తెలుగు వాళ్లూ కలిసి పరిగెత్తారు

26 Mar, 2021 00:22 IST|Sakshi
లతా భగవాన్‌ కరే, దర్శకుడు నవీన్‌ దేశబోయిన

మొన్నటి 67వ జాతీయ అవార్డుల హడావిడిలో ఒక బక్కచిక్కిన ముసలమ్మ, ఇద్దరు కరీంనగర్‌ కుర్రాళ్లు పత్రికలలో స్థలాభావం వల్ల కనపడకుండా పోయారు. ఆ అవార్డులలో వీరికీ స్థానం ఉంది. భర్త గుండె పరీక్షల కోసం 67 ఏళ్ల వయసులో మహరాష్ట్రలో మారథాన్‌ చేసిన ‘లతా భగవాన్‌ కరే’ జీవితాన్ని ఆమెతోనే సినిమా తీశారు దర్శకుడు నవీన్‌ దేశబోయిన, నిర్మాత అర్రబోతు కృష్ణ. 2020లో మరాఠీలో రిలీజ్‌ చేస్తే ఇప్పుడు దానికి జాతీయ ఉత్తమ చిత్రం (ప్రత్యేక ప్రస్తావన) దక్కింది. ఆమె విజయమూ వారి విజయమూ మనకు బాగా కనపడాలి... వినపడాలి.

‘నా దృష్టిలో ఆర్ట్‌ సినిమా, కమర్షియల్‌ సినిమా అనేవి లేవు. కథను నిజాయితీగా చెప్పే సినిమాయే ఉంది. కమర్షియల్‌గా కొలతలు వేసుకుని సినిమాలు తీస్తే అవన్నీ హిట్‌ అవ్వాలి కదా. నూటికి ఒకటో రెండో మాత్రమే ఎందుకు హిట్‌ అవుతున్నాయి?’ అంటారు దర్శకుడు నవీన్‌ దేశబోయిన. ఈ కరీంనగర్‌ సృజనశీలి ఇప్పుడు జాతీయస్థాయిలో తన ప్రతిభ చాటుకున్నాడు. మొన్న ప్రకటితమైన జాతీయ సినిమా అవార్డులలో ఇతను దర్శకత్వం వహించిన ‘లతా భగవాన్‌ కారే’ మరాఠీ సినిమాకు ఉత్తమ చిత్రం (స్పెషల్‌ మెన్షన్‌) అవార్డు దక్కింది. నిజానికి ఇది ఒక తెలుగువాడికి దక్కిన గౌరవం. దాంతో పాటు ఒక సామాన్యురాలి పట్టుదలకు దక్కిన గౌరవం కూడా. ఎవరా సామాన్యురాలు? అంత అసమాన్యమైన పని ఏమి చేసింది?

2013లో పరుగు
లతా కారేది మహారాష్ట్రలోని బారామతి. ఆమె భర్త భగవాన్‌ సెక్యూరిటీ గార్డు. వారికి ముగ్గురు కుమార్తెలు. ముగ్గురి పెళ్లిళ్లు చేసే సరికి వారి దగ్గర ఉన్న చివరి రూపాయి అయిపోయింది. ఆ సమయంలోనే భగవాన్‌కు గుండె జబ్బు పట్టుకుంది. డాక్టర్లు స్కానింగ్‌లు ఇతర పరీక్షలు చేయాలి అందుకు 5 వేలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. ఆ సమయానికి లతా కారే వయసు 60 సంవత్సరాలు. ఏదో గుట్టుగా బతికిందే తప్ప ఒకరి దగ్గర చేయి చాపింది లేదు. కాని భర్త కోసం ప్రయత్నాలు చేస్తే ఏమీ సాయం దక్కలేదు. ఆ సమయంలోనే ఒక కాలేజీ కుర్రాడి ద్వారా బారామతిలో ‘సీనియర్‌ సిటిజెన్స్‌ మారథాన్‌’ జరగనుందని తెలిసింది. అందులో గెలిచిన వారికి 5 వేల రూపాయలు ఇస్తారని కూడా తెలిసింది. భర్త ప్రాణాల కోసం ఆ 5 వేల రూపాయలు గెలవాలని నిశ్చయించుకుందామె.

9 గజాల చీరలో
పోటీ సంగతి తెలిసిన నాటి నుంచి లతా కారే తెల్లవారు జామునే లేచి ఊళ్లో ఎవరూ చూడకుండా పరిగెత్తడం మొదలెట్టింది. చాలాసార్లు కింద పడింది. అయినా సరే పట్టుదలగా సాధన చేసింది. పోటీ రోజు స్లిప్పర్లు వేసుకుని 9 గజాల చీర కట్టుకుని వచ్చిన ఆమెను అందరూ వింతగా చూశారు. మిగిలిన వారు ట్రాక్‌సూట్లలో, షూలలో ఉండేసరికి  ఆమె కూడా కంగారు పడింది. నిర్వాహకులు మొదట అభ్యంతరం చెప్పినా తర్వాత ఆమె పరిస్థితి తెలుసుకుని అనుమతి ఇచ్చారు. 3 కిలోమీటర్ల మారథాన్‌ అది. అందరూ పరిగెత్తడం మొదలెట్టారు. లతా కారే కూడా పరిగెత్తింది. వెంటనే ఒక స్లిప్పర్‌ తెగిపోయింది. ఆమె రెండో స్లిప్పర్‌ కూడా వదిలిపెట్టి పరుగు అందుకుంది. కొద్ది సేపటిలోనే పోటీదారులంతా వెనుకపడ్డారు. జనం కరతాళధ్వనుల మధ్య ఆమె గెలుపు సాధించింది. అయితే ఆమె ఏ కారణం చేత పరిగెత్తిందో తెలుసున్న జనం పెద్ద ఎత్తున సాయం చేశారు. సంస్థలు కూడా ఆర్థికంగా ఆదుకున్నాయి. భర్త ఆరోగ్యం మెరుగుపడింది. ఆమె ఇప్పుడు నిశ్చింతగా ఉంది. ఆ తర్వాత 2014లో, 2016లో కూడా ఆమె మారథాన్‌లు గెలిచింది.

సినిమాగా
ఈ వార్తను టీవీ రిపోర్టర్‌గా పని చేస్తున్న నవీన్‌ దేశబోయిన చూసి 2017లో ఆమెను సంప్రదించి తన తొలిసినిమాగా ఆమె కథను 2019లో తీశారు. ఆమె పాత్రను ఆమె చేతే పోషింప చేయడానికి ఆమెను ఒప్పించారు. మరాఠీలో తయారైన ఈ సినిమా ‘లతా భగవాన్‌ కారే’ పేరుతో 2020 జనవరిలో విడుదల అయ్యింది. కారే జీవితాన్ని సినిమాగా తీసేందుకు నవీన్‌ మిత్రుడు కరీంనగర్‌ వాసి అర్రబోతు కృష్ణ నిర్మాతగా వ్యవహరించారు. ఆ తెలుగువారి ప్రయత్నం లతా కారేను వెండి తెర మీద శాశ్వతం చేసింది. ఇప్పుడు జాతీయ అవార్డుతో మరింత గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం ఈ తెలంగాణ మిత్రులు ఇద్దరూ మరాఠి, తెలుగు భాషల్లో లతా కారే జీవితాన్ని సీక్వెల్‌గా తీస్తున్నారు. ఆ సినిమా కూడా ఇలానే ప్రశంసలు పొందాలని ఆశిద్దాం.

మరిన్ని వార్తలు