Earth Day: తల్లీ భూదేవి

22 Apr, 2021 03:32 IST|Sakshi

నేడు ధరిత్రి దినోత్సవం

తన మీద వొత్తిడి కలిగించినందుకే కర్ణుడిని భూమాత శపించిందట. భూమి ఇక పాపం మోయలేదు అనుకున్నప్పుడల్లా దేవదూతో, ప్రవక్తో ఉదయించారు రక్షణకు. ఒక నాగలి మొనకు సీతనే ఇచ్చింది ఈ తల్లి. తన కడుపున పంటలు, పాలుగారే నదులు మోసుకుంటూ తిరుగుతుంది రోజుకు 24 గంటలు. గోడ మీద పిల్లలు పిచ్చిగీతలు గీసినా ఒక అందం ఉంటుంది. కాని భూమి మీద మనిషి గీస్తున్న పిచ్చిగీతలు వినాశకరమైనవి. తల్లి భూదేవిని ప్రతి బిడ్డా కాపాడుకోవాలి. ఇంట్లో ప్రతి తల్లి ఈ విషయమై పాఠం చెప్పాలి. వశం తప్పిన పిల్లాణ్ణి దండించైనా సరే దారికి తేవాలి. అందరి కోసం ధరిత్రి. ధరిత్రి కోసం అందరూ.

పురాణాలు ఎప్పుడూ సంకేతాలలోనే మాట్లాడతాయి. ‘భూమ్మీద పాపం పెరిగిపోయినప్పుడల్లా అవతరించమని దేవుణ్ణి రుషులు మొరపెట్టుకున్నారని’ చెబుతాయి. భూమికి భారం పెరగకూడదని పురాణాలు ముందునుంచి చెబుతూ వస్తున్నాయి. భూమి క్షోభ పడకూడదని కూడా చెబుతూ వచ్చాయి. భూమ్మీద నేరాలు, ఘోరాలు, పాపాలు పెరిగినప్పుడు భూమి రోదిస్తుంది. ఆ రోదన మంచిది కాదు. కనుక ఆ పాపాల్ని రూపుమాపే అవతారపురుషులు అవసరమవుతారు. ఇక్కడ పాపాలు అంటే మనిషికి అపకారం చేసే పాపాలు మాత్రమే కాదు. ప్రకృతికి అపకారం చేసే పాపాలు కూడా.

ఇవాళ భూమ్మీద ప్రకృతి పరంగా పెరిగిన పాపాల కంటే మించి పాపాలు లేవు. ప్రకృతి వెంటనే తిరిగి మాట్లాడదని, వెంటనే తిరిగి ప్రతీకారం తీర్చుకోదనే ధైర్యంతో మనిషి ఇది చేస్తాడు. చెట్టును నరికితే చెట్టు వెంటనే గొడ్డలి పట్టుకుని వెంట పడదు. నదికి అడ్డంగా ఆనకట్ట కడితే నది బయటకు వినపడేలా శాపాలు పెట్టదు. పర్వతాలను పిండి పిండి చేసి చదును చేస్తే అవి కన్నెర్ర చేస్తున్నట్టు కనిపించవు.

కాని ఒకరోజు వస్తుంది. గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల మంచు శిలల కింద నక్కి ఉండాల్సిన విష క్రిములు బయటపడి మనుషుల మీద దాడి చేస్తాయి. సముద్రాల కింద భూకంపాలు వచ్చి అంతులేని జలరాశి భూమిని ముంచెత్తుతుంది. నదులు ఉగ్రరూపం ధరించి ఊళ్లలోకి వస్తాయి. పర్వతాలు తమ కొండ చరియలు కూల్చి దారులు మూసేస్తాయి. అడవులు తమకు తామే ఎండిపోతాయి. నేల తడారిపోయి లోలోపల ముడుచుకుపోతుంది. మన దగ్గర డబ్బుంటుంది.. నీరు ఉండదు. డబ్బుంటుంది.. తిండి ఉండదు. డబ్బుంటుంది.. మంచి గాలి ఉండదు. భూమి తాలూకు సకల సరంజామాను పాడు చేసి భూమ్మీద ఉండాలని మనిషి మాత్రమే అనుకుంటాడు. అది ఏ తార్కిక శాస్త్రం ప్రకారం కూడా సాధ్యం కాదు. భూమికి నువ్వు గౌరవం ఇస్తే భూమి నీకు జీవితం ఇస్తుంది.

తల్లి భూదేవి
జీవం ఇచ్చేది ఏదైనా తల్లే. భూమి జీవం ఇస్తుంది. విత్తు వేస్తే ఫలం ఇస్తుంది. లోతుకు తవ్వితే జలం ఇస్తుంది. నీ నివాసపు గోడకు గుణాద్రం అవుతుంది. నీ ప్రయాణానికి వీపు అవుతుంది. నీ సమూహానికి ఊరు అవుతుంది. తల్లి మాత్రమే ఇవన్నీ చేయగలుగుతుంది. బిడ్డలకు పచ్చటి చేల తోడు ఇస్తుంది. అందుకే భూమిని మనిషి తల్లిగా చేసుకున్నాడు. తల్లిగా ఆరాధించాడు. కాని క్రమక్రమంగా నేటి కొందరు కొడుకులకు మల్లే ఆ తల్లి గొప్పదనాన్ని మరిచాడు. ఆమె పట్ల చూపించాల్సిన ప్రేమను మరిచాడు. తల్లి ఓర్పును పరీక్షిస్తున్నాడు. ఓర్పుకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ హద్దును కూడా దాటే స్థితికి తెచ్చాడు.

తల్లి ఏమంటుంది?
భూమి తల్లి చెప్పేది మనిషి విననపుడు ప్రతి స్త్రీ భూమితల్లిగా మారి కుటుంబం నుంచి భూమి పట్ల ఎరుక కలిగించే సంస్కారాన్ని పాదు చేయాలి. పిల్లలకు మొక్కలు నాటడం నేర్పాలి. నీరు వృధా చేయకపోవడం నేర్పాలి. విద్యుత్తును ఆదా చేయడం నేర్పాలి. కాగితాన్ని వృధా చేయకూడదని నేర్పాలి. పరిసరాలు మురికి మయం చేయకూడదని నేర్పాలి. అనవసర ఇంధనం వృథా చేసే పద్ధతులను పరిహరించాలని చెప్పాలి. కారు అవసరమే. సైకిల్‌ తొక్కడం కూడా చాలా అవసరం అని తల్లి చెప్పాలి. ఏసి అవసరమే. కాని కిటికి తెరిచి ఆ వచ్చే గాలికి సహించేంత వేడిని సహించడం కూడా అవసరమే అని చెప్పాలి. ఆహార దుబారా, దుస్తుల దుబారా, ప్లాస్టిక్‌ దుబారా ఇవన్నీ తగ్గించి తద్వారా భూమి తల్లికి భారం తగ్గించాలని చెప్పడం అవసరమే అని చెప్పాలి. అమ్మ చెప్తేనే కొన్ని మాటలు చెవికి ఎక్కుతాయి. కొన్నిసార్లు అమ్మ గట్టిగా చెప్తే.

ఆ తల్లి ఆదర్శం
ఒక ఇంట్లో ఫంక్షన్‌ జరుగుతోంది. అందరూ వచ్చి అక్కడి పేపర్‌ ప్లేట్లను తీసుకుని భోజనం చేస్తున్నారు. ఆ ఫంక్షన్‌కు ఆహ్వానం అందుకున్న ఒక తల్లి తన భర్త, ఇద్దరు పిల్లలతో వచ్చింది. ఒక సంచిని తోడుగా తెచ్చింది. ఆ సంచిలో నాలుగు స్టీల్‌ ప్లేట్లు ఉన్నాయి. ఆ స్టీల్‌ ప్లేట్లలో తను, భర్త, ఇద్దరు పిల్లలు భోం చేశారు. వారు ఎంత తినగలరో అంతే ప్లేట్లలో పెట్టుకున్నారు. భోజనం పూర్తయ్యాక ఎక్కువ నీళ్లు అవసరం లేకుండా ఆ ప్లేట్లు శుభ్రమయ్యాయి. తిరిగి ఆ స్టీల్‌ ప్లేట్లను వారు సంచిలో పెట్టుకుని వెళ్లిపోయారు. వాళ్లు నాలుగు పేపర్‌ ప్లేట్ల వృధాను తగ్గించారు. తిన్నంతే తినడం వల్ల ఆహార దుబారా, తక్కువ నీటిని వాడటం వల్ల నీటి దుబారా తగ్గించారు.

ఇవి చిన్న ప్రయత్నాలు. కాని ఇవి మొత్తం భూమి మీద భారం తగ్గించేవే. ఆ నాలుగు పేపర్‌ ప్లేట్లకు ఎంత చెట్టు గుజ్జు అవసరం. అలా అందరూ చేస్తే ఎంత అడవి మిగులుతుంది. ఆలోచించాలి. అంటే ప్రతి చిన్న పనిలోనూ భూమికి సంబంధించిన ఎరుక ఉండాలి. ఈ పని భూమికి భారం అవుతుందా మేలు అవుతుందా అనేది ఆలోచించాలి. తల్లులే జాతికి సంస్కారాలు నేర్పుతూ వచ్చారు. భూమి తల్లిని కాపాడుకోవాలనే సంస్కారాన్ని కూడా వారి ఒడి నుంచి తొలిపాఠంగా అందించాలి. అది నేటి నుంచే మొదలు కావాలి.
– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు