చిత్రసీమ చిత్తరువులు

7 Mar, 2021 00:32 IST|Sakshi

చిత్రసీమ చిత్తరువులు

సుమంగళి నుంచి ఫిదా వరకు స్త్రీ పాత్రలు

రేపు మహిళా దినోత్సవ ప్రత్యేకం

సాహిత్యానికి కొంత స్వేచ్ఛ ఉంది. సినిమా జనామోదానికి లోబడి ఉండాలి. జనం, అనగా పురుషులు, అనగా పురుష భావజాలం తమపై ఉందని తెలియని స్త్రీలు కూడా మెచ్చే సినిమాలు తీస్తేనే డబ్బులు వస్తాయి. తెలుగు సినిమా స్త్రీ పాత్రను పాపులర్‌ జనాభిప్రాయాల మేరకే చూపింది. అయినా కొన్నిసార్లు వెండి తెర మీద స్త్రీ పాత్రలు కాస్త వెలుతురు చూశాయి. కొన్ని మాటలు చెప్పాయి. తమ ముఖం చూపడానికి చిన్న అద్దాలు వద్దని చెప్పాయి. తెలుగు సినిమాల్లో స్త్రీలు ఏం చెప్పారు? తెలుగు సినిమాలు స్త్రీలకు ఏం చెప్పాయి. ప్రత్యేక కథనం.


‘సతీ’ అనే పదం ఉండాలి టైటిల్‌లో. సినిమాను మహిళా ప్రేక్షకులకు అలవాటు చేయడానికి సినిమా మొదలైన కొత్తల్లో సినిమా వారు చేసిన పని అది. ‘సతీ అనసూయ’,‘సతీ సావిత్రి’, ‘సతి సుమతి’... దేశ వ్యాప్తంగా ‘సతి‘ సినిమాలు వచ్చాయి. తెలుగులో ‘సతి తులసి’ కూడా తీశారు. ‘సతి’ ఏం చేయాలి? పతిని శిరసావహించాలి. కథలు సోషలైజ్‌ అయ్యాక కూడా ఇదే భావధారను తెలుగు సినిమా జనామోదం కోసం తీస్తూ వెళ్లారు. భర్త ప్రాణాల కోసం యమునితో పోరాడిన సతి ఉంది కాని భార్య ప్రాణాల కోసం పోరాడిన పతి లేడు.
∙∙∙
‘శ్రీ లక్ష్మమ్మ కథ’ (1950) తెలుగు సినిమాల్లో స్త్రీలు ఎలా ఉండాలో గట్టిగా సుబోధ చేసిన చిత్రం. అక్కినేని, అంజలి దేవి నటించిన ఈ సినిమాలో అక్కినేని స్త్రీలోలుడిగా మారితే అంజలి దేవి అత్తారింటికి చేరి ఒక్కగానొక్క కూతురితో నానా బాధలు పడుతుంది. అయినా అక్కినేని మారడు. అయితే ఆమె సతి ధర్మాన్ని వీడదు. చివరకు ఆమెను బాధించినందుకు అక్కినేనికి కళ్లుపోతే ఆ కళ్లు తన ప్రార్థనా బలంతో రప్పించి ప్రాణాలు విడిచి దేవతలా కొలుపులు అందుకుంటుంది. శ్రీ లక్ష్మమ్మ మహిళా ప్రేక్షకులకు ఇలవేల్పు. చూడండి... భర్త తనకు దక్కకపోయినా భార్య భర్త కోసమే జీవించాలి. తన సుఖానికి పనికి రాకపోయినా భర్త కోసమే జీవించాలి. ‘సుమంగళి’ (1965) కథ ఇదే మాట చెబుతుంది. ఇందులో సావిత్రిని పెళ్లి చేసుకున్నాక అక్కినేనికి యాక్సిడెంట్‌ అవుతుంది. అతను వైవాహిక జీవితానికి పనికి రాడు. యోగ్యమైన వయసులో ఉన్న సావిత్రి భర్తనే సర్వస్వం అనుకుంటూ ఉంటుంది. ఆమె బాధ చూడలేక అక్కినేని అవస్థ పడతాడు. ఆమెకు మరో పెళ్లి చేయాలని ప్రయత్నిస్తాడు. భారతీయ వ్యవస్థలో స్త్రీ వివాహాన్ని ఎంత గౌరవించాలో చెబుతూ సుమంగళిగా వెళ్లిపోవడానికి సావిత్రి ఆత్మహత్య చేసుకుంటుంది. పై రెండు సినిమాల్లోనూ భార్యలు మరణించారు. భర్తలు జీవించారు.

స్త్రీ సమస్యలను తెలుగు సినిమా పట్టించుకోలేదు. బహుశా కొద్దిపాటి బుద్ధులు, కొంచెం సంస్కారం నేర్పడం వరకు అది తన వంతు అనుకుంది. ‘మాలపిల్ల’ (1938) సినిమా వచ్చింది... అందులో బ్రాహ్మణ యువకుడు మాలపిల్లను వివాహం చేసుకుంటాడు నిజమే కాని అది సాంఘిక సంస్కరణ మాత్రమే పురుష సంస్కరణ కాదు. ‘వర విక్రయం’ (1939) సినిమా వచ్చింది. అందులో భానుమతి ‘స్వాతంత్య్రం లేదా స్త్రీలకు’ అని పాడింది. అయితే ఈ ధోరణి గట్టిగా కొనసాగలేదు. ఇంటి పట్టున ఉండటం స్త్రీ ధర్మం, సంపాదించుకు రావడం పురుషధర్మం కనుక ఇంటి పట్టున ఉన్న స్త్రీని శ్లాఘించి ఇంటి పట్టున ఉండటంలోని గొప్పతనం తెలియచేసే కథలు పుంఖాను పుంఖాలుగా వచ్చాయి. ‘అర్థాంగి’ (1955), ‘మా ఇంటి మహాలక్ష్మి’ (1959), ‘దేవత’ (1965), ‘గృహలక్ష్మి’ (1967) ... ఇవి చాలా ఉన్నాయి. ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి’ అని పాటలు కట్టారు. అసలు ఇల్లాలు అంటే ఎలా ఉండాలో మోడల్‌ కూడా గట్టిగా చూపించారు. పాట సాగుతుండగా ఆమె తెల్లవారే లేస్తుంది.. ఎడ్లకు గడ్డి వేస్తుంది... స్నానం చేసొచ్చి కాఫీ తీసుకుని భర్త గదిలోకి వస్తుంది... అందాక భర్త నిద్రపోతూ ఉంటాడు. అతణ్ణి రెడీ చేసి టిఫిన్‌ పెట్టి.. బ్రీఫ్‌ కేస్‌ ఇచ్చి... ఇలా చేయడం వల్ల ఆమె దేవత. దీనిని రివర్స్‌ చేయడం మన సమాజంలో కాదు కదా సినిమాల్లోనూ అనూహ్యం. అమంగళకరం. ఆఫీసుకు వెళ్లే భార్య కోసం ఉదయాన్నే లేచి పాట పాడే భర్త లేడు. దాసరి తీసిన ‘సీతారాములు’ (1980)లో ‘ఏమండోయ్‌ శ్రీమతిగారు.. లేవండోయ్‌ పొద్దెక్కింది’ అని పాట ఉంటుంది... దానిని చూసి సమస్త లోకం కంగారు పడుతూ ఉండగా పాట చివరలో అది కల అని తెలుస్తుంది. ఆ సినిమాలో పెద్ద ఫ్యాక్టరీ యజమాని జయప్రద. కాని దర్శకుడు దాసరి చెప్పినట్టు బుద్ధిగా ఎర్లీ మార్నింగ్‌ లేచి కృష్ణంరాజుకు కాఫీ ఇస్తుంది.

‘గుండమ్మ కథ’ (1962) ‘స్త్రీల పొగరు అణచడం’ అనే సక్సెస్‌ ఫార్ములాను తెలుగు సినిమాకు ఇచ్చింది. ఈ సక్సెస్‌ఫుల్‌ సినిమా స్త్రీలకు బాగా అపకారం చేసిందని చెప్పవచ్చు. ఇందులో గుండమ్మ కూతురు జమున చేసిన తప్పు ఏమిటో ఎవరికీ తెలియదు. ఆమె కొంచెం పెంకిగా ఉంటుంది అంతే. గారాబంగా ఉంటుంది. ‘బాధ్యత తెలియకుండా’ ఉంటుంది. దాంతో ఎస్‌.వి.రంగారావు, ఎన్‌.టి.ఆర్, అక్కినేని వంటి మహామహులు కలిసి ఆమె ‘పొగరు’ అణచడానికి నాటకాలు ఆడతారు. ఏడ్పిస్తారు. మట్టి పని చేయిస్తారు. బెంబేలెత్తిస్తారు. ఇన్ని చేసేది ఆమె ‘భర్త పట్ల చూపాల్సిన అణకువ’ను అలవర్చుకోవడం కోసం. తెలుగు సినిమా అత్తలతో పందెం కాసే అల్లుళ్లతో, తల ఎగరేసే అలాంటి అత్తల కుమార్తెల ‘పీచమణిచే’ హీరోలతో నేటికీ వర్థిల్లుతోంది. తెలుగు హీరోకి ఏ స్త్రీ ఎదురు కారాదు... అయితే ఆమెను ‘దారికి తెస్తాడు’. ‘నరసింహ’లో రజనీకాంత్‌ రమ్యకృష్ణను తెచ్చినట్టు.

అయితే తెలుగు సినిమా ఎప్పుడూ స్త్రీల పట్ల పూర్తి అసున్నితంగా లేదు. అప్పుడప్పుడు సదుద్దేశాల వల్ల కావచ్చు.. ట్రెండ్‌ కోసం కావచ్చు స్త్రీల సమస్యను పట్టించుకుంది. ‘కట్నం’ సమస్యను తెలుగు సినిమా చర్చించింది. ఎన్‌.టి.ఆర్‌ స్వయంగా ‘వరకట్నం’ (1969) తీశారు. ‘శుభలేఖ’ (1982), ‘శ్రీకట్నలీలలు’ (1985), ‘శ్రీవారికి ప్రేమలేఖ’ (1984), ‘రాఖీ’ (2008) తదితరం ఉన్నాయి. ప్రేమ పేరుతో మోసం చేసే కుర్రాళ్లకు బుద్ధి చెప్పే ‘న్యాయం కావాలి’ (1981), ‘మౌన పోరాటం’ (1989) సినిమాలు ఉన్నాయి. వ్యభిచార సమస్యను ‘పూజకు పనికి రాని పువ్వు’ (1986), ‘నేటి భారతం’ (1983)లో చూపారు. ‘అనుమానం’ను ‘డాక్టర్‌ చక్రవర్తి’ (1964), ‘ముత్యాల ముగ్గు’ (1975) తదితర సినిమాలలో, లైంగిక దోపిడిని ‘దాసి’ (1988), గృహహింసను ‘ఆడదే ఆధారం’ (1986), ఇంటి చాకిరీని ‘అమ్మ రాజీనామా’ (1991), రేప్‌ను ‘శ్రీకారం’ (1996) ... ఇవన్నీ తప్పక ప్రస్తావించాలి. అయితే పురుషులు పురుషులతో స్త్రీల తరఫున చేసిన సంభాషణలే ఇవన్నీ ఎక్కువగా. స్త్రీలు గట్టిగా చేసిన స్టేట్‌మెంట్‌ కాదు. స్త్రీలు గట్టిగా స్టేట్‌మెంట్‌ ఇచ్చే సందర్భం ఇంకా తెలుగులో రాలేదు.

స్త్రీలు లీడ్‌రోల్స్‌ చేయడానికి వెనుకాడతారు తెలుగులో. ఒక్కసారి వారు తమ భుజాల మీద సినిమా మోస్తారన్న ఇమేజ్‌ వస్తే వారి పక్కన హీరోలు చేయరు. గతంలో చాలామంది హీరోయిన్‌లు అలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడూ పడుతున్నారు. స్త్రీలు ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులుగా, న్యాయవాదులుగా, కలెక్టర్లుగా, సంఘ సేవకులుగా కొన్ని అన్యాయాలను గొప్పగా ఎదిరించిన సినిమాలు తెలుగులో ఉన్నాయి. వాటితో సమాజానికి పేచీ లేదు. కాని స్త్రీల తరఫున స్త్రీలు మాట్లాడినప్పుడే పేచీ. అందుకు ఇంకా స్పేస్‌ రాలేదు. స్త్రీలు కుటుంబాలను గౌరవించం అనడం లేదు. స్త్రీలుగా తమ బాధ్యతలను విస్మరించం అనడం లేదు. పురుషులకు–స్త్రీలకు ఇల్లు సమానమే. కాని పెంపకంలో, చదువులో, ఉపాధి అవకాశాలలో, ఉద్యోగ స్థలాలలో, నిర్ణయాత్మక రాజకీయ పదవులలో, ఉనికిలో, అస్తిత్వంలో, అందచందాల నిర్వచనాలలో, గౌరవంలో సరి సమాన దృష్టికోణం, సరి సమాన వేదిక గురించి వారు మాట్లాడాల్సింది చాలా ఉంది సినిమాలలో. ‘చైల్డ్‌ అబ్యూజ్‌’, ‘మేరిటల్‌ రేప్‌’, ‘అంగీకార శృంగారం’, ‘జీవిత భాగస్వామి ఎంపిక’, ‘పిల్లల్ని కనే/వద్దనుకునే హక్కు’, ‘అబార్షన్‌’, ‘సెక్సువల్‌ హరాస్‌మెంట్‌’ వీటి గురించి తెలుగు సినిమా ఎంతో మాట్లాడాల్సి ఉంది.
కాస్త ఆత్మవిశ్వాసం చూపి తమ టర్మ్స్‌ ప్రకారం తాము ఉంటూ అబ్బాయిలు గౌరవంగా, ప్రేమగా తమకు దగ్గరయ్యే అమ్మాయిల పాత్రలు ‘ఆనంద్‌’, ‘గోదావరి’, ‘పెళ్లిచూపులు’, ‘ఫిదా’ తదితర సినిమాలలో కనిపించాయి. ‘ఫిదా’లో అమ్మాయి కోసమే అబ్బాయి అమెరికా వదిలి వస్తాడు. ఇది అరుదైన జెస్చర్‌. అన్ని జీవన, సంఘిక సందర్భాలను స్త్రీ వైపు నుంచి తిరగేస్తే ఇలాంటి జెస్చర్స్‌ ఇవ్వాల్సిన కథలు ఎన్నో వస్తాయి.
వాటిని తెలుగు తెర ఇంకా పట్టుకోవాల్సి ఉంది.

– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు