World Elephant Day 2021: ఏనుగమ్మ

12 Aug, 2021 00:18 IST|Sakshi
గజరక్షకి సంగీతా అయ్యర్‌

నేడు ప్రపంచ ఏనుగుల దినోత్సవం

ఏనుగమ్మ ఏనుగు... బాల్యం ఏనుగుతో మొదలవుతుంది. తాతలు, నానమ్మలు వీపు మీద పిల్లలను కూచోబెట్టి ఏనుగాట ఆడతారు. ఏనుగును విఘ్నేశ్వరుడిగా పూజించుకుంటాం. కాని ఏనుగుల గురించి పట్టించుకుంటున్నామా? ప్రపంచంలో 40 వేల ఆసియా ఏనుగులు ఉంటే వాటిలో దాదాపు 27 వేలు మన దేశంలో ఉన్నాయి. వీటిలో మగ ఏనుగుల శాతం దారుణంగా పడిపోయింది. వినోదం కోసం, సాంస్కృతిక ఉత్సవాల కోసం వాటిని బంధించి పెట్టే సంస్కృతి ఉంది. అవన్నీ ఏనుగుల స్వేచ్ఛను హరించేవే అంటారు సంగీతా అయ్యర్‌. ‘ఏనుగుల రక్షకురాలి’గా పేరుపొందిన సంగీత ఏనుగుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఏనుగమ్మ అయారు. ఆమె తీసిన 26 భాగాల డాక్యు సిరీస్‌ నేడు టీవీలో టెలికాస్ట్‌ కానుంది.

డైనోసార్లు అంతరించి పోయాయంటే మన కాలంలో కాదు కనుక కారణాలు కచ్చితంగా తెలియవు కనుక ఏమిటో అనుకోవచ్చు. కాని ఆఫ్రికా ఏనుగులు ‘ప్రమాదం’లో ఉన్నాయని, ఆసియా ఏనుగులు ‘అంతరించిపోయే’ జాబితాలో ఉన్నాయని తెలిస్తే అందుకు కారణం వర్తమానంలో మనిషి తప్పిదం తప్ప, మనిషి నిర్దాక్షిణ్యం తప్ప, మనిషి బాధ్యతారాహిత్యం తప్ప మరొకటి కాదు. అంత పెద్ద జంతువును వేటాడి, వెంటాడి, చంపి, దాని దంతాల కోసం దారుణంగా నిర్మూలించాలని చూసే మనిషి దుర్మార్గానికి ఏమని పేరు పెట్టగలం? అడవుల్లో ఉన్న ఏనుగుల బాధ ఒకవైపు ఉంటే మనిషి తన మాలిమి కోసం వాటిని చేరదీసి, బంధించి వాటికి పెట్టే బాధ మరోవైపు. ఇవన్నీ ఎంతకాలం అని అడుగుతారు సంగీతా అయ్యర్‌. ‘నేనే గనుక ప్రధానిని అయితే ఈపాటికి దేశంలోని ఏనుగులన్నీ స్వేచ్ఛాగాలులు పీలుస్తూ ఉండేవి’ అంటారామె.

బాల్యం నుంచి బంధం
కేరళ పాలక్కాడ్‌ జిల్లాలోని అళత్తూరులో పుట్టి పెరిగిన సంగీత చిన్నప్పుడు తన తాతయ్య, నానమ్మతో దగ్గరిలోని దేవస్థానానికి వెళ్లేవారు. అక్కడ పెద్దలు గుడి దర్శనంలో ఉంటే సంగీత దేవస్థానంలో కట్టేసి ఉన్న ఏనుగును చూస్తుండేవారు. ‘ఏనుగు కాళ్లకు ఉన్న పెద్ద పెద్ద సంకెళ్లను చూసి మా నానమ్మను అవి ఎందుకున్నాయి అని అడగడం మొదలుపెట్టాను. వాళ్లు ఏం చెప్పినా నేను సమాధాన పడలేదు. అప్పుడు మా నానమ్మ నా కాళ్లకు పట్టీలు వేసి ఇప్పుడు నీకూ ఉన్నాయిగా అని చెప్పింది. కాని ఏనుగులకు ఉన్న సంకెళ్లు రెండు కాళ్లను కదలకుండా చేసేలా ఉన్నాయి. నాకు అలా లేవు అని చెప్పాను. అప్పుడే ఏనుగుల గురించి నా మనసులో పడింది’ అంటారు సంగీత.

కెనడా నుంచి తిరిగి వచ్చి
కాలక్రమంలో సంగీత జర్నలిస్ట్, వీడియోగ్రాఫర్‌ అయ్యి కెనడాలో స్థిరపడ్డారు. కాని 2013లో భారత్‌కు వచ్చినప్పుడు కేరళలోని దేవస్థానాలు తిరుగుతున్నప్పుడు దారుణంగా గాయాలైనా సరే సంకెళ్లతో బంధించి ఉన్న  ఏనుగులను చూసి చలించిపోయారు. ‘కేరళలో ఉత్సవాల కోసం మగ ఏనుగులను మాలిమి చేస్తారు. కాని అవి వయసులోకి వచ్చినప్పుడు మదంతో ప్రవర్తించకుండా ఉండేందుకు సంకెళ్లతో కట్టి దారుణంగా కడుపు మాడుస్తారు. జబ్బు చేసినా, చూపు మందగించినా ఉత్సవాల్లో నిలబెడతారు. దీని మీద గొంతెత్తాలని నిశ్చయించుకున్నాను’ అంటారు సంగీత. అప్పుడే ఆమె ‘గాడ్స్‌ ఇన్‌ షాకల్స్‌’ డాక్యుమెంటరీ తీశారు. మానవ హింస వల్ల ఆ తర్వాతి కాలంలో పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌తో ఏనుగులు ఎలా బాధ పడతాయో ఈ డాక్యుమెంటరీలో చూపించారు. ఆమె తీసిన ఈ డాక్యుమెంటరీ ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో స్క్రీన్‌ అయ్యింది. అంత గొప్పగా ఆమె సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లింది.

మనిషే శత్రువు
‘ఏనుగులకు మనిషే శత్రువు. నిజానికి ఏనుగులు మనిషిని ఎంతో ప్రేమిస్తాయి. మనిషికి సాయం చేసేందుకు చూస్తాయి. గిరిజనులకు వాటితో పాటు ఎలా అడవిలో జీవించాలో తెలుసు. కాని నాగరీకులు అడవిగా ఉండాల్సిన దానిని వ్యవసాయంలోకి తెచ్చి ఏనుగులు తిరగాల్సిన భూమిని కుదిస్తున్నారు. వాటి నీటి ఆవాసాలను ఆక్రమిస్తున్నారు. అవి తిరుగాడే స్థలంలో పంటలు వేసి ఆ పంటల్ని అవి తినకుండా కరెంటు తీగలు ఏర్పాటు చేస్తున్నారు. కరెంట్‌ షాక్‌ కొట్టి ఏనుగులు చనిపోవడం ఎంత అన్యాయం’ అంటారు సంగీత. ‘ఎక్కడైతే ఏనుగులు తిరగాల్సిన భూమి ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉందో ఆ భూమిని ప్రభుత్వం తిరిగి కొని ఏనుగులకు వదిలిపెడితే సగం సమస్య తీరుతుంది’ అంటారు సంగీత. ‘రైల్వే అధికారులు ఏనుగులు ఉండే ప్రాంతంలో రైళ్ల వేగం అదుపు చేస్తే, ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులు రోడ్లపై వాహనాల వేగం అదుపు చేస్తే, విద్యుత్‌ అధికారులు కంచెలకు కరెంట్‌ లేకుండా అడ్డుకుంటే చాలా ఏనుగులు ప్రాణాలతో మిగులుతాయి’ అంటారు సంగీత.


ఆసియన్‌ ఎలిఫెంట్స్‌ 101
సంగీత అయ్యర్‌ తీసిన తాజా డాక్యు సిరీస్‌ ‘ఏసియన్‌ ఎలిఫెంట్స్‌ 101’ మనిషి–ఏనుగు కలిసి చేయాల్సిన సహవాసం గురించి చర్చిస్తుంది. మనిషి బంధనాల్లో దారుణంగా దెబ్బ తిన్న ఏనుగుల కోసం, అడవి నుంచి బయటపడిన ఏనుగు పిల్లల కోసం అస్సాంలో, కర్నాటకలో, కేరళలో రిహాబిలేషన్‌ సెంటర్లు ఉన్నాయి. అక్కడ వాటి బాగోగులను చూపిస్తుంది. అంతే కాదు వాటి బాగు కోసం పర్యావరణ కార్యకర్తలకు శాంక్చరీలను తెరిచే అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తుంది.

మావటీలకు ఇవ్వాల్సిన శిక్షణ, ఏనుగుల కాళ్లకు అవసరమైన కేరింగ్, వాటి ఆహారం, స్నానం, ప్రాణాంతక జబ్బుల గురించి వైద్యం... వీటన్నింటినీ చర్చిస్తుంది. ఈ సిరీస్‌లోని కొన్ని భాగాలు నేడు జియో టీవీ ఇండియాలో ప్రసారం కానున్నాయి. ఏనుగుల సంరక్షణ కోసం ‘వాయిస్‌ ఆఫ్‌ ఏసియన్‌ ఎలిఫెంట్స్‌ సొసైటీ’ అనే సంస్థ నడుపుతున్న సంగీత ఏనుగులకు సిసలైన రక్షకురాలు. కాని ప్రజలు ఇలాంటి వారికి తోడు నిలిచినప్పుడే గజరాజు నిజంగా అడవికి రాజయ్యి మనుగడ సాగిస్తాడు.

మరిన్ని వార్తలు