పర్యావరణం.. పక్షికి పండగ దూరం చేయవద్దు!

13 Jan, 2022 00:37 IST|Sakshi
యానిమల్‌ యాక్టివిస్ట్‌ సీమ

ఆమె రాగానే అప్పటివరకు గోలగోలగా ఉన్న హాలు సద్దుమణిగింది. ‘అందరూ వచ్చినట్లే కదా!’ అని ఆత్మీయంగా అడిగింది సీమ. ‘ఏమిటో మేడమ్‌ సెలవ రోజుల్లో ఈ క్లాసు...’ అని ఆవులించాడు ఒక కాలేజి విద్యార్థి. కొన్ని నవ్వులు వినిపించాయి. ‘ఇవి చూడండి’ అంటూ ఆమె కొన్ని చిత్రాలు చూపించింది.

నీలాకాశంలో రంగురంగుల గాలిపటాలు ఎగురుతున్న చిత్రాలు, ఆబాలగోపాలం ఆనందంతో పతంగులు ఎగరేస్తున్న చిత్రాలు, ‘కీంచ్‌...కాట్‌’ అంటూ వేరేవాళ్ల గాలిపటాలను ఆకాశంలో కట్‌ చేస్తున్న చిత్రాలు, తెగిపడిన గాలిపటాల వెంట అరుపులతో పరుగులు తీస్తున్న పిల్లలు... ఇలా ఎన్నో ఉన్నాయి.

‘ఈ చిత్రాలు కూడా చూడండి’ అంటూ మరికొన్ని చిత్రాలు చూపించింది. రెక్కలు తెగిన పక్షుల చిత్రాలు. మెడ తెగి నేలరాలి బాధతో కొట్టుకుంటున్న పక్షుల చిత్రాలు. కరెంటు తీగలకు, చెట్ల కొమ్మలకు అల్లుకున్న దారాల్లో చిక్కుకుపోయి ఊపిరాడక చనిపోతున్న పక్షుల చిత్రాలు... హృదయాన్ని మెలిపెట్టే చిత్రాలు ఇవి. ‘సంతోషం ముఖ్యమే కాని, మన సంతోషం పక్షుల చావుకు కారణం కావద్దు కదా!’ అన్నది సీమ.

కొద్దిసేపు ఆ హాల్లో నిశ్శబ్దం. ‘గాలిపటాలు ఎగిరేస్తున్నప్పుడు అప్పుడప్పుడు మన చేతివేళ్లు కోసుకుపోతాయి. ఆ కాస్త దానికే తల్లడిల్లిపోయి హాస్పిటల్‌కు పరుగెత్తుతాం. కాని పక్షులు మాత్రం మన గాలిపటాల వల్ల తీవ్రగాయాలపాలై చనిపోతున్నాయి. మనం హాస్పిటల్‌కు పరుగెత్తినట్లు అవి పరుగెత్తలేవు కదా!’ అని సీమ అన్నప్పుడు ఎంతటి హృదయాలైనా కరిగిపోవాల్సిందే.

నవీ ముంబైకి చెందిన సీమా టాంక్‌ జంతు ప్రేమికురాలు. పండగరోజుల్లో గాలిపటాలు పక్షుల పాలిట మృత్యుపాశాలుగా మారకుండా ఉండడానికి ఆమె అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటుంది. మొదట్లో ఈ సదస్సుకు రావడానికి ఇష్టపడని వారు కూడా ఆ తర్వాత నిజం గ్రహించి మార్పు దిశగా పయనించడం ఆమెకు సంతోషం ఇస్తోంది.

సీమ మాటలతో ప్రభావితమైనవారు ‘పక్షులకు పండగ దూరం చేయవద్దు ప్లీజ్‌’ ‘మన సంతోషానికి పక్షులు మూల్యం చెల్లించుకోవాలా?’ ‘ఆకాశంలో గాలిపటం ఎగరేసేముందు, అదే ఆకాశంలో ఎగురుతున్న పక్షి వైపు కూడా చూడు’... లాంటి పోస్ట్‌లు సామాజికవేదికల్లో పెడుతుంటారు.
సీమలాంటి వ్యక్తులే కాదు ‘ప్లాంట్స్‌ అండ్‌ యానిమల్‌ వెల్ఫేర్‌ సొసైటీ’లాంటి సంస్థలు కూడా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాయి. ఫేస్‌బుక్‌ వేదికగా హెల్ప్‌లైన్‌ నంబర్స్, రెస్క్యూ టిప్స్‌ షేర్‌ చేస్తున్నాయి.
‘సేవ్‌ బర్డ్స్‌’ అనేది యానిమల్‌ లవర్స్, యాక్టివిస్ట్‌ల నినాదం మాత్రమే కాదు, అది అందరి కనీస బాధ్యత అనే ఎరుక మనకు కలిగితే చాలు... పండగ సంతోషం మనతోపాటు పక్షులకూ దక్కుతుంది.

మరిన్ని వార్తలు