ప్రమాణ స్వీకారం సూట్‌లోనా? చీరలోనా?

20 Jan, 2021 04:42 IST|Sakshi
కమలా హ్యారిస్‌ : అమెరికా ఉపాధ్యక్షురాలిగా నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. (ఫైల్‌ ఫొటో)

ఇంకొద్ది గంటల్లో కమలా హ్యారిస్‌ అమెరికా ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ఆ ఆగ్రరాజ్యానికి వైస్‌–ప్రెసిడెంట్‌ అవుతున్న తొలి మహిళగా కమల ఈ చరిత్రాత్మకమైన కార్యక్రమానికి ఎలాంటి దుస్తులను ధరించి వస్తారు? అమెరికన్‌ పౌరురాలిగా అక్కడి సంస్కృతిని ప్రతిబింబించే ప్యాంట్‌ సూట్‌ను, బౌబ్లవుజును వేసుకుంటారా? లేక భారతీయ సంస్కృతిని ప్రతిఫలించే లా చీరకట్టుతో కనిపించబోతున్నారా? అమెరికాలోని భారతీయ ఫ్యాషన్‌ డిజైనర్‌లు.. ఆమె చీర ధరిస్తే బాగుంటుందనీ, అందులోనూ అందమైన బనారస్‌ చీరను కట్టుకుంటే భారతీయాత్మ ఉట్టిపడటంతో పాటు, నల్లజాతి ప్రజల మనోభావాలను గౌరవించినట్లు కూడా ఉంటుందనీ అంటున్నారు. ఏమైనా ఛాయిన్‌ కమలా హ్యారిస్‌దే. 

ఎన్నికల ఫలితాలు వచ్చాక గత నవంబరులో తొలిసారి ప్రజల ముందుకు అభివాదం చేయడానికి వేదిక మీదకు వచ్చినప్పుడు కమలా హ్యారిస్‌ తెలుపు రంగు ప్యాంట్‌సూట్‌లో, బౌ బ్లవుజులో ఉన్నారు. ఉపాధ్యక్ష విజేతగా ప్రత్యేకతను ఏమీ కనబరచలేదు. అమెరికన్‌ మహిళలు నూరేళ్ల క్రితం పోరాడి సాధించుకున్న ఓటు హక్కు వల్లనే మహిళలు రాజకీయాల్లోకి రావడం సాధ్యమయిందనీ, తన గెలుపు కూడా నాటి మహిళ వేసి బాటేనని కమల అన్నారు. ఆ తర్వాత అమెరికన్‌ ప్రజలకు, అమెరికాలో స్థిరపడిన ఇతర దేశాల ప్రజలకు అభివందనాలు తెలియజేశారు. అసలు ఆ కార్యక్రమానికే కమల చీరకట్టుకుని వస్తారని అక్కడి దక్షిణాసియా ప్రజలు, మన భారతీయులు కూడా భావించారు. భావించడం కాదు. ఆశించారు. 
కుటుంబ సభ్యులతో చీరలో కమల (పైన వరుసలో ఎడమవైపు) 

ఇవాళ అంతకన్న ముఖ్యమైన కార్యక్రమానికి కమల హాజరవుతున్నారు. నవంబర్‌లో జరిగింది ప్రజలకు ధన్యవాదాలు తెలిపే ఈవెంట్‌ అయితే, నేడు జరుగుతున్నది పదవీ స్వీకార మహోత్సవం. స్వీకారం అయిన వెంటనే అమెరికా ఈ ఉపాధ్యక్షురాలి చేతిలోకి వెళ్లిపోతుంది. ఇక్కడి నుంచి నాలుగేళ్ల పాటు కమలా హ్యారిస్‌ అమెరికాలోని అన్ని దేశాలవారినీ కలుపుకునే పోయే పాలనా విధానాలు అనుసరిస్తారు. ఆ మాటను ఎన్నికల ప్రచారంలోనే చెప్పారు కమల. అమెరికాకు తొలి ఉపాధ్యక్షురాలు అయిన కమల అమెరికన్‌ అయినప్పటికీ.. ఆఫ్రికా దేశాలకు, దక్షిణాసియా దేశాలకు ఆడబిడ్డ. దక్షిణాసియా ప్రజలకైతే తన ఫ్యామిలీ ఫొటోలో చీర ధరించి ఉన్న కమల మరింతగా దగ్గరయ్యారు. ఆ ఫొటో చూశాక అమెరికాలోని దక్షిణాసియా ఫ్యాషన్‌ డిజైనర్‌లు, సాధారణ ప్రజలు కమలను నేటి ప్రమాణ స్వీకారంలో కూడా చీరతోనే చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. 

అమెరికాలోని మైనారిటీలు.. మరీ ముఖ్యంగా భారతీయులు.. కమల చీర ధారణ ద్వారా మన సంస్కృతికి ప్రాధాన్యం లభించాలని కోరుకుంటుంటే.. ఫ్యాషన్‌ డిజైనర్‌లు చీరకు ఉన్న ‘పవర్‌’ గురించి మాట్లాడుతున్నారు. ఫ్యామిలీ ఫొటోలో కమల చిరునవ్వులు చిందిస్తూ, స్ఫూర్తివంతంగా కనిపిస్తున్నారు. ఆ ‘ఫీల్‌’ ఇప్పుడు కాపిటల్‌ హిల్‌ భవంతి ప్రమాణ స్వీకార వేదికను కూడా వెలిగిస్తుందని వారు నమ్ముతున్నారు. అయితే ఇంతవరకు కమల నేటి తన ‘బిగ్‌ డే’కి ఏ డ్రెస్‌లో వస్తున్నారో, ఏ కలర్స్‌తో వస్తున్నారో ఎవరి దగ్గరా సమాచారం లేదు. ఇటీవల వోగ్‌ ఫ్యాషన్‌ మ్యాగజీన్‌ కవర్‌ పై వేర్వేరుగా రెండు ఫొటోలలో రెండు రంగుల ప్యాంట్‌ సూట్‌లో కనిపించారు కమల. ఒకటి బ్లాక్‌ కలర్‌. ఇంకోటి బ్లూ కలర్‌. బ్లాక్‌లో కంటే బ్లూలో ఆమె బాగున్నారని నెటిజన్‌లు అన్నారు కనుక నేడు కమల బ్లూ కలర్‌ సూట్‌లో కనిపించే అవకాశాలు ఉండొచ్చు. చీర గురించి మాత్రం ఎవరూ ఏమీ ఊహించలేకున్నారు. బెనారస్‌ శారీ ఆమెకు ఉపాధ్యక్ష స్థాయి హోదాను, హూందాతనాన్ని ఇస్తుందని డిజైనర్‌లు ఒకరిద్దరు ఇప్పటికే తమ ఇంటర్వ్యూలలో అన్నారు.

2019 డిసెంబర్‌కు కొన్ని నెలల ముందు తనే స్వయంగా డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థిగా అధ్యక్ష పీఠానికి పోటీలో ఉన్న కమల (ఆ తర్వాత తగినంత ఫండింగ్‌ లేదని పోటీ నుంచి వైదొలిగారు) ను నెవడాలో కొందరు ఆసియా ప్రజలు.. ‘‘ఒకవేళ మీరు అధ్యక్షురాలిగా నెగ్గితే భారతీయ సంప్రదాయమైన చీరకట్టుకు మారిపోతారా?’’ అని అడిగారు. అందుకు కమల చెప్పిన సమాధానం ఆమె రాజకీయ పరిణతికి నిదర్శనంగా నిలిచింది. ‘‘మన పేరు పక్కన ఉన్న ఇంటి పేరేమిటన్న దానిని బట్టి కాదు, మనం ఉన్న దేశాన్ని బట్టి అందరం కలిసి వేడుకల్లో పాల్గొనాలి’’ అన్నారు కమల. ఆ సమాధానాన్ని బట్టి చూస్తే ఇవాళ కమలా హ్యారిస్‌ను మనం ప్యాంట్‌ సూట్‌లోనే చూడబోతాం. ఒకవేళ ఆమె చీరలో కనిపిస్తే కనుక ఆమె ప్రమాణ స్వీకారం ఒక భారతీయ ఉత్సవమే అవుతుంది.                         

అందంగా నేసిన బెనారస్‌ చీరలో కమలా హ్యారిస్‌ కనిపించినా ఆశ్చర్యం ఏమీ లేదు. ప్రమాణ స్వీకారానికి ఆమె చీర ధరిస్తే.. సంస్కృతుల సమైక్య భావనకు తనొక సంకేతం ఇచ్చినట్లు అవుతుంది కూడా. 
– విభు మహాపాత్ర, ఇండో–అమెరికన్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌

కమల చీర కట్టుకుని ఉన్న ఫ్యామిలీ ఫొటో చూశాను. నాకు మా అమ్మ, అక్కచెల్లెళ్లు, మేనకోడళ్లు.. ఇంకా మా కుటుంబంలోని ఆడవాళ్లను చూసినట్లే అనిపించింది. మాతృస్వామ్యంలోని శక్తిని, అధికారాన్ని ఆ ఫొటో ప్రతిబింబిస్తోంది. కమలా హ్యారిస్‌ చీర కట్టుకుని ప్రమాణ స్వీకారంలో కనిపిస్తే అమెరికాలోని దక్షిణాసియా సంతతి వారికి ఆమె తమ మనిషి అనే ఒక నమ్మకమైన భావన కలుగుతుంది. 
– ప్రబల్‌ గురంగ్, నేపాలీ–అమెరికన్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌

కమలా హ్యారిస్‌ కనుక చీరలో ప్రమాణ స్వీకారం చేస్తే అదొక దౌత్యపరమైన స్నేహానికి చిహ్నంగా నిలుస్తుంది. అమెరికాకు, అక్కడి నాన్‌–అమెరికన్‌లకు మధ్య తన పాలన ద్వారా బలమైన సహజీవన వారధిని ఆమె నిర్మించబోతున్నారన్న భరోసా అక్కడి ప్రజలకు లభించినట్లవుతుంది.
– నీమ్‌ ఖాన్, ఇండో–అమెరికన్‌ ఫ్యాషన్‌ డిజైనర్‌ 

మరిన్ని వార్తలు