కోవిడ్‌ సాగు: షుగర్‌ క్వీన్‌.. తియ్యటి పంట

3 Jun, 2021 13:03 IST|Sakshi

సీమా రథీశ్‌ లెక్కల టీచర్‌. కేరళలోని కసర్‌గోడ్‌ జిల్లా, ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం. గత ఏడాది నుంచి కోవిడ్‌ స్కూళ్ల టైమ్‌టేబుల్‌ను, క్యాలెండర్‌లను తలకిందులు చేసింది. సీమ ఉద్యోగ జీవితం కూడా కొద్దిపాటి ఒడిదొడుకులకు లోనయింది. ఉద్యోగాలు లేని కారణంగా కొందరు, ఆన్‌లైన్‌లో ఇంటినుంచి పని చేయడం అనే వెసులుబాటు వల్ల కొందరు పట్టణాలు, నగరాల నుంచి గ్రామాల బాట పట్టారు. సీమ కూడా భర్తతోపాటు తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడికి వెళ్లి ఊరికే కాలక్షేపం చేయలేదామె.

గత ఏడాది నవంబరులో పుచ్చకాయ మొక్కలు నాటింది. సేంద్రియ పద్ధతిలో సాగు చేసింది. ఈ ఎండాకాలం నాటికి ఐదు టన్నుల తియ్యటి కాయలు కాశాయి. కాయలు కేజీ పాతిక లెక్కన అమ్మింది. అమ్మో! ఇంత ధరా!! అని నోరెళ్లబెట్టిన వాళ్లకు ‘ఇది షుగర్‌క్వీన్‌ వెరైటీ పుచ్చకాయ. సేంద్రియ ఎరువులతో పండించాను. తియ్యదనంలో తేడా ఉంటే అప్పుడు అడగండి. మరో కాయ కోసం రాకుండా ఉండగలరేమో చూడండి’ సున్నితంగా సవాల్‌ విసిరింది సీమ. ఆమె అన్న మాట నిజమే అయింది. కాయలన్నీ మంచి ధరకు అమ్ముడయ్యాయి. ఏప్రిల్‌ నెలాఖరుకు ఖర్చులు పోను రెండు లక్షలు మిగిలాయి.

పంట పండింది!
‘‘లాక్‌డౌన్‌ తర్వాత నేను, మా వారు మా సొంతూరు మీన్‌గోత్‌కు వెళ్లాం. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న ఉన్నప్పుడు పదిహేను ఎకరాలు సాగుచేసేవాడు. ఇప్పుడు మా అన్న, అమ్మ మా కుటుంబ వ్యవసాయం చూసుకుంటున్నారు. లాక్‌డౌన్‌లో మా ఉద్యోగాల్లో ఎదురైన ఒడిదొడుకులు గమనించిన మా అన్నయ్య ‘వ్యవసాయం ఇప్పుడు లాభసాటిగానే ఉంటోంది. ప్రయత్నించకూడదూ’ అని సలహా ఇచ్చాడు.

సాగు చేయకుండా ఉన్న రెండున్నర ఎకరాల పొలంలో కలుపుతీసి, రాళ్లు ఏరివేసి, మంచి ఎరువు వేసి సాగుకు అనువుగా మట్టిని గుల్లబరిచాం. నషీద్‌ అనే స్నేహితుడి సూచన ప్రకారం షుగర్‌ క్వీన్‌ రకం పుచ్చమొక్కలు నాటాం. మొత్తం ఐదు లక్షలు ఖర్చయింది. ఖర్చులు పోగా తొలి పంట ఆదాయం రెండు లక్షలు.

ఇప్పుడు బెండకాయ, మిర్చి, ఉల్లిపాయ పంటలు వేస్తున్నాను. కోవిడ్‌ పూర్తిగా తగ్గిపోయి పూర్తిస్థాయిలో మా ఉద్యోగాలు గాడిన పడినా సరే... ఉద్యోగం చేస్తూనే వ్యవసాయాన్ని కొనసాగిస్తాను. కోవిడ్‌ చాలా నేర్పించింది. నేను వ్యవసాయం చేయగలనని నాకు తెలియచేసింది’’ అంటోంది సీమ.
చదవండి: Oxygen Train: లోకో పైలట్‌ శిరీషకు ప్రధాని ప్రశంస

మరిన్ని వార్తలు