Divya Gokulnath: ఆన్‌లైన్‌ టీచర్‌

5 Jun, 2021 05:49 IST|Sakshi
దివ్య గోకుల్‌నాథ్‌

టీచర్‌ కావాలన్నది ఆమె ఆశయం. అదొక్కటే కాదు, జీవితంలో ఎన్నో సాధించాలనుకున్నారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు వెదుక్కుంటూ వచ్చినా వెళ్లలేదు. తన సొంత దేశస్థులకు ఏదో ఒకటి చేయాలని కలలు కన్నారు.  అలా కన్న కలలను సాకారం చేసుకున్నారు. బైజూస్‌ కో ఫౌండర్‌ అయ్యారు. ఆన్‌లైన్‌ పాఠాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. శక్తిమంతమైన ఎంట్ర్‌ప్రెన్యూర్‌గా ఎదిగారు బెంగళూరుకు చెందిన దివ్య గోకుల్‌నాథ్‌.

భారతదేశంలోనే అతి పెద్ద ఎడ్‌ – టెక్‌ కంపెనీ బైజూస్‌. ఈ యాప్‌కి ఎన భై మిలియన్ల సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. ఏడాదిన్నరగా పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి సమయంలో ‘బైజూస్‌’ టీమ్‌ కొత్త కొత్త ప్రోడక్ట్స్‌ని తీసుకు వచ్చింది. ఉద్యోగులంతా వేరు వేరు ప్రాంతాలలో ఉంటూ ఈ ఏడాది కాలంలో పనులు చేస్తూ ఎన్నో విజయాలు సాధించేలా చేశారు ఈ సంస్థ కో ఫౌండర్‌ దివ్య గోకుల్‌నాథ్‌.

విద్యార్థిగా చేరి...
బైజూస్‌లో ఒక స్టూడెంట్‌గా చేరి కో ఫౌండర్‌ స్థాయికి ఎదిగారు. తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే అమలు చేయటం వల్ల ఈ అద్భుత విజయం సాధించగలిగారు. చదువుకునే రోజుల్లోనే దివ్య ఆల్‌రౌండర్‌గా ఎదగాలనుకున్నారు. ‘‘నేను బయో టెక్నాలజీ చదువుకునే రోజుల్లో మాకు సరైన అధ్యాపకులు లేకపోవటంతో, చాలా ఇబ్బంది పడ్డాం. ఒకరితో ఒకరు చర్చించుకుంటూ పాఠాలు నేర్చుకునేవాళ్లం. పాఠాలు చెప్పే వారు లేక విద్యార్థులు ఇబ్బంది పడకుండా ఉండేలా ఏదో ఒకటి చేయాలని అప్పుడే ఒక నిశ్చయానికి వచ్చాను’’ అంటారు దివ్య గోకుల్‌నాథ్‌.

టీచర్‌గా మొదటి రోజు..
బైజూలో విద్యార్థిగా చేరి, ఆ తరవాత అక్కడ టీచర్‌ని అయ్యాను. నేను టీచర్‌ కావాలనుకున్న నా కల అలా నెరవేరింది. మొదటి రోజు క్లాసు తీసుకున్నప్పుడు క్లాసులో వందమంది విద్యార్థులు ఉన్నారు. వారంతా నా కంటే రెండు మూడు సంవత్సరాలు మాత్రమే చిన్నవారు. నేను టీచర్‌లా కనిపించటం కోసం ఆ రోజున క్లాసుకి చీర కట్టుకుని వెళ్లాను. అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. ఆ రోజు పాఠం చెబుతుంటే ఎంతో సంతృప్తిగా అనిపించింది’ అంటారు దివ్య టీచర్‌గా తన మొదటి అనుభవం గురించి. విదేశాలలో పెద్దపెద్ద విశ్వవిద్యాలయాలలో చదువుకోవటానికి వచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు.

ఇంజినీరింగ్‌ చదివేటప్పుడు బయోటెక్నాలజీ చెప్పడానికి అనుభవజ్ఞులైన అధ్యాపకులు లేకపోవటంతో పడిన ఇబ్బందులను దివ్య గోకుల్‌నాథ్‌ మరచిపోలేదు. తనలా ఏ ఒక్క విద్యార్థి ఇబ్బంది పడకూడదనుకున్నారు. ‘ఆఫ్‌లైన్‌ టెస్ట్‌ ప్రిపరేషన్‌ క్లాసులు మానేసి, ఆన్‌లైన్‌ క్లాసులను దేశంలోని మారుమూలలకు సైతం తీసుకువెళ్లాలని మా బైజులో నిర్ణయించుకున్నాం. ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. 2015లో యాప్‌ లాంచ్‌ చేశాం. ఇందులో ర్యాంకులు, క్లాసులో టాపర్లు వంటివి ఉండవు. ఇందులో విజయం సాధించగలమని, మా ప్రోడక్టు మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. అన్నింటికీ మించి కుటుంబ సభ్యుల సంపూర్ణ మద్దతు ఉంది’’ అంటారు దివ్య గోకుల్‌నాథ్‌.

చిత్తశుద్ధి ఉండాలి..
స్టార్టప్‌లకు కావలసింది చిత్తశుద్ధి. ఏ స్టార్టప్‌ అయినా, కస్టమర్‌కి చాలా వేగంగా స్పందించడం ముఖ్యం. తొలిదశలో ఎంతమంది ఆదరిస్తున్నారనేది కాదు. పనిలో శ్రద్ధ చూపిస్తే విజయం దానంతట అదే నడుచుకుంటూ వస్తుంది. ఒక నిర్ణయం తీసుకోవటం, ఆచరణలో పెట్టడం వెంట వెంటనే జరిగి పోవాలి. ఆలస్యం చేస్తే నిరుపయోగం.. అని నమ్ముతారు దివ్య గోకుల్‌నాథ్‌. ‘‘నేను, బైజు... మా ఇద్దరి దార్శనికత, ప్రాధాన్యతలు ఒకేలా ఉంటాయి. మా విజయం వెనుక ప్లేబుక్‌ ఏమీ లేదు. ఈ పాండమిక్‌ సమయంలో, కేవలం ఆరు మాసాల వ్యవధిలో సుమారు 35 మిలియన్ల మంది మా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. ఇప్పుడు మా దగ్గర 80 మిలియన్ల మంది లెర్నర్స్‌ ఉన్నారు. మేం ఒక్కో అడుగు ఎదుగుతున్నాం’’ అంటూ తమ విజయం గురించి చెబుతారు దివ్య గోకుల్‌నాథ్‌.

ఎన్నో ఆశయాలు, ఆలోచనతో కృషి చేస్తున్న దివ్య గోకుల్‌నాథ్‌... భారతదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా తమ సేవలు విస్తరించాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు