రావమ్మా పౌష్యలక్ష్మి ఇవ్వమ్మా.. సిరులు కొలిచి

14 Jan, 2021 00:41 IST|Sakshi

సూరీడు ప్రతినెలలోనూ ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతుంటాడు. అయితే ఆయన ధనూరాశి నుండి మకరరాశిలోనికి ప్రవేశించడానికే ఉత్తరాయణమని పేరు. ఈ ఉత్తరాయణంతోనే భూమి తిరిగే దిశ మారుతుంది. దేవతలకు ఉత్తరాయణం పగటికాలం అనీ, ఇది వారికి చాలా ఇష్టమైన సమయమనీ చెబుతారు. అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని పిలుస్తారు. మకర సంక్రాంతి పర్వదినాన అయ్యప్ప స్వామి భక్తులు స్వామి వారిని మకర జ్యోతిరూపంలో దర్శనం చేసుకుంటారు.

పెద్ద పండుగ అని ఎందుకంటారు?
సంక్రాంతిని పెద్ద పండుగ అనటానికి మరో కారణమేమిటంటే తొలిపంట ఇంటికి వచ్చే సమయంలో అన్నదాతలు ఎంతో ఆనందంగా ఉంటారు. కళకళలాడుతున్న పంటపొలాలను, పండబోయే దిగుబడిని తలుచుకొని సంతోషపడుతుంటారు. జనావళికి అన్నం పెట్టే అన్నదాత ఆనందానికి మించిన పండుగ ఇంకేముంటుంది? అందుకే శ్రమకు, సంపదకు గొప్ప స్థానమిచ్చే ఈ సంక్రాంతి పండుగను బీద, గొప్ప అనే తేడా లేకుండా అందరూ ఘనంగా జరుపుకుంటారు. కర్షకులు ఆనందంలో పాలుపంచుకుంటారు. సంక్రాంతి వచ్చేది పుష్యమాసంలోనే కాబట్టి ఈ పండుగను పౌష్యలక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తారు. రైతులు తమకు సంవత్సరమంతా సేవలు అందించిన వివిధ వృత్తిదారులకు సంక్రాంతినాడు ఏడాదికి సరిపడా ధాన్యం కొలిచి ఇస్తుంటారు పల్లెటూళ్లలో.

విష్ణుపూజతో విశేషమైన పుణ్యం
సంక్రాంతి రోజు స్నానం చేసిన తరువాత నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. నువ్వులు, బియ్యం కలిపి శివుని అర్చించిన పిమ్మట ఆవునేతితో అభిషేకం చేయాలి. విష్ణువును, పౌష్యలక్ష్మిని పూజించి విష్ణుసహస్ర నామ పఠనం చేయాలి. తర్వాత లోకబాంధవుడు, ప్రత్యక్షనారాయణుడైన సూర్యభగవానుడిని పూజించి కొత్తబియ్యంతో పొంగలి, పులగం తయారుచేసి, పాలు పొంగించి భక్తిప్రపత్తులతో ఆయనకు నివేదించడం శుభప్రదం. మకర సంక్రాంతి పితృపూజలకు అనుకూలమైన దినం కాబట్టి నువ్వులతో పితరులకు తర్పణ విడవాలి. భోజనంలో మంచి గుమ్మడి కూర ఉండేట్లు చూసుకోవాలి. చక్కెర పాకంలో నువ్వులు కలిపి చేసిన ఉండలను భుజించడం, చుట్టుపక్కల వారికి, స్నేహితులకు, హితులకు పంచిపెట్టడం వల్ల బాంధవ్యాలు పెంపొందుతాయి.

సంక్రాంతి దానాలు దివ్యఫలాలు
సంక్రాంతి నాడు పితృ దేవతలకు, అర్హులకు ఏమి దానం చేస్తామో అవి ముందుజన్మలలో కూడా మనకు ఫలితాన్నిస్తాయి. అందుకే ఈ రోజు ఎవరి ఇంటా ‘లేదు’అనే మాట రాకూడదని పెద్దలు చెబుతారు. అలాగే సంక్రమణ కాలంలో ధాన్యం, గోవులు, కంచు, బంగారం లాంటివి దానం చేయటం ఉత్తమం. వీటిని దానం చేసేంత శక్తి లేనివారు నువ్వులు లేదా నెయ్యి లేదా వస్త్రాలను దానం చేయాలి. ఉత్తరాయణ పుణ్యకాలంలో కూష్మాండం అంటే గుమ్మడి పండును దానం చేస్తే మంచిదని ప్రతీతి. ముత్తయిదువలు మంగళకరమైన ద్రవ్యాలు అంటే పసుపు, కుంకుమ, అద్దం, దువ్వెన, బొట్టుపెట్టె, రవికల గుడ్డ వంటివి వాయనమివ్వాలి. చిన్నవాళ్లందరూ పెద్దలకు పాదాభివందనాలు చేసి ఆశీర్వాదాలు తీసుకోవాలి.

పతంగుల పండగ
సంక్రాంతిని తెలంగాణలో పతంగుల పండగగా జరుపుకుంటారు. పిల్లలు, పెద్దలందరూ  ఉల్లాసోత్సాహాలతో పతంగులు ఎగుర వేస్తారు. దీని వల్ల జీవితాన్ని సమతౌల్యంలో ఉంచడం చేతనవుతుందని నమ్ముతారు. పౌరాణిక పరంగా చూస్తే సంక్రాంతితో తదేవతలకు పగటికాలం ప్రారంభమవుతుంది కాబట్టి వారి దృష్టిని ఆకర్షించేందుకు పతంగులు ఎగరవేస్తారని చెబుతారు. 

పశువులను పూజించే కనుమ
సంక్రాంతి అంటే పంటల పండుగే అని అందరికీ తెలిసిందే. కానీ ఆ పంటలు బాగా పండాలంటే, పశువుల సాయం కావాలిగా! అందుకే సంక్రాంతి మర్నాడు కనుమని పశువుల పండుగగా పిలుస్తారు. పశువులు ఉన్నవారు ఆ రోజు వాటిని శుభ్రంగా అలంకరించి మంచి ఆహారం పెడతారు. పక్షులకి కూడా ఆహారం అందేలా ఇంటిచూరుకి ధాన్యపుకంకులు వేలాడదీస్తారు.

కనుమ రోజు అటు పెద్దలకి ప్రసాదం పెట్టేందుకు, ఇటు ఇంట్లోవారు కడుపు నిండా తినేందుకు... మాంసాహారాన్ని మించి ఏముంటుంది. అందుకనే గారెలు, మాంసంతో పెద్దలకి పెట్టుకుంటారు. మాంసం తినని వారికి, దాంతో సమానమైన పోషకాలని ఇచ్చేవి మినుములే కాబట్టి మినప గారెలు చేసుకుంటారు. అందుకే ‘కనుమ రోజు మినుము...’ అనే సామెత మొదలైంది. మినుములు చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి.

కనుమ రోజు పెద్దల కోసం విందుభోజనం తయారు చేయడమే కాదు... దాన్ని అందరూ కలిసి తినాలనే నియమం కూడా ఉంది. అందుకే అక్కాచెల్లెళ్లు, అల్లుళ్లతో కలిసి ఈ కనుమ వేడుకని చేసుకుంటారు. పొద్దున్నే పశువులని పూజించుకోవడం, మధ్యాహ్నం పితృదేవతలకి ప్రసాదాలు పెట్టి సుష్టుగా భోజనం చేయడం... అంతా కలిసే చేస్తారు. 

కనుమ రోజు ప్రయాణం చేయకూడదా?
కనుమ రోజు ఇంత హడావుడి ఉంటుంది కాబట్టి, ఆ రోజు కూడా ఆగి... పెద్దలను తల్చుకుని, బంధువులతో కాస్త సమయం గడిపి, విశ్రాంతి తీసుకుని... మర్నాడు ప్రయాణించ మని చెబుతారు. అందుకే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అన్న సామెత పుట్టి ఉండవచ్చు. కనుమ రోజు ప్రయాణం చేయకూడదని పెద్దలు చెప్పిన మాట వెనుక ఇంత కథ ఉంది. అత్యవసరం అయితే తప్ప.. ఆ మాట దాటకూడదనీ... ఒకవేళ కాదూకూడదంటూ కనుమ రోజు ప్రయాణం చేస్తే ఆటంకాలు తప్పవని అంటారు. సంక్రాంతిని తమిళనాడులో కూడా బాగా జరుపుకుంటారు. వారు దీనిని పొంగల్‌గా జరుపుకుంటే పంజాబ్‌లో లోహిరిగానూ, రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాలలో ఉత్తరాయన్‌గానూ జరుపుకుంటారు.
– డి.వి.ఆర్‌. భాస్కర్‌
ఫోటో: నోముల రాజేశ్‌రెడ్డి, సాక్షి, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు