ఆడపిల్లను ఊరూరూ తిప్పడమేంటి అనడంతో...

30 Jan, 2021 00:44 IST|Sakshi
దేవేంద్ర పాత్రలో సావిత్రి

కర్ణాటక సావిత్రి

మనకు మహానటి సావిత్రి తెలుసు.
ఈమె కర్ణాటక రంగస్థలంలో రాణిస్తున్న మంచినటి.
చిన్నప్పుడు సాధ్యం కాని తన అభీష్టాన్ని అరవై దాటిన తరవాత నెరవేర్చుకుంది.

పదేళ్ల వయసులో ఇంటినే యుద్ధరంగం చేసేది. కర్ర పుల్లనే కరవాలంగా చూసుకునేది. భీకర యుద్ధం చేస్తున్నట్లు నోటితో శబ్దాలు చేస్తూ యుద్ధఘట్టాన్ని రంజింపచేసేది. ముగియగానే ఓ పాట అందుకునేది. పాటకు తగ్గట్టు అభినయించేది. ఆ సన్నివేశాలన్నీ సావిత్రి అనే అమ్మాయి యక్షగానం మీద పెంచుకున్న ప్రేమకు చిహ్నాలు. ఆమె ఇష్టానికి తగ్గట్టు పెద్దవాళ్లు ఆమెకు యక్షగానంలో శిక్షణ ఇప్పించారు. పన్నెండు– పదమూడేళ్లు వచ్చేసరికి చిన్న చిన్న పాత్రలతో రంగస్థలం మీద అడుగుపెట్టడానికి సిద్ధమైన సావిత్రిని ‘పెద్దయిన ఆడపిల్లను యక్షగాన ప్రదర్శన కోసం ఊరూరూ తిప్పడమేంటి?’ అని ఆపేశారు. అలా తెరపడిన ఆమె నటకౌశలానికి అరవై ఆరేళ్ల వయసులో తనకు తానే తెర తీసుకుందామె. ఇప్పుడామె వయసు 77. ఈ పదకొండేళ్లలో వందకు పైగా నాటకాలు ప్రదర్శించింది రంగస్థల, యక్షగాన కళాకారిణి సావిత్రి.

అరవై... అయితేనేం?
ఈ సావిత్రిది కర్ణాటకలోని మంగుళూరు. తనకు ఇష్టమైన యక్షగాన ప్రదర్శనకు చిన్నప్పుడే అడ్డుకట్ట పడడంతో ఆమె ఆ తర్వాత చదువు మీదనే దృష్టి కేంద్రీకరించింది. స్కూల్‌ టీచర్‌ ఉద్యోగం వచ్చింది. టీచర్‌గా ఉద్యోగం చేస్తున్నప్పటికీ కళారంగానికి దూరం కాలేదు. భర్త శ్రీనివాసరావు నడిపిస్తున్న ‘మక్కల్‌ సాహిత్య సంగమ’కు సహకారం అందించేది. తన విద్యార్థులకు చిన్న నాటకాలు సాధన చేయించి పాఠశాల వార్షికోత్సవాల్లో ప్రదర్శిస్తుండేవారు. ఆ రకంగా తెర వెనుకే ఉంటూ తన కళాభిరుచిని నెరవేర్చుకునేది. రిటైర్‌ అయిన తర్వాత ఆమెకు ఆ వ్యాపకం కూడా లేకుండా పోయింది. అప్పుడు తీసుకుందామె ఓ నిర్ణయం. మంగుళూరులోని యక్షారాధన కళాకేంద్ర నిర్వహకులు సుమంగళ రత్నాకర్‌ను సంప్రదించి నాలుగైదు గంటల నిడివితో సాగే నాటకాలను కూడా అవలీలగా సాధన చే సింది.

పదేళ్లు గడిచేప్పటికి ఆమె వందవ నాటకాన్ని ప్రదర్శించారు. వాల్మీకి, దుర్యోధన, సుగ్రీవ, భీష్మ, ధర్మరాయ వంటి పౌరాణిక పాత్రల్లో చక్కగా ఇమిడిపోతారామె. ‘కరోనా కారణంగా నాటక ప్రదర్శనలు తగ్గాయి. లేకపోతే ఇప్పటికి మరో పాతిక ప్రదర్శనలిచ్చేదాన్ని. లాక్‌డౌన్‌ పోయి, అన్‌లాక్‌ మొదలైన తర్వాత కొద్దిపాటి నిడివితో ప్రదర్శనలు ఇస్తూ వాటిని డిజిటల్‌లో ప్రదర్శనలు ప్రసారం చేస్తున్నాం’ అన్నారు. అలాగే  ‘‘మనం మహిళలం కాబట్టి అలా చేయడం బాగుండదని... ఇలా చేస్తే ఎవరైనా నవ్వుతారేమోనని, మన వయసు ఇంత అని గుర్తు తెచ్చుకుంటూ పరిధులు గీసుకుంటూ పోతే మన కల ఎప్పటికీ నెరవేరదు. మన కలను మనమే సాకారం చేసుకోవాలి’’ అంటూ మహిళలకు మంచి సందేశమిచ్చారు.

మరిన్ని వార్తలు