సిగలో అవి విరులో...

21 Mar, 2021 01:06 IST|Sakshi

సినిమాల్లో కవులు

సిల్వర్‌ స్క్రీన్‌ పొయెట్రీ

నేడు ప్రపంచ కవితా దినోత్సవం

‘ఊహ తెలిశాక నేను చదివిన తొలి కవిత– నీ పేరు’ అంటాడు వినీత్‌ టబూతో ‘ప్రేమికుల దేశం’లో. ‘చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన’ అంటాడు ‘చెల్లెలి కాపురం’లో శోభన్‌బాబు. ‘మరుమల్లెల కన్నా తెల్లనిది’ అని ఇదే శోభన్‌బాబు  ‘మల్లెపూవు’లో కవిత్వం రాస్తాడు. ‘సిగలో అవి విరులో’ అని అక్కినేని జయసుధలోనే తన ఊహాసుందరిని వెతుక్కుంటాడు ‘మేఘసందేశం’లో. ‘రానీ రానీ వస్తే రానీ కష్టాల్‌ నష్టాల్‌ కోపాల్‌ తాపాల్‌’ అని తానే శ్రీశ్రీగా అవతరిస్తాడు కమలహాసన్‌ ‘ఆకలి రాజ్యం’లో. ఢిష్యూం ఢిష్యూం హీరోలకు కవిత్వం చుక్కెదురే. కాని కొన్ని సినిమాలలో వారి వల్ల కవిత్వం మెరిసింది. ‘నేడు ప్రపంచ కవితా దినోత్సవం’ సందర్భంగా సినిమాల్లో కవులపై సండే స్పెషల్‌...

‘సాగర సంగమం’లో కమలహాసన్‌ గొప్ప డాన్సర్‌. కాలక్షేపానికి కల్చరర్‌ రిపోర్టర్‌గా చేస్తూ శైలజ  డాన్స్‌ని విమర్శించాడని అతణ్ణి అవమానిస్తారు. దానిని ఎంత భరించాలో అంత భరిస్తాడు. కాని చాలక అతడి స్నేహితుడైన శరత్‌బాబును ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. అది మాత్రం భరించలేకపోతాడు. శరత్‌ బాబు అదే పేపర్‌లో ప్రూఫ్‌రీడర్‌. కాని అతడు ఒక గొప్ప కవి. ‘ఒక మహా కవికి ప్రూఫ్‌రీడర్‌ ఉద్యోగం ఇవ్వడమే కాక మళ్లీ ఉద్యోగంలో నుంచి తీసేస్తారా’ అని పత్రికాఫీసుకు వెళ్లి నానా రభసా చేస్తాడు. ‘టూ మిస్టేక్స్‌.. టూ మిస్టేక్స్‌’ అని రొప్పుతాడు. నిజమే. కవి అరుదు. కవి గౌరవం ఇవ్వవలసినవాడు. కవి సగటు మనిషి కంటే ఒక మెట్టు ఉన్నతుడు. అతడు కవిత్వం పలుకుతాడు. మనిషికి అవసరమైనది ఆహ్లాదపరిచేది అందులో ఏదో ఉంటుంది. అందుకే అతడు ఉన్నతుడు.

పద్యమే... అది మన సొంతం
ప్రపంచమంతా కవిత్వం ఉంది. తెలుగు వారికి పద్యం ఉంది. పదం ఉంది. వాగ్గేయకారులు ఉన్నారు. అందుకే సామాన్యులకు వచనం రాసేవారు, నాటకం రాసేవారు, నవలలు రాసే వారు ఎక్కువగా తెలియదు. ‘కై’గట్టేవాళ్లే తెలుస్తారు. తెలిశారు. ‘వాడు కైగడతాడురా’ అంటారు. బడికి వెళ్లి చదువుకోనివారికి కూడా ఒక వేమన పద్యం తెలుసు. పోతన భాగవతం తెలుసు. అందుకే కవికి ఆ దర్జా ఆ హోదా. తెలుగు సినిమా ఆ విషయాన్ని కనిపెట్టకుండా ఎలా ఉంటుంది. అందుకే కవులే కథా నాయకులుగా సినిమాలు వచ్చాయి. చిత్తూరు వి.నాగయ్య మనకు తెలుగు తెర మీద కవిని చూపించారు. ‘యోగి వేమన’ ఆయనే. ‘భక్త పోతన’ ఆయనే. రెంటికీ కె.వి.రెడ్డి దర్శకత్వం వహించారు. ఒక కవి అచ్చతెనుగులో మరో కవి గ్రాంథిక తెనుగులో కవిత్వం చెప్పి తెలుగువారి సారస్వతానికి లంకెల బిందెలు ఇచ్చి వెళ్లారు. వెండితెర అది నిక్షిప్తం చేసింది.

కవి అంటే అక్కినేనే
కత్తి పట్టుకునే ఎన్‌.టి.రామారావు ఘంటం పట్టుకుంటే బాగోదని నిర్మాత దర్శకులు అనుకున్నారో ఏమో అక్కినేనిని కవిని చేశారు. ‘మహాకవి కాళిదాసు’లో అక్కినేని కాళిదాసుగా అద్భుతమైన నటనను ప్రదర్శిస్తారు. ‘మాణిక్యవీణాం ముఫలాల యంతి’ అని సరస్వతి కటాక్షం తర్వాత తన్మయత్వంతో ఆయన చేసే స్తోత్రం పులకింప చేస్తుంది. అక్కినేనికే ఆ తర్వాత ‘తెనాలి రామకృష్ణ’ కవి పాత్ర పోషించే గొప్ప అవకాశం దొరికింది. ఈ వికటకవి తెలుగువారికి ప్రీతిపాత్రుడు. సినిమాని అందుకే హిట్‌ చేశారు. ఎన్‌.టి.ఆర్‌ శ్రీకృష్ణదేవరాయలుగా అక్కినేని ఆదరించడం, ఆయన అల్లరికి అదిరిపోవడం ఈ సినిమాలో చూశాం. అక్కినేనికి భక్తికవుల పాత్రలు దొరికాయి. ‘భక్త జయదేవ’, ‘భక్త తుకారాం’, ‘మహాకవి క్షేత్రయ్య’ ఇవన్నీ ఆయనకు దొరికిన అదృష్టపాత్రలే అనుకోవాలి. నాగార్జున అన్నమయ్యలో ‘భక్త కబీర్‌’గా కూడా ఆయన నటించారు. కబీర్‌ మహాకవి కదా.

శ్రీనాథ కవిసార్వభౌమ
అయితే ఎన్‌.టి.ఆర్‌కు మాత్రం శ్రీనాథ కవి సార్వభౌముడి పాత్ర పోషించాలని ఉండిపోయింది. ఆయన ‘బ్రహ్మంగారి’ పాత్ర పోషించినా ఆయన కవితాత్మకంగా భవిష్యత్తు చెప్పినా అది కాలజ్ఞానంగా జనం చెప్పుకున్నారు తప్ప కవిత్వంగా కాదు. కనుక తెలుగువారి ఘన కవి శ్రీనాథుడిని వెండి తెర మీద చూపడానికి ఎన్‌.టి.ఆర్‌ ఏకంగా బాపు, రమణలను రంగంలోకి దించారు. ఎంతో ఇష్టపడి కష్టపడి నటించారు. అయితే మునపటి దర్శక నిర్మాతల అంచనాయే కరెక్టు. ఎన్‌టిఆర్‌ను కవిగా ప్రేక్షకులు పెద్దగా మెచ్చలేకపోయారు.

చరణ కింకిణులు
సాంఘిక సినిమాలు వచ్చేసరికి కవిగా శోభన్‌బాబుకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ‘చెల్లెలి కాపురం’లో నిజ కవి సి.నారాయణరెడ్డి సహాయంతో తెర మీద ఆయన చెలరేగిపోయారు. ‘చరణకింకిణులు ఘల్లుఘల్లుమన’ అని ఆయన పాడే పాట నేటికీ హిట్‌. ‘ప్యాసా’ రీమేక్‌గా తెలుగులో ‘మల్లెపువ్వు’ సినిమా తీస్తే హిందీలో గురుదత్‌ వేసిన పాత్ర శోభన్‌బాబుకు దక్కింది. ఆ పాత్రను ఆయన హుందాగా చేసి సినిమా హిట్‌ కావడానికి కారకుడయ్యాడు. ‘మరుమల్లెల కన్నా తీయనిది’, ‘ఎవరికి తెలుసు చితికిన మనసు’, ‘చిన్నమాటా ఒక చిన్నమాటా’ పాటలన్నీ అందులోవే.

ఆకలేసి కేకలేసి

‘ఆకలేసి కేకలేశాను’ అన్నాడు శ్రీశ్రీ. ఆకలేసిన కుర్రకారు తన ఆగ్రహన్ని, ఆక్రందనను శ్రీశ్రీ కవితల ద్వారానే వ్యక్తం చేశారు. అలా చేయని వారిని ‘కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు’ అని హేళన చేశారు. ‘ఆకలి రాజ్యం’ సినిమాలో కమలహాసన్‌ ప్రతి ముఖ్యమైన సందర్భంలో శ్రీశ్రీని తలుచుకుంటాడు. ‘పతితులారా భ్రష్టులారా బాధాసర్పదష్టులారా ఏడవకండేడవకండి’ అని పొయెట్రీ చెబుతాడు. ఆకలికి తాళలేక శ్రీశ్రీ పుస్తకాలు అమ్ముతాడు. ‘విప్లవకవి శ్రీరంగం శ్రీనివాసరావు విలువ 3 రూపాయలు’ అని కన్నీరు కారుస్తాడు. ఒక నిజ కవి సినిమాలో నిజ కవిగా వ్యక్తీకరణ కావడం ఈ సినిమాతోనే మొదలు ఆఖరు.

ప్రేమ కవిత్వం
ఊహాసుందరిని ఊహించుకుని కవిత్వం చెప్పే తెలుగు హీరోలు కూడా ఉన్నారు. ‘సువర్ణ సుందరి’లో చంద్రమోహన్, ‘మేఘ సందేశం’లో నాగేశ్వరరావు ఇలా కనిపిస్తారు. మేఘసందేశంలో భార్యను తన ఊహా సుందరిగా మలుచుకోవడానికి అక్కినేని చూసినా ఆమెకు అదంతా తెలియదు. ఆ ఆర్తిని జయప్రద తీర్చాల్సి వస్తుంది. ‘సంకీర్తన’లో నాగార్జున కవిగా కనిపిస్తాడు. ఆ తర్వాత డబ్బింగ్‌ సినిమాలో కవిత్వం కనిపిస్తుంది. మణిరత్నం ‘ఇద్దరు’, ‘అమృత’ సినిమాలలో కవిత్వం విస్తృతంగా ఉంటుంది. ‘ప్రేమదేశం’లో కవిత్వాన్ని చెప్పే ఆస్వాదించే కుర్రాళ్లను చూపిస్తాడు దర్శకుడు.
కొత్తతరం హీరోలు ఈ కవిత్వానికి దూరంగా ఉన్నారు. జీవితంలో అయినా సినిమాల్లో అయినా పొయెట్రీ మిస్‌ కావడం వెలితి. కవిత్వం వర్థిల్లాలని కోరుకుందాం.

– సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు