Sarees Party Wear: ఆధునికంగా ఆ‘కట్టు’

27 Aug, 2021 18:17 IST|Sakshi

ఎన్ని మోడ్రన్‌ డ్రెస్సులు వచ్చినా చీరకట్టుకే మన అమ్మాయిలు ఓటేస్తున్నారు. సంప్రదాయ వేడుకకు, ఇండోవ్రెస్టన్‌ స్టైల్‌ పార్టీలకు చీరతోనే సింగారించుకుంటున్నారు. అందుకే, చీరకట్టులోనూ ఎన్నో వినూత్నమార్పులు వచ్చాయి. రెడీమేడ్‌గా వేసుకునే ధోతీ శారీ, ప్యాంట్, పలాజో వంటి శారీస్‌తో పాటు రెండు చీరలతోనూ వినూత్న స్టైల్‌ తీసుకువస్తున్నారు. పండగలకు, వివాహ వేడుకలకు ఓస్టైల్, వెస్ట్రన్‌ పార్టీలకూ మరో స్టైల్‌తో ఇలా చీరకట్టులో మెరిసిపోతున్నారు. 


పెప్లమ్‌ శారీ

కలంకారీ పెప్లమ్‌ బ్లౌజ్‌తో ప్లెయిన్‌ శారీ కట్టుకు ఆధునికత జతగా చేరింది. ఏ విధమైన ఇతరత్రా హంగులు లేకుండా చూడగానే వావ్‌ అనిపించే కళ నేటి కాలపు అమ్మాయిల ఛాయిస్‌గా మారింది. 


శారీ విత్‌ దుపట్టా స్టైల్‌

కంచిపట్టు చీరతో పాటు కంచిపట్టు దుపట్టా కూడా ఎంచుకొని వేడుకలకు ఇలా రెడీ అవ్వచ్చు. రెండు విభిన్నరంగుల కాంబినేషన్‌తో ఈ స్టైల్‌ తీసుకురావచ్చు. ఎడమ, కుడి భుజాల మీదుగా తీసిన కొంగులు  మూలంగా యువరాణీ కళ కనువిందుచేస్తుంది.


ప్యాంట్‌ శారీ

ఒకే కలర్, ప్రింట్‌ కాంబినేషన్‌లో ప్యాంట్‌కు జత చేసిన పవిట కొంగుతో ఈ డ్రెస్‌ నవతరం అమ్మాయిలను ఆకర్షిస్తుంది. ఏవిధమైన హంగులు లేకుండా ధరించడానికి సులువుగా ఉండే స్టైల్‌ ఇది. ఇది ధోతీ శారీకి దగ్గరగా ఉన్నా ప్యాంట్‌ కావడంతో స్టైల్‌ భిన్నంగా ఉంటుంది. కాటన్, సిల్క్‌ ఇతర ప్యాటర్న్‌లలోనూ ఇవి రెడీమేడ్‌గా లభిస్తున్నాయి. 


రెండు చీరల కట్టు

పూర్తి కాంట్రాస్ట్‌ చందేరీ చీరలను ఎంచుకొని ఒక రంగు చీరను ఒకవైపుకు లెహంగా కుచ్చిళ్లు సెట్‌ చేసుకొని, మరోవైపు మరో చీరతో కుచ్చిళ్లు తీసి, భుజం మీదుగా పవిట కొంగు తీయాలి. దీనిని బ్యాలెన్స్‌ చేసుకోలేం అనుకునేవారు బెల్ట్‌ లేదా వడ్డాణంతో నడుము దగ్గర సెట్‌ చేసుకోవచ్చు. బ్లౌజ్‌ను బట్టి, ఈ శారీ అలంకరణ ఆధునికంగానూ, సంప్రదాయంగానూ మార్చుకోవచ్చు. 


ధోతీ శారీ

పండగలకు, పుట్టిన రోజు వేడుకలకు సింపుల్‌గా, గ్రేస్‌గా కనిపించాలంటే ఈ స్టైల్‌ సరిగ్గా నప్పుతుంది. ధరించడమూ సులువు. పవిట కొంగు ధోతీకి జత చేసి రావడంతో ఇది ధోతీ శారీ డ్రెస్‌గానూ మార్కులు కొట్టేసింది. 

లంగా ఓణీ స్టైల్‌లో చీర కట్టు
రెండు భిన్నమైన రంగులు తీసుకొని ఒకవైపు ఒక చీర పచ్చ, రెండవ వైపు గులాబీ రంగు చీర కుచ్చిళ్లను సెట్‌ చేస్తూ లంగాఓణీ మోడల్‌ వచ్చేలా కట్టుకోవడం. ఈ కట్టు సంప్రదాయ వేడుకలకు సరైన ఎంపిక అవుతుంది. 

మరిన్ని వార్తలు