అడవి పంపిన బిడ్డ

23 Mar, 2021 12:26 IST|Sakshi
బిడ్డలా పెంచుకుంటున్న అడవి పందితో కుంతల కుమారి

తప్పిపోయిన కొడుకు తిరిగొస్తే ఎంత సంతోషంగా ఉంటుందో కుంతల కుమారికి ఇప్పుడు అంతకు మించిన సంతోషంగా ఉంది. రెండేళ్ల క్రితం అరణ్యంలో కనిపించిన అడవి పంది కూనను ఇంటికి తెచ్చి పెంచుకుందామె. వారం క్రితం అటవీ అధికారులు వచ్చి ఆ పందిని అలా పెంచుకోకూడదని అడవిలో వదిలి వచ్చారు. ఆ తల్లి ఆ బిడ్డ కోసం ఏడ్చింది. ఆ బిడ్డ ఆ తల్లిని వెతుక్కుంటూ బయలుదేరింది. రోమాంచితమైన ఈ అనురాగబంధపు కథ ఒడిసాలో జరిగి ప్రచారంలో ఉంది.

మీడియాకు భావోద్వేగాలు ఉండవు అని అంటారుగాని కుంతల కుమారి కోసం మీడియా కూడా కన్నీరు పెట్టినంత పని చేసింది. వారం క్రితం ఒడిసాలోని గంజాం జిల్లాలో పురుషోత్తంపూర్‌ అనే చిన్న పల్లెలో నివసించే కుంతల కుమారి ఆక్రందనలు విని మీడియా కూడా అక్కడకు చేరుకుంది. ‘నా బిడ్డను నా నుంచి దూరం చేశారు. నాకు న్యాయం చేయండి’ అని వారి ముందు ఏడ్చింది కుంతల కుమారి.
ఆ బిడ్డ పేరు ‘ధుడ’ (పాలు). అది ఒక అడవి పంది. ‘నా సొంతబిడ్డ కంటే దానిని ఎక్కువ సాక్కున్నాను’ అని చెప్పింది కుంతల కుమారి.

దేవుడు పంపిన కొడుకు
రెండేళ్ల క్రితం కుంతల కుమారి కూతురు జబ్బు చేసి చనిపోయింది. అడవిలో ఆ కుమార్తె అంతిమ సంస్కారాలు పూర్తి చేసి విషాదంతో తిరిగి వస్తున్న కుంతల కుమారికి తల్లి నుంచి తప్పిపోయి భీతిల్లి తిరుగుతున్న రోజుల వయసున్న అడవి పంది పిల్ల కనిపించింది. ‘అది నన్ను చూడగానే నా దగ్గరికి పరిగెత్తుకుని వచ్చింది. దానిని చూసి నేను నా కూతురు చనిపోయిందని బాధ పడాలా... ఈ పంది పిల్ల నా దగ్గరకు వచ్చిందని ఆనంద పడాలా తెలియలేదు. మొత్తం మీద ఆ కూన నాకు దేవుడు పంపిన కొడుకు అనుకున్నాను’ అంటుంది కుంతల కుమారి. ఆమెకు ఇంకో కూతురు కూడా ఉంది. తల్లీ కూతుళ్లు కలిసి ఆ పంది పిల్లకు ‘ధుడ’ అని పేరు పెట్టి పెంచసాగారు. అప్పటినుంచి ఆ అడవి పంది ఇంటి పందిగా మారిపోయింది. కుంతల కుమారి పిలిస్తే పరిగెత్తుకుని వస్తుంది. ఇంటి ముందే ఉంటుంది.

అడవి పందితో ఆడుకుంటున్న కుంతలకుమారి కుమార్తె

అటవీ అధికారుల ప్రవేశం
అయితే ఒడిసా వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అడవి పందిని పెంచుకోవడం నేరం. అందువల్ల అటవీ అధికారుల ఇన్నాళ్లు ఊరికే ఉండి వారం క్రితం కుంతల కుమారి ఇంటికి వచ్చి ఆమెను హెచ్చరించి ‘ధుడ’ను అడవిలో విడుస్తామని తీసుకెళ్లి విడిచి వచ్చారు. పురుషోత్తం పూర్‌కు దగ్గరలోనే టెల్కొయ్‌ అభయారణ్యం ఉంది. అధికారులు దానిని తీసుకెళ్లి ఆ అరణ్యంలో విడిచి పెట్టారు. ఇది జరిగిన వెంటనే కుంతల కుమారి లబలబమని నోరుకొట్టుకొని తీవ్రంగా ఏడ్వడం మొదలుపెట్టింది. ఈ సమాచారం అందుకున్న మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్‌ చేసింది. సోషల్‌ మీడియాలో కూడా దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ‘అటవీ అధికారులు చేసింది తప్పు’ అని అందరూ తిట్టిపోశారు. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అడవి లో ధుడా తప్పిపోయింది.

దాని ఆహారం ఎలా?
‘ధుడా ఇంటి తిండికి అలవాటు పడింది. అది అడవిలో బతకలేదు’ అని కుంతల కుమారి అంటే ‘అడవి పందులకు తాము అడవిలో ఎలా బతకాలో తెలుసు’ అని అధికారులు అన్నారు. కాని అది నిజం కాదు. అడవిలో పడ్డ ధుడా తిండి లేక నీరసించింది. అడవి కొత్త కావడంతో భీతిల్లిపోయింది. ‘ధుడా’ అని పేరు పిలుస్తూ వెతుక్కుంటూ తిరుగుతున్న కుంతలను చూసి గ్రామస్తులు కూడా ధుడాను వెతికారు. చివరకు అది 25 కిలోమీటర్ల దూరంలో కనిపించింది. వెంటనే కుంతల ఆగమేఘాల మీద వెళ్లి పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చి తల్లి దగ్గర సేదదీరింది. కుంతల, కుంతల కుమార్తె ధుడాను ఇంటికి తెచ్చుకున్నారు. ‘అది అడవిలో తిండి సంపాదించుకోలేకపోయింది. దాని సంగతి ఆలోచిస్తాం’ అని అటవీ అధికారులు ఇప్పుడు నత్తులు కొడుతున్నారు.

వారం రోజుల ఎడబాటు వల్ల భీతిల్లిపోయిన ధుడా, కుంతల ఇప్పుడు ఒకరిని విడిచి ఒకరు ఉండటం లేదు. ‘పడుకో నాన్నా.. కళ్లు మూసుకొని పడుకో’ అని కుంతల దాని ముట్టె మీద చేయి వేసి ఊరడిస్తే అది కళ్లు మూసుకొని నిద్రలోకి జారిపోవడం వీడియో లో చూసి ఆశ్చర్యపోయేవారు వారిద్దరికీ అభిమానులుగా మారారు. బహుశా వీళ్లను ఇక మీదట ఎవరూ విడదీయకపోవచ్చు.

– సాక్షి ఫ్యామిలీ

మరిన్ని వార్తలు