పిచుకా క్షేమమా..!

20 Mar, 2021 00:03 IST|Sakshi

నేడు ప్రపంచ పిచుకల దినోత్సవం

అది దొరకదు. కాని అది ఉంటుంది. మనం ఇల్లు కట్టుకుంటే హక్కుగా వచ్చి దాని ఇల్లు కట్టుకుంటుంది. మనం ఒండుకుని తింటాం. రాలినవి అవి ఏరుకుని తింటుంది. వాసాల మీద వాలుతుంది. వసారాపై వాలుతుంది. బల్బ్‌ మీద కూచుంటుంది. నీళ్ల తొట్టి అంచు మీద ఆలోచిస్తుంది. అది మనల్ని పట్టించుకుంటుంది. అసలు మనల్నే మర్చిపోతుంది. మనిషిది కూడా పిచ్చుక ప్రాణమే. కాని ఆ పిచ్చుక ప్రాణానికి ఈ పిచుక చేసే పిచ్చిపనులే ప్రమాదం. పిల్లల కథల్లో, పాటల్లో, సామెతల్లో, పలుకుబడుల్లో, సినిమాల్లో పిచ్చుక లేకుండా ఎలా ఉంటుంది. పిచ్చుక లేకపోతే మనం ఉండగలమా?  రాసుకోవద్దూ ఇవాళ దాని గురించి?

‘గురి తప్పిన బాణం వలే తిరుగాడింది పిచ్చుక’ అని రాశాడు ఒక తెలుగు కవి. గదిలోకి దూసుకు వచ్చిన పిచ్చుక ఒక్క క్షణం ఎక్కడికొచ్చానా అని తొట్రుపడి గురి తప్పిన బాణంలా గిరికీలు కొట్టి మళ్లీ బయటకు బుర్రున ఎగిరిపోయిన దృశ్యం ఆ వాక్యం చదవగానే కళ్ల ముందు మెదులుతుంది. నిజానికి ‘పిచ్చుక’ అనగానే దృశ్యాలు, జ్ఞాపకాలు, బాల్యాలు చుట్టుముట్టనిది ఎవరికి? చిలుకలు ఎప్పుడో కాని రావు. కాకులు వచ్చినా మనకు నచ్చవు. నెమళ్లు ఎక్కడుంటాయో తెలియదు. గద్దలు ప్రమాదం. పావురాళ్లు గుళ్లను మసీదులను ఇష్టపడతాయి.

మరి మన ఇళ్లకి ఎవరు రావాలి? పిచ్చుకమ్మే. అది తానుగా వచ్చి లేదా మగనితో వచ్చి వరండా లో కిచకిచమని, వడ్లను పొడిచి తిని, అద్దంలో ముఖం చూసుకొని, అమ్మ చేటలో బియ్యం ఏరుతూ ఉంటే దూరాన నేల మీద గెంతుతూ ఉండి విసిరిన నూకలను నోట కరుచుకుని, బావి గట్టు మీద వాలి, గిలక మీద కాళ్లు పెట్టి, బిందె పెట్టి పెట్టి లోతుకు పోయిన సిమెంటు గుంటలో నిలిచిన నీళ్లలో స్నానాలాడి... ఈ పిచ్చుకలే కదా జీవన లిప్తలను ఇస్తాయి ఇచ్చాయి అందరికీ. అందుకే అవంటే అందరికి ఇష్టం. కసురుకోవడానికి ఇష్టపడని స్నేహం. గమనించండి అప్పటికీ ఇప్పటికీ ఎవరూ పిచ్చుకలను కసురుకోరు. అవి వస్తే ఆనందం. వచ్చి వెళ్లిపోయినా ఆనందమే.

అంటీ ముట్టని చుట్టం...
పిచ్చుక మనిషితోనే ఉంది. మనిషితోనే ఉంటుంది. కాని అంటదు. ముట్టదు. అంటినా ముట్టినా సహించదు. మనిషి ఆవాసాల్లోనే అది గూడు కట్టుకుంటుంది. పూరి గుడిసెల వసారాల్లో, మిద్దిళ్ల వాసాల్లో ఉండే ఖాళీల్లో, వాకిలి పైన, సీలింగ్‌ ఫ్యాన్‌ పైడొప్పలో, వెంటిలేటర్‌లలో, ఓపెన్‌ షెల్ఫ్‌లలో, బావి లోపలి గోడల్లో ఉండే రంధ్రాల్లో అవి గూడు కట్టుకుంటాయి. గడ్డి వాటి గూడుకు ముఖ్యమైన మెటీరియల్‌. లేకుంటే పుల్లలు పుడకలూ ఎలాగూ సేకరిస్తాయి. పిచ్చుకల గూళ్లను భారతీయులు ఏ కోశానా కూల్చరు. కూల్చడం పాపం అనుకుంటారు. వాటిలోకి తొంగి చూడటం వాటికి పుట్టిన పిల్లలను తాకడం చేయరు. అలా చేయడాన్ని పిచ్చుకలు నచ్చవు. పొదగడానికి పెట్టిన గుడ్లను తాకితే అవి వాటిని పొదగవని పిల్లలకు చెబుతారు.

పిచ్చుకలు మనుషుల్లానే కుటుంబానికి విలువ ఇస్తాయి. ఆడ, మగ కలిసి కష్టపడి గూడు కట్టి పిల్లలను సాకి సంతరిస్తాయి. అందుకని కూడా మనవాళ్లకు అవంటే ఇష్టం. మగపిచ్చుక కొంచెం బొద్దుగా ఉంటే ఆడ పిచ్చుక సన్నగా స్పీడుగా ఉంటుంది. అవి రెండు ఏమిటేమిటో మాట్లాడుకుంటూ ఉంటాయి. వాటి మాటలు వినడం ఎవరికైనా సరే బాగుంటుంది. పిచ్చుకలు మూడేళ్లు బతుకుతాయి. కాని అవి ఆ మూడేళ్లను సంపూర్తిగా జీవిస్తాయి. బద్దకించవు. మెల్లగా ఉండవు. ఉత్సాహం మానుకోవు. ఎప్పుడూ బతుకు మీద ఆశతో మన బతుకు మనం బతుక్కుందాం అన్నట్టుగా ఉంటాయి. మనుషులు తినేవి కొన్ని అవి తింటాయి. అవి తినేవి కొన్ని వాటికి దొరుకుతాయి. ఇప్పుడు మనుషులు తినేవి కొన్ని వాటికి విషపూరితం. అవి తినే పురుగులు కూడా విషపూరితమైపోతున్నాయి.

కథల్లో పలుకుబడిలో....
కథల్లో పిచ్చుక ఉంటే పిల్లలకు ఇష్టం. పసిపిల్లలకు గోరుముద్దలు తినిపించేటప్పుడు ‘ఇది కాకమ్మ ముద్ద... ఇది పిచ్చుకమ్మ ముద్ద’ అని తినిపిస్తారు. కొన్ని పిచ్చుక లు కథల్లో భలే తెలివి చూపిస్తాయి. కొన్ని నవ్విస్తాయి. కాకి ఉప్పుతో మేడ కట్టుకుందట, పిచ్చుక పుల్లలతో కట్టుకుందట. కాకి పిచ్చుకను చూసి ఎగతాళి చేసిందట. కాని వానొస్తే ఏముంది? ఉప్పు కరిగి కాకి దిక్కులేనిది అయ్యింది. పిచ్చుక మాత్రం వెచ్చగా తన బిడ్డలను జవురుకొని నిద్రపోయింది. పిచ్చుక సోషలిస్టు. దానికి ఎంత కావాలో అంతే తిని ఎగిరిపోతుంది.

ఆశ చాలా చెడ్డది అని చెబుతుంది. గిన్నెలో మరికొన్ని గింజలను వదలడం దానికి ఇష్టం. అందుకే పల్లీయులు దానిని చేరదీస్తారు. వసారాల్లో వరి కంకులనో జొన్న కంకులనో వేళ్లాడగడతారు. అవి వచ్చి తింటే ఆ తృప్తి వేరు. ‘పిచ్చుక మొడితే మంచిది’ అని పల్లెల్లో అనుకుంటారు. అది మొట్టడం అరుదు. ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’ మూర్ఖత్వం పాపం అనుకుంటారు. మనుషుల్లో అలాంటి అల్పప్రాణి కనిపిస్తే కనికరించాలని పిచ్చుకను చూసి నేర్చుకున్నారు. బంగారు బాతులాగే బంగారు పిచ్చుక కూడా పోలికకు వాడతారు. ‘కాకమ్మ పిచుకమ్మ కబుర్లు’ అంటారు కాని ఉద్దేశాలు లేని హాౖయెన కబుర్లు చెప్పుకుంటే మంచిది కదా పిచ్చుకమ్మల్లాగా.

అపాయం
తడి చెత్త, పొడి చెత్త అని అన్నీ కవర్లలో పెట్టి పారేస్తున్నాం. బావి దగ్గర గిన్నెలు కడిగి మెతుకులు నేలన పడేసేది లేదు. బియ్యం ఏరేది లేదు. అందులో నూకను పారేసేది లేదు. శ్లాబ్‌ వేసి ఇళ్లు కట్టుకుంటున్నాం. కిటికీలు తెరవకుండా మూసేస్తున్నాం. బోర్లు చల్లదనాన్ని ఇవ్వవు... స్థలాన్నీ ఇవ్వవు. ఫ్యాక్టరీల ద్వారా, కార్ల ద్వారా, ఏసిల ద్వారా, ఫోన్ల ద్వారా గాలిలో హానికారమైన రసాయనాలను తరంగాలను వదులుతున్నాం.

తిండి గింజల పంటలకు బదులు వ్యాపార పంటలు వేసి పిచ్చుకలు ఎంత దూరం ఎగిరినా ఏమీ దొరకని స్థితి తెస్తున్నాం. వాటిపై కొట్టిన రసాయనాలు తిని చచ్చిన పురుగులను తిని పిచ్చుకలు చచ్చిపోతున్నాయి. పిచ్చుకది పిచ్చుక ప్రాణం. తట్టుకోలేదు. అందుకే రచయితలు ‘చివరి పిచ్చుక’ అని కథలు కూడా రాశారు. పర్యావరణకారులు పిచ్చుకలను ఆదరించడానికి గూళ్లను ఏర్పాటు చేసే ప్రచారం చేస్తున్నారు. వాటికి కావాల్సిన గింజలు పెట్టమని, నీళ్లు పెట్టమని చైతన్యం కలిగిస్తున్నారు. రేడియేషన్‌ లేకుండా సెల్‌టవర్లను తగ్గించాలని ‘రోబో2.ఓ’ వంటి సినిమాలే వచ్చాయి. ఎంత పెద్ద భవంతి ఉన్నా దాని బాల్కనీలో మొక్కలు ఆ నీటి కుండీ పక్కన వాలేందుకు పిచ్చుకలు లేకపోతే ఆ సంపదకు అర్థమేమిటి?


ఒక చిన్ని బుజ్జి పిచ్చుక ఉదయాన్నే ‘ఎలావున్నావమ్మా వొదినా’ అని ఇంట్లోకి వచ్చి నిద్ర లేపేలా మన పరిసరాలు, ఊరు, నేల, భూగోళం ఉండాలని కోరుకొని ఆ విధంగా ఉండేలా ప్రయత్నించకపోతే మనం ఎలా ఉంటున్నట్టు. ఆలోచిద్దాం ఇవాళ్టి నుంచైనా. బయట ఎండగా ఉన్నట్టుంది.. వెళ్లి కొంచెం పిచ్చుకలకు గింజలు, నీళ్లు పెడదాం పదండి.

– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు