Seema Bhavani: మైండ్‌బ్లోయింగ్‌ మోటర్‌ స్టంట్స్‌.. ‘సీమా భవాని’ గురించి తెలుసా?

26 Jan, 2022 09:16 IST|Sakshi

జై బోలో... సీమ భవానీ

సెల్యూట్‌ టు ప్రెసిడెంట్‌.. ఫిష్‌ రైడింగ్‌.. పీకాక్‌.. శక్తిమాన్‌ విండ్‌ మిల్‌....మొదలైన విన్యాసాలు ఆహా అనిపిస్తాయి! మనల్ని మరో లోకంలోకి తీసుకువెళతాయి. మన చేత ఆగకుండా చప్పట్లు కొట్టిస్తాయి. చలిపులి తోకముడిచి ఎక్కడికో పారిపోతుంది.

రిపబ్లిక్‌ డే పరేడ్‌ (రాజ్‌పథ్, దిల్లీ) విన్యాసాల్లో ‘సీమ భవాని’ బృందం 350 సీసీ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ మోటర్‌సైకిళ్లపై చేసే విన్యాసాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. పదహారు రకాలైన డేర్‌ డెవిల్‌ స్టంట్స్‌తో ఆబాలగోపాలం చేత వహ్వా అనిపిస్తుంది బీఎస్‌ఎఫ్‌ (బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌) లో భాగమైన ఈ ఆల్‌–వుమెన్‌ యూనిట్‌.

2016లో మధ్యప్రదేశ్‌లోని టెకన్‌పూర్‌ సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ మోటర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (సీఎస్‌ఎంటీ)లో ‘సీమ భవానీ’కి అంకురార్పణ జరిగింది. అంతకుముందు రిపబ్లిక్‌ డే వేడుకల్లో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ నుంచి మహిళలు పాల్గొని తన నైపుణ్యాలను ప్రదర్శించేవారు.

2018తో ఒక అధ్యాయం మొదలైంది...
ఆ సంవత్సరం తొలిసారిగా ‘సీమ భవాని’ బృందం చేసిన మైండ్‌బ్లోయింగ్‌ మోటర్‌ స్టంట్స్‌ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ‘అపురూపం, అసాధారణం’ అని  వేనోళ్ల పొగిడేలా చేశాయి. మొదట్లో ‘సీమ భవాని’లో 27 మంది ఉండేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 110కి చేరింది.  ‘సీమ భవాని’ టీమ్‌ కోసం 25–30 ఏళ్ల వయసు ఉన్నవారిని ప్రత్యేకంగా ఎంపిక చేస్తారు. ఈ టీమ్‌కు ఎంపిక కావడం పెద్ద గౌరవంగా భావిస్తారు.

‘గతంలో ఎక్కడైనా మోటర్‌ సైకిల్‌ స్టంట్స్‌ చూసినప్పుడు కలా? నిజమా? అనుకునేదాన్ని. సీమ భవాని టీమ్‌ లో నేను భాగం కావడం సంతోషాన్ని ఇస్తుంది’ అంటుంది హిమాన్షు శిర్హోయి. ‘అసాధారణమై బృందానికి ఎంపిక కావడం నా జీవితంలో మరచిపోలేని రోజు. రోజూ ఎన్నో గంటల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నప్పుటికీ కష్టం అనిపించలేదు’ అంటుంది సోనియా భన్వీ. ఈ ఇద్దరూ బీఎస్‌ఎఫ్‌లో ఇన్‌స్పెక్టర్స్‌గా పనిచేస్తున్నారు.

110 మందితో కూడిన ‘సీమ భవానీ’కి  కేరళలోని కొల్లాం జిల్లాకు చెందిన జయంతి ఎంపికైంది. బీఎస్‌ఎఫ్‌లో గత ఏడేళ్లుగా కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది జయంతి. పిరమిడ్‌ ఫార్మేషన్‌తో సహా కఠినతరమైన ఎన్నో విన్యాసాలలో గత ఏడు నెలలుగా శిక్షణ తీసుకుంది జయంతి. ‘రిపబ్లిక్‌ డే పరేడ్‌లో నాకు బాగా ఇష్టమైనవి మోటర్‌సైకిల్‌ విన్యాసాలు. ఎలా చేస్తున్నారో కదా! అని బోలెడు ఆశ్చర్యపోయేవాడిని. ఆ బృందంలో మా అమ్మాయి కూడా భాగం అయినందుకు గర్వంగా ఉంది’ అంటున్నాడు జయంతి తండ్రి జయదేవ్‌ పిళ్లై. నిజానికి ‘సీమ భవాని’ తల్లిదండ్రుల సంతోషమేకాదు యావత్‌ దేశ సంతోషం.  

చదవండి: ఆత్మగౌరవ వజ్రాయుధం... దాక్షాయణి వేలాయుధం                                      

మరిన్ని వార్తలు