పరశురామా! నీవు కారణజన్ముడివి..

29 Dec, 2020 06:54 IST|Sakshi

సప్తర్షి చరితం 

జమదగ్ని భృగువంశానికి చెందిన వాడు. సాక్షాత్తూ విష్ణుమూర్తి అంశావతారంగా ప్రసిద్ధుడైన పరశురామునికి తండ్రి. సప్తర్షులలో చివరివాడు. జమదగ్ని భార్య రేణుక. ఆమె మహా పతివ్రత. ఆమె రోజూ నదికి వెళ్లి స్నానం చేసి ఇసుకతో కడవ తయారు చేసి, దానిలో నీళ్లు తెచ్చేది. ఒకరోజున రేణుకాదేవి నదికి వెళ్ళి ఎంతసేపటికీ రాలేదు. జమదగ్ని దివ్యదృష్టితో భార్య ఏం చేస్తూందో చూశాడు. చిత్రరథుడనే ఒక గంధర్వుడు అప్సరసలతో జలక్రీడ చేస్తూంటే, రేణుక ఆ విలాసాన్ని మైమరచి చూస్తూ ఉండిపోయింది. దాంతో ఆమె ఇసుకతో తయారు చేసిన పాత్ర నిలబడక అందులో నుంచి నీళ్లు కారిపోతూ ఉండడంతో ఆమె రాక ఆలస్యమైంది. అది గ్రహించిన జమదగ్నికి కోపం వచ్చింది. భార్య వచ్చాక కుమాళ్ళను పిలిచి తల్లి తల నరకమన్నాడు.

అయితే వారు అంత పని చేయలేక పోయారు. అడవి నుంచి వచ్చిన పరశురాముడితో జమదగ్ని, ‘‘నీ అన్నల తలలనూ, మీ అమ్మ తలనూ నరుకు!’’ అని అన్నాడు. పరశురాముడు మారు మాట లేకుండా తండ్రి ఆజ్ఞను శిరసావహించి, ఒక వేటున అన్నలనూ, తల్లినీ తెగటార్చాడు. జమదగ్ని పరశురాముణ్ణి మెచ్చుకొని ఏం కావాలో కోరుకోమన్నాడు. ‘‘అన్నల్నీ, అమ్మనూ బతికించు!’’ అన్నాడు పరశురాముడు. జమదగ్ని అలాగే వాళ్ళను బతికించాడు. తన తపోమహిమ పట్ల పరశురాముడికి గల విశ్వాసానికీ, సూక్ష్మబుద్ధికీ జమదగ్ని ఎంతగానో సంతసించి, ‘‘పరశురామా! నీవు కారణజన్ముడివి. చిరంజీవిగా ఉంటావు!’’ అని ఆశీర్వదించాడు. అదిగాక పరశురామునికి మరో వరమియ్యాలనిపించింది జమదగ్నికి. ‘కోరుకో’మంటాడు. 

‘‘తండ్రీ! నా చేతిలో హతమైన ఐదుగురినీ బతికింపచేశారు. మన కుటుంబంలోకి ఆనందం తిరిగి వచ్చింది. కానీ, కొద్ది తడవైనా సరే, ఈ కుటుంబంలో దుఃఖం తాండవించింది. ఆవేదన, ఆందోళన రాజ్యమేలాయి. మీ క్రోధమే దానికి కారణం. ఇకనుండి మీరు నా కోసం ఈ కోపాన్ని వదిలిపెట్టాలి. ఇది నా ప్రార్థన’’ అన్నాడు పరశురాముడు. అలాగే అన్నాడు తండ్రి. ఇది జరిగిన కొన్నాళ్లకు ఒక రోజు వాళ్లింట్లో పితృకార్యం వచ్చింది. ఆ నిమిత్తం స్వయంగా ఆవు పాలు పితికి ఒక కొత్త కలశంలో భద్రపరిచాడు జమదగ్ని. ‘క్రోధ దేవత’ పొరపాటు అనిపించేలా, కావాలనే పాల కలశాన్ని తన్నింది. పాలు ఒలికి పోయాయి. విషయాన్ని గ్రహించి కూడా మిన్నకుండి పోయాడు జమదగ్ని. క్రోధ దేవత జమదగ్ని వద్దకు వచ్చి, ‘‘భృగువంశం వారికి కోపం ముక్కుమీదే వుంటుంది. నువు ఇందుకు మినహాయింపుగా వున్నావు. మహర్షీ! నన్ను క్షమించు. క్షీరాన్ని నేనే ఒలకపోశాను’’ అన్నది. ‘‘విధి లిఖితాన్ని ఎవరూ తప్పింపలేరు. నువు మటుకు ఏం చేయగలవు. వెళ్లిపో’’ అన్నాడు జమదగ్ని. పితృకార్యాన్ని శ్రద్ధగా నిర్వహించాడు జమదగ్ని. కాని, పాలు లేని లోటు అట్లే వుండిపోయింది. 

ఆ రాత్రి పితృదేవతలు జమదగ్నికి కలలో కనిపించి ‘‘కోపగించవలసిన చోట కోపానికి రాకపోవడమూ దోషమే. దౌష్ట్యాన్ని రూపుమాపడానికి, నేరస్తుణ్ణి శిక్షించడానికి, దోషిని సంస్కరించడానికి కోపాన్ని వినియోగించాలి. క్రోధం నీ అధీనంలో ఉండాలి. నువు కోపానికి లోబడకూడదు. నీవు చేసిన తప్పు క్షమార్హం కాదు కనుక మరుజన్మలో నువు ముంగిసవై పుట్టి, దోషరహితులైన బ్రాహ్మణులు స్వార్థరహితంగా పలికిన సాధువాక్యాలను ఆక్షేపించినపుడు నువు ముంగిస రూపం వదిలి నిజరూపాన్ని పొందుతావు’’ అని చెప్పి అంతర్ధానమై పోయారు పితృదేవతలు. అలా, ముంగిస జన్మనెత్తిన జమదగ్ని అనేక ఏళ్లపాటు ఆ రూపంలో ఉండి, ధర్మరాజు చేసిన అశ్వమేథ యాగాన్ని బ్రాహ్మణులు వేనోళ్ల కొనియాడుతుంటే, ఆ యాగాన్ని తక్కువ చేసి మాట్లాడి శాప విమోచనాన్ని, ఆ పైన జన్మ రాహిత్యాన్ని పొందాడు. మహాత్ములు శాపగ్రస్తులైనా లోకకళ్యాణానికే పాటుపడతారనడానికి ఈ కథ ఒక ఉదాహరణ. 

ఇది ఇలా ఉండగా... కార్తవీర్యార్జునుడు విజయయాత్ర ముగించి తన రాజధాని మాహిష్మతీ నగరానికి వెళ్తున్న దారిలో, జమదగ్ని ఆశ్రమం తగిలింది. అప్పుడు రాజూ, పరివారమూ, సైన్యాలూ ఆకలితో ఉన్నారు. జమదగ్ని కామధేనువు అంశగల తన హెూమధేనువు మూలంగా వారందరికీ గొప్ప విందుచేశాడు. ఆ ఆవు ఏది కావలిస్తే అది ఎంత మందికైనా ఇస్తుంది. కార్తవీర్యుడు అలాంటిది తన దగ్గర ఉంటే సైన్యాలకు తిండి సమస్య లేకుండా అన్ని విధాలా ఉపకరించుకోవచ్చుననే దురాశతో సైనికులకు ఆవును మాహిష్మతి నగరానికి తోలుకు రమ్మని ఆజ్ఞాపించాడు. అడ్డు వచ్చిన జమదగ్నిని ముష్కరులైన సైనికులు అవతలకు తోసి ఆవును ఈడ్చుకెళ్ళారు.
అలా పడిపోయిన జమదగ్ని మరణించినట్లే ఉండిపోయాడు. రేణుకాదేవి భర్తమీద పడి ఏడుస్తున్నది. అప్పుడే అరణ్యాల నుండి పరశురాముడు ఆశ్రమానికి వచ్చాడు. జరిగింది తెలుసుకొని పరశువును ఎత్తి ఝుళిపిస్తూ, మాహిష్మతీ నగరానికి పరుగెత్తాడు. అంతలో భృగుమహర్షి ఎక్కణ్ణించో వస్తూ జమదగ్ని ఆశ్రమం చేరాడు. రేణుకను ఓదార్చి, జమదగ్నిలోంచి పోతున్న ప్రాణాన్ని తన యోగశక్తితో నిలబెట్టి ఆయన్ని తిరిగి బతికించాడు.

అక్కడ మాహిష్మతీనగరానికి తోలుకుపోయిన ధేనువును కోరిన వాటిని ఆశ్రమంలో ఇచ్చినట్లుగా రాజధానిలో ఇవ్వలేదని సైనికులు కొడుతున్నారు. సరిగా ఆ సమయానికి పరశురాముడు ప్రళయరుద్రుడై వచ్చాడు. సైనికులు పారిపోయారు. ‘‘ఓ రాజాధమా! సంరక్షకుడై ఉండవలసిన రాజు దుర్మార్గుడైనప్పుడు శిక్షంచక తప్పదు. మేడదిగి ఇవతలికి రా!’’ అని పరశురాముడు రాజప్రాసాదం ముందు నిలిచి కేకవేశాడు. కార్తవీర్యుడు మొదట పరశురాముణ్ణి సాధారణ మునికుమారుడనుకున్నాడు గాని, అతని ధాటి తెలిశాక వెయ్యి చేతులతో ఎదుర్కొన్నాడు. కార్తవీర్యార్జునుడు ప్రయోగించిన అస్త్రాలను, శస్త్రాలను పరశురాముడు గొడ్డలితో తుత్తునియలు చేశాడు. అతని వెయ్యి చేతులను చెట్టుకొమ్మలు నరికినట్లుగా తెగ్గొట్టాడు. కార్తవీర్యుడు మొండి బోదెగా కూలిపోయాడు. పరశురాముడు ఇంటికివచ్చి తన తండ్రి క్షేమంగా ఉండడం చూసి తాను చేసినది చెప్పాడు. జమదగ్ని, ‘‘నాయనా! నువ్వు చేసినది మునులమైన మనకు తగని పని. అందుకు పరిహారంగా నువ్వు తపస్సు చేయాలి!’’ అన్నాడు.
పరశురాముడు తండ్రి ఆనతి మేరకు అరణ్యానికి వెళ్లి తపస్సులో నిమగ్నుడయ్యాడు. సాక్షాత్తూ విష్ణు తేజాన్నే పుత్రుడిగా పొందిన జమదగ్ని జన్మ ఆ విధంగా ధన్యమైంది. 
-డి.వి.ఆర్‌. భాస్కర్‌

మరిన్ని వార్తలు