Senna Tea: సెన్నా టీ  సిప్‌ చేశారా?

14 May, 2021 12:35 IST|Sakshi

చాయ్‌ అంటే చటుక్కున తాగని వాళ్లుంటారా? చాయ్‌ మహత్యం ఏంటోకానీ, ఒక్కసారి కూడా టీ తాగనివాళ్లుకానీ, తాగిన తర్వాత అలవాటు కాని వాళ్లు కానీ అరుదు. సాదా చాయ్‌ అందరూ తాగుతారు, కానీ ఇటీవల కాలంలో పలురకాల ఫ్లేవర్ల టీలు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఈ కోవలోకి చెందినదే సెన్నా టీ! ఈ టీతో పలు ఆరోగ్య సంబంధ ఉపయోగాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. వృద్ధుల్లో తరచూ కనిపించే అనారోగ్య సమస్య మలబద్ధకం. అలాగే యువత, పిల్లల్లోనూ ఈ సమస్య అప్పుడప్పుడూ తొంగిచూస్తూ ఉంటుంది.

దీని నివారణకు రకరకాల ఔషధాలు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఆయుర్వేద పద్ధతిలో మలబద్ధకాన్ని అరికట్టేందుకు ఉపయోగపడేదే సెన్నా టీ. సెన్నా అంటే తంగేడు చెట్టు. దీని ఆకులతో తయారుచేసేదే సెన్నా టీ. అలాగే తంగేడు పూలు, కాయలతోనూ దీనిని తయారుచేయొచ్చు. ఈ తంగేడు ఆకులు, పూలు, కాయలను మలబద్ధకం నివారణకు ఉపయోగించే మాత్రల్లో ఎక్కువగా వాడతారు. అలాగే బరువు తగ్గడానికి, శరీరంలోని విష కణాలను తొలగించడానికి సెన్నా ఉండే మాత్రలు పనిచేస్తాయని మార్కెట్లో ప్రచారం ఉన్నప్పటికీ శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. 

మలబద్ధకాన్ని ఎలా తగ్గిస్తుందంటే?
తంగేడాకుల్లో ఎక్కువగా గ్లైకోసైడ్స్, సెన్నోసైడ్స్‌ ఉంటాయి. ఈ సెన్నోసైడ్స్‌ మనం తీసుకున్న టీ ద్వారా కడుపులోకి చేరి అక్కడ మలబద్ధకానికి కారణమవుతున్న బ్యాక్టీరియాను విచ్ఛిన్నం చేస్తాయి. ఫలితంగా పేగులోపల కదలికలు ఏర్పడి సులభంగా విరేచనం అయ్యేందుకు తోడ్పడుతుంది. ఈ టీ తాగిన ఆరు నుంచి 12 గంటల్లోపు అది పనిచేస్తుంది. మార్కెట్లో లభించే మలబద్ధకం మాత్రల్లో అతి ముఖ్యమైన మూలకం సెన్నానే. అలాగే పురీషనాళంలో రక్తస్రావం, నొప్పి, దురదలు వంటి వాటికీ సెన్నా టీ విరుగుడు పనిచేస్తుందనే వాదన ఉన్నప్పటికీ దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు.  

బరువు తగ్గిస్తుందా?
బరువు తగ్గేందుకు సెన్నా టీ ఉపయోగపడుతుందని చాలామంది భావిస్తుంటారు. సెన్నా టీ, లేదా సెన్నా మూలకం ఉన్న మాత్రలు తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగై తద్వారా సులభంగా బరువు తగ్గొచ్చనే ప్రచారం తప్పని వైద్య నిపుణులు అంటున్నారు. ఇలా సెన్నా టీ, సెన్నా మూలకాలున్న మాత్రలు తీసుకోవడం ద్వారా బరువు తగ్గినట్లు శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు. అంతేకాదు, ఇలా బరువు తగ్గాలని చేసే ప్రయత్నం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. కాగా, బరువు తగ్గడం కోసం ఇలా ’సెన్నా’ను ఉపయోగిస్తున్న 10వేల మంది మహిళలపై జరిపిన ఓ సర్వే సైతం ఇదే విషయం చెబుతోంది. ఇంకా చెప్పాలంటే వారిలో ఆకలి పెరిగి, ఇంకా ఎక్కువ తింటున్నట్లు గుర్తించింది. 

ఎవరికి సురక్షితం?
సెన్నా టీ 12 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తాగొచ్చు. అయితే, వీరిలోనూ కొందరికి కొన్ని రకాల సైడ్‌ ఎఫెక్ట్స్‌ కనిపించొచ్చు. అందులో ముఖ్యమైనవి కడుపులో తిమ్మిరి, వికారం, అతిసారం. అయితే, ఈ లక్షణాలు ఎక్కువ సేపు ఉండవు. మరికొంతమందికి అలర్జీ ఉంటుంది. అలాంటి వాళ్లు సెన్నాకు దూరంగా ఉండడం మంచిది. అన్నింటి కంటే ముఖ్యమైనది సెన్నా టీని మలబద్ధకానికి విరుగుడుగా తీసుకునే తాత్కాలిక ఔషధంగా గుర్తుపెట్టుకోవడమే. ఈ టీని వరుసగా వారం కంటే ఎక్కువ రోజులు తాగకూడదు. ఎక్కువ రోజులు తీసుకుంటే కాలేయం దెబ్బతినడం తదితర సమస్యలు ఉత్పన్నమవుతాయి. అందువల్ల ప్రత్యేకించి హృదయ సంబంధ వ్యాధులు, కాలేయ సమస్యలు ఉన్నవాళ్లు సెన్నా టీనే కాదు, సెన్నా మూలకం ఉన్న ఏ ఉత్పత్తులనైనా వాడాలంటే వైద్యుని సలహాలు తీసుకోవడం ఉత్తమం. అలాగే గర్భిణులు, బాలింతలు ఎట్టి పరిస్థితుల్లోనూ సెన్నా మూలకం ఉన్న ఉత్పత్తులు, టీని తీసుకోకూడదు.

(చదవండి: అమెరికా అంటే.. ఐదు కావాల్సిందే!)

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు