Sankranti Special Recipes: నోరూరించే అరిశెలు.. కరకరలాడే సకినాలు.. నువ్వుల్లో మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్‌.. కాబట్టి

7 Jan, 2022 14:52 IST|Sakshi

కొత్త క్యాలెండర్‌ వచ్చింది. సంక్రాంతి తేదీని తెచ్చింది. నాన్న కొత్త దుస్తులు తెచ్చాడు. అమ్మ పిండివంటలకు సిద్ధమవుతోంది. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎప్పుడూ చేసే అరిశెలేనా! మరి... అరిశె బదులు మరేం చేసినా... సంక్రాంతి... పండుగ కళ తప్పుతుంది. అందుకే ఆరోగ్యాన్ని పెంచే అరిశెలనే చేద్దాం. అరిశెలతోపాటు మరికొన్నింటినీ చేద్దాం. ఏటా వచ్చే సంక్రాంతి రుచినే కొత్తగా ఆస్వాదిద్దాం. 

సంక్రాంతి పిండివంటల్లో ఉపయోగించే దినుసులన్నీ ఆరోగ్యకరమైనవే. బెల్లంలో ఐరన్‌ ఉంటుంది. నువ్వుల్లో మోనో అన్‌శాచురేటెడ్‌ ఫ్యాట్‌ ఉంటుంది. ఇది మహిళల్లో హార్మోన్‌ లెవెల్స్‌ను మెయింటెయిన్‌ చేస్తుంది. జంక్‌ ఫుడ్‌ మాదిరిగా వీటిని తినగానే ఒంట్లో గ్లూకోజ్‌ లెవెల్స్‌ పెరగడం జరగదు. నెమ్మదిగా డెవలప్‌ అవుతాయి. వీటిలో పోషకాలు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పండుగలకే కాకుండా రోజూ స్నాక్స్‌గా తీసుకుంటే మంచిది.

ఎక్కువ మోతాదులో తిన్నప్పుడు ఒంట్లోకి ఎక్కువ కేలరీలు చేరిపోవడంతో అధిక బరువు సమస్య వస్తుంటుంది. చక్కటి డైట్‌ ప్లాన్‌తో వీటిని రోజుకు ఒకటి తింటే మంచిది. పిల్లలకు స్కూల్‌కి ఇతర స్నాక్స్‌కు బదులుగా వీటిని అలవాటు చేయవచ్చు. సహజంగా పోషకాలు, కేలరీలు అందుతాయి. వీటిని తిన్న తరువాత పిల్లలకు కాని పెద్దవాళ్లకు కాని చిప్స్‌ వంటి ఇతర జంక్‌ఫుడ్‌ మీదకు మనసు పోదు. అయితే వీటిని తయారు చేయడానికి మంచినెయ్యి వాడాలి.


 

అరిశెలు
కావలసినవి: బియ్యం – ఒక కిలో
బెల్లం – 800 గ్రా.,
నువ్వులు, గసగసాలు– కొద్దిగా
నెయ్యి లేదా నూనె– కాల్చడానికి సరిపడినంత (సుమారుగా ఒక కేజీ తీసుకుంటే చివరగా బాణలిలో పావుకేజీ మిగులుతుంది)

తయారీ: అరిశెలు చేయడానికి ముందు రోజు నుంచి ప్రిపరేషన్‌ మొదలు పెట్టాలి.
బియ్యాన్ని ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టాలి.
ఉదయాన్నే నీళ్లను వంపేసి తడిగా ఉన్నప్పుడే దంచాలి.
దంచిన పిండిని సన్నని రంధ్రాలున్న జల్లెడతో జల్లించాలి ∙జల్లించేటప్పుడు పిండి ఆరిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి.
గాలికి ఆరకుండా ఎప్పటికప్పుడు ఒకపాత్రలో వేసి అదిమి మూత పెట్టాలి ∙పిండి సిద్ధమయ్యాక బెల్లాన్ని పాకం పట్టాలి 


పెద్దపాత్రలో ఒక గ్లాసు నీరు, పొడి వేసి పాకం వచ్చేదాకా మరగనిచ్చి బియ్యప్పిండి కలుపుకుంటే పాకం పిండి సిద్ధం. ఇప్పుడు బాణలిలో నూనె లేదా నెయ్యి పోసి కాగనివ్వాలి ∙పాకంపిండిని చపాతీకి తీసుకున్నట్లుగా తీసుకుని గోళీ చేసి గసాలు లేదా నువ్వులలో లేదా రెండింటిలోనూ అద్దాలి.

ఇలా అద్దినట్లయితే అవి పిండికి చుట్టూ అంటుకుంటాయి ∙అప్పుడు పాలిథిన్‌ పేపర్‌ మీద పెట్టి వేళ్లతో వలయాకారంగా అద్ది కాగిన నూనెలో వేసి దోరగా కాలిన తర్వాత తీసి అరిశెల పీట మీద వేసి అదనంగా ఉన్న నూనె కారిపోయేటట్లు వత్తాలి ∙అరిశెల పీటకు బదులుగా రంధ్రాలున్న చెక్కలుంటాయి ∙వీటితో బాణలిలో నుంచి తీసేటప్పుడే నూనె వదిలేటట్లు వత్తేయవచ్చు.

గమనిక:– అరిశె నొక్కులు పోకుండా వలయాకారంగా అంతా ఒకే మందంలో రావాలంటే చేతితో అద్దడానికి బదులుగా పూరీ ప్రెస్సర్‌ వాడవచ్చు ∙అరిశె మెత్తగా రావాలంటే పాకం లేతగా ఉన్నప్పుడే బియ్యప్పిండి కలుపుకోవాలి. గట్టిగా ఎక్కువ తీపితో కావాలనుకుంటే పాకం ముదరనివ్వాలి.

ఒక ప్లేటులో నీళ్లు పోసి ఉడుకుతున్న బెల్లం మిశ్రమాన్ని స్పూనుతో కొద్దిగా తీసుకుని నీటిలో వేయాలి. దీనిని చేత్తో నొక్కి రౌండ్‌ చేయాలి. జారి పోకుండా రౌండ్‌ వచ్చిందంటే పాకం వస్తున్నట్లు. ఆ రౌండ్‌ను పైకెత్తి ప్లేటు మీద వేసినప్పుడు మెత్తగా జారిపోకుండా అలాగే ఉంటే పాకం వచ్చినట్లు.

ముదురు పాకం కావాలనుకుంటే ఆ పాకం బాల్‌ ప్లేటుకు తగిలినప్పుడు ఠంగున శబ్దం వచ్చే దాకా మరగనివ్వాలి. ఇవి పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి. తినేటప్పుడు పెనం మీద సన్న సెగకు వేడి చేస్తే అప్పటికప్పుడు చేసిన అరిశెలాగా వేడిగా, మెత్తగా వస్తాయి. ఒవెన్‌ ఉంటే అందులో కూడా వేడి చేసుకోవచ్చు.

సకినాలు
కావలసినవి: కొత్త బియ్యం– అరకిలో, వాము– ఒక టేబుల్‌ స్పూన్, నువ్వులు– పావు కప్పు, ఉప్పు– రుచికి తగినంత, నూనె– వేయించడానికి తగినంత.

తయారీ: బియ్యాన్ని కడిగి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నీటిని వంపేసి మెత్తగా పిండి పట్టాలి. పిండిని జల్లించిన తర్వాత ఆ పిండిలో వాము, నువ్వులు, ఉప్పు వేసి కలపాలి. ఈ పొడి మిశ్రమంలో తగినంత నీటిని పోస్తూ ముద్దలా కలుపుకోవాలి.

కాటన్‌ క్లాత్‌ను తడిపి పలుచగా పరిచి దాని మీద పిండిని సకినాల ఆకారంలో చేత్తో చుట్టూ అల్లాలి. పది నిమిషాల సేపు ఆరనివ్వాలి.
ఈ లోపు బాణలిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత ఆరిన సకినాన్ని నూనెలో వేసి రెండువైపులా దోరగా కాలనిచ్చి తీసేయాలి.
పిండిని చేతిలోకి తీసుకుని వేళ్లతో సన్నని తాడుగా వలయాకారంగా చేయడానికి నైపుణ్యం ఉండాలి  సకినాలు చేయడంలో అసలైన మెలకువ అదే. 

చదవండి: Radish Health Benefits: ముల్లంగి రసం తాగుతున్నారా.. అయితే..


 

మరిన్ని వార్తలు