Holi 2021: కలర్‌ఫుల్‌ కలర్స్‌

28 Mar, 2021 08:19 IST|Sakshi

ఒక్కరు ఆడరు. మనుషులు గుంపులు. రంగులు బోలెడు. మీసం రంగు మారుతుంది. గాజులు వేరే రంగుకొస్తాయి. ఆట ఒక రంగు. పాట ఒక రంగు. వయసులో ఉన్న కుర్రదీ కుర్రాడూ ఒక రంగు. హోలీ వెలిసిన క్షణాలను దూరంగా విసిరేస్తుంది. ఉత్సాహ కణాలను దేహంలో నింపుతుంది. ఈ పండుగను పెద్ద తెర పండుగ చేసుకుంది. హిందీ సినిమాల్లో హోలీది మహాకేళీ. అందరికీ రంగుల చెమేలీ పూలు. హోలీలో ఎన్ని రంగులు ఉంటాయి? అన్నీ. హిందీ సినిమాల్లో హోలీని అడ్డు పెట్టుకుని ఎన్ని సీన్లు ఉంటాయి? అన్నే. వెండితెర అంటేనే కలర్‌ఫుల్‌గా ఉంటుందని కదా... మరి ఆ కలర్‌ఫుల్‌ తెరకే రంగులు అద్దితే ఎలా ఉంటుంది?
చూద్దాం..

‘మదర్‌ ఇండియా’ను మొదట చెప్పుకోవాలి. కలర్‌లో పాత్రలు హోలీ ఆడింది ఆ సినిమాలోనే. ఆడించినవాడు దర్శకుడు మెహబూబ్‌ ఖాన్‌. ‘హోలీ ఆయిరే కన్హాయి హోలీ ఆయిరే’ పాట అందులోదే. వితుంతువైన తల్లి నర్గిస్‌ తన ఇద్దరు కొడుకులు సునీల్‌ దత్, రాజేంద్ర కుమార్‌ గ్రామస్తులతో కలిసి పాడుతూ ఉంటే పులకించి భర్త రాజ్‌కుమార్‌తో తాను హోలి ఆడిన రోజులను గుర్తు చేసుకుంటుంది. కొడుకుల జీవితం, భవిష్యత్తు రంగులమయం కావాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. కాని వారిలో ఒక కొడుకు చెడ్డ రంగును, ద్రోహపు రంగును, ఊరికి చేయదగ్గ అపకారపు రంగును పులుముకుంటే ఆ తల్లి ఏం చేస్తుంది? ఆ రంగును కడిగి మురిక్కాలువలో పారేస్తుంది. ‘మదర్‌ ఇండియా’లో నర్గిస్‌ అదే చేస్తుంది. బందిపోటుగా మారిన కొడుకు సునీల్‌దత్‌ను ఊరి అమ్మాయిని ఎత్తుకుని పోతూ ఉంటే కాల్చి పడేస్తుంది. దేశం గురించి సంఘం గురించి ఆలోచించేవారు ఆ పనే చేస్తారు. సొంత కొడుక్కి తల్లి కావడం ఎవరైనా చేస్తారు. దేశానికి తల్లి కాగలగాలి. మదర్‌ ఇండియా చెప్పేది అదే.

‘కటీ పతంగ్‌’ రాజేష్‌ ఖన్నా 1969–71ల మధ్య ఇచ్చిన వరుస 17 హిట్స్‌లో ఒకటి. ఆ కథ ఒక ‘వితంతువు’ ఆశా పరేఖ్‌కు కొత్త జీవితం ప్రసాదించడం గురించి. నిజానికి ఆశాపరేఖ్‌ వితంతువు కాదు. మరణించిన స్నేహితురాలి కోసం వితంతువుగా మారింది. ఆమెను రాజేష్‌ ఖన్నా ప్రేమిస్తాడు. వైధవ్యం పాపం, శాపం కాదని అంటాడు. హోలి వస్తుంది. ‘ఆజ్‌ న ఛోడేంగే బస్‌ హమ్‌ జోలి’అని రాజేష్‌ ఖన్నా పాట అందుకుంటాడు. కాని తెల్లబట్టల్లో ఉన్న ఆశా పరేఖ్‌ దూరంగా ఉంటుంది. ఎందుకంటే వితంతువులు హోలి ఆడకూడదు. వారికి ఇక శాశ్వతంగా మిగిలేది తెల్లరంగే. కాని రాజేష్‌ ఖన్నా ఇందుకు అంగీకరించడు. పాట చివరలో రంగుల్లోకి లాక్కువస్తాడు. క్లయిమాక్స్‌లో ఆమెకు రంగుల జీవితం ఇస్తాడు. భర్త చనిపోవడంతో జీవితపు రంగులు ఆగిపోవడం ఒక వాస్తవం కావచ్చు. కాని జీవితం ముందు ఉంది. కొత్త రంగును తొడుక్కుంటే అది తప్పక మన్నిస్తుంది.

‘షోలే’లో గబ్బర్‌ సింగ్‌ మనుషుల్ని ఠాకూర్‌ సంజీవ్‌ కుమార్‌ ఆదేశం మేరకు అమితాబ్, ధర్మేంద్రలు తన్ని తగలేస్తారు. మరి గబ్బర్‌ సింగ్‌ ఊరుకుంటాడా? రామ్‌గఢ్‌పై దాడి చేయాలనుకుంటాడు. ‘కబ్‌ హై హోలి.. హోలి కబ్‌ హై’ అని అడుగుతాడు. ఈ సంగతి తెలియని రామ్‌గఢ్‌ వాసులు హోలీ వేడుకల్లో మునిగి ‘హోలికె దిన్‌ రంగ్‌ మిల్‌ జాయేంగే’ అని పాడుకుంటూ ఉంటారు. హటాత్తుగా గబ్బర్‌ ఊడిపడతాడు. ఊరంతా అల్లకల్లోలం. అగ్నిగుండం. అమితాబ్‌ దొరికిపోతాడు. ధర్మేంద్ర కూడా దొరక్క తప్పదు. ‘నా కాళ్ల మీద పడి క్షమాపణ కోరితే వదిలేస్తాను’ అంటాడు గబ్బర్‌ వాళ్లతో. అమితాబ్‌ బయలుదేరుతాడు. ఏం జరుగుతుందా అని అందరిలోనూ ఉత్కంఠ. గబ్బర్‌ కాళ్ల దగ్గరకు నమస్కారం పెట్టడానికన్నట్టు వొంగిన అమితాబ్‌ అక్కడ కింద ఉన్న రంగులు తీసి తటాలున గబ్బర్‌ కళ్లల్లో కొడతాడు. చూసిన ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. ఈ సీన్‌ హోలి సీన్లన్నింటిలో తలమానికం. గబ్బర్‌ భరతం పట్టిన సీన్‌ అది.

‘సిల్‌సిలా’లో అమితాబ్‌ రేఖా ప్రేమించుకుంటారు. కాని అమితాబ్‌ జయా బచ్చన్‌ను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. రేఖ సంజీవ్‌ కుమార్‌ను. రెండు జంటలూ తమ జీవితాలు గడుపుతూ ఉండగా అమితాబ్, రేఖ తిరిగి తారసపడతారు. తమలో ఇంకా ప్రేమ ఉందనుకుంటారు. తమ పెళ్లిళ్లు అర్థం లేనివని భావిస్తారు. తమ తమ భాగస్వాముల మధ్య ఆ సంగతి సూచనగా చెప్పడానికి హోలిని ఎంచుకుంటారు. ‘రంగ్‌ బర్‌సే’ పాటను అమితాబ్‌ పాడుతూ పరాయివ్యక్తి భార్య అని కూడా తలవకుండా రేఖ వొడిలో తల పెట్టుకుని కేరింతలు కొడతాడు. కాని పెళ్లయ్యాక ఈ దేశంలో గతన్నంతా బావిలో పారేయాల్సి ఉంటుంది. పెళ్లికే విలువ. దాని పట్లే స్త్రీ అయినా పురుషుడైనా విశ్వాసాన్ని వ్యక్తం చేయాలి. చివరిలో ఆ సంగతి అర్థమయ్యి అమితాబ్, రేఖ తమ తమ పెళ్లిళ్లకు నిబద్ధులవుతారు. కాని ఈలోపు వారి వివాహేతర ప్రేమను చూపే పద్ధతిలో ట్రీట్‌మెంట్‌ దెబ్బ తిని సినిమా కుదేలైంది. ఇదో చేదురంగు.

‘దామిని’లో హోలీ క్రూర రంగులను చూపిస్తుంది. అందులో మీనాక్షి శేషాద్రి పెద్దింటి కోడలు. కాని మరిది ఆ ఇంట్లో హోలీ రోజున ఆ గోలలో పని మనిషిపై అత్యాచారం చేస్తాడు. మీనాక్షి శేషాద్రి ఆ దుర్మార్గాన్ని చూస్తుంది. దారుణంగా బాధను అనుభవించిన పని మనిషికి న్యాయం చేయడానికి మీనాక్షి శేషాద్రి తన వైవాహిక బంధాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడుతుంది. అన్యాయానికి తగిన శిక్ష అనుభవించాల్సిందే అని నిలబడుతుంది. ఆమె మీద ఎన్నో దాడులు. కాని దాడులు నిండినదే లోకం అయితే లోకం ఉంటుందా? ఎవరో ఒకరు తోడు నిలుస్తారు. మీనాక్షి శేషాద్రికి తోడుగా సన్ని డియోల్‌ నిలుస్తాడు. పోరాడతాడు. న్యాయం జరిగేలా చూస్తాడు. న్యాయం గెలిచినప్పుడు ఆ రంగులకు వచ్చే తేజం గొప్పది.

‘డర్‌’ సినిమా దౌర్జన్యప్రేమను చూపిస్తుంది. అసలు ‘నో’ అనే హక్కు, స్వేచ్ఛ స్త్రీలకు ఉందని కూడా కొందరు మూర్ఖప్రేమికులకు తెలియదు. ఉన్మత్తంగా ప్రేమించినంత మాత్రాన ఆ ప్రేమ గొప్పది అయిపోదు. ‘డర్‌’లో జూహీ చావ్లాను ప్రేమించిన షారూక్‌ ఖాన్‌ ఆమె వివాహం అయ్యాక కూడా వెంటపడతాడు. ఆమె ఇంట్లో హోలీ చేసుకుంటూ ఉంటే ముఖాన రంగులు పూసుకుని ప్రత్యక్షమవుతాడు. భయభ్రాంతం చేస్తాడు. ఎంత హింస అది. రంగు ముఖానికి పూసుకుంటే బాగుంటుంది. కళ్లల్లో పడితే బాగుంటుందా? కళ్లల్లో పడే రంగును ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. చివరకు ఆ రంగు సముద్రంలో కలిసిపోతుంది.

రంగులు అన్నీ మంచివే.

కాని కొన్ని రంగులు కొందరికి నచ్చవు. అలాగే కొన్ని జీవన సందర్భాలు కూడా నచ్చవు. కాని నచ్చని రంగులు ఉన్నప్పుడే నచ్చే రంగులకు విలువ. నచ్చని జీవన సందర్భాలు ఉన్నప్పుడే నచ్చే జీవన సందర్భాలకు విలువ. పాడు రంగులనూ పాత గాయాలనూ వదిలి కొత్త రంగుల్లోకి కొత్త ఉత్సాహాల్లోకి ఈ హోలి అందరినీ తీసుకెళ్లాలని కోరుకుందాం. హ్యాపీ హోలీ.

– సాక్షి ఫ్యామిలీ
 

మరిన్ని వార్తలు