పాఠాలు నేర్పిన స్త్రీ పాత్రలు

31 Dec, 2020 01:12 IST|Sakshi

2020 స్త్రీ పాత్రల రౌండప్‌ ఇది.

‘చెంపదెబ్బే’ కదా అని అన్ని పాత్రలు అంటాయి. ‘చెంప దెబ్బ అయినా సరే’ అని ‘థప్పడ్‌’ సినిమాలో తన గౌరవ మర్యాదలకు భంగం కలిగించే భర్త నుంచి విడాకులు తీసుకుంటుంది స్త్రీ పాత్ర. భర్త పండు ముసలివాడైపోయినా సరే అతని కుత్సిత బుద్ధిని క్షమించలేక అతి వృద్ధురాలైన అతని భార్య మరొకరితో వివాహాన్ని కోరుకుంటుంది ‘గులాబో సితాబో’లో. ‘నా మేధను నేను కొనసాగిస్తాను కుటుంబ అడ్డంకులను తొలగించుకునైనా సరే’ అని ‘శకుంతలా దేవి’ పాత్ర మనకు చెబుతుంది. ‘యాసిడ్‌ దాడి నా భవిష్యత్తుకు ముగింపు కాదు’ అని ఆశను ఇస్తుంది ‘చపాక్‌’లోని ఒక పాత్ర. బాలీవుడ్‌ పైకి చూడటానికి నాలుగు డబ్బులు సంపాదించే రంగంగా కనిపించొచ్చు. కాని అది తయారు చేసి వదులుతున్నస్త్రీ పాత్రలు చాలా గట్టి పాఠాలు చెప్పేలా ఉంటున్నాయి. తప్పులు సరిచేసుకోమని పురుషులకు బోధ చేస్తున్నాయి.

నేర్చుకోవాలనుకునే మగవారు తక్కువగా ఉన్నా నేర్పే ప్రయత్నాలు సాగుతూనే ఉంటాయి వారికి స్త్రీల గురించి. సమాజం కొన్ని పాఠాలు చెబుతుంది. సాహిత్యం కొన్ని పాఠాలు చెబుతుంది. సినిమా కూడా కొన్ని పాఠాలు చెబుతుంది. స్త్రీని గౌరవించడం, స్త్రీ అభిప్రాయాలకు సమాన భూమికను ఏర్పరచడం, స్త్రీ మనోభావాలను గమనించడం పురుష ఆధిపత్యం ఉండే ఈ సమాజంలో ఎప్పటికప్పటి పాఠాల ద్వారానే సాధ్యమవుతుంది. గత నాలుగైదేళ్లుగా స్త్రీల స్వావలంబనను, స్వేచ్ఛను, స్వతంత్రాన్ని, మూసకు తలవొంచని పట్టుదలను, లైంగిక మర్యాదలను వ్యక్తం చేసే స్త్రీ పాత్రలు బాలీవుడ్‌లో అనేకం వస్తున్నాయి. స్త్రీలను మరింతగా అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నాయి. 2020 కూడా అందుకు మినహాయింపు కాదు. లాక్‌డౌన్‌ వల్ల నేరుగా సినిమాలు విడుదల కాకపోయినా ఓటిటిల ద్వారా విడుదలైన సినిమాలు స్త్రీలకు సంబంధించి గట్టి స్టేట్‌మెంట్‌లు ఇచ్చాయి.

చెంపదెబ్బపై చూపుడువేలు
2020 విడుదలైన సినిమాలలో గట్టి చర్చ లేవదీసిన సినిమా ‘థప్పడ్‌’. ఇళ్లల్లో అతి సాధారణంగా స్త్రీలు తినే చెంపదెబ్బను వేలెత్తి చూపిన సినిమా ఇది. ఈ సినిమాలో భార్యను భర్త చెంపదెబ్బ కొడతాడు. భర్త మంచివాడే. అత్తామామలు మంచివారే. ఇల్లూ మంచిదే. కాని చెంపదెబ్బ కొట్టడం మాత్రం మంచిది కాదు అనుకుంటుంది ఆ భార్య. విడాకులు కోరుతుంది. ‘చెంపదెబ్బే కదా’ అంటారు అందరూ. ఏ కొడుకూ తన తండ్రిని తల్లిని చెంపదెబ్బ కొట్టడు. భార్యను మాత్రం కొట్టొచ్చు అనుకుంటాడు. తండ్రిని కొట్టి ‘చెంపదెబ్బే కదా’ అనలేనప్పుడు అంతే సమాన గౌరవం ఇవ్వాల్సిన భార్యను మాత్రం ఎందుకు కొట్టాలి. గృహహింస అంటే రాచి రంపాన పెట్టడం కాదని, స్త్రీ తన ఆత్మగౌరవానికి భంగం కలిగిందని భావించే చెంపదెబ్బ కూడా చాలునని ఈ సినిమా చెప్పింది. తాప్సీ పన్ను ఈ పాత్ర పోషించింది.

ఎగరడానికి రెక్కలు
‘ఇది పురుషుల స్థలం. ఇక్కడ స్త్రీలకు చోటు లేదు’ అంటాడు ఎయిర్‌ఫోర్స్‌లో ఒక పురుష ఆఫీసర్‌ గుంజన్‌ సక్సేనాతో.

ఉమన్‌ పైలెట్‌ కావాలని ఎయిర్‌ ఫోర్స్‌లో చేరిన గుంజన్‌ సక్సేనాకు అక్కడ అంతా పురుష ప్రపంచమే కనిపించడం సవాలుగా మారుతుంది. అసలు ఆ స్థలాన్ని డిజైన్‌ చేయడమే పురుషుల కోసం చేసి ఉంటారు. స్త్రీల రూములు, బాత్‌రూములు, యూనిఫామ్‌ చేంజ్‌ రూమ్‌లు ఏవీ ఉండవు. స్త్రీలకు ఎగిరే పాఠాలు చెప్పడం నామోషీగా భావిస్తారు మరికొంత మంది ఆఫీసర్లు. అయినప్పటికీ గుంజన్‌ తాను ఎగరడానికి రెక్కలు మొలిపించుకుంది. ఎయిర్‌ ఫోర్స్‌లో ఉత్తమ పైలెట్‌గా నిలిచి కార్గిల్‌ వార్‌ సమయంలో సేవలు అందించి చరిత్ర లిఖించింది. గుంజన్‌ సక్సేనా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని చేసిన బయోపిక్‌ ‘గుంజన్‌’ భిన్న రంగాల్లో పని చేయాలనుకునే స్త్రీలకు ఒక ధైర్యం ఇచ్చింది. పురుషులను సెన్సిటైజ్‌ చేసింది.
 

పొగల నుంచి పునరుత్థానం
అత్యంత దుర్బలుడైన పురుషుడెవడంటే స్త్రీని దొంగదెబ్బ తీయాలనుకునేవాడే. అత్యంత శిక్షార్హమైన వ్యక్తి కూడా. యాసిడ్‌ దాడులు స్త్రీకి ‘గుణపాఠం’ అని భావించేవారికి గుణపాఠం చెప్పిన విజేతలు ఉన్నారు. ‘కుళ్లి కుళ్లి చావాలి’ అని యాసిడ్‌ జల్లినవాడే కుళ్లి కుళ్లి చచ్చేలా ఆ యాసిడ్‌ విజేతలు తమను తాము కూడదీసుకున్నారు. గౌరవాన్ని తిరిగి పొందారు. జీవికను కూడా పొందారు. ‘ముఖం మాత్రమే దెబ్బతింది. ఆత్మవిశ్వాసం కాదు.. పోరాట పటిమా కాదు’ అని చెప్పారు వీరు. అలా చెప్పిన వారిని వార్తల్లో చదవడం కంటే తెర మీద చూసి స్ఫూర్తి పొందే వీలు కల్పించింది ‘చపాక్‌’ సినిమా. లక్ష్మీ అగర్వాల్‌ అనే యాసిడ్‌ విజేత బయోపిక్‌గా వచ్చిన ఈ సినిమాలో ముఖ్యపాత్రను దీపికా పడుకోన్‌ పోషించి స్త్రీ చైతన్యంలో తన వంతు భాగస్వామ్యాన్ని కలిపింది. మరోమహిళ మేఘనా గుల్జార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించిందని గుర్తు పెట్టుకోవాలి.

లెక్క తప్ప కూడదు
‘నువ్వెంత జీనియస్‌వి అయినా ఒక భర్తకు భార్యవే... ఒక బిడ్డకు తల్లివే’ అని చెబుతుంది సమాజం. అదే భర్త జీనియస్‌ అయితే ‘ఆయన మానాన ఆయన్ని వదిలిపెట్టి ఇంటి సంగతి నువ్వు చూసుకోమ్మా’ అని స్త్రీకి సుద్దులు చెబుతుంది. తన మేధను చాటడానికి భూభ్రమణం చేసే హక్కు పురుషునికే ఉంది. ‘నాకూ ఉంది’ అని మేథమేటిక్స్‌ జీనియస్‌ శకుంతలా దేవి చెప్పింది. భర్తనూ కుటుంబాన్ని ఆమె గౌరవించినా తన మేధను చాటడంలో అవి అడ్డంకిగా మారుతాయని తెలిసినప్పుడు ఆమె ఒక భర్త బంధాన్ని వొదులుకుని కూతురి బంధం కోసం పెనుగులాడుతుంది. ఇలాంటి స్త్రీలను మూస చట్రం వ్యతిరేకంగా చూసేలా చేస్తుంది. ఇలాంటి స్త్రీలను అసలు అర్థం చేయించే ప్రయత్నం కూడా చేయదు. కాని ‘శకుంతలా దేవి’ బయోపిక్‌ చేసింది. శకుంతలా దేవిగా విద్యాబాలన్‌ ఈ సంవత్సరం గుర్తుండిపోయింది.

బెత్తం ఎత్తాలి
కొన్ని ఇండ్లలో పండు ముసలివారై పోయినా ఆ భర్త ఆ భార్య మీద అరవడమూ, కసరడమూ చేస్తూ ఉంటాడు. ఆమె వాటిని సహిస్తూ ఉంటుంది. ఇన్నాళ్లు పడుతున్నది ఇంకొన్నాళ్లు పడితే సరిపోతుంది అనే భావజాలం ఆమెను అలా చేసి ఉంటుంది. కాని ‘గులాబో సితాబో’లోని స్త్రీ పూర్తి భిన్నం. అందులో ఆమెకు 90 దాటి ఉంటాయి. ఆమె జమీందారు. భర్తకు కూడా 90 దాటి ఉంటాయి. కాని అతడు ఆ భార్య ఎప్పుడు చస్తుందా ఆమె పేరున ఉన్న ఆస్తి తనకెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు.

ఆమె పట్ల ప్రేమ, పక్కన కూచుని కబురు, మంచి చెడ్డలు ఏవీ పట్టవు అతనికి. దురాశ తప్ప. ఆ వయసులో ఏం బావుకుంటాడో కూడా తెలియదు. ఇలాంటి మగవారిని ఏం చేయాలి? ఆమె అస్సలు క్షమించదు. అతనికి విడాకులు ఇచ్చి తన జమిందారీలోని పూచిక పుల్ల ఇవ్వకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటుంది. సగటు భారతీయ సమాజంలో అందరూ గుండెలు బాదుకునే విషయమే ఇది. కాని స్త్రీలు తమకు ప్రేమ, గౌరవం దొరకని చోట తాము ఉండరు అని చెప్పదలుచుకున్నది ఈ పాత్ర. నటి ఫరూక్‌ జాఫర్‌ ఈ పాత్ర పోషించింది. భర్తగా అమితాబ్‌ బచ్చన్‌.
లాక్‌డౌన్‌ వల్లగాని మరికొన్ని గట్టి పాఠాలు చెప్పే స్త్రీల పాత్రలు కూడా ఈ సంవత్సరం వచ్చేవి. సరే లేండి. వచ్చే సంవత్సరం ఎలాగూ వస్తోందిగా.
– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు