సేఫ్‌ సెకండ్‌ ఒపీనియన్‌ ప్లీజ్‌!

24 Jul, 2022 06:12 IST|Sakshi

ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు డాక్టర్‌కు చూపించుకుని, ఆయన సూచించిన చికిత్స సక్రమమైన మార్గంలోనే వెళ్తుందా లేదా అని తెలుసుకోడానికి సెకండ్‌ ఒపీనియన్‌ కోసం చాలామంది మొగ్గుచూపుతుంటారు. తమ చికిత్స సక్రమమైన మార్గంలోనే సాగుతుందని మరో డాక్టర్‌ కూడా భరోసా ఇస్తే... బాధితులకు అదో ధీమా. నిజానికి మొదటి డాక్టర్‌ మీద సందేహం కంటే... ఈ భరోసా కోసం, ఈ ధీమా కోసమే చాలావరకు సెకండ్‌ ఒపీనియన్‌ కోసం వెళ్తుంటారు. ఒకరికి ఇద్దరు డాక్టర్లు ఒకేమాట చెబితే మనసుకెంతో ఊరట. కానీ ఒక్కోసారి సెకండ్‌ ఒపీనియన్‌ మరీ తేడాగా ఉంటే... మరోసారి మనం సందర్శించిన మొదటి డాక్టర్‌తోనూ ఒక మాట మాట్లాడటం ఎంతో అవసరం. అదెందుకో చూద్దాం.

ఓ కేస్‌ స్టడీ: వైద్య విషయాలపై మంచి అవగాహన ఉన్న వ్యక్తి ఓ డాక్టర్‌ను సంప్రదించారు. ఆయనకు కడుపులో ట్యూమర్స్‌ వంటివి ఉన్నాయనీ, ఆపరేషన్‌తో తొలగించాల్సిన అవసరముందని డాక్టర్‌ చెప్పారు. మరో ఒకరిద్దరు డాక్టర్ల దగ్గర సెకండ్‌ ఒపీనియన్‌ తీసుకున్నప్పుడు వారూ శస్త్రచికిత్స తప్పదని చెప్పడంతో... బాధితుడు సర్జరీ చేయించుకున్నారు.

శస్త్రచికిత్స అనంతరం ఇచ్చే పోస్ట్‌ ఆపరేటివ్‌ మందుల్లో ఒకదాని గురించి డాక్టర్‌ ఓ మాట చెప్పారు. ‘‘ఈ మందు మీకు కాస్త ఇబ్బందిని తెచ్చిపెట్టవచ్చు. అందరికీ అలా జరగాలని లేదు. ఒకవేళ మీ విషయంలో ఇబ్బంది కలిగితే నాకు చెప్పండి. నేను మందు మారుస్తాను’’ అని చెప్పారు డాక్టర్‌.
ఎప్పటిలాగే సెకండ్‌ ఒపీనియన్‌లో భాగంగా ఆ పేషెంట్‌ ఆ మందు గురించి మరో డాక్టర్‌ను అడిగారు. ‘‘ఆ... అదంత ముఖ్యమైన మందు కాదులే’’ అని ఆ డాక్టర్‌ చెప్పడంతో బాధితుడు ఆ మందు తీసుకోలేదు.


బాధితుడికి ఆర్నెల్లలోనే కడుపులో ట్యూమర్‌ మరోసారి పెరిగింది. సమస్య ఎందుకు పునరావృతమైందో తెలియక డాక్టర్‌ తలపట్టుకున్నారు. ఈ ఆర్నెల్ల కాలంలో బాధితుడి దగ్గర్నుంచి ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రయత్నంలో తాను మొదట ఇచ్చిన మందుల్లో ఒకదాన్ని బాధితుడు వాడలేదని తెలియవచ్చింది. దాంతో డాక్టర్‌ కాస్తంత ఆగ్రహం చూపాల్సివచ్చింది.

‘‘నిజానికి అదో కీమో తరహా మందు. కీమో అన్న మాట వినగానే తమకు క్యాన్సరేనేమో అని పేషెంట్‌ అపోహ పడవచ్చు. కానీ కాన్సర్‌ కానటువంటి కొన్ని రకాల (నాన్‌ క్యాన్సరస్‌) ట్యూమర్లు మళ్లీ మళ్లీ రాకుండా కీమోలాంటి చికిత్సనే అందించే ఓరల్‌ ట్యాబ్లెట్లను డాక్టర్లు ఇస్తుంటారు. ట్యూమర్‌ తొలగింపులో... దాన్ని పూర్తిగా తొలగించడానికి వీలుకాని ప్రదేశంలో సూక్షా్మతిసూక్ష్మమైన భాగం కొంత మిగిలిపోతే... మళ్లీ పెరగకుండా ఉండేందుకు ఇచ్చిన మందు అది. మీరు సెకండ్‌ ఒపీనియన్‌ తీసుకోవడం తప్పుకాదు. కానీ ఆ తర్వాత మళ్లీ నాతో మాట్లాడితే... నేను మరింత వివరించేవాణ్ణి. ఇప్పుడు మరోసారి సర్జరీ చేయాల్సి వస్తోంది. అది కూడా గతంలో కంటే పెద్ద సర్జరీ. ఖర్చు కూడా దాదాపు రెట్టింపు’’ అంటూ మందలించారు డాక్టర్‌.
ఇదీ మరోమారు జబ్బు రిలాప్స్‌ (పునరావృతం) అయిన ఓ బాధితుడి వాస్తవ గాధ.

ఆందోళన కలిగించే విషయాలు అనవసరం : ఈ కేస్‌ స్టడీలో డాక్టర్‌ కావాలనే కొన్ని విషయాలను బాధితలకు విపులంగా చెప్పలేదు. దానికీ కారణం ఉంది. నిజానికి డాక్టర్‌ ఇచ్చిన మందు వాడేసి ఉంటే... ఆ మిగిలిపోయిన భాగమూ మృతిచెంది... రోగి పూర్తిగా స్వస్థుడయ్యేవాడు. కానీ ఈ మందు కీమో వంటిది అనగానే రోగిలో అనవసరమైన ఆందోళన మొదలయ్యే అవకాశం ఉంటుంది. దాంతో లేనిపోని ఊహలూ, అనవసరమైన సందేహాలతో మరింతమంది డాక్టర్లను సంప్రదించవచ్చు. దాంతో డబ్బూ, సమయమూ వృథా కావడమే కాదు... అవసరమైన యాంగై్జటీ, కుంగుబాటుకు తావిచ్చినట్టు అవుతుంది. అందుకే రోగి మానసిక ఆరోగ్యాన్ని కాపాడాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని అతడికి అనవసరమైన విషయాలను చెప్పకపోవచ్చు. లేదా ఒకవేళ బాధితులు మంచి విద్యావంతులే అని చెపినప్పటికీ, వారిలో మరిన్ని సందేహాలు చెలరేగే అవకాశాలు ఎక్కువ. నిజానికి ఇలాంటి సందేహాలు విద్యావంతుల్లోనే ఎక్కువ అని డాక్టర్లు అంటుంటారు.

సరికొత్త అనర్థాలకు తావిచ్చే గూగుల్‌ : ఏదైనా విషయాన్ని డాక్టర్లు యథాలాపంగా చెప్పినా సరే... చాలామంది విద్యావంతులు గూగుల్‌ను ఆశ్రయిస్తారు. వైద్యవిజ్ఞానానికి చెందిన చాలా అంశాలు గూగుల్‌లో విపులంగా ఉంటాయి. నిజానికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అది వ్యక్తికీ, వ్యక్తికీ వేరుగా ఉండవచ్చు. కొన్ని అంశాలు వారికి వర్తించకపోవచ్చు. అవి డాక్టర్‌కు తెలుస్తాయి. కానీ గూగుల్‌లో మొత్తం సమాచారమంతా ఉంటుంది. అది తమకు వర్తించదన్న అంశాన్ని గ్రహించలేని పేషెంట్లు... ఆ అనవసర పరిజ్ఞానాన్ని తలకెక్కించుకుని మరింతమంది డాక్టర్ల చుట్టూ తిరుగుతూ మనశ్శాంతిని దూరం చేసుకుంటుంటారు.

ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో పనికిరాని పరిజ్ఞానం : దీనికి తోడు ఫేస్‌బుక్, యూట్యూబ్‌ వంటి సోషల్‌ మీడియాలో మరిన్ని క్లిప్స్‌ ఉంటాయి. తమ లైక్స్‌ కోసం లేదా తమ పాపులారిటీని పెంచుకునేందుకు అర్హత లేని నకిలీలు (క్వాక్స్‌) కూడా ఏమాత్రం శాస్త్రీయతకు తావు లేని అంశాలతో వీడియోలు చేసి పెడుతుంటారు. వీటిని చూసి బాధితులు మరింత అయోమయానికి గురవుతుంటారు.

సెకండ్‌ ఒపీనియన్‌ బాధితుల హక్కు నిజానికి మరో డాక్టర్‌ దగ్గర్నుంచి వారి అభిప్రాయం  తీసుకోవడం పేషెంట్స్‌ హక్కు. మరొకరి ఒపీనియన్‌ తీసుకున్న తర్వాతే చికిత్సకు రమ్మని చాలామంది డాక్టర్లూ సూచిస్తుంటారు. దానికి కారణమూ ఉంది. సెకండ్‌ ఒపీనియన్‌ వల్ల పేషెంట్స్‌లో మంచి నమ్మకమూ, తాము తీసుకునే చికిత్స సరైనదే అనే విశ్వాసం పెంపొందుతాయి. అది బాధితులను మరింత వేగంగా కోలుకునేలా చేస్తుంది. చాలా సందర్భాల్లో తొలి డాక్టర్‌ చెప్పిన విషయాలూ, సెకండ్‌ ఒపీనియన్‌ ఇచ్చిన్న డాక్టర్‌ చెప్పిన అంశాలు నూటికి తొంభై పాళ్లు ఒకేలా ఉంటాయి. కొన్ని అటు ఇటుగా ఉన్నప్పటికీ మొదటి డాక్టర్‌ చెప్పిన అంశాలను చాలావరకు రెండో డాక్టర్‌ విభేదించరు. ఒకవేళ విభేదిస్తే కారణాలు చెబుతారు. కానీ తాము తీసుకున్న సెకండ్‌ ఒపీనియన్‌ గనక మన డాక్టర్‌ చెప్పిన విషయాలకు దాదాపుగా పూర్తిగా భిన్నంగా ఉన్నప్పుడు అదే విషయాన్ని మనం చికిత్స తీసుకునే డాక్టర్‌తో ఆ విషయాలపై స్పష్టంగా, నిర్భయంగా, విపులంగా చర్చించవచ్చు. మన సందేహాలనూ, సంశయాలనూ తీర్చడం డాక్టర్‌ విధి కూడా. అలాంటప్పుడు ఒకసారి మన డాక్టర్‌తోనూ మాట్లాడటం మంచిది.

డాక్టర్‌ షాపింగ్‌ వద్దు
ఓ డాక్టర్‌ను సంప్రదించాక... ఇంకా తమ సందేహాలు తీరలేదనో లేదా మరోసారి డాక్టర్‌ను అడిగితే ఏమనుకుంటారనో ఒకరి తర్వాత మరొకరి దగ్గరకు వెళ్తుంటారు. దీన్నే ‘డాక్టర్‌ షాపింగ్‌’ అంటారు. నిజానికి డాక్టర్‌ షాపింగ్‌ అన్నది మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుందని గ్రహించడం మంచిది.

డాక్టర్‌ జి. పార్థసారధి, సీనియర్‌ సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌

మరిన్ని వార్తలు