World Voice Day 2021: మీ గళం మీ మార్గం

16 Apr, 2021 00:09 IST|Sakshi

నేడు ప్రపంచ గళ దినోత్సవం

స్త్రీల గళాల వల్లే ఈ ప్రపంచం సంగీతమయం అయ్యిందంటే ఎవరూ కాదనకపోవచ్చు. భారతీయ మహిళ తన గొంతు వినిపించడం, తన మాటకు విలువ తెచ్చుకోవడం, తన గళంతో ఉపాధి పొందడం ఇంకా సంపూర్ణంగా సులువు కాలేదు. యాంకర్లు, డబ్బింగ్‌ ఆర్టిస్టులు, అనౌన్సర్లు, గాయనులు, రిసెప్షనిస్టులు, కాల్‌ సెంటర్‌ ఉద్యోగినులు... మంచి గొంతు వల్లే ఉపాధి పొందుతున్నారు.

నిత్య జీవితంలో గొంతు పెగల్చకుండా జీవనం సాగదు. ‘ప్రపంచ గళ దినోత్సవం’ మన గొంతును జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుంది. అంగీకారానికైనా అభ్యంతరానికైనా గొంతును సవరించమని కోరుతుంది. గొంతు నొప్పి వస్తే తప్ప గొంతును పట్టించుకోని మనం మన గళానికి ఏం ఇస్తున్నాం? మన గళంతో ఏం పొందుతున్నాం?

సీనియర్‌ నటి లక్ష్మితో నటుడు కమల హాసన్‌ ఒకసారి ‘మీరు రోజూ గుడ్‌ మార్నింగ్‌ చెప్తే చాలు... మీ గొంతు విని ఆ రోజంతా ఉత్సాహంగా గడిపేయగలను’ అన్నాడట. ఇది ప్రేమ ప్రకటన కాదు. ఒక మంచి గొంతు వింటే వచ్చే ఉత్సాహం గురించి. మంచి గొంతు కలిగి, అందులో ఉత్సాహం నిండి ఉంటే మనకు మనం పొందే వెలుగు సరే. జగానికి కూడా వెలుగు ఇవ్వవచ్చు.

గొంతు పై ఆంక్ష
భారతీయ సమాజంలో ‘ఆడది గడప దాటకూడదు. ఇంట్లో నోరు మెదపకూడదు’ అనే భావన అనేక శతాబ్దాలు రాజ్యమేలింది. ‘ఇంట్లో ఆడపిల్లా ఉందా లేదా అన్నట్టు ఆమె గొంతు వినిపించాలి’ అని అనేవారు. ఆడపిల్ల తనకో నోరు ఉన్నట్టు, ఆ నోటి నుంచి మాట రాగలదు అన్నట్టు ఉండటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. అబ్బాయిలకు. ఆ అబ్బాయి పెద్దయ్యి పురుషుడు అయితే అతని గొంతు అన్ని విధాలా అనుమతి ఉంటుంది. కాని స్త్రీకి మాత్రం కాదు. గొంతు ‘వాడిన’ స్త్రీని ‘గయ్యాళి’ అనడానికి సమాజం రెడీగా ఉండేది. అది కాదు ఆ గొంతును ప్రదర్శనకు పెట్టడం నామోషీగా దిగువ రకం స్త్రీలు చేసే పనిగా ప్రచారం చేశారు.

పాటలు పాడేవాళ్లను, నలుగురూ వినేలా కవిత్వం పలికే వారిని, వేదిక ఎక్కి ఏదైనా అభిప్రాయం చెప్పేవారిని సమాజం న్యూనత పరిచేలా చూసింది. సరిగా చెప్పాలంటే న్యూనతతో చూసింది. ఆడేపాడే స్త్రీలకు ఒక కులాన్ని, ఒక సమూహ స్వభావాన్ని ఏర్పాటు చేసింది. స్త్రీలు మెదడు ఉపయోగించరాదు. శారీరక బలాన్ని ఉపయోగించరాదు. మాటను కూడా ఉపయోగించరాదు. భర్తకు, కుటుంబానికి తప్ప తమ గొంతు ఎలా ఉంటుందో తెలుపకనే... వినిపించకనే గతించిపోయిన స్త్రీలు కోట్లాది మంది. పేరంటం పాటలు పాడటాన్ని కూడా చాలా బిడియంతో నిండిన విషయంగా సగటు స్త్రీలు భావించేవారంటే గొంతు విప్పడం గురించి ఎన్ని ఆంక్షలు ఉండేవో అర్థం చేసుకోవచ్చు.

మీ గొంతు మీ హక్కు
మనిషి మనుగడకు, ఉపాధికి గొంతు ఒక ప్రధాన సాధనం. అయితే ఆ గొంతుతో అవకాశం పొందే హక్కుదారు మొదట మగవాడే అయ్యాడు. స్త్రీల గొంతు ఇంటికే పరిమితమైంది. పెళ్లికి ముందు ఎంతో అద్భుతమైన గాయనులుగా గుర్తింపు పొందినవారు పెళ్లి తర్వాత ‘భర్తకు ఇష్టం లేదని చెప్పి’ తమ కెరీర్‌లను వదులుకున్నారు. మొదటి రేడియో అనౌన్సర్‌గా పని చేసే మహిళలు, మొదటి టీవీ అనౌన్సర్‌గా పని చేసే మహిళలు, ఆ తర్వాత టెలిఫోన్‌ ఆపరేటర్లు, రైల్వే అనౌన్సర్లు, డబ్బింగ్‌ ఆర్టిస్టులు, యాంకర్లు, ఇప్పుడు కాల్‌సెంటర్‌ ఉద్యోగినులు తమ గొంతు ను ఒక ఉపాధి చేసుకోవడానికి సుదీర్ఘ పయనం చేయాల్సి వచ్చింది. ఇవాళ రాజకీయ పార్టీలకు స్పోక్స్‌పర్సన్స్‌ దగ్గరి నుంచి విదేశాంగ వ్యవహారాలను తెలియచేసే ప్రతినిధుల వరకు స్త్రీలు తమ గొంతును, మాటను సమర్థంగా ఉపయోగించే స్థాయికి ఎదిగారు.

హేళనా బుద్ధి
స్త్రీలు చాడీలు చెప్పుకుంటారని, గోడకు ఈ పక్క ఆ పక్క నిలబడి గంటల కొద్దీ ఊసుపోని కబుర్లు చెప్పుకుంటారని హేళన చేసే కార్టూన్లతో జోకులతో వారిని పలుచన చేసే భావజాలం కొనసాగుతూనే ఉంది. బయట మాట్లాడే వీలు లేనప్పుడు, ఆఫీసుల్లో మాట్లాడే వీలులేనప్పుడు, చాయ్‌ హోటళ్లలో మాట్లాడే వీలు లేనప్పుడు, స్నేహబృందాలుగా కూచుని మాట్లాడుకునే వీలు లేనప్పుడు, ఇంట్లోనే ఉండక తప్పనప్పుడు స్త్రీలు గోడకు ఈ పక్క ఆ పక్క మాట్లాడక ఎక్కడ మాట్లాడతారు? మాటకు ముఖం వాచిపోయేలా చేసి ఆ తర్వాత వారు గంటల తరబడి మాట్లాడతారనడం ఎంత వరకు సబబో ఆలోచించాలి.

గొంతు ఆరోగ్యం
స్త్రీలు వయసు పెరిగే కొద్ది గొంతులో వచ్చే మార్పులను గమనించుకోవాలని ‘ప్రపంచ గళ దినోత్సవం’ సూచిస్తోంది. వినోద రంగంలో ఉండే స్త్రీలు, గొంతు ఆధారంగా ఉపాధి పొందే స్త్రీలు తమ గొంతు గురించి చైతన్యం కలిగించుకోవాల్సిన రోజే ‘ప్రపంచ గళ దినోత్సవం. పిల్లల గొంతు సమస్యలు గాని, స్త్రీల గొంతు సమస్యలు కాని నిర్లక్ష్యం చేయకుండా వైద్య సహాయం పొందాలని కోరుతుంది. 1999లో బ్రెజిల్‌ దేశంలో మొదలైన ప్రపంచ గళ దినోత్సవం నేడు ప్రపంచమంతా జరుపుకుంటోంది. ఇంట్లో ఆడపిల్ల అల్లరి చేస్తుంటే ‘ఏంటా గొంతు’ అని గద్దించే భావధారకు ఇవాళైనా స్వస్తి పలకాల్సిన అవసరాన్ని ఈ దినం ప్రత్యేకంగా గుర్తు చేస్తోంది.

– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు