అబ్బురపరిచే అమ్మాయి... అవ్‌నీత్‌ కౌర్‌!

12 May, 2021 00:01 IST|Sakshi

సోషల్‌ స్టార్‌

ఏయ్‌ బంటీ నీ సబ్బు స్లోనా ఏంటీ? అంటూ లైఫ్‌బాయ్‌ యాడ్‌లో ఎంతో చక్కగా నటించిన అనాటి చిన్నారి.. కట్‌ చేస్తే నేటి సోషల్‌ మీడియా సంచలన సూపర్‌ స్టార్‌గా ఎదిగింది. యాడ్‌లు, సీరియళ్లు, సినిమాల్లో నటిస్తూ.. మరోపక్క సోషల్‌ మీడియాలో ఫ్యాషన్, లైఫ్‌స్టై్టల్, మేకప్‌ ట్యుటోరియల్స్‌ వీడియోలు పోస్టుచేస్తూ, ఒకప్పటి టిక్‌టాక్‌ క్వీన్‌గానూ యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో దాదాపు రెండు కోట్లమంది ఫాలోవర్స్‌తో ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది అవనీత్‌ కౌర్‌. 

పంజాబ్‌ రాష్ట్రం జలంధర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో.. అమన్‌దీప్‌ నంద్ర, సోనియా నంద్ర దంపతులకు 2001 అక్టోబర్‌ 13న అవ్‌నీత్‌ జన్మించింది. అవ్‌నీత్‌కు జయ్‌జీత్‌ సింగ్‌ అనే అన్నయ్య ఉన్నాడు. తండ్రి ఓ కంపెనీలో పనిచేస్తుండగా తల్లి గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జలంధర్‌లో పాఠశాల విద్యనభ్యసించిన అవనీత్‌ తరువాత ముంబైకు మారింది. ప్రస్తుతం ముంబైలోని ఆక్స్‌ఫర్డ్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఇంటర్మీడియట్‌ 74 శాతం మార్కులతో పాసయ్యింది. ఒకపక్క చదువును కొనసాగిస్తూనే, కెరీర్‌లో నిలదొక్కుకుంటూ లక్షల్లో సంపాదిస్తోంది అవ్‌నీత్‌. 

డ్యాన్స్‌ రియాల్టి షోలు..
డ్యాన్స్‌ ఇండియా డ్యాన్స్‌ లిటిల్‌ మాస్టర్స్‌ షో ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలోకి అవ్‌నీత్‌ అరంగేట్రం చేసింది. తన డ్యాన్స్‌ స్టెప్పులతో డ్యాన్స్‌ షోలో టాప్‌ త్రీ కంటెస్టెంట్స్‌లో ఒకటిగా ఉండేది. అంతేగాక ‘డ్యాన్స్‌ కే సూపర్‌స్టార్స్‌’లో కూడా పాల్గొంది. ఈ షోలో ఎంతో పాపులర్‌ అయిన ‘జలక్‌ దిఖలాజా’పాటకు డ్యాన్స్‌ చేసిన ఐదుగురు కంటెస్టెంట్స్‌లో అవ్‌నీత్‌ కూడా ఒకటి. మేరీ మా టీవి సీరియల్‌ ద్వారా తొలిసారి టీవీ తెరకు పరిచయమైంది.

క్రమంగా సీరియల్స్‌ చేస్తూ.. జీ5 వెబ్‌సిరీస్‌ ‘బబ్బర్‌ కా తబ్బార్‌’ వంటి వాటిలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘‘అల్లాద్దిన్‌ నామ్‌ తో సునా హోగా’’ సీరియల్‌లో ప్రిన్సెస్‌గా నటించి ఎంతోమంది అభిమానాన్ని చూరగొంది. టీవీ షోలతో వచ్చిన గుర్తింపుతో మర్దాని సినిమాలో మీరా క్యారెక్టర్‌ను ఎంతో చక్కగా పోషించింది. తరువాత వచ్చిన మర్దాని–2 లో కూడా అవనీత్‌ నటించడం విశేషం. ఈ రెండు సినిమాల్లో అవ్‌నీత్‌ నటనకు అనేక ప్రశంసలు వచ్చాయి. తరువాత రొమాంటిక్‌ కామెడీ సినిమా ఖరీబ్‌ ఖరీబ్‌లో నటించింది. 

సింగర్‌గానూ..
అవ్‌నీత్‌ ఒకపక్క డ్యాన్సర్‌గానూ మరోపక్క మంచి నటిగా రాణిస్తూ చక్కటి గాయనిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే చాలా మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ను విడుదలచేసింది. అవనీత్‌కు మ్యూజిక్‌ పరంగా మంచి పేరు తెచ్చిన వాటిలో కాలీ మేరీ ఘాడీ, తార్సే యే నైనా, యారి, పహాదాన్, మేరే నైనా, అటాచ్‌మెంట్‌, తేరి నాజర్, మెయిన్‌ ఫిర్‌ నైనాలు బాగా ఫేమస్‌ అయిన వాటిలో ఉన్నాయి. హిందీ, పంజాబీ భాషల్లో తన గానంతో అలరిస్తోంది. 

సంపాదన, ఫాలోవర్స్‌ లక్షల్లోనే..
ఒకపక్క నటన, మరోపక్క సింగింగ్‌తో రోజంతా తీరికలేకుండా ఉండే అవనీత్‌ తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, మేకప్‌ ట్యూటోరియల్, డ్యాన్స్‌ వీడియోలను పోస్టు చేసి యూట్యూబ్, టిక్‌టాక్‌ ఇన్‌స్టాగ్రామ్‌లలో లక్షలమంది ఫాలోవర్స్‌ అభిమానం సంపాదించింది. రోజూ తన అప్‌డేటెడ్‌ వీడియోలతో ఎంతోమంది యువతీ యువకులకు ప్రేరణగా నిలుస్తోంది.

ప్రస్తుతం అవనీత్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ దాదాపు రెండు కోట్లమంది ఉన్నారు. ఇండియాలో టిక్‌టాక్‌ బ్యాన్‌ చేయకముందు వరకు అవనీత్‌ అకౌంట్‌ను ఫాలో అయ్యేవారి సంఖ్య కోటీ ఎనభై ఆరు లక్షలుగా ఉండేది. అప్పట్లో టిక్‌టాక్‌ క్వీన్‌గానూ అలరించింది. అవ్‌నీత్‌ ఎప్పటికప్పుడు తన అందచందాలతోనూ, డ్యాన్స్‌స్కిల్స్‌తో తన అభిమానులను అలరిస్తూ సోషల్‌ మీడియాలో పెద్ద స్టార్‌గా ట్రెండ్‌ అవుతోంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టి  ఈ ఏడాదికి 11 ఏళ్లు పూర్తయ్యాయి. 19 ఏళ్లకే సెలబ్రెటి హోదాను పొందడం ఒక ఎల్తైతే.. నెలకు ఆరులక్షల రూపాయలకు పైగా గడిస్తూ ఏడాదికి కోటి రూపాయల టర్నోవర్‌ను కలిగి ఉండడం విశేషం.  

మరిన్ని వార్తలు