ఉన్నచోటే ఉండిపోకండి కొత్తవి నేర్చుకోండి

29 Apr, 2021 03:26 IST|Sakshi

గౌరికి నది ఇరుకై పోయింది. సముద్రంలోకి వెళ్లింది. నది అంటే న్యూఢిల్లీ లోని ‘ఎయిమ్స్‌’. అందులో డెంటిస్ట్‌ గౌరి. సముద్రం అంటే న్యూయార్క్‌లోని డబ్ల్యూ.ఎం.ఎస్‌.! పన్నెండేళ్లుగా పసిఫిక్‌ మహా సముద్రం లాంటి ఆ బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్మెంట్‌ కంపెనీలో ఇష్టంగా ఈతకొడుతూ ఉన్నారు గౌరీ. అందులోని అన్ని డిపార్ట్‌మెంట్‌ల పని నేర్చుకుని, అన్ని డిపార్ట్‌మెంట్‌లకు టీమ్‌ లీడర్‌గా చేశారు.

ఆపరేషన్‌ మేనేజ్మెంట్, హెచ్‌.ఆర్‌., ట్రాన్సా్ఫర్మేషన్, రోబోటిక్స్, డిజిటలైజేషన్‌.. అన్నీ నేర్చుకున్నారు. పసిఫిక్‌ సముద్రం అన్ని ఖండాలను టచ్‌ చేస్తూ ఉన్నట్లుగానే సముద్రం లాంటి తన కంపెనీలో అన్నిటిలోనూ ప్రావీణ్యం సంపాదించారు గౌరి. ప్రస్తుతం ఆమె ఆ కంపెనీలోనే హెల్త్‌ కేర్‌ విభాగానికి బిజినెస్‌ యూనిట్‌ లీడర్‌ గా ఉన్నారు. ఉద్యోగంలోని చలన రహిత సౌఖ్యానికి అలవాటు పడితే ఇక మనం నిరర్థకంగా ఒడ్డున పడ్డట్లేనని అంటారు గౌరి పురి. ఉన్నచోటే ఉండి పోవద్దంటారు.

గౌరీపురి తన ఈడు పిల్లల్లో కాస్త భిన్నంగా ఉన్న అమ్మాయి. కనుక ఇప్పుడూ భిన్నంగానే ఉన్నారని అనుకోవచ్చు. పదేళ్ల వయసులోని ఆమె భిన్నత్వం గురించి మొదట తెలుసుకుందాం. పిల్లలు ఆటలు ఆడే వయసులో కిందపడటం, దెబ్బలు తగలడం, అప్పుడప్పుడు రక్తం వారి కంట పడటం సహజంగా జరిగేదే. అప్పుడు మిగతా పిల్లలు భయంతో కళ్లు మూసుకుంటే గౌరి మాత్రం ఏ మాత్రం బెదురు లేకుండా ఆ దెబ్బలు తగిలిన పిల్లలకు గాయం దగ్గర తుడిచి, శుభ్రం చేసేవారట. ‘‘ప్రాథమిక చికిత్స వంటిది అనుకోండి’’ అని ఇప్పుడా సంగతులను నవ్వుతూ గుర్తు చేసుకుంటారు గౌరి. ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీలో ఉంటుంది వాళ్ల కుటుంబం. గౌరి అక్కడే పుట్టి పెరిగారు.

21వ యేట న్యూఢిల్లీలోని ‘ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైస్సెస్‌’లో డెంటల్‌ సర్జన్‌గా తనకో గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఆమె అక్కడ పని చేసింది రెండున్నరేళ్లే. తర్వాత ఆర్నెల్లు సెలవు పెట్టి.. ‘నది కాదు నాకు కావలసింది, సముద్రం’ అని అనుకుని న్యూ ఢిల్లీ నుంచి న్యూయార్క్‌ వెళ్లి డబ్లు్య.ఎన్‌.ఎస్‌. కంపెనీలో చేరిపోయారు! డబ్లు్య.ఎన్‌.ఎస్‌. అంటే వరల్డ్‌ నెట్‌వర్క్‌ సర్వీసెస్‌. బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ వాళ్లు 1996లో ముంబైలో ప్రారంభించిన బిజినెస్‌ ప్రాసెస్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ అది. ప్రపంచం అంతటా బ్రాంచీలు ఉన్నాయి. గౌరి కోరుకున్నట్లుగా నిజంగా అది సముద్రమే. 2007లో అందులో అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా చేశారు.

డెంటల్‌ సర్జన్‌కి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో ఏం పని? యూఎస్‌ మార్కెట్‌లో హెల్త్‌ క్లెయిమ్‌లను చక్కబెట్టడానికి వాళ్లకొక ఇండియన్‌ మెడికల్‌ డాక్టర్‌ కావలసి వచ్చింది. అక్కడ ఆమె 60 మంది డాక్టర్‌ల బృందాన్ని నడిపించాలి. గౌరి వెంటనే యూఎస్‌ విమానం ఎక్కేశారు. ఆ తర్వాత ఆమె కెరీర్‌ అంతా అంత ఎత్తులోనే ఎగురుతూ ఉంది. నేర్చుకోవడం ఆమెకు ఇష్టం. నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. ఏ సబ్జెక్టునూ తనది కాదు అనుకోరు. అక్కడ టీమ్‌ని నడుపుతూనే ఆపరేషన్‌ థియేటర్స్‌ అని, బోర్డ్‌ రూమ్స్‌ అని లేకుండా అన్ని విభాగాల విధాన నిర్ణయాల గురించి తెలుసుకున్నారు. నిర్ణయ విధానాలను గమనించారు. అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా చేరగానే మొదట బ్యాంకింగ్, ఫైనాన్సియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్, హెల్త్‌కేర్‌ల నిర్వహణలో శిక్షణ తీసుకున్నారు.

మూడేళ్లకే ఆ సముద్రం కూడా బోర్‌ కొట్టేసింది గౌరికి! సముద్రంలో ఇంకా తనకు తెలియని ప్రదేశాలు ఏమైనా ఉన్నాయా అని గాలించారు. డబ్లు్య.ఎన్‌.ఎస్‌. ఒక పసిఫిక్‌ మహాసముద్రం. పసిఫిక్‌ అన్ని ఖండాలకూ వ్యాపించినట్లు డబ్లు్య.ఎన్‌.ఎస్‌. ఖండాంతర  శాఖలుగా విస్తరించి ఉంది. పైగా గౌరికి ఒకే  సీట్లో హాయిగా కూర్చోవడం ఇష్టం ఉండదు. ఉద్యోగంలోని చలన రహిత సౌఖ్యానికి అలవాటు పడితే ఇక మన కెరీర్‌ అక్కడితో ఆఖరు అంటారు. తను చేస్తున్న పని చేస్తూనే ఫిలిప్పీన్స్, శ్రీలంకల్లో ఉన్న తమ కంపెనీ వ్యవహారాలను కూడా యూఎస్‌ నుంచే ఆమె నడిపించారు. రోజుకు కనీసం 18 నుండి 20 గంటలు పని చేస్తారు గౌరి. అంత శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ‘‘పనే నా శక్తి’’ అని నవ్వుతారు గౌరి.

కష్టం ఊరికే పోతుందా? 2017లో ఆమెకు ఎవరూ ఊహించనంత పెద్ద ప్రమోషన్‌. డబ్లు్య.ఎన్‌.ఎస్‌.లోని హెల్త్‌కేర్, లైఫ్‌ సైన్సెస్‌ యూనిట్‌లకు ఆమె బిజినెస్‌ లీడర్‌ అయ్యారు! ఈ మూడేళ్లలో మళ్లీ ఆపరేషన్స్‌ మేనేజ్‌మెంట్, హెచ్‌.ఆర్‌., ట్రాన్స్‌ఫార్మేషన్, రోబోటిక్స్, డిజిటలైజేషన్‌లో పట్టు సాధించారు. గౌరి హెల్త్‌ కేర్‌ యూనిట్‌ను చేపట్టినప్పుడు 7 శాతం మాత్రమే ఉన్న ఆ విభాగం రాబడి ఇప్పుడు ఆమె నేతృత్వంలో 20 శాతానికి పెరిగింది. ప్రస్తుతం ఆమె మొత్తం కలిపి 4 వేల మంది డాక్టర్‌లు, కోడర్స్, ఫార్మసిస్టులు, హెల్త్‌కేర్‌ ప్రొఫెషనల్స్‌ను లీడ్‌ చేస్తున్నారు! వారిలో ఒక్క సీనియర్‌ కూడా ఇప్పటివరకు ఆమె టీమ్‌ నుంచి వెళ్లిపోలేదు. ఎందుకు వెళ్లిపోతారు? ఆమె దగ్గర పని చేయడమంటే ఆమెతో సమానంగా పని చేయడమేనన్న గొప్ప గుర్తింపును పొందుతున్నప్పుడు!
 
‘‘కొత్త విషయాలను నేర్చుకోడానికి యువ వృత్తి నిపుణులు చిన్నతనంగా భావించకూడదు. నేర్చుకోవడం అన్నది నన్ను ఈ వయసులోనూ యవ్వనోత్సాహంతో ఉంచుతోంది.’’
– గౌరి పురి (38),
ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్, డబ్లు్య.ఎన్‌.ఎస్‌.

మరిన్ని వార్తలు