ధర్మోద్ధారకులు శంకరాచార్యులు

17 May, 2021 05:42 IST|Sakshi

జయ జయ శంకర

ధర్మానికి గ్లాని ఏర్పడినపుడు శిష్టరక్షణకై దుష్టశిక్షణకై తాను అవతారాన్ని ధరిస్తానని భగవద్గీతలో కృష్ణపరమాత్ముడు చెప్పాడు. ‘సంభవామి యుగే యుగే’ ధర్మగ్లాని అంటే జనులకు స్వధర్మాచరణ పట్ల శ్రద్ధా భక్తులు లోపించడం ధర్మాచరణ కించిత్తు కూడా ఆచరణ చేయకుండా ఉండటం. అలానే వేదాలలో... శాస్త్రాలలో చెప్పినదానికి విరుద్ధంగా ధర్మాన్ని ప్రబోధించి జనులను పక్కదోవ పట్టించి అవైదిక ధర్మ ప్రాబల్యం పెరగడం.

అలాంటి సమయంలో పునః ధర్మప్రతిష్ట చేయడానికి భగవదవతారం జరుగుతుంది. కలియుగానికి వచ్చేసరికి జనులలోని రాక్షస ప్రవృత్తిని తీసివేయాలి. అంటే వారిని అధర్మమార్గం నుండి ధర్మమార్గం వైపు బుద్ధిని ప్రచోదించేలా చేయాలని, జ్ఞానభిక్ష పెట్టాలనీ సాక్షాత్తు పరమేశ్వరుడు ఆదిశంకరాచార్యుల రూపంలో ఆర్యాంబా శివగురువులనే పుణ్యదంపతులకు కేరళ రాష్ట్రం కాలడీ క్షేత్రంలో పూర్ణానదీ తీరాన వైశాఖ శుద్ధ పంచమి శుభతిథిన తేజోమూర్తిౖయెన శంకరాచార్యుల వారు జన్మించారు.

శంకరులు బాల్యంలోనే అత్యంత ప్రజ్ఞాశాలిగా ఉండేవారు. ఆయన ఐదవ సంవత్సరంలో ఉపనయనాన్ని చేసుకొని అతి తక్కువ సమయంలో ఏ మానవ మాత్రునికి కూడా సాధ్యం కాని ‘అష్టవర్షే చతుర్వేదీ ద్వాదశీ సర్వశాస్త్రవిత్‌’ ఎనిమిదవ సంవత్సరంలో చతుర్వేదాలు 12 సంవత్సరాల వయస్సులోపు సర్వశాస్త్రాలను అధ్యయనం చేశారు.

వేదాధ్యయన సమయంలో భిక్షాటనకై ఒక పేద వృద్ధురాలి ఇంటికి వెళ్లి యాచించగా ఆమె ఒక ఉసిరికాయను ఇచ్చింది. ఆమె దారిద్య్ర పరిస్థితిని చూసి చలించిపోయిన శంకరులు ‘కనకధారా స్తోత్రం’ ఆశువుగా స్తుతించారు. దానికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై బంగారు ఉసిరికాయలను వర్షంగా కురిపించింది.

శంకరుల సన్యాస ఆశ్రమ స్వీకారం కూడా చాలా విచిత్రంగా జరిగింది. సన్యాసం తీసుకొనే సమయం ఆసన్నమవడంతో తల్లిని ఆనుమతి కోరారు. సన్యాసం స్వీకరిస్తే  తన ఒంటరి అవుతానన్న కారణంతో తల్లి అందుకు నిరాకరించింది.

ఒకరోజు శంకరులు పూర్ణానదిలో స్నానం చేస్తుండగా ఒక మొసలి వచ్చి ఆయనను పట్టుకుంది. తనను సన్యసించడానికి అనుమతిస్తే మొసలి వదిలేస్తుందని చెప్పారు. ఈ సంసారబంధాలు తనను మొసలిలా పట్టుకున్నాయని ఆ బంధాల నుండి తనను తప్పించమని కోరారు. దీనినే ఆతుర సన్యాసం అంటారు, సన్యాసిగా మారే మంత్రాలు జపిస్తుండగానే ఆశ్చర్యంగా మొసలి శంకరులను విడిచి వెళ్లిపోయింది. తరువాత గురువుకోసం అన్వేషిస్తూ నర్మదా నదీతీరంలో ఉన్న గోవింద భగవత్పాదులను దర్శించి ఆయననే తన గురువుగా తెలుసుకొన్నారు. ‘షోడశే కృతవాన్‌ భాష్యం’ తరువాత మహోత్కృష్టమైన బ్రహ్మసూత్రాది గ్రంథాలకు భాష్యాన్ని రచించారు.

మహా మహా పండితులకు కూడా మళ్లీ, మళ్లీ చదివితే కాని అర్థం కాని ఎన్నో గ్రంథాలు రచించారు. కనీసం శబ్దజ్ఞానం కూడా లేనటువంటి సామాన్యవ్యక్తికి కూడా వేదాంతాది విషయాలను ‘భజగోవిందం’ వంటి స్తోత్రాల ద్వారా ప్రబోధించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిపాదించాలన్నా సమైక్యవాదాన్ని స్థాపించాలన్నా ఆదిశంకరుల సిద్ధాంతం తప్ప మరొకటి లేదని నిరూపించినవే ఆదిశంకరుల రచనలు.
ఆయన కాలినడకన దేశాద్యంతం పర్యటించి అవైదికమైన 72 మతాలను సప్రమాణంగా ఖండిస్తూ వేదప్రతిపాదితమైన అద్వైత సిద్ధాంతాన్ని పునఃప్రతిష్ఠించారు. ఆదిశంకరులు వైదిక మతోద్ధారకులు. దాని పేరే అద్వైత సిద్ధాంతం.

‘‘వేదో నిత్యమధీయతాం’’ తదుదితం కర్మస్వనుష్టీయతాం అనే అనేకమైన ఉపదేశాలను జనహితానికి ఆయన ప్రబోధించిన జ్ఞానమార్గాన్ని సూర్యచంద్రులు ఉన్నంతవరకు ప్రసరింప చేయాలనే ఉద్దేశ్యంతో తూర్పున పూరీలో గోవర్థన పీఠం, దక్షిణాన శృంగేరీలో శ్రీ శారదా పీఠం, పశ్చిమాన ద్వారకలో శారదా పీఠం, ఉత్తరాన బదరిలో జ్యోతిష్పీఠాలను స్థాపించారు. ఈ పీఠాలు, పీఠాధిపతుల ద్వారా ఎల్లప్పుడూ జనులకు ధర్మ ప్రబోధం జరిగి అందరూ వేదోక్తకర్మలను ఆచరించి జ్ఞానమార్గాన్ని పొంది శ్రేయోవంతులు అవాలని లోకోపకారం కోసం మహత్తరమైన కార్యకలాపాలను శంకరాచార్యుల వారు చేశారు.

అలాంటి మహోన్నతమైన శ్రీ శంకరాచార్యుల వారిని అయన జయంతి సందర్భంగా స్మరించడం కన్నా ప్రతి సనాతన ధర్మ అనుయూయులకు పుణ్యమేముంది? అత్యంత భక్తి శ్రద్ధలతో శంకరుల వారిని ఈరోజు ఆరాధించాలి. ఆరాధించడం, పూజించడం, స్మరించడం ఎంతముఖ్యమో ఆయన ప్రతిపాదించిన ధర్మాన్ని పాటించడం అంతే ముఖ్యం. ఎల్లప్పుడూ స్వధర్మాన్ని ఆచరిస్తూ, జ్ఞానోపార్జన చేస్తూ ఈ జీవనాన్ని సఫలీకృతం చేసుకుందాం.
(నేడు శంకర  జయంతి)


వ్యాసోఝల గోపీకృష్ణశర్మ వేద పండితులు, శృంగేరీ పీఠం
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు