‘ఇంటిపంట.. ఒక రెవెల్యూషన్‌’!

25 Aug, 2020 07:02 IST|Sakshi

‘‘నెల్లూరులో పుట్టింట్లో ఉన్నప్పుడు పదేళ్ల క్రితం ‘సాక్షి’లో ‘ఇంటిపంట’ కాలమ్‌ చదివి ఉత్సాహంతో ఇంటిపంటల సాగు ప్రారంభించాను. ఏడేళ్ల క్రితం అమెరికా వచ్చేశాం. నాలుగేళ్లు మంచు, చలి ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో ఉన్నాం. ఫ్లోరిడాలోని టాంప నగరానికి మారిన తర్వాత మూడేళ్లుగా మన దేశీ విత్తనాలతోనే సేంద్రియ ఇంటిపంటలు పండించుకొని తింటున్నాం. అపార్ట్‌మెంటు ఎదుట, స్కూలు ఆవరణలోని కమ్యూనిటీ గార్డెన్‌ ప్లాట్‌లో పంటలు పండిస్తున్నాం.

సాక్షి ఇంటిపంట ఒక రెవెల్యూషన్‌ తెచ్చింది. అప్పటి ఇంటిపంట కాలమ్‌ క్లిప్పింగ్స్‌ను భద్రంగా దాచుకున్నాను..’’ అని ‘సాక్షి’తో అన్నారు శిల్ప, పట్టలేనంత సంతోషంగా! నేచురల్‌ ఎకో లివింగ్‌ గ్రూప్‌ సుధీర్‌ నిర్వహించిన వెబినార్‌ ద్వారా ఇటీవల శిల్ప తన కిచెన్‌ గార్డెనింగ్‌ అనుభవాలను పంచుకున్నారు. శిల్ప గృహిణి. ఆమె భర్త బొబ్బా హజ్రత్‌రెడ్డి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. హర్షిణి(10), హైందవ్‌(5) వారి పిల్లలు. ఫ్లోరిడాలో సమశీతోష్ట వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఏడాదిలో ఎక్కువ నెలలు ఇంటిపంటల సాగుకు అనుకూలంగా ఉందన్నారు. కరోనా వల్ల గత కొద్ది నెలలుగా అమెరికన్లలో చాలా మంది ఇంటి పెరట్లో కూరగాయలు సాగు చేసుకోవటం ప్రారంభించారని శిల్ప తెలిపారు. 

శిల్ప తమ అపార్ట్‌మెంట్‌ ఎదుట ఉన్న చోటులో 50 వరకు గ్రోబాగ్స్‌లో కూరగాయలు, ఆకుకూరలు పెంచుతున్నారు. దీంతోపాటు తమ కౌంటీలోని హైస్కూల్‌ ఆవరణలో గల కమ్యూనిటీ గార్డెన్‌లో 120 చదరపు గజాల ప్లాట్లు రెంటిని అద్దెకు తీసుకొని మరీ కూరగాయలు, ఆకుకూరలు పండించుకొని తింటున్నారు. సాధారణంగా ఒక కుటుంబానికి 30“4 చ.అ.ల ప్లాట్‌ కేటాయిస్తారు. అందుకు ఏడాదికి 110 డాలర్ల (రూ. 8,242) అద్దె చెల్లించాలి.

ఎవరి ప్లాట్‌లో వాళ్లు తమకు నచ్చిన కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవచ్చు. గార్డెనింగ్‌ పరికరాలు అక్కడ ఉచితంగానే అందుబాటులో ఉంటాయి. రోజూ స్ప్రింక్లర్లతో మొక్కలకు స్కూలు సిబ్బందే నీటిని అందిస్తారు. మనం రోజూ ప్లాట్‌ దగ్గరకు వెళ్లక్కరలేదు. వీలున్నప్పుడు వెళ్లొచ్చు. మొక్కల బాగోగులను మనమే చూసుకోవాలి.  గ్రంథాలయంలో నెలకోసారి విత్తనాలు కూడా ఉచితంగా ఇస్తారు. హైస్కూలు పిల్లలు కూడా పంటలు పండిస్తారు. అగ్రికల్చర్‌ టీచర్‌ వారికి నేర్పిస్తుంటారు. 

శిల్ప ఇంకా ఇలా వివరించారు.. మేం కమ్యూనిటీ గార్డెన్‌ ప్లాట్‌ తీసుకున్న మొదట్లో ఎక్కువ మంది ఆసక్తి చూపేవారు కాదు. ఇప్పుడు కరోనా ప్రభావంతో సేంద్రియ ఆహారం మనమే పెంచుకోవాలన్న ఆసక్తి ఎక్కువ మందిలో కలగటం సంతోషంగా ఉంది. ఈ ఆసక్తిని గమనించి ‘బ్యాక్‌ టు ఫార్మింగ్‌’ పేరిట యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించాను. అమెరికాలో మాదిరిగా మన దేశంలో కూడా కమ్యూనిటీ గార్డెన్లలో కుటుంబాలకు ప్లాట్లు కేటాయిస్తే.. ఇళ్ల దగ్గర అవకాశం లేని వారు కూడా ఇంటిపంటలు పండించుకోవటం సాధ్యమవుతుంది అన్నారు శిల్ప (+1 651 605 5269). నగరాల్లో సేంద్రియ ఇంటిపంటల ద్వారా ఆకలిని జయించిన క్యూబా దేశానికి అతి దగ్గర్లోనే ఫ్లోరిడా ఉండటం యాదృచ్చికం. 
wearebacktofarming@gmail.com

మరిన్ని వార్తలు