అందాల తార జయప్రద గురించి ఈ విషయాలు తెలుసా..?

3 Apr, 2021 18:08 IST|Sakshi

నేడు(ఏప్రిల్‌ 3) జయప్రద జన్మదినం

ఆమె ఆరేసుకుంటే ప్రేక్షకుడు మనసు పారేసుకున్నాడు. ఈమెతోనే రజనీకాంత్‌ ‘ఇంక ఊరేల.. సొంత ఇల్లేల ఓ చెల్లెలా’ అన్నది. కమలహాసన్‌ కళ మద్యపు మురుక్కాలవలో పారుతుంటే ఈమె కదూ దానిని ‘సాగర సంగమం’ చేయించింది. ‘భారతీయ వెండితెర మీద అంత అందమైన ముఖం మరొకటి లేదు’ అని సత్యజిత్‌ రే పొగిడిన ఏకైక తెలుగు అందం జయప్రదది. ఆమె రాజకీయ ప్రస్థానం ఒకదారి. ఆమె నటనదే ప్రేక్షకుల గుండెదారి.

జయప్రద... జయసుధ.. శ్రీదేవి తెలుగు సినీ జగత్తును ఏలిన ఈ ముగ్గురు హీరోయిన్లు ఒకటి రెండు సంవత్సరాల తేడాతో స్టార్లు అయ్యారు. తెలుగు మాట, తెలుగు ఆట, తెలుగు సౌందర్యం తెర మీద చూపారు. శ్రీదేవి గ్లామర్‌లో బెస్ట్‌. జయసుధ యాక్టింగ్‌లో బెస్ట్‌. జయప్రద ఇటు గ్లామర్, అటు యాక్టింగ్‌ రెంటిలోనూ బెస్ట్‌ అనిపించుకున్నారు.

రాజమండ్రికి చెందిన లలిత రాణి ‘భూమి కోసం’ (1974)లో మొదటిసారి తెర మీద రెండు మూడు నిమిషాల సేపు కనిపించారు. ఒక పాట మధ్యలో ఒక వితంతువు తనను చెరబట్టే కామందును హతమారుస్తుంది. ఆ వితంతువు జయప్రద. మొట్టమొదటి వేషం అలాంటిది ఎవరూ వేయరు. కాని జయప్రద చేశారు. ఆ సినిమాలోనే పేరు మార్చుకుని అప్పట్లో ‘జయ’ ట్రెండ్‌ నడుస్తున్నందున జయప్రదగా మారారు. ఆమె పెదవి మీద  పుట్టుమచ్చ ఉంటుంది. వెండితెర మీద ఒక అందమైన పుట్టుమచ్చగా ఆమె ప్రేక్షకులకు నచ్చింది.

తరం మారుతున్నప్పుడు కొత్త తరం వస్తుంది. వాణిశ్రీ, లక్ష్మి, మంజుల, లత... వీరు సీనియర్లు అవుతున్న కొద్దీ కొత్తవాళ్లు కావాల్సి వచ్చారు. జయప్రద ఆ సమయంలోనే మద్రాసులో అడుగుపెట్టారు. ఏకంగా కె.బాలచందర్‌ దృష్టిలో పడ్డారు. ఆమె తమిళంలో తీసిన ‘అవల్‌ ఒరు తోడర్‌ కథై’లో సుజాత చేసిన పాత్రను జయప్రదకు ఆఫర్‌ చేశారాయన. సుజాతకు అప్పటికి తెలుగు రాదు. అచ్చతెలుగు అమ్మాయి ఉంటేనే బాగుంటుందని బాలచందర్‌ ఆలోచన. అందుకు జయప్రద సరైనది అని ఆయన భావించారు.

ఒక మధ్యతరగతి గంపెడు సంసారాన్ని తన భుజాల మీద మోసే, తన కలలను చిదిమేసుకుని కుటుంబం కోసం బతికే ఒక సగటు ఆడపిల్ల కథ అది. దాని బరువు ఎక్కువ. జయప్రదది ఆ సమయానికి చిన్న వయసు. కాని ఆమె ఆ పాత్రను అర్థం చేసుకొని పోషించడంతో... ఒక్క కేరెక్టర్‌లోనే ప్రేమ, కోపం, ఆర్తి, అసహనం చూపడంతో జయప్రద స్టార్‌ అయ్యారు. ఆ సినిమాయే తెలుగులో రజనీకాంత్‌కు కూడా తొలి సినిమా. ఆ సినిమాలో ‘దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి పాట’... ఏసుదాస్‌కు, జయప్రదకు, రజనీకాంత్‌కు నేటికీ మిగిలిపోయింది. కె.బాలచందర్‌ దర్శకత్వంలో ఆమె ‘47 రోజులు’, ‘అందమైన అనుభవం’ చేశారు. కేన్సర్‌ పేషెంట్‌గా చేయడానికి ఎవరు ఒప్పుకుంటారు? జయప్రద తప్ప.

‘అడవి రాముడు’తో కె.రాఘవేంద్రరావు జయప్రదను కమర్షియల్‌ హీరోయిన్‌ను చేశారు. అప్పటికే జయప్రద కుటుంబం ఎన్‌.టి.ఆర్‌కు పరిచయం ఉంది. కొన్నాళ్ల క్రితం సెలవుల్లో వచ్చి ఆయన దగ్గర కూచుని కబుర్లు చెప్పిన స్కూల్‌ గర్ల్‌ ఇప్పుడు ఆయన పక్కనే హీరోయిన్‌ అయ్యింది. వేటూరి రాయగా కె.వి.మహదేవన్‌ స్వరపర్చగా బాలూ, సుశీల పాడిన ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ పాట జయప్రదను సకల ప్రేక్షకులకు పరిచయం చేసేసింది.

జయప్రద అంటే ఒక సుందరమైన సౌందర్యవంతమైన రూపం. ప్రేక్షకులు అలానే కోరుకున్నారు. ఆమె నేటికీ అలానే ఉన్నారు. ఇప్పుడు ఆమె ఒక తెలుగు సినిమా లో నటిస్తున్నారు. మరోసారి జయప్రద జయప్రదంగా మన ముందుకు రావాలని కోరుకుందాం.

– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు