ఆత్మ గౌరవం.. జీవన వనాన విరిసే ఆమని

13 Dec, 2021 00:28 IST|Sakshi

మంచిమాట

ఆత్మగౌరవం మనిషికి నిజమైన ఆభరణంలా భాసిస్తుంది. ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకుని, నమ్మిన సిద్ధాంతం కోసం, విలువలకోసం రాజీ పడకుండా ముందుకు సాగే లక్షణానికి మనం చెప్పుకునే అందమైన పదభూషణం ‘ఆత్మ గౌరవం’. సమపాళ్ళలో కలిగి ఉండే ఈ లక్షణం సమాజంలో అగణ్యత, అగ్రగణ్యత సంపాదిస్తుందో లేదో తెలియదు కానీ, జీవన గమనానికి ఖచ్చితంగా నిజమైన నాణ్యతను సంతరిస్తుంది.

‘‘ఆయనకు చాలా ఆత్మగౌరవం ఎక్కువండీ.. ఎక్కడా రాజీ పడకుండా జీవిస్తాడు’’ అనే మాటను మనం కొంతమంది వ్యక్తులను ఉద్దేశించి, మిగిలినవాళ్ళు మాట్లాడుకోవడం వింటూ ఉంటాం.

అహంకారం ఉన్నవారు తమకోసం కాక, ఎదుటివాళ్ల దృష్టిలో తాము గొప్పగా వున్నట్లుగా భావన చేసుకుని జీవికను సాగిస్తారు. ఎవరైనా తన గురించి తక్కువ, ఎక్కువల తేడా చూపిస్తే చాలు, అవమానంతో రగిలిపోతారు. అహంకారంతో ఉండేవాళ్ళు, విలువలకోసం ప్రయత్నించక, పక్కవారి ముందు ఉన్నతులుగా గుర్తింపబడాలని కోరుకుంటారు. వీరిలో చెలరేగే అహంకారం వారిలో ఉన్న మంచిని కూడా ఎదుటివారిని చూడనీయకుండా చేస్తుంది. సంఘంలో మనకు ఎక్కువగా ఈ తరహా వ్యక్తులే తారసపడుతూ ఉంటారు.

స్వల్పమాత్రపు భేదాన్ని మాత్రం మనం ఇక్కడ తప్పనిసరిగా గ్రహించాలి. అహంకారంతో వర్తించడం ఎటువంటి నేరమో, ఆత్మగౌరవాన్ని చంపుకోవడం అంతకుమించిన దోషం..!! మనం నమ్ముకున్న సూత్రాల విషయంలో అవలంబించే రాజీ ధోరణి తాత్కాలికంగా సుఖమయమనిపించినా, దీర్ఘకాలంలో తప్పనిసరిగా మనకు మానసిక క్లేశాన్ని కలిగిస్తుందని ఎన్నో ఉదాహరణలు తెలియజేస్తాయి.

ఆత్మగౌరవం అనే భావన ఒక వ్యక్తి తన గురించి కలిగి ఉన్న విలువ, అవగాహనకు సంబంధించిన భావన.దీని ఆధారంగా, ఒక వ్యక్తి తోటివారితో సాగే గమనంలో విభిన్న విషయాల్లో తనకు ఎటువంటి స్థానం ఉందో కనుగొంటాడు.

ఆత్మగౌరవానికి నిర్వచనాన్ని చెప్పవలసి వస్తే, దాదాపుగా స్వీయ–ప్రేమకు, ఈ పదాన్ని సమానంగా చెప్పవచ్చు.  తన గౌరవాన్ని గురించి ఎవరైనా, ఏ సందర్భంలోనైనా ప్రకటించ వలసి వస్తే,ఆత్మగౌరవం అనే పదం వ్యక్తికి గల స్వీయ గౌరవం అనే పదానికి ప్రత్యక్ష అర్థంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. తనని తాను ప్రేమించడం స్వార్థం లేదా అనారోగ్యం కాదు; ఇది ఒక ప్రాథమిక భావన. తనని తాను ప్రేమించుకోవడం అనేది ప్రతి వ్యక్తీ చేసే పనే. తనకు మంచి జరగాలని కోరుకోవడమూ సహజమే.. అయితే, తనకే మంచి జరగాలని కోరుకోవడాన్ని స్వార్ధభావనగా మనం పేర్కొంటూ ఉంటాం.

ప్రతికూల ఆలోచనలను అంతం చేయడం, జ్ఞానాన్ని పెంచే లేదా వ్యక్తికి మంచి అనుభూతిని కలిగించే కార్యకలాపాలు చేయడం, కొత్త విషయాలను నేర్చుకోవడం, చేసిన తప్పులను తెలుసుకోవడం మొదలైనవి మనలో మరింత ఆత్మగౌరవాన్ని పెంచుతాయి.

ఆత్మగౌరవాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు మనకు గుర్తొచ్చే మరో పదం ‘అహంకారం’. పరిణతి చెందిన వ్యక్తులు సైతం తమ వైఖరిని వ్యక్తపరిచే సందర్భంలో, ఆ విధంగా మాట్లాడితే అహంకారులుగా తమను ఎదుటివారు భావిస్తారేమో అని సందేహించే సందర్భాలూ ఉంటాయి. అయితే, ఆత్మగౌరవానికీ, అహంకారానికీ మధ్య తేడా బాగానే ఉంది.

సమాజం తీరును మనం నిశితంగా పరికిస్తే, అత్యాశలకు లోనైనప్పుడే, మనిషి జీవనశైలిలో ఉన్న సమతౌల్యం దెబ్బ తింటుంది. అనవసరమైన కోరికలనే గుర్రాలవెంట పరుగెడుతూ, వాటిని ఏ విధంగానైనా తీర్చుకోవాలనే తపన ప్రబలినప్పుడే, మనిషి తాను పాటించే విలువల విషయంలో, ఆత్మను వంచన చేసుకునేలా రాజీపడి, ఎదుటివాడి ముందు తలను వంచుతాడు. ఒకరకంగా దీన్నే నైతిక పతనానికి నాంది అని చెప్పవచ్చు. ఎందుకు ఈ అనవసరపు వెంపర్లాట..!!

ఎవరికీ తలవంచకుండా, అధికమైన ఆశలతో ఎవరెవరినో ఆశించకుండా, దృఢమైన చిత్తంతో సాగుతూ, నిండుగా నిలుపుకునే ఆత్మగౌరవమే గుండెకు ఆనందరవం..!! జీవన వనాన విరిసే ఆమనిలో అదే మధురంగా కిలకిలమనే కోకిలారావం..!!

ఆత్మగౌరవం అన్నది మనిషి ఉత్తమ ప్రవృత్తిని తెలియపరుస్తుంది. ఒక మంచి ప్రవర్తనకు జగతి లో అందే విలువను పరోక్షంగా ఆత్మగౌరవానికి నమూనాగా ప్రకటించవచ్చు. సంస్కారాలు, విలువలు, నియమాలతో కూడిన జీవన ఆచరణ కలిగినవారు ఒకరి ముందు తలవంచరు. దీనికి ధనంతో ఏమాత్రం పనిలేదు. సంస్కారాలకు ఉన్న మహత్తరమైన విలువ అలాంటిది. వీరు ఆదర్శ జీవనాన్ని జీవిస్తూ, ఉన్నంత లో ఎదుటివాళ్లచేత గుర్తింపును, గౌరవాన్ని పొందేవారుగా తమను తాము మలుచుకంటారు. అలాంటి వారు తమకు తాము కొన్ని హద్దులు పెట్టుకొని వాటిని దాటకుండా ఒక్కరిపైన ఆధారపడకుండా ఆత్మగౌరవంతో నిరంతరం జీవిస్తారు.

– ‘‘వ్యాఖ్యాన విశారద’’ వెంకట్‌ గరికపాటి

మరిన్ని వార్తలు