Ugadi 2021: స్వస్థతనొసగవమ్మా ఓ ఉగాదీ...

13 Apr, 2021 04:40 IST|Sakshi

శ్రీ ప్లవ నామ సంవత్సరం

చిన్ని పాపాయి నవ్వుల్ని ఇంటికి తోరణంగా కట్టనీ. బుజ్జిగాడి అల్లరిని బంతిపూల మాలగా చుట్టనీ. అమ్మమ్మ, నానమ్మలు నిశ్చింతగా మెలగనీ. అమ్మ సంతోషంగా పాయసం వండనీ. నాన్న సురక్షితంగా పనులకు వెళ్లిరానీ. చంద్రుడు అందంగా కనిపించనీ. సూర్యుని ప్రతాపం వేసవి అని మాత్రమే తెలపనీ. పాత రొష్టులన్నీ తొలగిపోనీ. కోత సమయాలన్నీ చెదిరిపోనీ. ధన ధాన్యాలు తర్వాత. మణి మాణిక్యాలు అటు పిమ్మట. మొదలు స్వస్థత నొసగవమ్మా ఓ ఉగాది. మా అరిటాకుల్లో ఆయుష్షునీ, ఆనందాన్ని వడ్డించమ్మా మా ఉగాది. ప్లవ నామ ఉగాదికి పండగ విన్నపాలు ఇవి.

సంవత్సరం గడిచిపోయింది తల్లీ. వేడిగాలులు వీస్తూనే ఉన్నాయి. శీతవేళలు కోత పెడుతూనే ఉన్నాయి. మనసారా నవ్వి చాలా కాలమయ్యిందమ్మా. మనిషిని హత్తుకొని యుగాలు దాటిందమ్మా. వాకిట్లో పూలకుండీలు కూడా బెంగ పెట్టుకున్నాయి. పెరటిలో అరటి చెట్లు ఆకులను ముడుచుకున్నాయి. ఏ ఇల్లూ వచ్చేపోయే ఇల్లుగా లేదు. ఏ వాకిలీ నిర్భయంగా గడిని తీయడం లేదు. కాసింత గాలి కావాలి తల్లీ. కాసింత వెలుగు కావాలి. మామాలుగా జీవితం గడిచే మహద్భాగ్యం కావాలి తల్లీ.

శ్రీ ప్లవ నామ సంవత్సరమా... స్వస్థతనొసగమ్మా... శాంతిని పంచమ్మా.
హుండీలు పగులగొట్టేశాం. పోపుల డబ్బా చిల్లర చివరకొచ్చింది. అకౌంట్‌లో సొమ్ము గీకీ గీకీ బేలెన్స్‌ జీరోకు చేరింది. ఉప్పుకు డబ్బు కావాలి. పప్పుకు డబ్బు కావాలి. పొయ్యిలో పిల్లిని తోలడానికి చేతికి సత్తువ కావాలి. పిల్లలకు మిఠాయిలు తెచ్చి ఎంత కాలమో. నాలుగు పండ్లు కొనాలన్నా ఎంత పిరిమో. ప్రతి ఇంటి జరుగుబాటును కాపు కాయి తల్లీ. ప్రతి ఇంట్లో అంట్లు పడే వేళను గతి తప్పనీకు తల్లీ. ప్లవ నామ సంవత్సరమా... ఆకలి ని బెత్తం దెబ్బలు కొట్టి తెలుగు ప్రాంతాల నుంచి తరిమికొట్టు. తెలుగువారి చేతి వేళ్లు ప్రతి పూటా నోట్లోకెళ్లే వరం ప్రసాదించు.

సేవ చేసే వైద్యులకు సేవ చేసే శక్తినివ్వు. కాపు కాచే వ్యవస్థకు కాపు కాచే స్థయిర్యాన్ని ఇవ్వు. చెడు గాలులు, విష గాలుల బారిన అమాయకులు, నిరుపేదలు, నిస్సహాయులు, స్త్రీలు, పిల్లలు పడితే వారికి క్షణాలలో సాయం అందేలా చూడు. ఆశబోతు జలగలు, అత్యాశ పాములు, అబద్ధాల తేళ్లు వాళ్లను కుట్టకుండా చూడు. మెడలో పుస్తెలు, శరీరంలో అవయవాలు తప్ప వారి దగ్గర ఏ ఆస్తులూ ఉండవు. వారిని వారికి మిగిలేలా చూడు. వారి ఇళ్లల్లో ఏ కన్నూ చెమర్చకుండా చూడు. ఏ గొంతూ గద్గదం కాకుండా కాచుకో. ముంగిట్లో సన్నజాజుల మొక్క వేసుకుని, మూడుపూట్లా పచ్చడి నూరుకుని జీవితాంతం బతికేయగలరు వారు. ఆ పెన్నిధిని కూడా దగా చేసి దోచుకోకు. ఏ ఇంటి సంఖ్యా తక్కువ చేయకుండా చూడు.

ఓ ప్లవ నామ ఉగాదీ... ఈసారి నీ వెంట ఏ మృత్యుభటుడూ రాకుండా ఉండనీ. వచ్చినా అతని వద్ద ఉండే సకల చిరునామాలు తప్పుగా ప్రింటయ్యి ఎల్లకాలమూ తికమకపడనీ. అతని గూగుల్‌ మేప్‌ పూర్తిగా మిస్‌గైడ్‌ చేయనీ.

పిల్లలు చదువుకోనీ. యుక్త వయసు ఉన్నవారికి పెళ్లిళ్లు జరగనీ. ఉద్యోగాలు ఇబ్బడి ముబ్బడిగా పెరగనీ. పగిలిన గోడ నుంచి ఒక మొలక మొలవనీ. బోసిపోయిన వీధులు తిరిగి కళకళలాడనీ. రహదారులు ప్రజల రాకపోకలతో అజీర్తి పడనీ. కూలి జీవులకు దిలాసా కలగనీ. మేలు చేసే బుద్ధి ప్రతి మనసుకూ కలగనీ. కాలానికి మంచికాలం తెచ్చే శక్తి ఉంటుంది. ప్లవ నామ పర్వదినమా... నీ గేలానికి సకల శుభాలన్నీ వచ్చి చిక్కుకోనీ.

అవమానాలు పూజ్యం చేయి. సన్మానాలు భోజ్యం చేయి. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసాన్ని పొందనీ. ప్రతి ఒక్కరినీ మర్యాదగా బతకనీ. కుళ్లు, కపటాలను లంకె బిందెలుగా దాచి చూసుకున్నవారు వాటిని తెరిచి చూసినప్పుడు నిండా మండ్రగప్పలు కనపడనీ. సాయం, ఔదార్యాలను చేసంచిలో నింపుకున్నవారి పైకప్పు నుంచి మణిమాణిక్యాలు నట్టింట కురవనీ.

ప్లవ నామ సంవత్సరమా... ప్రతి ఒక్కరూ పదుగురి బతుకు కోరనీ. పదుగురూ ప్రతి ఒక్కరి కోసం పాటు పడనీ.

ఓ ఉగాది మాతా... ఎవరైనా బాగుపడితే చూసి ఓర్చుకునే శక్తిని ఇవ్వు లేనివాడికి. ఎవరైనా నవ్వుతుంటే నవ్వే హృదయం ఇవ్వు లేనివాడికి. ఎవరైనా అందలం ఎక్కితే లాగాలనుకునేవాడి చేతులను పూచిక పుల్లలుగా మార్చెయ్‌. ఎవరికైనా కీడు చేయాలనుకునేవాడి మాడును రిపేర్‌ చేయి.

అమ్మా కొత్త సంవత్సరమా... మా రొటీన్‌ని మాకు ప్రసాదించు చాలు. మా ఆరోగ్యాలను మాతోపాటు కాపాడు చాలు. మేము చేసుకునే ఉగాది పచ్చడికి వేక్సిన్‌ కంటే ఎక్కువ ప్రతాపాన్ని ఇవ్వు. చేదు వగరు ఉప్పు కారాలను సాలిడ్‌గా అనుభవించింది చాలు. ఈ సంవత్సరం తీపిమయమే చేయి అంతా.

నీకు దండాలు. నీకు దస్కాలు. ముల్లు తిప్పి ఎల్లరులకు మేలు చేద్దువు రా. స్వస్థత నిండిన అంబరాన్ని పరువు.
రా నువ్వు. మా ఆశలను నిలబెట్టుతూ.

– సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు