు, తమిళంలోనూ చేయాలనుకున్నాం.

► మొదట మీకు కథ తట్టిందా? లేక సంగీతమా?
(నవ్వుతూ) కథే! కథలో నుంచే సంగీతం వచ్చింది. కథ ప్రకారమే పాటలు ఉంటాయి.

► కె.విశ్వనాథ్‌ తీసిన ‘శంకరాభరణం’, ‘స్వాతిముత్యం’ సినిమాలు నచ్చాయన్నారు. మీరు ఆ టైమ్‌లో ఉంటే, ఆ సినిమాలకు చేసి ఉంటే...?
లేదండీ. వాటికి లెజెండ్స్‌ వర్క్‌ చేశారు. కేవీ మహాదేవన్‌  గారిని నా గురువుగా భావిస్తాను. కర్ణాటక సంగీతం నుంచి తీసుకొని ఆయన సినిమాకు చేసిన ట్యూన్స్‌ను మ్యాచ్‌ చేయలేం.

► విశ్వనాథ్‌ గారి లాంటి వారితో ఓ మ్యూజిక్‌ ఫిల్మ్‌ చేయాలని మీరు ఆశపడుతుంటారా?
‘ఇఫీ’ ఫంక్షన్‌ లో గోవాలో విశ్వనాథ్‌గారిని కలిశా. గంట మాట్లాడా. ఆయనకి చాలా వినయం. అలాంటి అద్భుత చిత్రాలన్నీ భగవత్‌ కృప అని వినయంగా చెప్పారు. కమల్‌హాసన్‌  గారిని కలిసినప్పుడు రెండు గంటలు మాట్లాడుకున్నాం. ‘సాగర సంగమం’ రూపకల్పనలో విశ్వనాథ్‌గారి కృషి, అందరి మేధామథనం సంగతుల్ని నెమరేసుకున్నాం.

► మ్యూజిక్, రచన, నిర్మాణం... ఏది కష్టం?
ఏ విషయాన్ని అయినా మూలాల నుంచి తపనతో నేర్చుకోవాలి. మ్యూజిక్‌లో నేను ఫాలో అయిన ఈ విధానాన్నే ప్రొడక్షన్, రైటింగ్‌లోనూ చేశా. సినిమా నిడివి మూడున్నర గంటలు వచ్చింది. కథాంశం పాడవకుండా ఉండేలా రెండు గంటల్లో సినిమా ఉండేలా కొత్త ఎడిట్‌ చేశాం. ‘మామ్‌’ చిత్ర ఎడిటర్‌ మోనిషా పని చేశారు. ట్రైలర్‌ కట్‌ కోసం దర్శకుడు అట్లీని సంప్రదించాం. కమర్షియల్‌ వేలో కట్‌ చేశారాయన. తమిళ వెర్షన్‌ కు దర్శకుడు గౌతమ్‌ మీనన్‌  డైలాగ్స్‌ అందించారు. ఆస్కార్‌ గెలిచిన ‘లా లా ల్యాండ్‌’కు చేసిన పియానో ప్లేయర్‌ మా సినిమాకు పనిచేశారు. చాలామంది అంతర్జాతీయ నిపుణులు, నా స్నేహితులు నన్ను గైడ్‌ చేశారు.

► నిర్మాతల కష్టాలు అర్థమయ్యాయా?
(నవ్వేస్తూ) ప్రొడ్యూసర్‌ జాబ్‌ జూదం లాంటిది. నిర్మాతగా ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఫినిష్‌. చాలామంది నష్టపోయారు. కానీ ధైర్యంగా ముందుకు వెళ్లకపోతే లైఫ్‌ లేదు. ఒక మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ‘సినిమాలో మంచి పాట ఇది.. వినండి’ అని నేనెప్పుడూ చెప్పను. కానీ నిర్మాత బాధ్యతలు వేరు. కెప్న్‌  ఆఫ్‌ ది షిఫ్‌ మనమే. సినిమాను రిలీజ్‌ చేయాల్సిన బాధ్యతా నిర్మాతలదే. కానీ ఈ ప్రొడక్ట్‌ ఒక్క నిర్మాతదే కాదు. డైరెక్టర్స్, ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్‌... ఇలా చాలామంది కలిస్తేనే ఒక సినిమా. వీటికి తోడు ఏఆర్‌ రెహమాన్‌  సినిమా అంటే కొన్ని అంచనాలు ఉంటాయి. వాటినీ అందుకోవాలి. ఇందులో అందరి కృషీ ఉంది.

► నిర్మాతగా, రచయితగా... కొనసాగుతారా?
‘99 సాంగ్స్‌’ రిలీజ్‌ కోసం చూస్తున్నా. నేను నిర్మాతగా కొనసాగాలో లేదో జనం నిర్ణయిస్తారు.

► సినిమా రఫ్‌కట్‌ మీ అమ్మగారికి చూపించారట
అవును. ఆమె తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతారు. ఆ సమయంలో అమ్మ అనారోగ్యంతో మంచం మీదున్నారు. ఆవిడ చూసి ఇంగ్లీష్‌ సినిమాలా ఉందన్నారు. ఇనిషియల్‌ కట్, కథలోని సీన్లు ఆమెకి అలా అనిపించాయి.  

► దర్శకులు శంకర్‌ ఇదే మాట అన్నట్లున్నారు?
ఆయన ఓ పాట చూశారు. విజువల్స్‌ అంత గ్రాండ్‌గా అనిపిస్తుండడం హ్యాపీగా ఉంది. హాలీవుడ్‌ విజువల్స్, భారతీయ ఆత్మ – మా సినిమా.

► మీ చిత్రదర్శకుడు విశ్వేశ్‌కి మీ సలహాలేమైనా?
లేదు. 2016లో ఈ సినిమాను స్టార్ట్‌ చేశాం. వర్క్, పోస్ట్‌ ప్రొడక్షన్స్‌  వర్క్స్‌ నాలుగేళ్లు జరిగాయి.

► రాబోయే రోజుల్లో సినీ డైరెక్టర్‌గా కూడా...?
లేదు. ‘లే మస్క్‌’ అనే ఓ చిన్న వర్చ్యువల్‌ రియాలిటీ ఫిల్మ్‌ మాత్రం తీశా.  దర్శకత్వం అంటే, 2–3 ఏళ్ళు అన్నీ పక్కన పెట్టేయాలి. (నవ్వేస్తూ) నన్ను సంగీతం వదిలేయమంటారా ఏమిటి?

► మీరు వర్క్‌ చేసిన రాజ్‌–కోటితో అనుబంధం?
కోటి గారిని కలుస్తుంటా. అన్నయ్య లేని నాకు ఆయన అన్నయ్య. రాజ్‌ గారిని చూసి చాలా కాలమైంది. ఆయనను కలవాలని ఉంది.

► గత ఏడాది మీ అమ్మ గారి లానే, లెజండ్‌ సింగర్‌ ఎస్పీ బాలు దూరమయ్యారు...
(బాధగా)ఎస్పీబీ గారి లాంటి సింగర్‌ మరొకరు రారు. 40 వేల పాటలు పాడిన ఆయనను ఇంకెవరూ మ్యాచ్‌ చేయలేరు. 1982 –83 టైమ్‌లో అనుకుంటా... నా ఫస్ట్‌ పెర్ఫార్మెన్స్‌ ఆయన బర్త్‌ డేకి, మద్రాస్‌ మ్యూజిక్‌ అకాడెమీలో జరిగింది. నా మ్యూజిక్‌ డైరెక్షన్‌ లో వచ్చిన సినిమాల్లో ఆయన పాడిన పాటలన్నీ మళ్ళీ వీడియో రికార్డ్‌ చేయిద్దామని అనుకున్నాను. ఆయన ఎగ్జయిటయ్యారు. కానీ ఇంతలో కరోనా వ్యాప్తి. ప్రాజెక్ట్‌ ఆగింది. ఆయన వెళ్ళిపోయారు.

► ఆస్కార్‌ సాధించారు. మన సిన్మాలకి బెస్ట్‌ ఫారిన్‌ఫిల్మ్‌గా ఆస్కారొచ్చే ఛాన్స్‌?
మన ఫిల్మ్‌మేకర్స్‌ ఏం మిస్సవుతున్నామో గమనించాలి. బావిలో కప్పల్లా ఉండిపోకూడదు. మనం వెళ్ళాలి, పోటీ పడాలి. నేను ‘ఫ్యూచర్‌ ప్రూఫ్స్‌’ వర్క్‌షాప్‌ కూడా చేశా. మార్కెటింగ్‌లో, క్రియేటివ్‌ సైడ్‌ కొత్త ఆలోచనలను సమీకరించడానికి ఈ ఛానెల్‌ను స్టార్ట్‌ చేశా. నేను అనకూడదు కానీ హాలీవుడ్‌లో భారతీయ సినిమాల పట్ల చిన్న రేసిజమ్‌ ఉంది. ఏ భాష సినిమా అయినా బాలీవుడ్‌ అనేస్తారు. నిజానికి, అద్భుతమైన డైరెక్టర్లు, సాంకేతిక నిపుణులు ఉన్నారు మన దగ్గర. మన మధ్య ఉన్న గ్యాప్‌ను కూడా పూడ్చుకోవాలి.

► నార్త్, సౌత్‌ మధ్య వివక్ష మాటేమిటి?
అదో పెద్ద కథ. మరోసారి మాట్లాడతా. కానీ, జనరల్‌గా సౌత్‌ డైరెక్టర్స్‌ నార్త్‌లో చేస్తున్నారు. నార్త్‌ హీరోలు సౌత్‌లో నటిస్తున్నారు. జనం సమైక్యంగానే ఉన్నాం. తెలుగువారు తమిళం, తమిళం వారు తెలుగును ఇష్టపడతారు. హిందీవారు తమిళ పాటలను ఇష్టపడతారు. సో.. వుయార్‌ యునైటెడ్‌. వుయార్‌ హ్యాపీ ఇండియా.

► మీరు మళ్ళీ స్ట్రైట్‌ తెలుగు ఫిల్మ్‌ చేసేదెప్పుడు?
‘ఏ మాయ చేసావే’ స్ట్రైటేగా! మంచి కథ, దర్శకుడు కుదిరితే మళ్లీ చేస్తా. తెలుగంటే ఇష్టం. నా దగ్గరవాళ్ళతో తెలుగులోనే మాట్లాడుతుంటా.

► ఇటీవల ఓ ఫంక్షన్‌ లో ఈ తరం సంగీత దర్శకులు యువన్‌  శంకర్, జీవీ ప్రకాశ్, అనిరు«ధ్‌ మిమ్మల్ని పొగుడుతుంటే ఏమనిపించింది?
ఈ తరంలో చాలా ఉత్సాహం కనిపిస్తోంది. వారు ప్రేమను చూపించడాన్ని గౌరవంగా ఫీలవుతున్నా. ఆర్టిస్టులందరూ కలిసి ఉంటే మరిన్ని అద్భుతాలు వస్తాయి. యువ సంగీతజ్ఞుల కోసం మేం ‘మాజా’ అనే యాప్‌ స్టార్ట్‌ చేశాం. ఇండిపెండెంట్‌ మ్యూజిక్‌ను ముందుకు తీసుకెళ్ళి, ఆర్థిక భద్రత కల్పిస్తుంది.

► మీరు చాలామందికి స్ఫూర్తి. కొత్తతరాన్ని చూసి మీరు ఇన్‌ స్పైర్‌ అవుతారనుకోవచ్చా?
అవును. ప్రతిభావంతుల్ని ప్రోత్సహిస్తున్నా. ఎవరైనా కొత్త మ్యూజిక్‌ను ట్రై  చేసినప్పుడు మెచ్చుకుంటే వారిలో మరింత జోష్‌ వస్తుంది.

► మీరు చాలామందిని ట్రైన్‌ చేస్తున్నారు కదా?
మా కె.ఎం కన్జర్వేటరీ ద్వారా చాలామంది పైకొస్తు్తన్నారు. మేం కొన్ని షోలు చేశాం. కొన్నిసార్లు ఈ పాటను మరోలా పాడదామని అనిపిస్తుంటుంది. ఒకసారి నీతీ మోహన్, జనితాగాంధీ లాంటి యంగ్‌స్టర్స్‌ ఆడుతూ, పాడే శైలి చూశా. స్టేజ్‌పై ఎలా ఉండాలనే విషయాల్ని నేను వారిని చూసి నేర్చుకున్నా. మనం ఇంకా బాగా పాడాలి, ఏదో రిటైర్డ్‌ ఆఫీసర్లలా బిగుసుకోని ఉండకూడదని (నవ్వేస్తూ) అనుకున్నా. ఇప్పుడు బన్నీ, సిధ్‌ శ్రీరామ్‌ బాగా షైనవుతున్నారు. హ్యాపీగా ఉంది.

► మీ సంగీతానికి వారసులెవరు? మీ ఇంట్లో...
నా అకాడెమీలోని స్టూడెంట్స్‌ను సొంత బిడ్డలుగా భావిస్తా. అమీన్, సార్థక్‌ కల్యాణి, పూర్వీ కౌటిశ్, ఔరంగాబాద్‌ అంజలీ గైక్వాడ్‌... ఇలా నా లెగసీని కంటిన్యూ చేయడానికి చాలామంది ఉన్నారు. అందులో నా బిడ్డలూ భాగస్వాములే.

► మీరీ స్థాయికి చేరుకోవడంలో మీ అమ్మగారి పాత్ర?
గత ఏడాది మా అమ్మ మాకు దూరమయ్యారు. నేను, నా ఫ్యామిలీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాం. మా అమ్మకి మేం అంతలా అటాచ్‌ అయ్యాం. నా పిల్లలు, నా సిస్టర్స్‌ ఆ బాధను తట్టుకోలేక ఏడుస్తుంటే, నా బాధను దిగమింగుకొని, వాళ్లల్లో ఆత్మస్థైర్యం నింపాల్సిన బాధ్యత తీసుకున్నా. మా అమ్మగారు ఈ లోకాన్ని వదిలి మరో మంచి లోకాన్ని చేరుకున్నారు. ఈ విషయాన్ని మా ఫ్యామిలీ మెంబర్స్‌కు కన్విన్సింగ్‌గా చెప్పడం నాకు చాలా కష్టంగా అనిపించింది. ఆమె త్యాగం, గైడ్‌లైన్స్, ధైర్యమే మమ్మల్ని ఈ స్థాయిలో నిలిపాయి. మా అమ్మ పేరిట చెన్నైలో ఓ స్మారక చిహ్నం
నిర్మిస్తున్నాం.

► ప్రపంచసిన్మాకి, భారతీయ సినిమాకు తేడా?
ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతి తెలియాలి. మనం బెగ్గర్స్‌ కాదు. మనకంటూ ఓ స్టేటస్, ఉనికి, ఐకమత్యం ఉన్నాయని ప్రపంచం మొత్తం తెలియాలి. కష్టపడి పనిచేసే తత్వం మన నేలలోనే ఉంది. అంతర్జాతీయ ప్రేక్షకులు మన ప్రతిభను గుర్తించాలి. ఇండియా అనగానే ఏదో పేదరికంలో మగ్గే దేశం అన్నట్లు జాలి చూపిస్తుంటారు వారి సినిమాల్లో. అది కరెక్ట్‌ కాదు. అందుకే, నాకు ‘బాహుబలి’ నచ్చింది. ‘ఎవెంజర్స్‌’, ‘లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌’ లాగా ఈ సినిమాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు దక్కింది. మన దగ్గర్నుంచి యంగ్‌ ఫిల్మ్‌మేకర్స్‌ మంచి ప్రతిభావంతులు వస్తున్నారు. మన సినిమాలు ప్రపంచస్థాయిని చేరుకోవాలని కోరుకుంటున్నా.

– రెంటాల జయదేవ

మరిన్ని వార్తలు