క్రిస్మస్‌ వేళ.. మమ్మీ.. శాంటా ఏమిచ్చాడో చూడు..

22 Dec, 2022 09:03 IST|Sakshi

మమ్మీ... శాంటా ఏమిచ్చాడో చూడు.. శాంటా వస్తాడట... గిఫ్ట్స్‌ ఇస్తాడట... మమ్మీ... నాక్కూడా ఇస్తాడా?. డాడీ... నేనడిగింది ఇస్తాడా? పిల్లలు... బంగారు కొండలు. శాంటా వారికి ఇష్టమైన తాతయ్య. కానుకలిచ్చే తాతయ్య. పిల్లల్ని మంచి మార్గంలో పెట్టడానికి మంచి బుద్ధులు చెప్పడానికి చదువులో ప్రోత్సహించడానికి ఊరికే సంతోషపెట్టడానికి అర్ధరాత్రి దిండు కింద కానుకలు పెట్టి తల్లిదండ్రులే శాంటాలు అవుతారు. పిల్లలు ఈ సంతోషానికి హక్కుదారులు. పెద్దలు ఈ సంతోషం పంచాల్సిన బాధ్యత కలిగిన వారు. క్రిస్మస్‌ను సంతోషమయం చేయండి. పిల్లలను ఈ కానుకలతో ఎలా ప్రోత్సహించవచ్చు?. ఏ కానుకలు ఇవ్వొచ్చు?

‘అమ్మా... శాంటా క్లాజ్‌ ఎక్కడ ఉంటాడు?’
‘నార్త్‌ పోల్‌లో’
‘ఎప్పుడు వస్తాడు?’
‘రేపు క్రిస్మస్‌ అనగా ఇవాళ రాత్రి వస్తాడు’
‘ఎలా వస్తాడు?’
‘ఎగిరే జింకల బగ్గీ మీద బోలెడన్ని గిఫ్ట్స్‌ వేసుకుని, ఏయే పిల్లాడికి ఏయే గిఫ్ట్‌ ఇవాలో వాటి మీద పేరు రాసుకుని వస్తాడు’
‘మన ఇంటికి వస్తాడా?’
‘ఎందుకు రాడు?’
‘నాకు గిఫ్ట్‌ ఇస్తాడా?’
‘ఇస్తాడు. మంచి పిల్లలకు మంచి గిఫ్ట్‌ ఇస్తాడు. అల్లరి పిల్లలకు గిఫ్ట్‌ ఇవ్వడు’
‘నేను మంచి పిల్లాడినేగా’
‘నాకేం తెలుసు. నీకు తెలియాలి’
‘నేను అల్లరి చేయనుగా’
‘అయితే నీకు గిఫ్ట్‌ తెచ్చిస్తాడులే’
∙∙ 
క్రిస్మస్‌ వచ్చిందంటే పిల్లలందరికీ క్రిస్మస్‌ తాత గుర్తుకొస్తాడు. తెల్లటి ఫర్‌ అంచుల ఎర్రటి బట్టలు వేసుకుని, ఇంత పొడవు తెల్ల గడ్డంతో, ఎర్ర టోపీతో, కళ్లద్దాలు పెట్టుకుని ‘జింగిల్‌ బెల్స్‌ జింగిల్‌ బెల్స్‌’  పాడుతూ కానుకలు తెచ్చే శాంటా తాత కోసం ఎదురు చూపులు మొదలవుతాయి. మూడు నాలుగేళ్ల వయసు నుంచి పదేళ్ల లోపు పిల్లలకు క్రిస్మస్‌ తాత మీద ఎంతో నమ్మకం. సంవత్సరమంతా ఎదురు చూసైనా తాత ఇచ్చే బహుమతి అందుకోవాలనుకుంటారు. ఏ బహుమతి ఇస్తాడో అనే సస్పెన్స్‌ని ఎంజాయ్‌ చేస్తారు. కాస్త పెద్ద పిల్లలకు తాత మీద డౌట్‌ ఉన్నా తెల్లారే సరికి తమ బెడ్‌ మీద పక్కనే ఉన్న గిఫ్ట్స్‌ను చూస్తే ఆనందం. సంతోషం. వాటిని తాత ఇచ్చినా సరే. తాత పేరుతో ఎవరు ఇచ్చినా సరే. కాని ఆ రోజంతా ‘శాంటా ఏం ఇచ్చాడో చూడు’ అని అందరికీ చూపడం ఎంత బాగుంటుందో.
∙∙ 
‘అమ్మా.. నాకేం గిఫ్ట్‌ కావాలో శాంటాకు ఎలా తెలుస్తుంది?
‘ఉత్తరం రాసి నాకు ఇవ్వు పోస్ట్‌ డబ్బాలో పడేస్తాను’
‘సరే’
‘నేను కోరిందే ఇస్తాడా?’
‘శాంటాకు రాయి. తాతయ్యా... నేను బాగా చదువుకుంటాను. బుద్ధిగా ఉంటాను. క్లాస్‌లో అల్లరి చేయను. అమ్మ చెప్పినట్టు వింటాను. అన్నం తిననని మారాం చేయక పెట్టిందల్లా తింటాను. అబద్ధాలు చెప్పను. ఎక్కువగా ఫోన్‌తో ఆడను. నేను గుడ్‌బాయ్‌గా ఉంటాను అని రాయి. అప్పుడు తెస్తాడు’
‘సరే’
∙∙ 
కానుకలు ఎప్పుడూ పిల్లలను ఉత్సాహపరుస్తాయి. తల్లిదండ్రులు క్రిస్మస్‌ సందర్భంగా వారికి నచ్చిన చిన్నచిన్న కానుకలైనా ఇచ్చి ప్రోత్సహించాలి. ‘పోయిన సంవత్సరం మంచి మార్కులు తెచ్చుకున్నావుగా. అందుకని ఈ గిఫ్ట్‌. చాలా బుద్ధిగా ఉంటున్నావుగా... అందుకని ఈ గిఫ్ట్‌. చెల్లితో/అక్కతో కొట్లాడటం లేదు కదా అందుకని ఈ గిఫ్ట్‌. మంచి ఫ్రెండ్స్‌ను చేసుకున్నావుగా. అందుకని ఈ గిఫ్ట్‌’ ఇలా చెప్పి కానుకలు ఇస్తే వారు తాము మంచి పనులు చేస్తున్నామనే నమ్మకానికి వస్తారు. చేయాలని అనుకుంటారు. వాటికి కానుకలు ఉంటాయని ఉత్సాహపడతారు. క్రిస్మస్‌ తాతను చూపి దురలవాట్లు (గోర్లు కొరకడం, హ్యాండ్‌ రైటింగ్‌ కరెక్ట్‌ చేసుకోకపోవడం, పుస్తకాల బ్యాగ్‌ సరిగ్గా ఉంచుకోకపోవడం, స్కూల్‌ ఎగ్గొట్టడం.. వంటివి) మాన్పించవచ్చు. అవి మానతామని హామీ ఇస్తేనే తాత గిఫ్ట్‌ ఇస్తాడని చెప్పాలి. మెర్రీ క్రిస్మస్‌.

పిల్లలకు ఏం గిఫ్ట్‌లు ఇవ్వొచ్చు? వీటిలోంచి ఎంచుకోండి.
1. ఆర్ట్‌ మెటీరియల్
2. బొమ్మల పుస్తకాలు
3. షూస్
4. పిగ్గీ బ్యాంక్
5. కెలడీస్కోప్‌ 
6. ఇండోర్‌ ప్లాంట్
7. కుక్కపిల్ల 
8. స్మార్ట్‌ వాచ్
9. స్మార్ట్‌ స్పీకర్స్‌ 
10.పోర్టబుల్‌ ఆడియో ప్లేయర్‌ 
11. క్రిస్మస్‌ టీషర్ట్స్
12. హెడ్‌ సెట్స్‌
13. టాయ్స్‌ 

మరిన్ని వార్తలు