టైమిస్తారా ఇవాళైనా?

6 Apr, 2021 23:45 IST|Sakshi

నేడు ప్రపంచ ఆరోగ్యదినం 

అమ్మ కంటి డాక్టర్‌ దగ్గరకు తీసుకెళ్లమంది.టైమ్‌ దొరకట్లేదు.భార్య థైరాయిడ్‌ డౌట్‌ ఉందని తోడు రమ్మంది.టైమ్‌ ఉండట్లేదు. కూతురు కళ్ల కింద చారలు వచ్చాయని బెంగ పెట్టుకుంది. అదేమైనా సమస్య. తర్వాత  చూద్దాం. సొంత అక్క... తమ్ముడూ కొంచెం గుండె పరీక్ష చేయించరా అనంటే ఎప్పుడు వీలు చిక్కింది కనుక. నాన్నకు, కొడుక్కు, భర్తకు ఆరోగ్య సమస్య వస్తే టైమ్‌ దొరికినంత సులువుగా ఇంట్లో స్త్రీలకు సమస్య వస్తే టైమ్‌ దొరకదు. ప్రపంచ ఆరోగ్య దినం నేడు. ఈ ప్రపంచం సగం స్త్రీలది. వారి ఆరోగ్యాన్ని పట్టించుకుంటున్నామా మనం?

‘టాబ్లెట్‌ వేసుకొని పడుకో’ అని ఇంట్లోని స్త్రీలకు చెప్పడం సులభం. ‘డాక్టర్‌ దగ్గరకు వెళ్దాం పద’ అని అనడం కష్టం. డాక్టర్‌ దగ్గరకు అయితే వాళ్లే వెళ్లాలి. లేదంటే ఇంట్లోనే ఉండిపోవాలి. పురుషులు మాత్రం తోడు వెళ్లరు. తోడు వారు స్వయంగా చూపించుకోలేక కాదు. ‘నా తోడు నా కుటుంబం ఉంది’ అని అనిపించడం ముఖ్యం. కుటుంబం మీద పురుషుడి నిర్ణయాధికారం ఉండటం వల్ల స్త్రీ ఆరోగ్యం మీద కూడా అతడిదే నిర్ణయాధికారం అవుతుంది. ‘సంప్రదాయ భావధార’ ప్రకారం కూడా ఇంట్లో పురుషుడి అనారోగ్యానికి ఎంతైన ఖర్చు చేయవచ్చు. స్త్రీ అనారోగ్యానికి ఖర్చయితే ‘అనవసర ఖర్చు వచ్చి పడింది’ అని చికాకు. ఈ ప్రపంచంలో ఆరోగ్యాన్ని పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మన ఇళ్లల్లో అది స్త్రీలకు ఎంత ఉంది?

‘వివక్ష లేని ఆరోగ్య ప్రపంచం’
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) 2021 సంవత్సరానికి ‘ప్రపంచ ఆరోగ్య దినం’కు సంబంధించిన ‘వివక్ష లేని ఆరోగ్య ప్రపంచం నిర్మిద్దాం’ అనే నినాదాన్ని ఇచ్చింది. వివక్ష లేని అంటే? పేదవాళ్లు కావడం వల్ల, బాధిత కులాలు కావడం వల్ల, ఫలానా మతం వారు కావడం వల్ల, ఫలానా దేశంలో ప్రాంతంలో నివహించడం వల్ల వారు ఆరోగ్యానికి యోగ్యులు కారు అని అనుకోవడం. లేదా వారు ఈ రోగాలకు తగినవారే అని అనుకోవడం. వీళ్ల కంటే ముఖ్యం వివక్ష అంటే ‘స్త్రీలకు ఆరోగ్యం గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని భావించడం. స్త్రీల ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం. ఆర్థికంగా పురుషుడి మీద ఆధారపడే వ్యవస్థను స్త్రీకి కల్పించి తన ఆరోగ్య ఖర్చుల కోసం కూడా అతడి మీద ఆధారపడేలా చేయడం వల్ల పురుషుడి (ఇంటి పెద్ద) అంగీకార అనంగీకారాలు స్త్రీ ఆరోగ్యానికి కీలకంగా మారాయి. ‘ఏమంటాడో’, ‘ఇప్పుడు చెప్పడం అవసరమా’, ‘తర్వాత చెబుదాంలే’, ‘చెప్పినా పట్టించుకోడు’ వంటి స్వీయ సంశయాల కొద్దీ స్త్రీల తమ అనారోగ్యాలను ముదరబెట్టుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

సూపర్‌మామ్‌ సిండ్రోమ్‌
ప్రసిద్ధ రచయిత్రి పి.సత్యవతి ‘సూపర్‌మామ్‌ సిండ్రోమ్‌’ అనే కథ రాశారు. అందులో ఒక అరవై ఏళ్ల స్త్రీ మరణిస్తుంది. కాని మరణించిన మరుక్షణం ఆమె శరీరం అంతా మందు బిళ్లల మయంగా మారిపోతుంది. శరీరం ఉండదు... అన్నీ మందు బిళ్లలే. ఇన్ని మందుబిళ్లల మయం ఎందుకయ్యింది ఆమె? పిరియడ్స్‌ టయానికి రావాలని, పిరియడ్స్‌ టయానికి రాకూడదని, మొటిమలు నివారించాలని, జుట్టు పెరగాలని,  పెళ్లయ్యాక సంతానం నిరోధించాలని, సంతానం కలగాలని, ఇంటి పనికి ఓపిక తెచ్చుకోవాలని, నిద్ర సరిగ్గా పట్టాలని, తెల్లారే లేవడానికి నిద్ర అసలు పట్టకూడదని, గర్భాశయంలో సమస్యలకు, ఒత్తిడి వల్ల వచ్చిన బి.పికి, సుగర్‌కు, ఇంటి పని ఆఫీస్‌ పని చేయలేక వచ్చిన డిప్రెషన్‌కు... ఇంకా అనంతానంత సమస్యలకు ఆమె బిళ్లలు మింగీ మింగీ ఈ పరిస్థితికి వచ్చిందని అబ్సర్డ్స్‌గా కథ చెప్పడం అది. తమ సమస్యలకు డాక్టర్‌ దగ్గరకు వెళ్లడం కంటే సొంత వైద్యం చేసుకునే స్త్రీలు ఎక్కువ మన దేశంలో. వారు డాక్టర్‌ దగ్గరకు వెళ్లి తమ సమస్య నుంచి బయటపడే హక్కు ఉంది అని అనుకునే సహకరిస్తున్నాడా పురుషుడు?

కాసింత ప్రేమ... ఎంతో ఆప్యాయత
మందు కంటే ఒక మంచి మాట ఏ మనిషికైనా ఉపయోగపడుతుంది. ‘ఎలా ఉన్నావమ్మా’, ‘ఆరోగ్యం ఎలా ఉంది’, ‘ఏంటలా ఉన్నావు... ఏమైనా సాయం కావాలా’, ‘తలనొప్పిగా ఉందా టీ పెట్టనా’... లాంటి చిన్న చిన్న మాటలు కూడా భర్తలు, కుమారులు మాట్లాడని ఇళ్లు ఉన్నాయి. ఉండటం ‘నార్మల్‌’ అనుకునే వ్యవస్థా ఉంది. కాని ఒక్క మాట మాట్లాడితే అదే స్త్రీలకు సగం ఆరోగ్యం అని ఎవరూ అనుకోరు. ప్రతి సంవత్సరం కంప్లీట్‌ బాడీ చెకప్‌ చేయించుకునే భర్త భార్యను కూడా అందుకు ప్రోత్సహిస్తున్నాడా... చేయించుకోవాలని భార్య కూడా అనుకుంటూ ఉందా? చెక్‌ చేసుకోవాల్సిన అవసరం ఉంది.


తిండి ఎవరిది?
‘తిండి కలిగితే కండ కలదోయ్‌’ అన్నాడు కవి. ఈ కండ పురుషుడికే. స్త్రీకి కాదు. ఉదయాన్నే లేచి వాకింగ్‌కు వెళ్లడం, జిమ్‌లో చేరడం, బజారు లో నచ్చింది తినడం పురుషుడి వంతు. ఉదయాన్నే నాష్టా చేయడంలో బిజీ అయ్యి, ఇంటి పనుల్లో మునిగిపోయి, ప్రత్యేకంగా ఫలానాది నా కోసం ఏం ఒండుకుని తింటాంలే అని అందరికీ వొండింది, అందరూ వొదిలిపెట్టింది తినడం స్త్రీ వంతుగా ఉందంటే అది కాదనలేని సత్యం. స్త్రీల పుష్టికి ప్రత్యేకంగా పౌడర్లు, టానిక్కులు, విటమిన్‌ టాబ్లెట్లు, పండ్లు, వారికి ఇష్టమైన ఆహారమూ తెచ్చి పెట్టే సందర్భాలు ఎన్ని ఉన్నాయో గమనించుకోవాలి. ‘నాకు ఫలానాది తినాలని ఉంది’ అని స్త్రీ చెప్పే పరిస్థితి కొన్ని ఇళ్లల్లో ఉండదు. ఉద్యోగం చేసే స్త్రీలు కూడా తాము తాగే సోడాకు భర్తకు లెక్క చెప్పే పరిస్థితి ఉందని అంగీకరించడానికి సిగ్గు పడాల్సిన పని లేదు. వివక్ష లేని ఆరోగ్య ప్రపంచం నిర్మిద్దాం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న మాట తక్కిన ప్రపంచం సంగతి ఎలా ఉన్నా ఇంటినే లోకంగా భావించే స్త్రీల వైపు అందరం దృష్టి పెట్టాల్సిన అక్కరను గుర్తు చేస్తోంది. ఇవాళైనా విందామా?

– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు