రికార్డు కోసం కాదు నా పిల్లల కోసం..

25 May, 2021 02:52 IST|Sakshi
విక్టరీ 4 వీల్స్‌ గ్యారేజ్‌, గ్యారేజ్‌లో కారు వాష్‌ చేస్తున్న అనిత

గ్రేట్‌ జర్నీ

అనిత పుట్టింది పెరిగింది కరీంనగర్‌లో. ఎనిమిదవ తరగతి నుంచి హైదరాబాద్‌లో అమ్మమ్మగారింట్లో ఉండి చదువుకుంది. ఐటీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసి, ఆరేళ్ల పాటు ఉద్యోగం చేసింది. రెండవ బిడ్డ పుట్టినప్పుడు కెరీర్‌లో కొంత విరామం. ఇప్పుడు సొంత గ్యారేజ్‌ తో కొత్త కెరీర్‌లో అడుగుపెట్టింది. గ్యారేజ్‌ అనగానే టైర్లు, రెంచ్‌లు, గ్రీజు అంటిన దుస్తులతో మగవాళ్లు కళ్లముందు మెదలుతారు. మహిళలు ప్రవేశించని రంగం అనడం కంటే మహిళలు పెద్దగా ఇష్టపడని రంగం అనే చెప్పాలి. భుజబలంతో చేసే పనులు ఎక్కువగా ఉంటాయి. భౌతిక శక్తి సామర్థ్యాలకు పరీక్ష పెట్టే ఈ రంగంలో అడుగుపెట్టడం నిజంగా ఒక సాహసమే. ఆ సాహసాన్ని ఒక సవాల్‌గా స్వీకరించింది అనిత వ్యాల.

ఇల్లు అమ్మేశాం!
‘‘విక్టరీ 4 వీల్స్‌ గ్యారేజ్‌ని 2018లో తమ్ముడు, నేను కలిసి మొదలుపెట్టాం. ఇప్పుడు నేను ఒక్కదాన్నే చూసుకుంటున్నాను. యాభై లక్షలతో పూర్తవుతుందని దిగాం. కానీ మేము అనుకున్న స్వరూపం వచ్చేటప్పటికి 90 లక్షలైంది. లోన్‌ కోసం నెలలపాటు బ్యాంకు చుట్టూ తిరిగి చివరికి మా ఫ్లాట్స్‌ అమ్మేసి గ్యారేజ్‌ పెట్టాం. నలుగురు ఉద్యోగులతో మొదలైన గ్యారేజ్‌లో ఇప్పుడు నాతో కలిసి పన్నెండు మందిమి పని చేస్తున్నాం. మహిళ అయిన కారణంగా ఎదురయ్యే ఇబ్బందులేమీ లేవు. కానీ వర్కర్స్‌ జాప్యం చేస్తున్నట్లు, మహిళను కావడంతోనే పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారేమో అనిపించేది. అయితే వాళ్ల సమాధానం విన్న తర్వాత పని ఆలస్యం కావడానికి కారణం సహేతుకంగానే అనిపించేది.

పాప లక్ష్యం మెడిసిన్‌
పిల్లల కోసం సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ వదిలేసిన తరవాత గ్యారేజ్‌ పెట్టడానికి మధ్య కొంతకాలం ట్యూషన్‌లు చెప్పాను. ట్యూషన్‌లతో వచ్చే రాబడితో హాయిగానే ఉండేది. అయితే మా పాప లక్ష్యం మెడిసిన్‌. సీటు తెచ్చుకోవడం ఆమె లక్ష్యం. ఫీజులు కట్టడానికి తగినట్లు నా ఇన్‌కమ్‌ను పెంచుకోవడం నా లక్ష్యం అయింది. అందుకే పని చేయగలిగిన వయసులోనే కన్‌స్ట్రక్టివ్‌గా ఏదో ఒక బిజినెస్‌లోకి అడుగుపెట్టి స్థిరపడాలనుకున్నాను. అంతే తప్ప నేను రికార్డు సాధించడం కోసం పిల్లల భవిష్యత్తు మీద ప్రయోగం చేసే పరిస్థితి కాదు.

తమ్ముడి సూచన
మా తమ్ముడికి టాటా డీలర్‌షిప్‌ వర్క్‌షాపులో పదహారేళ్ల అనుభవం ఉంది. మల్టీ బ్రాండ్‌ కార్‌ సర్వీసింగ్‌ సెంటర్‌‡గురించి చెప్పాడు. అలా ఈ రంగంలోకి వచ్చాను. ఇందులో ప్రతిదీ పనిలోకి దిగిన తర్వాత నేర్చుకున్నదే. కారు డీప్‌ ఇంటీరియర్‌ క్లీనింగ్, ఇన్‌సైడ్‌ వ్యాక్యూమింగ్, కెమికల్‌ క్లీనింగ్, ఫోమ్‌ వాషింగ్, ఫాగ్‌ మెషీన్‌ శానిటైజేషన్‌ వంటి పనులన్నీ చేస్తాను. సమస్యలుంటాయని చెప్పడానికి... ‘దిగితేనే లోతు తెలుస్తుంది’ అంటారు. నేనయితే ‘దిగితే ఈత దానంతట అదే వస్తుంది’ అంటాను.

ఇందులో పదిమందికి ఉపాధి కల్పించగలుగుతున్నాను. ఒకసారి మా గ్యారేజ్‌కి వచ్చిన కస్టమర్లు ఆ తర్వాత నుంచి కొనసాగుతున్నారు. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ చేసుకునే మహిళల విషయంలో కారు సర్వీస్‌కి కూడా వాళ్లే రావాల్సి ఉంటుంది. మగవాళ్లు నిర్వహించే గ్యారేజ్‌లో కంటే మా దగ్గర సౌకర్యంగా ఫీలవుతున్నారు మహిళలు. నేను ఉదయం పది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు గ్యారేజ్‌లో ఉంటాను. ఒక్కోసారి అర్జంట్‌గా పని పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటప్పుడు పన్నెండు గంటల వరకు కూడా గ్యారేజ్‌లో ఉండాల్సి వస్తుంది.

అమ్మాయిలూ రెంచ్‌ పట్టుకోండి!
ఒకప్పుడు మెకానిక్‌ అంటే సమాజం తక్కువ గా చూసేది. అలా చూడడం వల్లనే కావచ్చు ఇప్పుడు ఈ రంగంలో నిపుణుల కొరత ఉంది. పైగా ఇప్పుడు మెకానిక్‌ వృత్తికి గౌరవం పెరిగింది కూడా. కాబట్టి అమ్మాయిలకు ఇది మంచి అవకాశం. ఈ రంగంలో కెరీర్‌ డెవలప్‌ చేసుకోవాలనుకునే అమ్మాయిలకు శిక్షణ ఇచ్చి నిపుణులుగా తయారు చేస్తాను. ఈ కాలంలో టూ వీలర్‌ నడిపే అమ్మాయిలు, కారు నడిపే మహిళల సంఖ్య బాగా పెరిగింది. వాళ్లు గ్యారేజ్‌కి వచ్చినప్పుడు గ్యారేజ్‌లో పని చేసే వాళ్లలో అమ్మాయిలు కనిపిస్తే భరోసాగా ఫీలవుతారు. ఇది మంచి కెరీర్‌ ఆప్షన్‌. ఎప్పటికీ ఆదరణ తగ్గని మంచి రంగం అవుతుంది’’ అన్నది అనిత.

కష్టం... వద్దన్నా వచ్చే అతిథి
సింగిల్‌æమదర్‌ల మీద ఉండే బాధ్యతల బరువు నాకు తెలుసు. అందుకే సింగిల్‌ మదర్‌లు ఈ పని నేర్చుకోవడానికి ముందుకొస్తే వారికి సహకరిస్తాను.ఎవరూ కోరి కష్టాలు తెచ్చుకోరు. అనుకోని అతిథిలా కష్టం దానంతట అదే వచ్చి తిష్టవేస్తుంది. కష్టం వచ్చిందని భయపడి పిల్లలతోపాటు ఆత్మహత్యలకు పాల్పడే తల్లుల గురించి తెలిసినప్పుడు బాధ కలుగుతుంటుంది. ఒక్క క్షణం ఆలోచించండి. పరిస్థితులకు మనం బాధితులమైనప్పటికీ మన పిల్లలను బాధితులను చేయకూడదు. అలాగని అమ్మానాన్నల మీద వాలిపోకూడదు. వాళ్లు కష్టకాలంలో అండగా భుజాన్ని ఇవ్వగలుగుతారు. కానీ బరువు మోసే శక్తి వాళ్లకు ఉండదు. మీకు వచ్చిన పని చేయండి, నచ్చిన పనిని నేర్చుకోండి.
– అనిత వ్యాల, ఎం.డీ.

ఆమె తాను ఎంచుకున్న రంగంతో మహిళలకు స్ఫూర్తినివ్వడంతోపాటు కొత్తతరానికి స్వాగతం పలుకుతోంది కూడా.

– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి
 

మరిన్ని వార్తలు