Banothu Vennela: మట్టిని కాపాడుకుందాం!

21 May, 2022 00:18 IST|Sakshi
మట్టిని కాపాడుకుందామంటూ దారి పొడవునా గ్రామీణులకు వివరిస్తున్న వెన్నెల; సైకిల్‌ యాత్ర చేస్తున్న బానోత్‌ వెన్నెల

మట్టితో పోరాడితేనే విత్తనం మొక్కగా ఎదగగలదు.   కానీ, సారం లేని మట్టిలో ఏ విత్తనమూ మొలకెత్తదు.   మనిషి స్వార్థంతో చేసే కలుషిత కారకాల ద్వారా మట్టి సారం కోల్పోతోంది.   భూసారాన్ని కాపాడుకోకుంటే భవిష్యత్తులో అనేక దుష్పరిణామాలు తలెత్తవచ్చు.   ఈ విషయాన్ని అర్థం చేసుకున్న బానోత్‌ వెన్నెల అనే గిరిజన అమ్మాయి ‘సేవ్‌ సాయిల్‌’ పేరుతో ఐదు వేల కిలోమీటర్ల సైకిల్‌ యాత్రకు పూనుకుంది.  

కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలోని మారుమూల గిరిజన గ్రామపరిధిలోని సర్దాపూర్‌ తండాకు చెందిన బానోత్‌ వెన్నెల 60 రోజుల్లో 5 వేల  కిలోమీటర్ల సైకిల్‌ యాత్రను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సైకిల్‌ యాత్ర ద్వారా వేలాది మంది రైతులకు, ప్రజలకు ‘మట్టి’ పట్ల అవగాహన కల్పిస్తోంది. ఇప్పటికి దాదాపు రెండు వేల కిలోమీటర్లకు చేరువైంది.   తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల మీదుగా ఆమె సైకిల్‌ యాత్ర చేస్తోంది.

మే1న కామారెడ్డి నుంచి సైకిల్‌ యాత్రను ప్రారంభించిన వెన్నెల మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్‌నగర్‌ జిల్లాల మీదుగా వెళుతోంది. అన్ని ప్రాంతాల్లోనూ రైతులను, గ్రామ పెద్దలను కలిసి ‘మట్టిని ఏ విధంగా కాపాడాలో, ఎందుకు కాపాడాలో’ వివరించి, తిరిగి తన యాత్రను కొనసాగిస్తోంది.

కలల అధిరోహణ
వెన్నెల చిన్నతనంలోనే ఆమె తండ్రి మోహన్‌ చనిపోయాడు. తల్లి భూలి కూలి పనులు చేస్తూ పిల్లల్ని పోషిస్తోంది. వెన్నెలకు ఇద్దరు అన్నలు, ఒక అక్క. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి పూర్తి చేసింది వెన్నెల. తల్లి కూలి పనికి వెళితే గానీ కుటుంబం నడవని పరిస్థితి. అలాంటి పేద కుటుంబంలో పుట్టిన వెన్నెలకు పెద్ద పెద్ద లక్ష్యాలున్నాయి. ఎన్ని కష్టాలైనా సరే వాటిని సాధించాలన్న పట్టుదలతో నిరంతరం సాధన చేస్తోంది.

పర్వతారోహణ చేయాలన్నది ఆమె లక్ష్యం. ఇందుకోసం కొంతకాలం భువనగిరిలో రాక్‌ క్లైబింగ్‌ స్కూల్లో మౌంటెనీర్‌లో శిక్షణ కూడా తీసుకుంది. అయితే పేదరికం ఆమెకు శాపంగా మారింది. సోషల్‌మీడియాలో జగ్గీవాస్‌దేవ్‌ ‘సేవ్‌ సాయిల్‌’ కథనాలు విని స్ఫూర్తి పొందిన వెన్నెల భవిష్యత్తు భూసారాన్ని పెంచడానికి తన వంతుగా సమాజాన్ని జాగృతం చేయాలనుకుంది. రెండు నెలల పాటు ఒంటరిగా సైకిల్‌పై వెళ్లే యాత్రకు పూనుకుంది.  

తల్లి చెవి కమ్మలతో సైకిల్‌...
ఒంటరి యాత్రకు తల్లిని ఒప్పించింది. కానీ, సైకిల్‌ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితులు. తిరిగి తల్లినే బతిమాలుకుంది. తల్లి చెవి కమ్మలు అమ్మి, ఆమె ఇచ్చిన డబ్బులతో సైకిల్‌ కొనుగోలు చేసింది. మే 1 న కామారెడ్డి నుంచి సైకిల్‌ యాత్రను ప్రారంభించింది. ప్రస్తుతం కొత్తగూడెం భద్రాచలం జిల్లాలో యాత్ర కొనసాగుతోంది. 60 రోజుల్లో 5,000 కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర నిర్వహించాలని లక్ష్యం పెట్టుకుంది.

రాత్రిపూట ఉండాల్సిన పరిస్థితులు, యాత్రలో సమస్యల గురించి ప్రస్తావించినప్పుడు ‘ఇప్పటి వరకు ఆరు గరŠల్స్‌ హాస్టల్‌లో రాత్రిళ్లు బస చేశాను. మిగతా చోట్ల. పోలీస్‌ స్టేషన్‌లలో ఉన్నాను. ఈ రోజు (రాత్రి) కూడా పోలీస్‌ స్టేషన్‌లో ఉన్నాను. స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు కూడా సపోర్ట్‌ చేస్తున్నారు. 10 రోజులు యాత్ర పూర్తయ్యాక ఈషా ఫౌండేషన్‌ వాళ్లు కలిశారు. ఒక అమ్మాయిగా ఇలాంటి సాహసమైన పనిని చేస్తున్నందుకు గర్వంగా ఉంది.

రోజూ వంద కిలోమీటర్లు
‘రోజుకు వంద కిలోమీటర్లు సైకిల్‌ యాత్ర చేస్తున్నాను. దారిలో రైతులు, గ్రామస్తులను కలుస్తున్నాను. భూసారం గురించి, వారు చేస్తున్న పంటల పనుల గురించి అడిగి తెలుసుకుంటున్నాను. చాలా వరకు భూమిలో సేంద్రీయత కేవలం 0.9 శాతం మాత్రమే ఉంది. ఇది ఇలాగే తగ్గితే భవిష్యత్తులో పంటల దిగుబడులకు, మనుషుల మనుగడకు పెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే మేలుకోవాలి.

2050 నాటికి కనీసం 3 నుంచి 6 శాతం తిరిగి భూసారం పెంచాల్సిన అవసరం ఉంది. ఇందుకు సేంద్రీయ పద్ధతులను అవలంభించి భూసారాన్ని కాపాడాలి. లేదంటే ఇబ్బందులు తప్పవని దారిపొడవునా కలిసిన వారికల్లా వివరిస్తున్నాను’ అని తెలిపింది వెన్నెల. నిన్నటితో దాదాపు రెండు వేల కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర పూర్తయ్యింది. ఎక్కడా ఏ ఇబ్బందులూ లేవని, గ్రామస్తుల ఇళ్లలోనే వారి ఆహ్వానం మేరకు భోజనం సదుపాయం కూడా పొందుతున్నాను’ అని తెలిపింది వెన్నెల. 

మట్టిబిడ్డగా మట్టి కోసం...
మాది పేద కుటుంబం. అమ్మే అన్నీ తానై మమ్మల్ని పెంచి పెద్ద చేస్తోంది. ఎవరెస్ట్‌ అధిరోహించాలన్నది నా లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించాలంటే ఎన్నో అవరోధాలను అధిగమించాలి. అందుకే కొన్ని రోజులు శిక్షణ తీసుకున్నా. ఇప్పుడు భూ సారాన్ని కాపాడమంటూ సైకిల్‌ యాత్ర చేపట్టా. యాత్ర ద్వారా ఎంతో మంది చైతన్యం అవుతున్నారు. మట్టి బిడ్డగా మట్టికోసం చేస్తున్న ఈ యాత్ర సక్సస్‌ అవుతుంది. దీని తరువాత కాలేజీలో అడ్మిషన్‌ తీసుకోవాలి. ఆ తర్వాత పర్వతారోహణ మీద దృష్టి పెడతా.
– బానోత్‌ వెన్నెల, సర్దాపూర్‌ తండా, కామారెడ్డి

– ఎస్‌.వేణుగోపాలచారి, సాక్షి, కామారెడ్డి.

మరిన్ని వార్తలు