‘ఎవరి కోసమో ఎందుకు మన కోసం మనం’

7 Jul, 2021 14:11 IST|Sakshi
ఆల్‌–ఫిమేల్‌ రోమా బ్యాండ్‌ 

సంగీతానికి రాళ్లు కరుగుతాయి అంటారు... అదేమిటోగానీ సెర్బియాలోని ఆల్‌–ఫిమేల్‌ రోమా బ్యాండ్‌ తమ సంగీతంతో శతాబ్దాలుగా తిష్ట వేసిన పురుషాధిక్య భావజాలంపై సమరభేరీ మోగిస్తోంది. బాల్య వివాహాలను నుంచి గృహహింస వరకు స్త్రీలు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలను పాటలుగా పాడి వినిపిస్తుంది. కేవలం సమస్య గురించి మాట్లాడడమే  కాదు వాటికి పరిష్కార మార్గాన్ని కూడా సూచిస్తోంది.ఆల్‌–ఫిమేల్‌ రోమా బ్యాండ్‌ది నల్లేరుపై నడకేమీ కాదు. ‘పెళ్లివిందు దగ్గర బ్యాండ్‌ వాయించండి. మీ వల్ల ఒరిగేదేమీ ఉండదు’ అని వెక్కిరించిన వాళ్లు కొందరైతే ‘మా పిల్లల పెళ్లి గురించి మాట్లాడడానికి మీరెవరు!’ అంటూ భౌతికదాడులు చేసినవారు ఇంకొందరు.

అయినా సరే, ‘తగ్గేదే లేదు’ అంటు ముందుకు సాగుతున్నారు. బాల్యవివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయని, దీన్ని అరికట్టడానికి సెర్బియన్‌ ప్రభుత్వం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినా దాని వల్ల పెద్దగా ఫలితం రాలేదు. అయితే రోమా బ్యాండ్‌ ప్రచారం వల్ల తరతరాల సంప్రదాయ ఆలోచనల్లో గణనీయమైన మార్పు వస్తుంది.
‘మీకంటూ ఒక సొంతవ్యక్తిత్వం ఉంది. భవిష్యత్‌ను నిర్మాణం చేసుకునే హక్కు పూర్తిగా మీ మీదే ఉంది’లాంటి మాటలు వినేవారికి మొదట ఆశ్చర్యంగా అనిపించేవి. ఆ తరువాత వాటి విలువను గ్రహించడం మొదలైంది’ అంటోంది 24 సంవత్సరాల సిల్వియా సినాని అనే సభ్యురాలు. 

ఫిమేల్‌ బ్యాండ్‌ ఇచ్చిన చైతన్యంతో చాలామంది బాల్యవివాహాలకు దూరంగా ఉన్నారు. చదువులపై దృష్టి కేంద్రీకరించారు. చిత్రమేమిటంటే ‘రోమా బ్యాండ్‌’లోని కొందరు సభ్యులకు కూడా తెలిసీ తెలియని వయసులో బాల్యవివాహాలు జరిగాయి. వారు తమ అనుభవాలను, ఎదుర్కొన్న కష్టాలను చెబుతుంటే వినేవారికి కంటతడి తప్పదు. అనుభవాన్ని మించిన జ్ఞానం ఏముంటుంది!

ర్యాప్‌ అండ్‌ ట్రెడిషనల్‌ రోమా–ఫోక్‌ బీట్‌ మిళితం చేసి శ్రోతలను ఆకట్టుకుంటున్న ఈ ‘ఆల్‌–ఫిమేల్‌ బ్యాండ్‌’ సభ్యులు ఒకప్పుడు స్థానిక ‘బాయ్స్‌ బ్యాండ్‌’లో పనిచేసిన వాళ్లే. అక్కడ రకరకాలుగా అవమానాలు ఎదుర్కొన్నవారే. ‘ఎవరి కోసమో ఎందుకు మన కోసం మనం’ అంటూ ఆల్‌–ఫిమేల్‌ బ్యాండ్‌ మొదలైంది. అప్పుడు కేవలం వినోదం కోసం అయితే ఇప్పుడు ‘స్త్రీ చైతన్యం’ ప్రధాన ఎజెండాగా పనిచేస్తోంది. ఒకప్పడు సెర్బియాకే పరిమితమైన ఈ బ్యాండ్‌ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందికి ఆదర్శం అయింది.

మరిన్ని వార్తలు