ఆ ముగ్గురు ఇండియాను గెలిపించారు

21 Jan, 2021 00:21 IST|Sakshi
తల్లి షబానా బేగంతో సిరాజ్‌; భార్య ప్రీతితో రవిచంద్రన్‌ అశ్విన్‌; అక్క శైలజతో వాషింగ్టన్‌ సుందర్‌

మాతృమూర్తి.. జీవిత భాగస్వామి.. సోదరి..

జాత్యహంకారం. కించపరిచే మాటలు. ఒళ్లంతా గాయాలు. అంతిమంగా.. ఒక ఘన విజయం. ముప్పై రెండేళ్ల తర్వాత ఆస్ట్రేలియాలోని ‘గాబా గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాపై ఇండియా గ్రౌండ్‌ బ్రేకింగ్‌ విక్టరీ సాధించింది. 2–1తో టెస్ట్‌ సిరీస్‌ గెలుచుకుంది. ముగ్గురు హీరోలు. మొహమ్మద్‌ సిరాజ్‌. అతడి వెనుక ఉన్న జీవ శక్తి అతడి తల్లి షబానా. ఇంకో హీరో రవిచంద్రన్‌ అశ్విన్‌. ఫస్ట్‌ సిరీస్‌లో రన్స్‌ కోసం ఒళ్లంతా హూనం చేసుకున్నాడు. భార్య ప్రీతి అతడికి ఊరడింపుగా నిలబడ్డారు. వన్‌ మోర్‌ హీరో వాషింగ్టన్‌ సుందర్‌. సిరీస్‌లో మూడో రోజు అతడు తీసిన పరుగులే టీమిండియాకు తక్షణ శక్తి! అతడి వెనుక ఉన్న శక్తి మాత్రం సోదరి శైలజ! ఈ ముగ్గురు హీరోలు ఇండియాను నిలబెడితే, వారిని ఈ ముగ్గురు మహిళలు నిలబెట్టినవారయ్యారు.

అడిలైడ్‌లో ఓటమి. మెల్‌బోర్న్‌లో గెలుపు. సిడ్నీలో మ్యాచ్‌ డ్రా. గాబాలో గెలుపు. ఇండియా 2–1తో చరిత్రాత్మక విజయం సాధించింది. టీమిండియాలోని మొహమ్మద్‌ సిరాజ్‌ ఇండియన్‌ ఫాస్ట్‌ బౌలర్‌. హైదరాబాద్‌ కుర్రాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో ఐదు వికెట్‌లు తీసుకున్నాడు! హీరో అయ్యాడు. కానీ తన కొడుకు హీరో అవడం తండ్రి చూడలేకపోయాడు. టీమిండియా ఆస్ట్రేలియాలో ల్యాండ్‌ అవగానే ఇక్కడ ఇండియాలో సిరాజ్‌ తండ్రి చనిపోయారు. టెస్ట్‌ మ్యాచ్‌ లో కొడుకు హీరో అవాలని కాదు ఆ తండ్రి కలగంది. అసలంటూ టెస్ట్‌ మ్యాచ్‌లోకి అడుగుపెట్టాలని. సిరాజ్‌ తండ్రి ఆటో డ్రైవర్‌. తల్లి గృహిణి. ఆయన ఇంటిని నడిపాడు. ఆమె సిరాజ్‌ను క్రికెటర్‌గా నడిపించారు.

గాబాలో మొన్న ఇండియా ఘన విజయం సాధించగానే.. ‘‘సిరాజ్‌ క్రికెటర్‌ కావాలన్న మా నాన్న కలను మా అమ్మ నిజం చేసింది. నాన్న చనిపోయినప్పుడు సిరాజ్‌ గుండెను దిటవు పరచింది అమ్మే. సిరాజ్‌ కెరీర్‌లో అమ్మది కీలకమైన పాత్ర’’ అని సిరాజ్‌ సోదరుడు (అన్న) మొహమ్మద్‌ ఇస్మాయిల్‌ అన్నారు. సిరాజ్‌ తల్లి షబానా బేగం. ఆస్ట్రేలియా లో ఉన్న సిరాజ్‌ను తండ్రి మరణం నుంచి తేరుకునేలా చేయడానికి అతడితో రోజూ కనీసం రెండు గంటలైనా మాట్లాడేవారు, ధైర్యం చెప్పేవారు. మనిషి రాటు తేలినట్లు ఉంటాడు కానీ సిరాజ్‌ వట్టి ఉద్వేగ ప్రాణి. మహా సున్నితం. సిడ్నీ మ్యాచ్‌ లో టీమిండియా జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు తండ్రి గుర్తుకు రావడంతో సిరాజ్‌ కళ్లలో నీళ్లు ఉబికివచ్చాయి. ‘హి గాట్‌ ఎమోషనల్‌’ అని బీసీసీఐ ట్వీట్‌ చేసింది.
∙∙
ఆస్ట్రేలియా టూర్‌లో ఇంకో హీరో రవిచంద్రన్‌ అశ్విన్‌. ఆల్‌ రౌండర్‌. చెన్నై ప్లేయర్‌. సిడ్నీ మ్యాచ్‌ డ్రా అయి ఇండియా గట్టెక్కింది ఇతడి వల్లనే. ఆ మ్యాచ్‌లో ఏకధాటిగా మూడు గంటలపాటు బ్యాటింగ్‌ చేసి 128 బాల్స్‌కి 39 రన్స్‌ తీశాడు. ఆ మాత్రానికైనా అతడు చెల్లించవలసి వచ్చిన మూల్యం ఒళ్లు హూనం చేసుకోవడం. కష్టపడ్డాడు. ‘‘భరించలేనంత వెన్నునొప్పితో ఆయన నిద్రపోలేకపోయారు. నిలవడం, కూర్చోవడం కూడా కష్టమైపోయింది. వంగి షూ లేస్‌లను కూడా కట్టుకోలేకపోయారు. ఆ నొప్పితోనే అద్భుతంగా ఆడారు’’ అని అశ్విన్‌ భార్య ప్రీతి ట్వీట్‌ చేశారు.

అందుకు అశ్విన్‌ ఒక కన్నీటి ఎమోజీ, చేతులు జోడించిన రెండు ఎమోజీలు పెట్టి ‘‘ఇన్‌స్టెంట్‌ టియర్స్‌. థ్యాంక్స్‌ ఫర్‌ బీయింగ్‌ విత్‌ మి త్రూ ఆల్‌ దిస్‌’’ అని రీ ట్వీట్‌ చేశారు. ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ తన భర్తను స్లెడ్జ్‌ చేసిన సంగతిని కూడా ఆమె బాగానే గుర్తుపెట్టుకుని ఇండియా గెలిచాక అంతకంతా తీర్చుకున్నారు. ‘‘గాబాలో చూసుకుందాం’ అని టిమ్‌ పెయిన్‌ తన భర్తను స్లెడ్జ్‌ (తక్కువ చేసి మాట్లాడ్డం) చేసినందుకు ప్రతీకారంగా ఆమె ‘గాబాలో చూసుకుందాం’ అనే మాటతో ట్విట్టర్‌ లో ప్రస్తావిస్తూ భారత విజయాన్ని సెలబ్రేట్‌ చేశారు. టీమిండియాను తన కూతురు ఉల్లాస పరుస్తున్న వీడియోను కూడా షేర్‌ చేశారు.
∙∙
టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా గెలుపునకు కారణం అయిన మరో ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌. ఇతడిది కూడా చెన్నై. తొలి ఇన్నింగ్స్‌లోనే స్మిత్‌ సహా మూడు వికెట్‌లు పడగొట్టాడు. సిరీస్‌లో మూడో రోజు 62 పరుగులు తీసి జట్టుకు తక్షణ శక్తిని అందించాడు. రెండో ఇన్నింగ్‌లో కూడా ఒక వికెట్‌ తీసుకున్నాడు. కీలక దశలో 22 పరుగులు తీశాడు. కెరీర్‌లో సుందర్‌ వెనుక ఉన్న శక్తి, స్ఫూర్తి అతడి అక్క శైలజ. ‘‘మా తమ్ముడిని చూసి ఆర్నెల్లు అయింది.

వాడి రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను’’ అని ఇండియా గెలిచిన సందర్భంలో తన కామెంట్‌ అడిగేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులతో శైలజ అన్నారు. ఈ అక్కాతమ్ముడికి ‘సూపర్‌ సిబ్లింగ్స్‌’ అని పేరు. ఏ ఫొటోలో అయినా అక్క పక్కనే తమ్ముడు. అక్కే తమ్ముడి ప్రపంచం. ఆమె పుట్టిన రోజుకు ‘హ్యాపీ బర్త్‌డే మై వరల్డ్‌’ అని శుభాకాంక్షలు తెలిపే ఈ క్రికెటర్‌కు ఆట–అక్క సమాన ప్రపంచాలు. శైలజ కూడా క్రికెటరే.              

సిరాజ్‌ క్రికెటర్‌ కావాలన్న మా నాన్న కలను మా అమ్మ నిజం చేసింది. నాన్న చనిపోయినప్పుడు సిరాజ్‌ గుండెను దిటవుపరచింది అమ్మే. సిరాజ్‌ కెరీర్‌లో అమ్మది కీలకమైన పాత్ర.
– సిరాజ్‌ సోదరుడు ఇస్మాయిల్‌

మొహమ్మద్‌ సిరాజ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, వాషింగ్టన్‌ సుందర్‌

మరిన్ని వార్తలు