నడుస్తున్న చరిత్రకు రూబిడి

12 Oct, 2020 00:13 IST|Sakshi

ముందుమాట

బౌద్ధ జాతక కథల్లో ఒక చిన్న కథ వుంది. ఒక వ్యక్తి గుర్రం మీద పోతుంటే, మరో వ్యక్తి ఆపి ‘ఎక్కడికెళుతున్నావు’ అని అడుగుతాడు. దానికి సమాధానంగా ‘నాకేం తెలుసు, గుర్రాన్ని అడుగు’ అంటాడు. గమ్యం లేని ప్రయాణం నిరర్థకం అంటాడు బుద్ధుడు. సాహిత్యానికి కూడా గమ్యం వుండాలి. సాహిత్యం అంతిమ లక్ష్యం మనిషే! ఆ మనుషులు నిత్యం ఎదుర్కొనే సమస్యలు కథావస్తువు కావాలి. ‘రూబిడి’ అంటే నిర్ధారణ, నిరూపణ. భూమి సమస్య, పేదరికం, ఆర్థిక దోపిడి, హీనమవుతున్న మానవ సంబంధాలు, కార్పొరేట్‌ కంపెనీ ఆధిపత్యం, కులం, మతం, అగ్రకులాల దోపిడి, అధికార రాజకీయాలు, వారసత్వ ఎత్తుగడలు, రాజ్యాధికారం ఈ రూబిడిలోని ప్రధాన వస్తువులు. తెలంగాణ కథా సంకలనంగా వస్తున్న ఈ కథలు నిజానికి ఈ దేశ సామాజిక, ఆర్థిక సమస్యలు కూడా!

రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏండ్లు గడుస్తున్నా మనకు మనం నిర్దేశించుకున్న ఏ ఆశయాలను సాధించుకోలేక పోయాము. ‘అంతా బాగుంది’ అనే నినాదం వెనుక గల డొల్లతనాన్ని ఈ కథలు ఎత్తి చూపుతున్నాయి. భారత స్వాతంత్య్రంలాగే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా సర్వరోగ నివారిణి కాదనీ, ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలకు కూడా బలహీనతలుంటాయనీ ఈ కథలు నిరూపిస్తున్నాయి. బానిసకొక బానిస (స్నేహ), పెసిరెంట్‌ పోశెట్టి (నాగవర్ధన్‌ రాయల), ఏకగ్రీవం (పెద్దింటి అశోక్‌కుమార్‌), భూమాట (వడ్డెబోయిన శ్రీనివాస్‌), అలివి వల (ఉదయమిత్ర), గుండె నిండా జీలుబండ (గుడిపల్లి నిరంజన్‌), ఆరుతప్పులు (కావేటి సరిత), గడీ (చందు తులసి), ఇత్తరాకుల కట్ట (మేడి చైతన్య), ఎక్కాలు రానోడు (హనీఫ్‌), కొండ (పూడూరి రాజిరెడ్డి), జొండ్ల పాతర (మంగారు రమేష్‌ యాదవ్‌)–– ఈ సంకలనం తెలంగాణ

సమాజాకాశం మీద విరిసిన ఒక పన్నెండు రంగుల సింగిడి. ఒక్కోకథ ఒక సమకాలీన సమాజ శిథిల వర్ణచిత్రం. మౌనంగా బాధితుల పక్షాన వినిపించే ధర్మాగ్రహం. ఇందులో సీనియర్‌ కథకులతో పోటీ పడుతూ రాసిన నాలుగు బలమైన కొత్త గొంతులున్నాయి. ఈ పన్నెండు కథలను ఎంపిక చేయడంలో వస్తువు, శైలి, శిల్పాలతో పాటు భాషను ఒక ప్రాతిపదికగా తీసుకున్నాం. ఇందులోని దాదాపు అన్ని కథలు తెలంగాణ తెలుగును ఎంతో సమర్థవంతంగా ఉపయోగించుకున్న కథలు. తద్వారా తెలంగాణ భాషా సౌందర్యం ఇప్పటి తరాలకు అందించినట్టు కూడా అవుతుందనేది మరో ప్రణాళిక.       
- సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్‌     

రూబిడి (తెలంగాణ కథ – 2019)
సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్, డాక్టర్‌ వెల్దండి శ్రీధర్‌; పేజీలు: 128; వెల: 70; ప్రతులకు: నవోదయా బుక్‌ హౌజ్, కాచిగూడ, హైదరాబాద్‌. సంగిశెట్టి ఫోన్‌: 9849220321 

మరిన్ని వార్తలు