Sankranthi Special: సున్నుండలు, పూతరేకులు.. ఇంట్లోనే.. ఇలా అయితే 15 రోజుల వరకు తాజాగా

10 Jan, 2022 10:36 IST|Sakshi

Sankranti Special Food Items In Andhra: సంక్రాంతి... పండుగ సమీపిస్తోంది. అమ్మ పిండివంటలు చేసేందుకు సిద్ధమవుతోంది. రుచితో పాటు ఆరోగ్యాన్ని పెంచే వంటకాలను మనకోసం తయారు చేస్తుంది. మరి ఆ పనిలో మనం కూడా మనకు తోచిన సాయం చేయాలి కదా! ఎందుకు ఆలస్యం! ఏటా వచ్చే సంక్రాంతి రుచినే కొత్తగా ఆస్వాదించాలనుకునే వారు సున్నండలు, కజ్జికాయలు, పూతరేకులను ఇలా ఇంట్లోనే తయారు చేసుకోండి.

సున్నుండలు
కావలసినవి: మినప్పప్పు– పావు కేజీ, పెసరపప్పు– పావుకేజీ, బెల్లం– 400గ్రా., ఏలకుల పొడి– ఒక టీ స్పూను, నెయ్యి– 200గ్రా.


 

తయారీ: మందపాటి బాణలిలో నూనె లేకుండా మినప్పప్పు, పెసరపప్పులను దోరగా వేయించుకుని పొడి చేయాలి ∙ఆ పొడిలో బెల్లం పొడి, ఏలకుల పొడి, నెయ్యి వేసి కలపాలి ∙అన్నీ సమంగా కలిసిన తరువాత కావలసిన సైజులో ఉండలు చేయాలి ∙నెయ్యి వాడకాన్ని తగ్గించాలనుకుంటే నేతిని పిండిలో కలపకుండా చేతికి కాస్త రాసుకుంటూ ఉండలు చేసుకోవాలి.
 

గమనిక: మినప్పప్పు, పెసరపప్పులను విడిగా వేయించుకుంటే మంచిది లేదా ముందుగా మినప్పప్పు వేసి ఒక మోస్తరుగా వేగిన తరువాత పెసరపప్పును వేయాలి.

కజ్జికాయలు
కావలసినవి: మైదా పిండి లేదా గోధుమ పిండి – ఒక కేజి, నువ్వులు – ఒక కేజి, బెల్లం – 800గ్రా., ఏలకులు– 10 గ్రా., జీడిపప్పు– వందగ్రాములు
నెయ్యి లేదా నూనె– వేయించడానికి కావలసినంత.

తయారీ: ∙పిండిని చపాతీలకు కలుపుకున్నట్లుగా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి.
మిగిలినవి సిద్ధం చేసుకునే లోపుగా ఇది బాగా నానుతుంది
నువ్వులను దోరగా వేయించి చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకుగా గ్రైండ్‌ చేయాలి.
బెల్లాన్ని పొడి చేసి అందులో ఏలకుల పొడి వేసి అన్నీ సమంగా కలిసే వరకు కలపాలి

జీడిపప్పును నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి
గోధుమ పిండిని చిన్న చిన్న రౌండ్లు చేసుకోవాలి.
ఒక్కొక్క రౌండును ప్రెస్సర్‌తో పూరీలా వత్తుకుని దానిని సాంచిలో పరిచి అందులో ఒక స్పూను నువ్వులు, బెల్లం మిశ్రమాన్ని, ఒక జీడిపప్పును పెట్టి సాంచిని మూత వేయాలి. కజ్జికాయ ఆకారం వస్తుంది

సాంచిలో నుంచి తీసి కజ్జికాయను మరుగుతున్న నూనెలో వేసి దోరగా కాలనివ్వాలి
ఇవి దాదాపుగా ఇరవై రోజుల వరకు తాజాగా ఉంటాయి
‘సాంచి’ అంటే చెక్కతో చేసిన మౌల్డ్‌. ఇందులో పూరీని పెట్టి మడత వేస్తే అంచులు నొక్కుకుని పిండి అతుక్కుపోతుంది ∙లోపల పెట్టిన మిశ్రమం బయటకు రాకుండా ఉంటుంది ∙దీనికి బదులుగా వెనుక చక్రం ఉండే స్పూనులు కూడా ఉంటాయి ∙వాటిని కూడా వాడవచ్చు.

గమనిక: కజ్జికాయలను నేతిలో వేయిస్తే రుచి పెరుగుతుంది కాని, కజ్జికాయలు త్వరగా మెత్తబడతాయి ∙ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే నూనెతో చేసుకోవడం మంచిది.

పూతరేకులు
కావలసినవి: చక్కెర లేదా బెల్లం– ఒక కేజి, సగ్గుబియ్యం– ముప్పావు కేజి, జీడిపప్పు– పావుకేజి, బాదంపొడి–100 గ్రా, ఏలకులు– 50గ్రా., నెయ్యి– 100 గ్రా.

తయారీ: తెల్లగా, మెత్తగా చూడగానే నోరూరుతూ పూతరేకులు చుట్టడం సులభమే కాని అందుకోసం రేకులను తయారు చేసుకోవడం మాత్రం కొంచెం కష్టమే.
ఇందుకు ప్రత్యేకంగా కుండలు దొరుకుతాయి
ముందుగా సగ్గుబియ్యాన్ని ఉడికించి చిక్కటి గంజి చేసుకోవాల
∙కుండను మంట మీద బోర్లించి వేడెక్కిన తరువాత సగ్గుబియ్యం గంజిలో ముంచిన క్లాత్‌ను పరిచి తీసేయాలి
∙గంజి కుండకు అంటుకుని వేడికి పలుచని పొరలాగా వస్తుంది
ఆ పొర విరిగిపోకుండా అట్లకాడతో జాగ్రత్తగా తీయాలి
ఇలా ఎన్ని రేకులు కావాలంటే అన్నింటికీ ఇదే పద్ధతి

రేకు ఏ సైజులో కావాలంటే క్లాత్‌ను ఆ సైజులో కట్‌ చేసుకోవాలి ∙ఇందుకు కాటన్‌ క్లాత్‌ను వాడాలి 
∙చక్కెర, జీడిపప్పు, ఏలకులను పొడి చేసి కలుపుకోవాలి
ఇప్పుడు రేకులను రెండు పొరలు తీసుకుని వాటికి నెయ్యిరాసి ఆ పైన చక్కెర లేదా బెల్లం పొడి, జీడిపప్పు, బాదం పొడి మిశ్రమాన్ని పలుచగా వేసి పైన మరొక పొర రేకును వేసి మడత వేయాలి. ఇవి పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి
ఎక్కువ మోతాదులో రేకులను తయారు చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కెర లేదా బెల్లంపొడి మిశ్రమాన్ని వేసి తాజాగా రేకులను చుట్టుకోవచ్చు.

మరిన్ని వార్తలు