Kindness Day: దయ చుట్టంబౌ.. నేడు ప్రపంచ దయాగుణ దినోత్సవం

13 Nov, 2021 00:43 IST|Sakshi

దేవుడు భక్తుణ్ణి అడిగాడట– ‘నేను నీ ఇంటికొస్తే నాకు అన్నమెందుకు పెట్టలేదు’ అని. ‘నువ్వెప్పుడొచ్చావు తండ్రీ’ అన్నాడట భక్తుడు. ‘ఒకరోజు నీ ఇంటి ముందు ఒక దీనుడు క్షుద్బాధతో అన్నం అడిగాడు. అతడికి నీవు పెట్టి ఉంటే అతడిలో నేను కనపడేవాణ్ణి’ అన్నాడట దేవుడు. దయను మించిన అంటు లక్షణం మరొకటి లేదు.

మనం ఒకరితో దయగా ఉంటే ఆ ఒకరు మరొకరితో దయగా ఉంటారు. సాహసం, వీరత్వం కంటే దయ కలిగినవాడే గొప్పవాడు. ఇంట్లో, ఆఫీసుల్లో, సంఘంలో దయ లోపించడం వల్లే ఇవాళ సమస్యలు పెరిగిపోయాయి. దయ చూపేవారికి సాటి మనిషి తోడు నిలుస్తాడు. దయే నేడు కావలసిన చుట్టం. వెతకవలసిన దైవం.

దేవుడు మనుషుల పట్ల ఎంతో దయగా ఉన్నాడు. లేకుంటే ఉష్ణం గక్కే పగలు నుంచి సాంత్వనం కోసం రాత్రిని ఇచ్చేవాడా? క్రూరమృగాల కీకారణ్యంలో తీయని ఫలాలను వేళ్లాడగట్టేవాడా? నదులను గీత కొట్టి అంతే పారాలని చెప్పేవాడా? సముద్రానికి చెలియలికట్టలు గీచేవాడా. దేవుడు మనుషులతో ఎంతో దయగా ఉన్నాడు. జబ్బు ఉన్నచోటే మందు ఇచ్చాడు. గాయపడిన చోట మాన్పుకోవడమూ నేర్పాడు. కంటిలో నీరు ఇచ్చి ఆనందబాష్పాలను కూడా చిలకరించాడు.

మనిషి? అన్నీ ఫ్రీ. గాలిలోని ఆక్సిజన్‌ ఫ్రీ. సూర్యుడిలోని డి విటమిన్‌ ఫ్రీ. మబ్బులోని వాన ఫ్రీ. చంద్రుడిలోని వెన్నెల ఫ్రీ. చెట్ల ఆకుపచ్చదనం ఆకాశంలోని నీలిమ.. అన్నీ ఫ్రీ. ఇన్ని ఫ్రీగా తీసుకుంటూ అతడు బదులుగా ఇవ్వవలసింది చూపవలసింది ఏమిటి? సాటిమనిషి పట్ల కాసింత దయ. కొంచెం కరుణ. గుప్పెడు ఆర్ద్రత. చిటికెడు చెమరింత. ఇంగ్లిష్‌వాడు మానవజాతిని ‘మేన్‌కైండ్‌’ అన్నాడు. ‘కైండ్‌’గా ఉండటమే మానవజాతి లక్షణం.

మానవీయమైన గుణం కలిగినవాడే మానవుడు. మానవీయగుణం అంటే దయ, కరుణ. ‘ఇంటి దగ్గర ఉండే లేగదూడకు పాలు ఇచ్చి వస్తాను. అప్పుడు నన్ను చంపి తిను’ అన్న గోవు మాట మీద నిలబడి తిరిగి వస్తే క్రూరమృగమైన పులికి దయ కలిగింది. ఆవును వదిలిపెట్టింది. కాని నేటి మనిషి పులి కంటే కఠినంగా మారుతున్నాడా? దయ, జాలి, కరుణ అనే మాటల్నే మరుస్తున్నాడా? ఇలాంటి మనిషిని ప్రకృతి ఇష్టపడుతుందా?

ఇల్లు–ఇరుగు పొరుగు
‘పిల్లల పట్ల పెద్దలు దయగా ఉండాలి’ అని  అంటారు. పిల్లలకు ఇంటి పని నేర్పించడం వేరు. ఇంటి పని పిల్లల చేత చేయించడం వేరు. బాల కార్మిక వ్యవస్థ బయట శిక్షార్హమైన నేరం. కాని ఇళ్లల్లో సొంత పిల్లలను రకరకాల పనుల్లో పెట్టి వారిని చెప్పుకోలేని బాధకు గురి చేసే తల్లిదండ్రులు ఉంటారు. ప్రతి పనికీ పిల్లల్ని కేక వేయడానికి వారు పనిమనుషులు కాదు.

ఇక వారిని తిట్టడం, కొట్టడం వారిని భవిష్యత్తులో నిర్దాక్షిణ్యులుగా మార్చడమే. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలతో ఇరుగు పొరుగువారితో దయగా ఉంటే, ‘వాచ్‌మెన్‌కు ఈ టిఫిన్‌ ఇచ్చిరా’ అని పిల్లల చేత పంపిస్తే, ‘పాపం.. వాళ్ల బండి పంక్చర్‌ అయ్యిందట.. మన బండి తాళం ఇచ్చిరా’ అని పంపిస్తే... పిల్లలు దయను కూడా నేర్చుకుంటారు. అవును. మంచి గుణాలను నేర్పించాలి.

ట్రాఫిక్‌ సిగ్నల్‌ దగ్గర ఎవరో చేయి సాచగానే తండ్రి నోటి నుంచి బూతులు, తల్లి మాటల్లో ఈసడింపు కనిపిస్తే పిల్లలు అలాంటి పేదవారి గురించి భవిష్యత్తులో దయగా ఉండే అవకాశం ఉండదు. ఇరుగు పొరుగు పిల్లలతో, క్లాస్‌లోని పిల్లలతో ఎంతో స్నేహంగా, దయగా ఉండాలని పిల్లలకు నేర్పించాలి. పెద్దలు తమ ప్రవర్తనతో చూపాలి. యువతలో ఈ దయాగుణం లోపిస్తున్నదని అమెరికా, ఆస్ట్రేలియా, యు.కెలలో క్లాస్‌ 12 లోపు పిల్లల కోసం ‘కైండ్‌నెస్‌ కరిక్యులమ్‌’ ప్రవేశపెడుతున్నారు.

పని చోట
మనతో పని చేసే వారితో మనం కఠినంగా ఉండాలి అనుకోవడమే సగం అనారోగ్యం. పని రాబట్టుకోవాలంటే కఠినంగా ఉండాల్సిన అవసరం లేదు. ప్రేమగా ప్రశంసగా కూడా పని జరుగుతుంది చాలాసార్లు. కొలీగ్స్‌ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చూడటానికి మించిన నిర్దయ లేదు. వారి నిజమైన సమస్యలకు స్పందించడం, కనీసం వినడం, వారి పని సర్దుబాటులో, సెలవుల అవసరంలో సాయంగా ఉండటం పని చోట చూపాల్సిన కనీస దయ. పని చోట రాజకీయాలు నడిపితే అనారోగ్యం వస్తుందని దయగా ఉంటే మనశ్శాంతితో ఉంటూ శరీరంలో మంచి ఎంజైమ్‌లు ఊరుతూ ఆరోగ్యంగా ఉండొచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.

అందరూ పౌరులే
ఈ దేశంలో అందరూ సమాన పౌరులే. అందరికీ రాజ్యాంగం శిరోధార్యమే. ఈ దేశంలో ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించాలి. అలా జీవించే హక్కు వారికి ఉంది. ప్రాంతాన్ని బట్టి, సామాజిక వర్గాన్ని బట్టి, మతాన్ని బట్టి, భాషను బట్టి, ఆచారాలను బట్టి, ఆహారపు అలవాట్లను బట్టి ఫలానా వారి పట్ల నిర్దయగా ఉండొచ్చు అనుకోవడానికి మించి సంకుచితత్వం లేదు. నువ్వు నిర్దయగా ఉన్నావంటేనే పైచేయి తీసుకుంటున్నట్టు అర్థం. పైచేయి తీసుకోవడం అంటే పీడన చేయడానికి సిద్ధమవడమేనని అర్థం. పీడిస్తే సంఘంలో బాధ ప్రవహిస్తుంది. దయగా ఉంటే సంతోషం, సామరస్యం పెల్లుబుకుతాయి. ఇవాళ ద్వేషం కాదు కావలÜంది దయ. బాగున్న వర్గాలు బాగలేని వర్గాల పట్ల నిర్దయను మానుకుంటే చాలు. వారి హక్కుల్ని వారు సాధించుకుంటారు.

గ్రామీణులు ‘ఫలానా అతను దయగల్లోడు’, ‘ఫలానా ఇల్లాలు దయగలది’ అంటుంటారు.

ఇవాళ, ఈ రోజున, మనల్ని ఎవరైనా అలా అంటున్నారా లేదా అని ఆత్మశోధన చేసుకోవడమే మనం చేయవలసిన పని. దయగా ఉంటే ఏం పోతుంది. మహా అయితే అందరూ మనతో దయగా ఉంటారు. అంతేగా?

మరిన్ని వార్తలు