మహిళా వెడ్డింగ్‌ ప్లానర్స్‌ ఆకాశమే హద్దు...

4 Dec, 2021 04:13 IST|Sakshi

తమ వివాహ వేడుక నూరేళ్లు గుర్తుండిపోయేలా ఆకాశమే హద్దుగా.. భూదేవంత కళగా వైభవంగా.. వినూత్నంగా .. కనివిని ఎరగని విధంగా జరుపుకోవాలంటే డబ్బొక్కటే ఉంటే సరిపోదు... సరైన ప్లానింగ్‌ కూడా ఉండాలి. పట్టుచీరలు, నగలు అలంకరించుకుని మండపానికి వచ్చే మగువలే కాదు.. తమ చేతులతో పెళ్లిళ్లను అర్ధవంతంగా జరిపించి, అంతటా పేరు తెచ్చుకుంటున్న అతివలు మన దేశాన అగ్రశ్రేణిలో ఉన్నారు.

వివాహ వేడుకను అత్యంత ఘనంగా జరుపుకోవాలనే ఆలోచన మెజారిటీ ప్రజల్లో ఉండటం కారణంగా వెడ్డింగ్‌ ప్లానర్‌ల డిమాండ్‌ వేగంగా పెరుగుతోంది. ఖర్చుతో బాటు సరైన ప్లానింగ్‌తో జరగాలన్న ఒత్తిడితో కూడుకున్న ఈ వేడుక ప్లానర్‌ని నియమించేలా చేస్తుంది. ఇండియా టాప్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌ల జాబితాలో ఉన్న వందనామోహన్, దివ్యావితిక, టీనా తర్వాణి, దేవికా సఖుజ, ప్రీతీ సిద్వానీలు పెళ్లి పెద్దలుగా ప్లానింగ్‌ చేసే అవకాశాన్ని ఏళ్ల తరబడి అందిపుచ్చుకుంటున్నారు.

వందనా మోహన్‌
ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో పొలిటికల్‌సైన్‌ విభాగం నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకున్న వందన ఐక్యరాజ్యసమితిలో పనిచేయాలనుకుంది. రూట్‌ మార్చుకుని భారతదేశపు అగ్రశ్రేణి వెడ్డింగ్‌ ప్లానర్‌లో ఒకరుగా పేరొందారు. ‘ది వెడ్డింగ్‌ డిజైన్‌’ కంపెనీ పేరుతో 28 ఏళ్లుగా వందనా మోహన్‌ దేశవ్యాప్తంగా సెలబ్రిటీల పెళ్లి కళ బాధ్యతను తీసుకుంటున్నారు.

మూడేళ్ల క్రితం ఇటలీలోని లేక్‌ కోమోలో బాలీవుడ్‌ అగ్రనటులు దీపికాపదుకొనే, రణ్‌వీర్‌సింగ్‌ల పెళ్లి కలను నిజం చేసిన ప్లానర్‌ వందనామోహన్‌. అద్భుతమైన కథలా కళ్లకు కట్టే సెట్టింగ్, సమ్మోహనపరిచే డిజైన్స్, ఎక్కడా దేనికీ తడుముకోవాల్సిన అవసరం లేకుండా వివాహతంతును పూర్తి చేయడంలో వందనది అందె వేసిన చేయి. ‘ఒకప్పటి ప్రఖ్యాత ప్రెంచ్‌ ఫ్యాషన్‌ డిజైనర్, బిజినెస్‌ ఉమెన్‌ కోకో చానెల్‌ నుండి ప్రేరణ పొందుతాను. మూస విధానాలను దాటి ఆలోచించడమే నా విజయం’ అనేది ఈ ఫస్ట్‌ ఇండియన్‌ ఉమన్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌ మాట. ఇప్పటికి 500 పెళ్లిళ్ళను అద్భుతంగా చేసిందన్న ఘనత వందన ఖాతాలో జమ అయ్యింది.

దివ్య – వితిక
బెంగుళూరు వెడ్డింగ్‌ ప్లానర్స్‌ దివ్య–వితిక లు ప్రారంభించిన సంస్థ. వీరి సోషల్‌ మీడియా అకౌంట్‌ చూస్తే చాలు ఆ పెళ్లిళ్లు ఎంత గ్రాండ్‌గా ఉంటాయో కళ్లకు కడతాయి. గతంలో మిస్‌ ఇండియా పోటీలలో పాల్గొన్న ఈ ఇద్దరు దివ్యా చౌహాన్, వితికా అగర్వాల్‌ స్నేహితులయ్యారు.  ‘దివ్య వితిక’ అని తమ పేరుతోనే 2009లో వెడ్డింగ్‌ ప్లానర్‌ కంపెనీని ప్రారంభించారు. తమ ప్లానింగ్‌లో భాగంగా ఎక్కడా ఆనందాన్ని మిస్‌ కానివ్వదు. వచ్చే అతిథులు చూపులకు పూర్తిగా ఓ కళారూపంగా, వినోద భరితంగా వీరి ఈవెంట్‌ డిజైనింగ్‌ ఉంటుంది. ఒక బలమైన థీమ్, కలర్‌ డిజైన్, అద్భుతమైన అలంకరణ కావాలనుకుంటే దివ్య వితికను కలవాల్సిందే అనేలా వీరి ప్లానింగ్‌ ఉంటుంది.

టీనా థర్వాణి
వెడ్డింగ్‌ ప్లానింగ్‌ కంపెనీ ‘షాదీ స్క్వాడ్‌’ సహ వ్యవస్థాపకురాలు టీనా థర్వాణి. ఈ కంపెనీలో కొనసాగాలని నిర్ణయించుకోవడానికి ముందు టీనా చిత్ర నిర్మాణంలో పనిచేసింది. ఇటలీలోని టుస్కానీలో బాలీవుడ్‌ బ్యూటిఫుల్‌ కపుల్‌గా పేరొందిన అనుష్క–విరాట్‌కోహ్లి (విరుష్క)ల అందమైన పెళ్లి వేడుకను టీనా ప్లాన్‌ చేసింది. ఈ జంట వారి ప్రత్యేక రోజును వారి ఊహలను, గ్రాండ్‌నెస్‌ను కలిపి ఆవిష్కరించింది. టీనా చేసే థీమ్‌ బేస్డ్‌ ప్లానింగ్‌లో ఒక ప్రత్యేకమైన రిచ్‌నెస్‌తో పాటు యువజంట కలలను కళ్లముందు నిలుపుతుంది.

దేవికా సఖుజా
ఢిల్లీలో ఉంటున్న ఈ వెడ్డింగ్‌ ప్లానర్‌ తన పేరుతో స్థాపించిన సొంత కంపెనీకి ఈవెంట్‌ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. గతం నుంచి తీసుకున్న థీమ్‌ను ప్రస్తుత కాలానికి తగినట్టుగా వినూత్నంగా నవీకరిస్తుంది. ఈ రకమైన థీమ్‌లను రూపొందించడంలో దేవికకు ప్రత్యేకమైన పేరుంది. సన్నిహితుల మధ్య జరిగే  చిన్న సమావేశమైనా, పెళ్లి వంటి పెద్ద వేడుకలైనా ప్రతీ క్షణం ఆహూతులు ఆస్వాదించే విధంగా జంటకు ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా ఈవెంట్‌ను ప్లాన్‌ చేయాలన్నదే దేవిక అభిమతం. సందర్భానికి తగిన విధంగా సరైన వాతావరణాన్ని తనదైన కోణంలో సృష్టించకపోతే వేడుక సంపూర్ణం కాదనేది దేవికా సఖుజా అభిప్రాయం. వేడుక సందర్భాన్ని బట్టి ఎలాంటి డిజైన్లనైనా ఏ బడ్జెట్‌లోనైనా పూర్తి చేయడంలో దేవిక సఖుజ దిట్ట.

ప్రీతి సిధ్వాని
రెండు దశాబ్దాలుగా వెడ్డింగ్‌ ప్లానింగ్‌లో తీరికలేకుండా ఉంటున్నారు ప్రీతి సిధ్వాని. ‘డ్రీమ్జ్‌ క్రాఫ్ట్‌’ పేరుతో 2002లో ప్రారంభించిన వెడ్డింగ్‌ ప్లానింగ్‌ కంపెనీ నిర్వహణతో పాటు సినిమా సెట్టింగ్‌ డిజైన్లలోనూ బిజీగా ఉంటారు ప్రీతి. సినిమా సెట్టింగ్స్‌ నుంచి పెళ్లి వేడుకల సెట్టింగ్స్‌తో ఆమె ఈ మార్కెట్లోకి ప్రవేశించింది. దేశ నలుమూలల నుండి వెడ్డింగ్‌ ప్లానింగ్‌కు సంబంధించిన సృజనాత్మక ఐడియాల కోసం ప్రీతిని సోషల్‌మీడియా ద్వారా కాంటాక్ట్‌ చేస్తూనే ఉంటారు.

ఆకాశమంత పందిరి, భూదేవి అంత అరుగు వేసి ఎంతో వైభవంగా జరుపుకోవాలనే ఆలోచన ఒక్క పెళ్లి విషయంలోనే చేస్తారు. వధువు, వరుడి వైపు కుటుంబాలు ప్రశాంతంగా, సంబరంగా జరుపుకునే ఈ వేడుక అన్నీ పద్ధతి ప్రకారం జరగాలంటే ఓ పెద్ద సవాల్‌. రకరకాల అంశాలతో కూడి ఉండే ఈ వేడుక బాధ్యతను సవాల్‌గా తీసుకొని తమ సమర్థతను చాటుతున్నారు ఈ మహిళామణులు.

మరిన్ని వార్తలు