కుమార్తెను చేరిన వందేళ్ల నాటి చెక్కుచెదరని ఉత్తరం

26 Jun, 2021 21:19 IST|Sakshi

ఒక శతాబ్దం కిందట ఎవరో ఒక సందేశం పంపితే, మీకు అది ఇప్పుడు చేరితే ఎలా అనిపిస్తుంది. ఆశ్చర్యంగాను, ఆనందంగాను ఉంటుంది కదూ! ఆశ్చర్యంగా కాదు, వాస్తవంగానే జరిగింది. ఇది సినిమా కథ కాదు. అమెరికాలోని మిచిగాన్‌లో వెలుగుచూసిన వాస్తవ గాథ. ఈ ఆశ్చర్యంతో పాటు, ఆ సందేశం లభించిన ప్రదేశం గురించి తలచుకుంటే మరింత ఆశ్చర్యం వేస్తుంది.

జెన్నిఫర్‌ డౌకర్‌ ఒక స్కూబా డైవర్‌. ఆవిడకు బోట్‌ టూర్‌ కంపెనీ ఉంది. ఆమె ఒక రోజు స్కూబా డైవింగ్‌ పూర్తి చేసుకుని, తన బోట్‌ అంచులు, కిటీకీలు శుభ్రపరుస్తుంటే, అక్కడ ఆకుపచ్చ రంగు సీసా కనిపించింది. అందులో మూడు వంతుల వరకు నీళ్లు ఉన్నాయి. చిన్న బిరడా మూత ఉంది. అయినా కూడా అందులో నుంచి కాగితం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ సీసా తీసుకుని, మూత తీసి కాగితం చూసింది. ఆ కాగితం 1926లో రాసినది. అందులో ఒక సందేశంతో కూడిన ఉత్తరం ఉంది.  ‘‘ఈ సీసా దొరికిన వారు ఇందులోని కాగితాన్ని జార్జ్‌ మారో చేబోగాన్‌కి అందచేయండి. అలాగే ఈ సీసా ఎక్కడ దొరికిందో కూడా తెలియచేయండి’’ అని రాసి ఉంది.

నాటికల్‌ నార్త్‌ ఫ్యామిలీ అడ్వెంచర్స్‌ అనే సొంత టూర్‌ కంపెనీ అధినేత అయిన డౌకర్, తనకు దొరికిన సీసా, ఉత్తరాలకు ఫొటోలు తీసి, ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తూ ‘నాకు ఏం దొరికిందో ఒకసారి అందరూ చూడండి’ అన్నారు. ఆ మరుసటి రోజు ఈ మెసేజ్‌ సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయింది. డౌకర్‌ తన పోస్టు చూసుకునే సమయానికి ఒక లక్ష పదమూడు వేల మంది ఆ పోస్టును షేర్‌ చేశారు. చాలామంది ‘ఇది అద్భుతం, నమ్మశక్యంగా లేదు’ అంటూ కామెంట్స్‌ పెట్టారు. ‘ఈ సందేశం చూస్తే మాకు ఆనందంగా ఉంది’ అంటూ మరికొందరు కామెంట్‌ చేశారు.

టలియా రోథ్‌ఫ్లీష్‌ హాలీ, ‘ఇదొక అద్భుతం. ఆశ్చర్యం. ఇంతకాలం అక్షరాలు చెక్కుచెదరకుండా ఉండేలా ఏ ఇంక్‌ వాడారో తెలుసుకోవాలని ఉంది. అక్షరాలు చూస్తే ఈ రోజు రాసినట్లు ఉన్నాయి’ అన్నారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో మారో పేరు మార్మోగుతోంది. ఈ సందేశం ఎవరు రాశారు అనే దాని కంటె, కథ సుఖాంతం అవుతుందా లేదా అని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉదాహరణకి, ‘‘ఈ సంఘటన భలే ఆసక్తిగా ఉంది. ఈ కథను కొనసాగించండి. ముగింపు ఎలా ఉంటుందో వినాలని ఆత్రంగా ఉంది’ అంటున్నారు పాట్రికా ఆడమ్స్‌.

డౌకర్‌ ఆ ఉత్తరాన్ని ఫోటో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ, ‘స్కూబాకి ఎవరెవరు సంసిద్ధంగా ఉన్నారు?’ అనే సందేశం పెట్టారు. డౌకర్‌ సీసా మీద గుర్తుగా ఒక చుక్క పెట్టారు. ఈ సంఘటన జూన్‌ 18వ తేదీన జరిగింది. జూన్‌ 20, ఆదివారం నాడు స్కూబా డైవింగ్‌ చేసి, తన తండ్రి ఇంటి నుంచి తిరిగి వస్తుండగా, డౌకర్‌కి ఒక ఫోన్‌ వచ్చింది. అది మిచెల్‌ ప్రిమ్యా అనే 74 సంవత్సరాల మహిళ దగ్గర నుంచి వచ్చిన ఫోన్‌ కాల్‌. ఫేస్‌బుక్‌లో పోస్టు చూసిన ఒక మహిళ తనకు ఈ సమాచారం అందించిందని ఫోన్‌లో చెబుతూ, అది తన తండ్రి చేతి రాతని, తన తండ్రి 1995లో మరణించాడని వివరించారు.

ఇక్కడ మరో ఆశ్చర్యమేమిటంటే, ఈ ఉత్తరాన్ని డౌకర్‌... ప్రిమ్యాకి అందచేద్దామనుకున్నారు. కాని ప్రిమ్యా ఆ ఉత్తరాన్ని డౌకర్‌ దగ్గరే ఉంచమన్నారు. ఆ ఉత్తరాన్ని ఒక షాడో బాక్స్‌లో ఫ్రేమ్‌ చేయించారు డౌకర్‌. ‘నా తండ్రి జ్ఞాపకాలు మరింత కాలం పదిలంగా ఉండాలి, అలాగే మరింతమంది ఈ ఉత్తరాన్ని చూడాలి’’ అంటున్నారు ప్రిమ్యా. ఇప్పుడు మీరు కూడా ఆ ఉత్తరం చూడాలనుకుంటున్నారా, అయితే వెంటనే బయలుదేరండి. డౌకర్‌ దగ్గరకు వెళితే, స్కూబా డైవింగ్‌ చేయిస్తూ, ఉత్తరం కూడా చూపిస్తారు.

– వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు