మీరు డయాబెటికా?

25 Feb, 2021 06:30 IST|Sakshi

కంటిని కాపాడుకోండి!

అదుపులో లేకుండా ఉండే చక్కెరవ్యాధి అన్ని అవయవాలతో పాటు కంటిని కూడా  దెబ్బతీస్తుందన్న విషయం తెలిసిందే కదా. ఇలా డయాబెటిస్‌ కారణంగా కంటికి కూడా పలు సమస్యలు వస్తాయి. వాటిలో ముఖ్యమైనది ‘డయాబెటిక్‌ రెటినోపతి’.  మిగతా ఏదైనా అవయవానికి లోపం వస్తే కొద్దో గొప్పో సమస్యను మేనేజ్‌ చేయవచ్చేమోగానీ... కంటికి వచ్చే సమస్యలతో అంతా అంధకారమైపోతుంది. అందుకే డయాబెటిస్‌ ఉన్నవారు అన్ని అవయవాల విషయంలోనూ జాగ్రత్తగా ఉన్నప్పటికీ ... కంటి విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలన్న విషయం గుర్తుంచుకోవాలి. షుగర్‌వ్యాధి ఉన్న ప్రతివారూ తమ రక్తంలోని చక్కెరను అదుపులో ఉంచుకోవడం ఎంతముఖ్యమో... డయాబెటిక్‌ రెటినోపతిపై అవగాహన పెంచుకోవడమూ అంతే ప్రధానం. అందుకు ఉపయోగపడేదే ఈ కథనం.

డయాబెటిక్‌ రెటినోపతి అంటే ఏమిటో తెలుసుకునే ముందుగా... అసలు మనకు చూడటం అన్న ప్రక్రియ ఎలా సాధ్యమవుతుందో అర్థం చేసుకుందాం. మన కంటి వెనక భాగంలో రెటీనా అనే తెర ఉంటుంది. మనకు కనిపించే దృశ్యం దీనిపై తలకిందులుగా పడుతుంది. అక్కడి నుంచి ఆ ఇమేజ్‌ మెదడుకు చేరడం వల్ల మనకు చూడటం అనే ప్రక్రియ సాధ్యమవుతుంది.

కంటికి వెనక ఉన్న రెటినా తెరకు అత్యంత సన్నటి రక్తనాళాల (క్యాపిల్లరీస్‌) ద్వారా రక్తం సరఫరా అవుతుంటుంది. డయాబెటిస్‌ నియంత్రణ లేనివారిలో ఈ క్యాపిల్లరీస్‌ ఉబ్బడం జరుగుతుంది. దీన్నే మైక్రో అన్యురిజమ్‌ అంటారు. కొందరిలో క్యాపిలరీస్‌ మూసుకుపోతాయి. క్యాపిలరీస్‌ మూసుకుపోయినప్పుడు రెటినాకు కావాల్సిన పోషకాలు, ఆక్సిజన్‌ అందవు. అప్పుడు రెటీనా సరిగా పనిచేయదు. మైక్రో అన్యురిజమ్స్‌ లీక్‌ అయినప్పుడు ఎగ్జుడేట్స్‌ అనే పదార్థం రెటినాలో పేరుకుపోతుంది. దీనివల్ల రెటినా ఉబ్బతుంది.

ప్రధానంగా మాక్యులా అనే మధ్యభాగంలో ఈ ఉబ్బు ఎక్కువగా ఉంటుంది. దీన్నే డయాబెటిక్‌ మాక్యులార్‌ ఎడిమా అంటారు. రక్తనాళాలు మూసుకుపోయినవారిలో అసాధారణమైన అవాంఛిత కొత్తరక్తనాళాలు పెరుగుతాయి. ఈ కొత్త రక్తనాళాల నుంచి మాటిమాటికీ రక్తస్రావం జరుగుతుంటుంది. ఈ రక్తం రెటినాలోనూ, విట్రియస్‌ అనే జెల్‌లోనూ స్రవిస్తుంది. దీనివల్ల అకస్మాత్తుగా చూపు తగ్గిపోతుంది. ఈ రక్తస్రావం రెటినాలోగానీ, విట్రియస్‌లో గానీ కొంతకాలం అలాగే ఉంటే రెటినా ఊడే ప్రమాదం ఉంది. దీన్నే ‘రెటినల్‌ డిటాచ్‌మెంట్‌’ అంటారు.

క్రమేణా ఈ కొత్తరక్తనాళాలు కంటి ముందుభాగానికి (యాంగిల్‌ ఆఫ్‌ ది యాంటీరియర్‌ ఛేంబర్‌) వచ్చినప్పుడు నియోవాస్కులార్‌ గ్లకోమా అనే ప్రమాదకరమైన గ్లకోమా వస్తుంది. రెటినల్‌ డిటాచ్‌మెంట్‌ వల్లగానీ లేదా గ్లకోమా వల్లగానీ చాలామంది తమ చూపును పూర్తిగా కోల్పోతారు. అయితే డయాబెటిక్‌ రెటినోపతి లక్షణాలు మొదటి దశలో కనిపించవు. ఇలాంటి అసాధారణ, అవాంఛిత రక్తనాళాల నుంచి రక్తస్రావం అయి, అది కంటిలోని విట్రియస్‌ అనే జెల్లీలోకి స్రవించినప్పుడు ఈ కండిషన్‌ను తొలిసారి గుర్తించడం సాధ్యమవుతుంది. తర్వాత కంటి ముందు నల్లటి చుక్కలు తేలుకుంటూ పోతున్నట్లుగా, అల్లుకుపోతున్నట్లుగా కనిపిస్తుంటాయి. ఆ తర్వాత మెల్లమెల్లగాగానీ లేదా ఒక్కోసారి అకస్మాత్తుగా గాని కంటిచూపు పోవచ్చు.

డయాబెటిస్‌ ఉంటే తరచూ కంటి పరీక్ష తప్పదు...
పైన పేర్కొన్న పరిస్థితులను నివారించుకోవడం కోసం డయాబెటిస్‌ ఉన్నవారు కనీసం ఆర్నెల్లకొకసారి అయినా లేదా కంటి వైద్యుడు సూచించిన ప్రకారం కంటి పరీక్షలు చేయించుకోవాలి. మనం పైన చెప్పుకున్న అవాంఛిత పరిణామాలను  తొలిదశలోనే గుర్తించి, తగిన చికిత్స చేస్తే చూపు కోల్పోయే ప్రమాదం ఉండదు.

సాధారణంగా రెటినోపతి సమస్య ఉన్నవారికి ఫండస్‌ ఫొటో, ఓసీటీ పరీక్ష, ఫ్లోరెసిన్‌ యాంజియోగ్రఫీ అనే పరీక్షలు చేసి, రెటినోపతి ఏ దశలో ఉందో నిర్ధారణ చేస్తారు. ఫండస్‌ ఫొటో ద్వారా స్టేజ్‌తో పాటు... మొదటిసారి పరీక్షించినప్పుడూ, ఆ తర్వాతి విజిట్స్‌లోనూ తేడాలు గమనిస్తారు. ఓసీటీ పరీక్షలో రెటినా ఎంతగా మందం అయ్యింది అనే విషయం తెలుస్తుంది. యాంజియోగ్రఫీలో కొత్తరక్తనాళాలు, రెటినాలో జరిగే రక్తసరఫరా (రెటినల్‌ సర్క్యులేషన్‌) గమనిస్తారు.


డయాబెటిస్‌ ఉన్నవారు ఎవరైనా సరే... కనీసం ఆర్నెల్లకోసారి లేదా తమ కంటిడాక్టరు సూచించిన వ్యవధుల్లో తరచూ తప్పనిసరిగా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలతో చూపును జీవితాంతం పదిలంగా కాపాడుకోవడం సాధ్యమవుతుందని గుర్తుంచుకోవాలి.
 
చికిత్స
డయాబెటిక్‌ రెటినోపతిలో కంటికి జరిగిన నష్టాన్ని బట్టి అనేక రకాల చికిత్సలు చేయాల్సిరావచ్చు. ఉదాహరణకు లేజర్‌ ఫొటో కోయాగ్యులేషన్‌ అనే ప్రక్రియ ద్వారా లీకేజీలను అరికడతారు. ఇది గోల్డ్‌స్టాండర్డ్‌ చికిత్స. ఈ ప్రక్రియలో అసాధారణంగా, అవాంఛితంగా పెరిగిన రక్తనాళాలనూ తగ్గిస్తారు. మ్యాక్యులార్‌ ఎడిమా ఉన్నవారికి యాంటీవెజ్‌ ఇంజెక్షన్ల ద్వారా రెటినా వాపును తగ్గిస్తారు. అడ్వాన్స్‌డ్‌ రెటినోపతి ఉన్నవారికి, విట్రియస్‌ హేమరేజీతో పాటు రెటినల్‌ డిటాచ్‌మెంట్‌ ఉన్నవారికి మైక్రో విట్రియో రెటినల్‌ సర్జరీ నిర్వహిస్తారు.  

డాక్టర్‌ రవికుమార్‌ రెడ్డి కంటి వైద్య నిపుణులు

మరిన్ని వార్తలు