ఆ వేసవి తిరిగి రానీ...

10 Apr, 2021 00:41 IST|Sakshi

మిట్ట మధ్యాహ్నం ఎండను కసిరి వేపచెట్టు నీడ ఏసీ గాలులు వీస్తుంది. పెంకుటింటి వసారాలోని తాటాకు పందిరి చల్లగా... చలచల్లగా అని రాగం తీస్తుంది. కి టికీలకు కట్టిన గోతంపట్టాలు మగ్గు నీళ్లు ఒంపితే చాలు వేడిపై దండెత్తే కాలకేయులవుతాయి. మధ్యాహ్నం భోం చేశాక కబుర్లు రాత్రిళ్లు ఆరుబయట సందళ్లు వచ్చే పోయే చుట్టాలు పక్కాలు పిల్లలకు అనుదిన ఆటల పరమాన్నాలు ఎక్కడమ్మా ఎక్కడ ఆ వేసవి ఎక్కడ? కరోనా కరోనా ప్లీజ్‌ గో అవే. మా వేసవి మాకు ఇచ్చి పోవే. వీకెండ్‌ స్పెషల్‌.

వానాకాలం కలిసే కాలం కాదు. శీతాకాలం ముడుక్కునే కాలం. కాని వేసవి కాలమే నలుగురినీ కలిపే కాలం. నలుగురూ కలిసే కాదు. ఎండ భళ్లున కాసి రాత్రిళ్లు వెన్నెలను ఆరబోసే కాలం. పగళ్లు ఉబ్బరింత కలిగించి రాత్రిళ్లు వెన్నవీవెనలను వీచే కాలం. వేసవి కాలం మనోహరం. వేసవి కాలం ప్రేమ మయం. ఈ కాలం గత సంవత్సరం మిస్సయ్యింది. ఈ సంవత్సరమూ మిస్సవుతోంది. కరోనాపై మెటికలు విరవాలా? దేవుడికి మొరపెట్టుకోవాలా?

సంవత్సరం పొడుగూతా ఏవో పనులు. పిల్లల చదువులు. ఇంకేవో ఆరాటాలు. అటెండ్‌ కాలేని పోరాటాలు. వేసవి వస్తే అన్నీ పక్కకు వెళతాయి. వేసవి వస్తే అందరూ దగ్గర అవుతారు. వేసవిలో మన ఇంట్లో మనం మాత్రమే గడపడం నామోషీ గా భావిస్తారు. వేసవిలో మన ఇంటికి ఎవరో రావాలి... ఎవరింటికో మనం పోవాలి. అప్పుడే మనకు అయినవారు ఉన్నట్టు.

అసలు ఆ మాటలు ఎక్కడ? మిద్దె మీద నీళ్లు కుమ్మరించి చల్లపడ్డాక పరిచే పక్కల మీద చేరి చెప్పుకునే కబుర్ల సంబరమెక్కడ? వెంట్రుకలు పొడువైన బుజ్జాయికి పూల జడ ఫలానా రోజు వేద్దామని నిశ్చయించుకున్నాక అబ్బో... ఆ హడావిడి.. ఉరుకులు పరుగులు... అంతా అయ్యాక ఫొటో తీసి ఆనెక దిష్టి తీసి... తిన్న తియ్య మామిడి టెంకెను మట్టిలో నాటి చెట్టు మొలిస్తే నా పేరు పెట్టు అనుకునే బాల్యం ఎక్కడ. ఆ నీళ్ల తొట్లలో పెద్దలు వారిస్తున్నా బుడుంగున దూకే గడుగ్గాయిలు ఏరి? గడ్డివాముల్లో ఆటలేవి. పొలం గట్ల మీద పరుగులేవి. ఏదీ ఆ సువర్ణ వేసవి.

అదిగో వీధిలోకి పాలైసు బండి వచ్చింది. ద్రాక్షా ఐసు కూడా అమ్ముతారట. జేబులో చక్కెర పొట్లం స్మగుల్‌ చేసి నిమ్మరసం చేసుకుని రహస్యంగా పెదాలకు అంటించుకున్న తీపి. వి.సి.పి అద్దెకు తెస్తారు పెద్దవాళ్లు. సెకండ్‌ షో సినిమాలకు బయల్దేర తీస్తారు. ఇప్పుడైతే మినిమమ్‌ ఒక ఓటిటి చానల్‌కైనా చందా పడుతుంది. అవకాయ పెట్టడాన్ని చూడటానికి మించిన షో ఉండదు. వడియాలకు కావలి కాయడానికి మించిన పెద్ద బాధ్యత ఉండదు. బంధువుల్లో ఫలానా అబ్బాయి అమ్మాయికి స్నేహం కుదురుతుంది.

బంధువుల్లో ఫలానా పిల్లలూ పిల్లలూ కలిసి మనం ఆజన్మాంతం కలిసి మెలిసి ఉందాం అని గట్టిగా అనేసుకుంటారు. బాదం చెట్టు వారిని చూసి కొన్ని కాయలను రాలుస్తుంది. సీమచింతగుబ్బలు గొంతు నస పెట్టించినా రుచిని ఇస్తాయి. జీడిమామిడి కాయలు ఉప్పును గుచ్చి తినమని పసుపురంగులో, ఎర్రరంగులో దోసిట్లో పడతాయి. ఇంట్లో చేసిన ఐస్‌క్రీమ్‌ ఫ్లాప్‌ అవుతుంది. చేసినమ్మ ఉసూరుమని ఐదు, పది రూపాయల వెనిల్లా కొనుక్కోమని పైసలు ఇస్తుంది. గోరింటాకు చెట్టు ఉంటే కనుక అబ్బాయి అరచేతుల్లో చందమామ దిద్దుకుంటుంది. అమ్మాయిలు ఎలా పండిందో చూసి కాబోయే మొగుడి గురించి కబుర్లాడితే సిగ్గుపడి తుర్రుమంటారు. వేసవి పండుగ ను ఇస్తుంది. వేసవి బాల్యాన్ని పండిస్తుంది.

పోయిన సంవత్సరం కదలడానికి లేకుండా పోయింది. ఈ సంవత్సరం కదలకపోవడమే మంచిదనిపిస్తోంది. పిల్లలు చిన్నబుచ్చుకుంటున్నారు. ఇల్లాళ్లు తమకు దొరికే ఈ పాటి ఆటవిడుపును జార్చుకుంటున్నందుకు విసుక్కుంటున్నారు. ఆనందం పండే సమయంలో చుట్టూ భయం వ్యాపించి ఉంది. ఇలా ఎంత కాలం?

తప్పదు. ఇంకొంత కాలం. మరికొంత కాలం. అంతే. ఈ వేసవి పోతే ఏముంది. ఆరోగ్యంగా ఉంటే ఆయుష్షుతో ఉంటే మరో వేసవి వస్తుంది. ఇంకో వేసవిని తెస్తుంది. ఈ సమయంలో జ్ఞాపకాలను పంచుకోవాలి. దూరంగా ఉన్నా సాంకేతికతతో దగ్గరగా ఉన్నామని కలిసి ఉన్నామని ఒకరికి ఒకరం ఉన్నామని చెప్పుకోవాలి. పెద్దలే పిల్లలకు పిల్లలు కావాలి. ఇద్దరికి నలుగురై ఆటలాడుకోవాలి.

కాలం విసిరిన సవాలుకు బెంగటిల్లి లాభం లేదు. వచ్చే వేసవి కోసం మనం సంతోషాలను సంబరాలను దాచుకుందాం. క్షేమంగా ఉండండి. క్షేమం ఆశించండి.

– సాక్షి ఫ్యామిలీ

>
మరిన్ని వార్తలు